Krishna Bai
-
విరసం మా ఊపిరి
విశాఖలో 1970 ఫిబ్రవరి 1న శ్రీశ్రీకి జరిగిన సన్మానానికి నాలుగు చెరగులనుంచీ సాహిత్యాభిమానులు తరలివచ్చారు. విశాఖ విద్యార్థులు ‘రచయితలారా! మీరెటువైపు!’ అని సవాల్ విసిరారు. రచయితల్లో కలకలం బయలుదేరింది. తామెటువైపో తేల్చుకోవలసి వచ్చింది. సాయంత్రం ఆర్వీఎస్, పురిపండా, కారా, కేవీఆర్, పురాణం, వరవరరావు, జ్వాలా ముఖి, లోచన్, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మొదలైన ప్రముఖ రచయితలూ, కవులూ విశాఖలోని చౌల్ట్రీ నుంచీ స్టేడియం దాకా ఊరేగింపుగా నడిచారు. రచయితలు ఊరేగింపుగా రావడం ఇదే తొలిసారి అన్నారు పురిపండా అప్పలస్వామిగారు. దిగంబర కవులూ, తిరగబడు కవులూ, మరెందరో తమ రచనలు వినిపించారు. లోచన్ ‘ట్రిగ్గర్ మీద వేళ్లతో’ అంటూ ‘శిశూ! పిడికిలి బిగించి ఈ లోకంమీద యుద్ధం ప్రకటిస్తున్నావా?’ అంటూ పొత్తి ళ్లలో బిడ్డని ఆహ్వానించాడు. అయిదు నెలల తర్వాత 1970 జూలై 4న హైదరాబాద్‌లో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. విడివిడిగా చిన్న సమూహాలుగా ఉన్న అనేకమంది కవులు విరసంలోకి వచ్చారు. ‘నిజం చెప్పాలంటే విరసం ఆవిర్భావానికి ఏకైక చోదక శక్తి నక్సలైట్ ఉద్యమం... విప్లవాగ్నుల లోంచి విరసం ప్రభవించడం నేను కళ్లారా చూశాను’ అన్నాడు శ్రీశ్రీ. విరసం పుట్టి వారం తిరక్కుండానే శ్రీకాకుళోద్యమ నాయకులు వెంపటాపు సత్యం, కైలా సాల్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది (జూలై 10). ఒక కేసులో రైతు నాయకులు కిష్టా గౌడ్, భూమయ్యలకి ఉరిశిక్ష విధించింది కోర్టు. ప్రజాందోళనతో రెండుసార్లు ఉరి ఆగింది. పౌరహక్కుల సంఘం తరఫున పత్తిపాటి వెంకటేశ్వర్లు ఈ విషయంలో నిర్వహించిన పాత్ర అమోఘం. పిరికి ప్రభుత్వం ఎమర్జెన్సీ చీకటిమాటున వాళ్లిద్దర్నీ ఉరి తీసింది (డిసెంబరు 1975). పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వికృత రూపం ధరించడంతో, ఎన్నికల వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు రాజకీయాల్లో ముందుకొచ్చాయి. ఆ పోరాటాల ప్రేరణతో రచయితలంతా ఉత్సాహంగా విరసంలో చేరారు. కవిత, కథ, నవల, విమర్శ, పాట సహా అన్ని సాహిత్య ప్రక్రియల్లో విరసం విస్తృత కృషి చేసింది. రచయితలంతా తమ రచనలతో ప్రజలపక్షం వహించారు. విరసం ప్రేరణతో వందలాదిమంది పోరాట యోధులు తయారయ్యారు. అలాంటి సంస్థకి 2004–2006 మధ్య కార్యదర్శిగా ఉన్నాను. 2001–2007 మధ్య అరుణతారకి సంపాదకత్వం వహించాను. పెరుగుతున్న ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటాలను అణచివేసే ప్రయత్నంలో భాగంగా విరసంపై నిషేధం విధిం చిన సందర్భంలో నగరంలో పెద్దల్ని (జస్టిస్ చిన్నపరెడ్డిసహా) కలిసి పరిస్థితులు వివరించాం. అప్పుడు నేను విరసం కార్యదర్శిని. ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. మాది రాజకీయ పార్టీ కాదనీ సాహిత్య, సాంస్కృతిక సంఘమేననీ, ఇలాంటి సంఘాన్ని నిషేధించడం అన్యాయమనీ త్రిసభ్య కమిటీకి నివేదించాం. ‘నిషేధిస్తే నష్టమేమిటని’ త్రిసభ్య కమిటీ మెంబర్ టీఎల్ఎన్ రెడ్డి అడిగాడు. ‘మీ అబ్బాయిని మూడు గంటలు చీకటి కొట్లో నిర్బంధించి, ఆ తర్వాత అభిప్రాయాన్ని సేకరించండి తెలుస్తుంది’ అన్నాం. మూడు నెలల తర్వాత నిషేధం ఎత్తేయవలసి వచ్చింది. విరసం మా ఊపిరి. తప్పులూ, ఒప్పులూ, నిర్బంధాలూ, విజయాలూ ఎదురయ్యే దారిలోనే విరసం ప్రయాణం సాగుతోంది. విరసం ఆవిర్భావంలో ఎందరో కొత్త రచయితలకి ఊపిరులూది, పీడిత ప్రజల పక్షపాతిగా నిలిచిన విరసంతో నా అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది. ఈ అర్ధ శతాబ్ది ఉత్సవాల్లో, చరిత్రని విశ్లేషించుకుంటూ, ఇంకా చేయవలసిన పనులని పురమాయిస్తూ, విప్లవానికి పునరంకితమవుతూ విరసం ముందుకు సాగవలసిన తరుణం ఏర్పడింది. అమరులైన విప్లవ రచయితలందరి స్ఫూర్తితో విరసం మరింత నిబద్ధతతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. కృష్ణాబాయి వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యురాలు (హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు, రేపు విరసం మహాసభలు) -
బిడ్డ కోసం తల్లి వెతుకులాట- హాఫ్ మదర్
పట్టుకోగానే అరచేతికి రక్తపు మరకలు అంటించే నవల ‘హాఫ్ మదర్’. మనం గాయపడుతూ కశ్మీరీల గాయాలతో ఏకమవుతూ చివరి వరకూ వదలకుండా చదివించే కవితాత్మక వచనం షహనాజ్ బషీర్ మొదటి నవల ‘హాఫ్ మదర్’. అబద్ధాల మధ్యనా, అర్ధసత్యాల మధ్యనా, ఆల్ ఈజ్ వెల్ అనుకునేవాళ్లందరికీ ఈ నవల ఒక మేలుకొలుపు. భారతసైన్యం మాయం చేసిన ఒకానొక కొడుకు కోసం ఊరూవాడ వెతికిన ఒక కశ్మీరీ అమ్మ కథ ఇది. కశ్మీర్లో ఇలాంటి తల్లులు ఎందరో. కొడుకు బతికున్నాడో లేదో తెలియక అల్లాడిపోయే తల్లిని ‘హాఫ్ మదర్’ అంటారు కశ్మీర్లో. అలాగే భర్త ఆచూకీ తెలియని భార్యని ‘హాఫ్ విడో’ అంటారు. గాయపడిన కశ్మీర్ సౌందర్యం గురించి బషరత్ పీర్ ‘కర్ఫ్యూడ్ నైట్స్’ చదివితే తెలుస్తుంది. ‘హాఫ్ మదర్’ చదివితే కన్నీరుబుకుతుంది. కథ దగ్గరికొస్తే- ఆబ్జాన్, బోబా అందరిలాగే ఒక సాదాసీదా దంపతులు. వాళ్ల కూతురు హలీమా. కాని ఆ పిల్ల అచ్చటా ముచ్చటా తీరకుండానే బోబా క్షయవ్యాధితో