బిడ్డ కోసం తల్లి వెతుకులాట- హాఫ్ మదర్ | Interactive book | Sakshi
Sakshi News home page

బిడ్డ కోసం తల్లి వెతుకులాట- హాఫ్ మదర్

Published Fri, Dec 19 2014 10:53 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

బిడ్డ కోసం తల్లి వెతుకులాట- హాఫ్ మదర్ - Sakshi

బిడ్డ కోసం తల్లి వెతుకులాట- హాఫ్ మదర్

పట్టుకోగానే అరచేతికి రక్తపు మరకలు అంటించే నవల ‘హాఫ్ మదర్’. మనం గాయపడుతూ కశ్మీరీల గాయాలతో ఏకమవుతూ చివరి వరకూ వదలకుండా చదివించే కవితాత్మక వచనం షహనాజ్ బషీర్ మొదటి నవల ‘హాఫ్ మదర్’. అబద్ధాల మధ్యనా, అర్ధసత్యాల మధ్యనా, ఆల్ ఈజ్ వెల్ అనుకునేవాళ్లందరికీ ఈ నవల ఒక మేలుకొలుపు. భారతసైన్యం మాయం చేసిన ఒకానొక కొడుకు కోసం ఊరూవాడ వెతికిన ఒక కశ్మీరీ అమ్మ కథ ఇది. కశ్మీర్‌లో ఇలాంటి తల్లులు ఎందరో. కొడుకు బతికున్నాడో లేదో తెలియక అల్లాడిపోయే తల్లిని ‘హాఫ్ మదర్’ అంటారు కశ్మీర్‌లో. అలాగే భర్త ఆచూకీ తెలియని భార్యని ‘హాఫ్ విడో’ అంటారు. గాయపడిన కశ్మీర్ సౌందర్యం గురించి బషరత్ పీర్ ‘కర్‌ఫ్యూడ్ నైట్స్’ చదివితే తెలుస్తుంది. ‘హాఫ్ మదర్’ చదివితే కన్నీరుబుకుతుంది.

కథ దగ్గరికొస్తే- ఆబ్జాన్, బోబా అందరిలాగే ఒక సాదాసీదా దంపతులు. వాళ్ల కూతురు హలీమా. కాని ఆ పిల్ల అచ్చటా ముచ్చటా తీరకుండానే బోబా క్షయవ్యాధితో మరణిస్తుంది. ఆబ్జాన్ మరో పెళ్లి చేసుకోకుండా హలీమాని చక్కగా పెంచుతాడు. ఉద్యోగంలో రిటైరైన తర్వాత  కిరాణాకొట్టు పెట్టుకొని నిజాయితీగా నడుపుతుంటాడు. గనక ఆ దుకాణంలో జనం కిటకిటలాడుతుంటారు. హలీమాకి ఒక డాక్టరుతో పెళ్లవుతుంది. అయితే ఆ డాక్టరుకు ఒక నర్సుతో సంబంధం ఉందని గ్రహించి మూడో నెలలోనే విడాకులిస్తుంది. కాని అప్పటికే తను గర్భవతి. కొడుకు పుట్టాడు. వాడికి ఇమ్రాన్ అని పేరు పెట్టాడు తాత. తల్లి, కొడుకు, తాత... ఇది వారి కుటుంబం. లైబ్రరీలో పుంఖానుపుంఖాలుగా చదివే ఇమ్రాన్ టీచర్లని ప్రశ్నలతో వేధిస్తుంటాడు. ‘ఎప్పుడూ సింధూలోయ, హరప్పా నాగరికతల గురించేనా. మన నాగరికత గురించి చెప్పరా?’ అని అడిగితే టీచర్ నుంచి జవాబుకు బదులు చెవి మెలివేత దక్కింది. కాని తాత మాత్రం ‘మనకి మన సొంత అస్తిత్వం, చరిత్ర ఉన్నాయి. కాని వాటిని బయటకి రానీరు. మన గురించి మనం తెలుసుకోవడం కొందరికిష్టం లేదు’ అంటాడు.

