వర్షపుదారి
- కవిత
ఒక్క చినుకు దారి మరచి
అరచేతిలో రాలినా చినుకులో ఏమీ వుండవు
చేతిలో పడగానే స్పర్శ మొదలవుతుంది
ఒక నాటి వాన జల్లు తడి జ్ఞాపకం
వేళ్ల కొసలని తాకుతుంది
పసుపు గన్నేరు పూలు భుజాల మీద
మెడ ఒంపులో రాలుతున్న మెత్తటి సుఖం
ఖాళీతనంలో చొరబడి చెవి పక్కనే వినిపించే నవ్వు
ఎగిరిపోయిన గొడుగు దొరికిపోయిన శరీరం
కాస్త ఖాళీ చోటులో కాగితం పడవతో ఆడుకోవడం
దూరంగా వినిపించే చిన్న పిట్ట కూత రెక్కలో
తడి ఆకాశం మబ్బులని తోసుకుంటున్న
దృశ్యంలోకి
చినుకు తలుపులు తోసుకు వచ్చిన గాలి గుర్తులని
ఆ వర్షపు హాయిని ఈ వేడిదారిలో
వెతుక్కుంటూ చాచిన అరచేయిలో
రాలి పడిన ఒక్క చినుకు తడిలో
వర్షపు దారి ఆనవాళ్లు పొడి పొడిగా
- రేణుక అయోల, 9963889298
నిశ్శబ్దభేదం
అధరాల మధ్యలో
ఉక్కిరిబిక్కిరవుతూ
పరస్పర పరవశాల
పరాకాష్ట పరవళ్లలో
మునిగిపోయింది...
అపార్థాల మధ్యలో
బిక్కుబిక్కుమంటూ
మరింతగా ముడుచుకుని
ముఖాన్ని మాడ్చుకుంటూ
మూలన కూర్చుంది...
అప్పటికీ
ఇప్పటికీ
మనిద్దరి మధ్యా
నిశ్శబ్దంలో ఎంత భేదం?!
- రాజేష్ యాళ్ళ, 9700467675
రెండు బాణాలు
కురిస్తే
ఖాళీ అవుతాయి మబ్బులు
కానీ ఎప్పటికీ కురిసేవే
కళ్లు
చినుకు రాలితే
నేలకు తడి
గొంతు పాడితే
గుండెకు తడి
- డా॥బాణాల శ్రీనివాసరావు
9440471423