మరణిస్తుంది. ఆబ్జాన్ మరో పెళ్లి చేసుకోకుండా హలీమాని చక్కగా పెంచుతాడు. ఉద్యోగంలో రిటైరైన తర్వాత కిరాణాకొట్టు పెట్టుకొని నిజాయితీగా నడుపుతుంటాడు. గనక ఆ దుకాణంలో జనం కిటకిటలాడుతుంటారు. హలీమాకి ఒక డాక్టరుతో పెళ్లవుతుంది. అయితే ఆ డాక్టరుకు ఒక నర్సుతో సంబంధం ఉందని గ్రహించి మూడో నెలలోనే విడాకులిస్తుంది. కాని అప్పటికే తను గర్భవతి. కొడుకు పుట్టాడు. వాడికి ఇమ్రాన్ అని పేరు పెట్టాడు తాత. తల్లి, కొడుకు, తాత... ఇది వారి కుటుంబం. లైబ్రరీలో పుంఖానుపుంఖాలుగా చదివే ఇమ్రాన్ టీచర్లని ప్రశ్నలతో వేధిస్తుంటాడు. ‘ఎప్పుడూ సింధూలోయ, హరప్పా నాగరికతల గురించేనా. మన నాగరికత గురించి చెప్పరా?’ అని అడిగితే టీచర్ నుంచి జవాబుకు బదులు చెవి మెలివేత దక్కింది. కాని తాత మాత్రం ‘మనకి మన సొంత అస్తిత్వం, చరిత్ర ఉన్నాయి. కాని వాటిని బయటకి రానీరు. మన గురించి మనం తెలుసుకోవడం కొందరికిష్టం లేదు’ అంటాడు. కథ ఇలా ఉండగా ఆ ఊరిపై భారత సైన్యం పడింది. తాతను ఇంట్లో నుంచి బయటికి లాగి ‘మిలిటెంట్లను ఎక్కడ దాచావో చెప్పు’ అని పిస్తోలు గురి పెట్టాడు అధికారి. ‘మానవత్వం లేని నీలాంటి మృగాలున్న చోట బతకడం కన్నా చావడం మేలు’ అని తాత అంటూ ఉండగానే గుండెల్లోనూ కడుపులోనూ గుళ్లు దిగబడ్డాయి. ఇరుగూ పొరుగూ రాబోతుంటే వాళ్లకూ తుపాకీతో బెదిరింపు ఇచ్చాడు అధికారి. తల్లి హలీమా, కొడుకు ఇమ్రాన్ జరిగిన సంఘటనతో కుదేలయ్యి దిగాలుగా బతుకుతుంటే అది చాలదన్నట్టు సైన్యం మళ్లీ ఇంటిమీదకొచ్చింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసింది. పదో తరగతి చదివే పిల్లవాడు. వాడేం పాపం చేశాడు? హలీమా వాళ్ల కాళ్లకు అడ్డం పడుతున్నా వినకుండా ‘ఇప్పుడే నాలుగైదు ప్రశ్నలడిగి పంపించేస్తాం’ అని తీసుకెళ్లారు. అంతే. ఇమ్రాన్ మళ్లీ కనిపించలేదు. ఇమ్రాన్ ఆచూకీ కోసం హలీమా రకరకాల మనుషుల్ని కలుస్తుంది. ప్రతి చోటా ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటుంది. అలాగే కశ్మీర్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో కూడా అర్థం చేసుకుంటుంది. ఒక పార్లమెంట్ సభ్యుడిని కలిస్తే ‘నీ అందాన్ని వృధా చేస్తున్నావ్. మనిద్దరం కలిస్తే పిల్లవాణ్ణి ఒక్కరోజులో వెతకవచ్చు’ అంటాడు. తనలాంటి బాధితులతో పాటు ముఖ్యమంత్రిని కలిస్తే ‘వాళ్లు సరిహద్దును దాటేసి ఉంటారు. మేమెలా తీసుకురాగలం’ అని విసుక్కుంటాడు. కాని అతడనే మరో మాట అతడి పరిస్థితినీ తెలియచేస్తుంది. ‘నేనూ మీలాగే పిచ్చెత్తి పోతున్నాను. నా భార్య అమెరికాలో ఉంటోంది. నా కొడుకు మరో చోట. నా కూతుళ్లు వేర్వేరు చోట్ల. నేనూ మీలాగే ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాను. మనందరం ఒకే స్థితిలో ఉన్నాం’ అంటాడు ముఖ్యమంత్రి. హలీమా ఇప్పుడు తన కొడుకు ఇమ్రాన్ కోసం పోరాడ్డం లేదు. కశ్మీర్లో మాయమైపోయిన వాళ్ల కోసం పోరాడుతోంది. అదే ఆమె జీవితంగా మారిపోయింది. ‘తల్లిపోయినవారి బంధుమిత్రుల సంఘాని’కి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఇందుకు బి.బి.సి విలేకరి, స్థానిక కశ్మీరీ అయిన ఇజర్లాంటి వాళ్లు మద్దతుగా నిలిచారు. చివరకు ఒక జడ్జి ఆధ్వర్యంలో మాయమైపోయినవారి విచారణ జరిగింది. ఆ రోజైనా ఇమ్రాన్ ఏమయ్యాడో తెలుస్తుందని ఆశ. కాని మిలటరీ అధికారి వచ్చి ‘నీ జీవితాంతం నేను చూసుకుంటాను. రెండు లక్షల దాకా డబ్బు కూడా ఇస్తాం’ అంటాడు. కొడుకు కోసం వెతికే తల్లికి ఇది ధూళితో సమానం. ‘నా కొడుకెక్కడా? వాణ్ణి తీసుకెళ్లిన మేజర్ నా బిడ్డని ఏం చేశాడు’ ఆమె కన్నీరు మున్నీరుగా అడుగుతుంది. ‘ఆ మేజర్ సరిహద్దుల్లో చచ్చిపోయాడు’ అని జవాబొస్తుంది. కొడుకు గురించిన సమాచారం ఇవ్వగలిగింది అతనొక్కడే. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. ‘నేనిలా ఓడి పోకూడదు. ఇంటికి పోయి ఎదురు చూస్తూ కూచోవాలి. అదొక్కటే నాకు దారి’ అనుకుంటుంది హలీమా. ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఇజర్ ఆమెను చూడ్డానికి వెళితే ‘కలలు రాని నిద్ర పోవాలని ఉందయ్యా’ అంటుంది బాధగా. బహుశా, కశ్మీరీలకు మెలకువ, నిద్ర కూడా ఒక పీడకలగా మారిందని చెప్పడానికి ఇంతకు మించిన వాక్యం లేదు. ‘ఇమ్రాన్.. వచ్చావా నాయనా’ అన్నదే హలీమా ఆఖరి మాట. రోజులు గడిచాయి. ఒకప్పుడు పట్టుకెళ్లినవాళ్లను చిత్రహింసలకు గురిచేసిన భవనం ఇప్పుడు విదేశీ టూరిస్టులకి అతిథి గృహమయింది. స్థానికులను తరలించి జీలం నది ఒడ్డును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం చేసే ఈ పనులు ఇజర్ వంటి వారిని ఆగ్రహోదగ్రులను చేయడం సహజం. ఈ నవలను చదువుతుంటే మహాశ్వేతాదేవి ‘ఒక తల్లి కథ’ కళ్ల ముందు కదలాడింది. హాఫ్ మదర్‌లో ఎన్నో సంఘటనలు మన కళ్లని తడిపేస్తాయి. కశ్మీర్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ నవల తప్పకుండా చదవాలి. - కృష్ణాబాయి కొడుకు బతికున్నాడో లేదో తెలియక అల్లాడిపోయే తల్లిని ‘హాఫ్ మదర్’ అంఆరు కశ్మీర్లో. అలాగే భర్త ఆచూకి తెలియని భార్యని ‘హాఫ్ విడో’ అంటారు. గాయపడిన కశ్మీర్ సౌందర్యం గురించి బషరత్ పీర్ ‘కర్ఫ్యూడ్ నైట్స్’ చదివితే తెలుస్తుంది. ‘హాఫ్ మదర్’ చదివితే కన్నీరుబుకుతుంది.