కథ ఇలా ఉండగా ఆ ఊరిపై భారత సైన్యం పడింది. తాతను ఇంట్లో నుంచి బయటికి లాగి ‘మిలిటెంట్లను ఎక్కడ దాచావో చెప్పు’ అని పిస్తోలు గురి పెట్టాడు అధికారి. ‘మానవత్వం లేని నీలాంటి మృగాలున్న చోట బతకడం కన్నా చావడం మేలు’ అని తాత అంటూ ఉండగానే గుండెల్లోనూ కడుపులోనూ గుళ్లు దిగబడ్డాయి. ఇరుగూ పొరుగూ రాబోతుంటే వాళ్లకూ తుపాకీతో బెదిరింపు ఇచ్చాడు అధికారి. తల్లి హలీమా, కొడుకు ఇమ్రాన్ జరిగిన సంఘటనతో కుదేలయ్యి దిగాలుగా బతుకుతుంటే అది చాలదన్నట్టు సైన్యం మళ్లీ ఇంటిమీదకొచ్చింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసింది. పదో తరగతి చదివే పిల్లవాడు. వాడేం పాపం చేశాడు? హలీమా వాళ్ల కాళ్లకు అడ్డం పడుతున్నా వినకుండా ‘ఇప్పుడే నాలుగైదు ప్రశ్నలడిగి పంపించేస్తాం’ అని తీసుకెళ్లారు. అంతే. ఇమ్రాన్ మళ్లీ కనిపించలేదు.
 ఇమ్రాన్ ఆచూకీ కోసం హలీమా రకరకాల మనుషుల్ని కలుస్తుంది. ప్రతి చోటా ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటుంది. అలాగే కశ్మీర్‌లో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో కూడా అర్థం చేసుకుంటుంది. ఒక పార్లమెంట్ సభ్యుడిని కలిస్తే ‘నీ అందాన్ని వృధా చేస్తున్నావ్. మనిద్దరం కలిస్తే పిల్లవాణ్ణి ఒక్కరోజులో వెతకవచ్చు’ అంటాడు. తనలాంటి బాధితులతో పాటు ముఖ్యమంత్రిని కలిస్తే ‘వాళ్లు సరిహద్దును దాటేసి ఉంటారు. మేమెలా తీసుకురాగలం’ అని విసుక్కుంటాడు. కాని అతడనే మరో మాట అతడి పరిస్థితినీ తెలియచేస్తుంది. ‘నేనూ మీలాగే  పిచ్చెత్తి పోతున్నాను. నా భార్య అమెరికాలో ఉంటోంది. నా కొడుకు మరో చోట. నా కూతుళ్లు వేర్వేరు చోట్ల. నేనూ మీలాగే ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాను. మనందరం ఒకే స్థితిలో ఉన్నాం’ అంటాడు ముఖ్యమంత్రి.

హలీమా ఇప్పుడు తన కొడుకు ఇమ్రాన్ కోసం పోరాడ్డం లేదు. కశ్మీర్‌లో మాయమైపోయిన వాళ్ల కోసం పోరాడుతోంది. అదే ఆమె జీవితంగా మారిపోయింది. ‘తల్లిపోయినవారి బంధుమిత్రుల సంఘాని’కి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఇందుకు బి.బి.సి విలేకరి, స్థానిక కశ్మీరీ అయిన ఇజర్‌లాంటి వాళ్లు మద్దతుగా నిలిచారు. చివరకు ఒక జడ్జి ఆధ్వర్యంలో మాయమైపోయినవారి విచారణ జరిగింది. ఆ రోజైనా ఇమ్రాన్ ఏమయ్యాడో తెలుస్తుందని ఆశ. కాని మిలటరీ అధికారి వచ్చి ‘నీ జీవితాంతం నేను చూసుకుంటాను. రెండు లక్షల దాకా డబ్బు కూడా ఇస్తాం’ అంటాడు. కొడుకు కోసం వెతికే తల్లికి ఇది ధూళితో సమానం. ‘నా కొడుకెక్కడా? వాణ్ణి తీసుకెళ్లిన మేజర్ నా బిడ్డని ఏం చేశాడు’ ఆమె కన్నీరు మున్నీరుగా అడుగుతుంది. ‘ఆ మేజర్ సరిహద్దుల్లో చచ్చిపోయాడు’ అని జవాబొస్తుంది. కొడుకు గురించిన సమాచారం ఇవ్వగలిగింది అతనొక్కడే. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. ‘నేనిలా ఓడి పోకూడదు. ఇంటికి పోయి ఎదురు చూస్తూ కూచోవాలి. అదొక్కటే నాకు దారి’ అనుకుంటుంది హలీమా. ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఇజర్ ఆమెను చూడ్డానికి వెళితే ‘కలలు రాని నిద్ర పోవాలని ఉందయ్యా’ అంటుంది బాధగా. బహుశా, కశ్మీరీలకు మెలకువ, నిద్ర కూడా ఒక పీడకలగా మారిందని చెప్పడానికి ఇంతకు మించిన వాక్యం లేదు. ‘ఇమ్రాన్.. వచ్చావా నాయనా’ అన్నదే హలీమా ఆఖరి మాట.

 రోజులు గడిచాయి. ఒకప్పుడు పట్టుకెళ్లినవాళ్లను చిత్రహింసలకు గురిచేసిన భవనం ఇప్పుడు విదేశీ టూరిస్టులకి అతిథి గృహమయింది.  స్థానికులను తరలించి జీలం నది ఒడ్డును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం చేసే ఈ పనులు ఇజర్ వంటి వారిని ఆగ్రహోదగ్రులను చేయడం సహజం. ఈ నవలను చదువుతుంటే మహాశ్వేతాదేవి ‘ఒక తల్లి కథ’ కళ్ల ముందు కదలాడింది. హాఫ్ మదర్‌లో ఎన్నో సంఘటనలు మన కళ్లని తడిపేస్తాయి. కశ్మీర్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ నవల తప్పకుండా చదవాలి.
 - కృష్ణాబాయి
 
 కొడుకు బతికున్నాడో లేదో తెలియక అల్లాడిపోయే తల్లిని ‘హాఫ్ మదర్’ అంఆరు కశ్మీర్‌లో. అలాగే భర్త ఆచూకి తెలియని భార్యని ‘హాఫ్ విడో’ అంటారు. గాయపడిన కశ్మీర్ సౌందర్యం గురించి బషరత్ పీర్ ‘కర్‌ఫ్యూడ్ నైట్స్’ చదివితే తెలుస్తుంది. ‘హాఫ్ మదర్’ చదివితే కన్నీరుబుకుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement