విశాఖలో 1970 ఫిబ్రవరి 1న శ్రీశ్రీకి జరిగిన సన్మానానికి నాలుగు చెరగులనుంచీ సాహిత్యాభిమానులు తరలివచ్చారు. విశాఖ విద్యార్థులు ‘రచయితలారా! మీరెటువైపు!’ అని సవాల్ విసిరారు. రచయితల్లో కలకలం బయలుదేరింది. తామెటువైపో తేల్చుకోవలసి వచ్చింది. సాయంత్రం ఆర్వీఎస్, పురిపండా, కారా, కేవీఆర్, పురాణం, వరవరరావు, జ్వాలా ముఖి, లోచన్, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మొదలైన ప్రముఖ రచయితలూ, కవులూ విశాఖలోని చౌల్ట్రీ నుంచీ స్టేడియం దాకా ఊరేగింపుగా నడిచారు. రచయితలు ఊరేగింపుగా రావడం ఇదే తొలిసారి అన్నారు పురిపండా అప్పలస్వామిగారు. దిగంబర కవులూ, తిరగబడు కవులూ, మరెందరో తమ రచనలు వినిపించారు. లోచన్ ‘ట్రిగ్గర్ మీద వేళ్లతో’ అంటూ ‘శిశూ! పిడికిలి బిగించి ఈ లోకంమీద యుద్ధం ప్రకటిస్తున్నావా?’ అంటూ పొత్తి ళ్లలో బిడ్డని ఆహ్వానించాడు.
అయిదు నెలల తర్వాత 1970 జూలై 4న హైదరాబాద్‌లో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. విడివిడిగా చిన్న సమూహాలుగా ఉన్న అనేకమంది కవులు విరసంలోకి వచ్చారు. ‘నిజం చెప్పాలంటే విరసం ఆవిర్భావానికి ఏకైక చోదక శక్తి నక్సలైట్ ఉద్యమం... విప్లవాగ్నుల లోంచి విరసం ప్రభవించడం నేను కళ్లారా చూశాను’ అన్నాడు శ్రీశ్రీ. విరసం పుట్టి వారం తిరక్కుండానే శ్రీకాకుళోద్యమ నాయకులు వెంపటాపు సత్యం, కైలా సాల్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది (జూలై 10). ఒక కేసులో రైతు నాయకులు కిష్టా గౌడ్, భూమయ్యలకి ఉరిశిక్ష విధించింది కోర్టు. ప్రజాందోళనతో రెండుసార్లు ఉరి ఆగింది. పౌరహక్కుల సంఘం తరఫున పత్తిపాటి వెంకటేశ్వర్లు ఈ విషయంలో నిర్వహించిన పాత్ర అమోఘం.
పిరికి ప్రభుత్వం ఎమర్జెన్సీ చీకటిమాటున వాళ్లిద్దర్నీ ఉరి తీసింది (డిసెంబరు 1975). పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వికృత రూపం ధరించడంతో, ఎన్నికల వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు రాజకీయాల్లో ముందుకొచ్చాయి. ఆ పోరాటాల ప్రేరణతో రచయితలంతా ఉత్సాహంగా విరసంలో చేరారు. కవిత, కథ, నవల, విమర్శ, పాట సహా అన్ని సాహిత్య ప్రక్రియల్లో విరసం విస్తృత కృషి చేసింది. రచయితలంతా తమ రచనలతో ప్రజలపక్షం వహించారు. విరసం ప్రేరణతో వందలాదిమంది పోరాట యోధులు తయారయ్యారు.
అలాంటి సంస్థకి 2004–2006 మధ్య కార్యదర్శిగా ఉన్నాను. 2001–2007 మధ్య అరుణతారకి సంపాదకత్వం వహించాను. పెరుగుతున్న ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటాలను అణచివేసే ప్రయత్నంలో భాగంగా విరసంపై నిషేధం విధిం చిన సందర్భంలో నగరంలో పెద్దల్ని (జస్టిస్ చిన్నపరెడ్డిసహా) కలిసి పరిస్థితులు వివరించాం. అప్పుడు నేను విరసం కార్యదర్శిని. ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. మాది రాజకీయ పార్టీ కాదనీ సాహిత్య, సాంస్కృతిక సంఘమేననీ, ఇలాంటి సంఘాన్ని నిషేధించడం అన్యాయమనీ త్రిసభ్య కమిటీకి నివేదించాం. ‘నిషేధిస్తే నష్టమేమిటని’ త్రిసభ్య కమిటీ మెంబర్ టీఎల్‌ఎన్ రెడ్డి అడిగాడు. ‘మీ అబ్బాయిని మూడు గంటలు చీకటి కొట్లో నిర్బంధించి, ఆ తర్వాత అభిప్రాయాన్ని సేకరించండి తెలుస్తుంది’ అన్నాం. మూడు నెలల తర్వాత నిషేధం ఎత్తేయవలసి వచ్చింది.
విరసం మా ఊపిరి. తప్పులూ, ఒప్పులూ, నిర్బంధాలూ, విజయాలూ ఎదురయ్యే దారిలోనే విరసం ప్రయాణం సాగుతోంది. విరసం ఆవిర్భావంలో ఎందరో కొత్త రచయితలకి ఊపిరులూది, పీడిత ప్రజల పక్షపాతిగా నిలిచిన విరసంతో నా అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది. ఈ అర్ధ శతాబ్ది ఉత్సవాల్లో, చరిత్రని విశ్లేషించుకుంటూ, ఇంకా చేయవలసిన పనులని పురమాయిస్తూ, విప్లవానికి పునరంకితమవుతూ విరసం ముందుకు సాగవలసిన తరుణం ఏర్పడింది. అమరులైన విప్లవ రచయితలందరి స్ఫూర్తితో విరసం మరింత నిబద్ధతతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.
కృష్ణాబాయి
వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యురాలు
(హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు, రేపు విరసం మహాసభలు)
Comments
Please login to add a commentAdd a comment