Telugu poem
-
సింగపూర్‌లో మొట్టమొదటిసారిగా తెలుగు పద్యాల పోటీ
తెలుగు భాషా ప్రాధాన్యం తగ్గిపోతున్న ఈ రోజుల్లో దేశం కాని దేశంలో తెలుగుపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. సింగపూర్ తెలుగు తోరణము అనే పేరుతో ఓ రియాలిటీ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేమన, సుమతి శతకాల నీతి పద్యాల పోటీని నాలుగు వృత్తాలుగా, పది ఎపిసోడ్లుగా నిర్వహిస్తున్నారు. 20 మంది చిన్నారులు ఈ పోటీలో పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్దికి ఈ కార్యక్రమం ఒక ముందడుగులా ఉంటుందని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అనంతరం పోటీలో పాల్గొన్న చిన్నారులకు పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని అందజేశారు. కాగా మొదటి రౌండ్ పోటీకి రాంబాబు పాతూరి, గాడేపల్లి అపర్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంఘ సింగపూర్ తెలుగు టీవీ యేట్యూబ్ చానల్లో ప్రతి శనివారం ఒక భాగంగా మొత్తం 10 భాగాలుగా విడుదల అవుందని నిర్వాహకులు తెలిపారు. -
ప్రపంచ సాహిత్యంలో అరుదైన ప్రక్రియ తెలుగు పద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలోనూ లేని అరుదైన ప్రక్రియ పద్యమని.. తెలుగు వారి సొత్తైన ఈ ప్రక్రియ కాపాడి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అన్నారు. తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక, ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగం సంయుంక్తాధ్వర్యంలో సిటీ కళాశాలలో జరిగిన మహోన్నతం మన పద్యం విద్యార్థి పద్యగాన సభలో అతిథిగా పాల్గొన్న డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ... ప్రాచీన పద్యాలలో ఉన్న మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసం వంటిని నేటితరం విద్యార్థులకు అందించడం, అలాగే పద్య పఠనం ద్వారా వారిలో ఏకాగ్రత, ధారణశక్తి, జ్ఞాపకశక్తి వంటిని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పౌరాణిక నాటక పద్యాలలో గొప్ప జీవన విలువలున్నాయి. పౌరాణిక నాటకాల ప్రదర్శనతో తెలుగు పద్యానికి విస్తృతి పెరిగిందని రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ పాండవీయం తదితర పద్య నాటకాలు తెలుగు ప్రజానీకానికి గొప్ప సంస్కృతి సంతృప్తిని కలిగించాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాల భాస్కర్ మాట్లాడుతూ... సిటీ కళాశాల విద్యార్థులలో చైతన్యం కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఘట్టి బాల చైతన్యం, పద్య పరిమళం వంటి సంస్థలలో శిక్షణ పొందిన 25 మంది ప్రాథమిక, ఉన్నత పాఠశాలల చిన్నారులు ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు, శతకాలలోని పద్యాలను రాగయుక్తంగా, భావ గర్భితంగా ఆలపించి ఆధ్యాపకులను, సభికులను మంత్ర ముగ్ధులను చేశారు. (క్లిక్ చేయండి: తానా ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు పురస్కారాలు) -
సాహితీ శరత్తు
ప్రాచీన కవులు మొదలుకొని నవీన కవుల వరకు శరదృతు వర్ణన చేయని కవులు సాహితీలోకంలో అరుదు. వర్షకాలం నిష్క్రమించి, కరిమబ్బులు తొలగిన స్వచ్ఛగగనంలో రాత్రివేళ కనిపించే చంద మామ కురిపించే వెన్నెల సోనల జడిలో మనసు తడిసి మురిసిన కవులు నిలువెల్లా పులకించి పుంఖాను పుంఖాలుగా పద్యాలు రాశారు. ‘శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులం/ జారు తరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో/ దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క/ ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరపూరితంబులై’– భారతంలో నన్నయ చివరి పద్యం ఇది. వెన్నెల ధగధగలతో నిండిన శారద రాత్రులు నక్షత్రాల పట్ల దొంగల య్యాయని ఈ పద్యంలో చమత్కరించాడాయన. వెన్నెల వెలుగుల్లో నక్షత్రాలు అంత స్పష్టంగా కనిపించవు కదా! కర్పూరపు పొడిలా వెన్నెల కురుస్తోందని, వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలితో, పూల పరాగంతో ఆకాశం వెలిగిపోతోందంటూ శరద్రాత్రులను కళ్లకు కట్టాడాయన. శరదృతువును ‘న భూతో న భవిష్యతి’ అనే రీతిలో వర్ణించిన కవి ఆంధ్రభోజుడు కృష్ణదేవ రాయలు. ఆయన కావ్యం ‘ఆముక్త మాల్యద’లో శరదృతువును వర్ణించే పద్యాలు అనేకం ఉన్నాయి. వాటిలో మచ్చుకొకటి చూద్దాం. ‘గగనలక్ష్మి నిజోరు నక్షత్రమాలి/ కలు, వియన్నది జలముల గడుగ బిసుక/ నెఱయు కుంకుడు బండుల నుఱువులనగ/ బలపలని పాండురాంబుద పంక్తులమరె’– గగనలక్ష్మి తన ఇరవైఏడు నక్షత్రాల ముత్యాల సరాలను ఆకాశగంగలో కుంకుడురసంతో కడుగు తోందట. ఆ కుంకుడు నురుగులా ఉన్నాయట శరదాకాశంలో తేలియాడే తెలిమబ్బులు. ఇంతటి వర్ణన ప్రాచీన సంస్కృత సాహిత్యంలో సైతం ఎక్కడా కనిపించదు. రుతువర్ణనలోనూ వికటకవి తెనాలి రామకృష్ణుడి పద్ధతే వేరు! ‘పాండురంగ మాహాత్మ్యము’లో తెనాలివారి శరదృతు వర్ణనకు ఒక మచ్చుతునక– ‘కలుగకుండిన నేమి కడిమి పువ్వుల తావి/ ననిచిన మరువమెంతటికి నోప?/ దొదవకుండిన నేమి మదకేకి నటనంబు/ చాలదె యంచల సంభ్రమంబు?/ మెరవకుండిననేమి మెరుగుల పొలప మే/ తన్మాత్రములె శాలిధళధళములు?/ సుడియకుండిన నేమి సోనవానల పెల్లు/ గజదాన వృష్టికి గడమ కలదె?/ కారుకాలాన కలిగిన గౌరవంబు/ చౌకౖయె తోచె శరదృతు సౌష్ఠవమున/ నురిలి తొల్లిటి యధికారి యోసరిలిన/ వెనుక యధికారి యవికావె విభవకళలు?’. వర్షకాలంలోని కడిమిపూల పరిమళం లేదుగాని, శరత్తులో మరువం సుగంధం ఉంది కదా! నెమళ్ల నాట్యం లేకపోతేనేం హంసల సంరంభముంది కదా? మెరుపులు మెరవకపోతేనేం శాలిధాన్యాల తళతళలున్నాయి కదా! చిరుజల్లులు కురవకపోతేనేం ఏనుగులు మదజలాలను వర్షిస్తున్నాయి కదా! వర్షాకాలంలో దొరికేవి శరత్తులో మరింత చౌకగా దొరుకుతున్నాయి. శరత్తు తన ధర్మాలతో పాటు వర్షాకాల ధర్మాలనూ చూపుతోంది. ఒక అధికారి వైదొలగాక వచ్చే అధికారికి పాత అధికారి వైభవం దక్కినట్లే, శరత్తుకు వర్షరుతు వైభవమూ దక్కిందని చమత్కరించడం తెనాలి రామకృష్ణుడికే చెల్లింది. నవీనుల్లో చూసుకుంటే, ‘ఓ సఖీ! ఓ సుహాసినీ! ఓ శరద్వి/భావరీ నర్తకీ! కవిభావనా వి/లాసినీ! నిత్యసైరంధ్రి! ఓ సమస్త/ లోక మోహినీ! ఓ స్వప్నలోకరాజ్ఞి!’ అంటూ శరదృతువును అపూర్వంగా సంబోధించారు ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి. ఆరు రుతువుల్లోనూ అత్యంత ఆహ్లాదకరమైనది శరదృతువు. వర్షాలు తగ్గుముఖం పట్టి, నిర్మలాకాశం కనిపిస్తుంది. నేల మీద చిత్తడి తగ్గుతుంది. వాతావరణం సమశీతలంగా ఉంటుంది. ఉక్కపోతా ఉండదు, వణికించే చలీ ఉండదు. పనిపాటలకు మాత్రమే కాదు, విహార విలాసాలకూ కాలం అనుకూలంగా ఉంటుంది. ‘పెరిగిన శాలిసస్యముల బెంపువహించిన భూతలంబులన్/ సరసతృణాభితృప్తమయి, స్వస్థములై తగు గోకులంబులన్/ వరకలహంస సారసరవంబులకుం బ్రతిపల్కు సీమలం/ బరగుచు నెందు జూచినను భవ్యములయ్యెను నేడు క్షేత్రముల్’– అంటూ కాళిదాసు ‘ఋతు సంహారం’లోని శరద్వర్ణనను తిరుమల కృష్ణదేశికాచార్యులు తెలుగులోకి అనువదించారు. ఇక ‘ఋతుఘోష’లో శేషేంద్ర ‘ముల్లోకములు ఏలు ముద్దుహరిణాంకుడు/ విరజాజి తీవలకు విరహిణీ జీవులకు/ తరిపి వెన్నెల పాలు త్రాగించుచున్నాడు’ అని శరత్ చంద్రుడి విలాసాన్ని వర్ణించారు. నింగీ నేలా ఆహ్లాదభరితంగా ఉండే అద్భుతమైన రుతువు ఇది. ఈ ఆహ్లాదభరితమైన రుతువు లోనే శరన్నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీ. మన సంస్కృతిలో వసంత నవరాత్రుల కంటే శరన్నవరాత్రులకే ప్రాశస్త్యం ఎక్కువ. శరన్నవరాత్రుల్లో దేశం నలుమూలలా ఘనంగా దేవీపూజలు చేస్తారు. విజయదశమి దసరా పండుగగా ఆబాల గోపాలానికీ ప్రీతిపాత్ర మైన పండుగ. ఒకప్పుడు దసరా పండుగ రోజుల్లో పిల్లల సందడి ఎక్కువగా ఉండేది. గురువుల వెంట పిల్లలు విల్లంబులు పట్టుకుని ఇంటింటికీ వెళ్లేవారు. ‘ఏదయా మీ దయా మామీద లేదు/ ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు... అయ్యవారికి చాలు ఐదు వరహాలు/ పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు’ అంటూ పద్యాలు పాడేవారు. ఇంటివారు ఇచ్చే కానుకలు తీసుకుని సంతోషంగా కేరింతలు కొడుతూ వెళ్లేవారు. అదొక ముచ్చట. నాలుగైదు దశాబ్దాల కిందటి వరకు తెలుగునాట ఊరూరా సజీవంగా ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడు కనుమరుగైపోయింది. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ప్రకృతి కొంత గతి తప్పుతోంది. అలాగని ప్రకృతి తన రుతుధర్మాన్ని నెరవేర్చు కోవడాన్ని మానుకోలేదు. అందుకే మనం ఇంకా శరత్తుల సౌందర్య సౌరభాలను ఎంతో కొంత ఆస్వాదించగలుగుతున్నాం. -
Pallipattu Nagaraju: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..
జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం.. అడుగడుగునా కనిపించే వివక్ష నుంచి రగిలిన అగ్ని కణం.. కనుచూపు మేరలో కనిపించే అణచివేతను కూకటి వేళ్లతో పెకలించాలనే ఆక్రోశం.. పేదల పక్షాన పోరాటమై.. పీడిత జన పిడికిలై.. కవిత్వమే ఆయుధమై.. అక్షర సూరీడయ్యాడు.. నేను, నా కుటుంబం కాకుండా, మనం.. సమాజం అనుకొని ఎక్కుపెట్టిన ఆ కలం చైతన్య తూటాలను పేల్చింది.. నవ సమాజ నిర్మాణానికి తన వంతు బాధ్యతగా అక్షర యుద్ధం చేస్తున్న పల్లిపట్టు నాగరాజును కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించడం.. ఉమ్మడి చిత్తూరు జిల్లా చరిత్రలో ఇదే తొలి పురస్కారం కావడం విశేషం. తిరుపతి కల్చరల్/శాంతిపురం: నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన భూలక్ష్మి, రాఘవయ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు పల్లిపట్టు నాగరాజు పాఠశాల విద్యను వెంకటాపురంలో పూర్తి చేసి, సత్యవేడు జూనియర్ కళాశాలలో ఇంటర్, తిరుపతి ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ(స్పెషల్ తెలుగు) చదివారు. కర్నూలు ఐఏఎస్ఈ కాలేజీలో తెలుగు పండిట్ శిక్షణ పొందారు. తిరుపతి ఎస్వీయూలో ఏంఏ తెలుగు ఉత్తీర్ణులై.. ప్రస్తుతం ఆచార్య మేడపల్లి రవికుమార్ పర్యవేక్షణలో విల్సన్ సుధాకర్ రచనలపై పీహెచ్డీ చేస్తున్నారు. 2016 జూన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శాంతిపురం మండలంలోని 64.పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. చిన్నప్పటి నుంచే రచనలపై ఆసక్తి తల్లిదండ్రుల కష్టంతోపాటు చుట్టుపక్క ప్రజల జీవన శైలి నాగరాజు రచనలపై ఎనలేని ప్రభావం చూపింది. సమాజంలో సగటు మనిషి బాధలే తన బాధగా కవితలను అక్షరీకరించాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో పీడిత జనానికి తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలని అక్షరాలనే ఆయుధంగా మలుచుకున్నాడు. శ్రీశ్రీ, తిలక్ రచనల స్ఫూర్తితో తనదైన శైలిలో పల్లె భాషకు జీవం పోస్తూ సామాన్య పదాలతో అసామాన్య కవితలకు జీవం పోశాడు. అవ్వ చెప్పిన ఆ కథలే.. చిన్నప్పుడు అవ్వ మంగమ్మ చెప్పే జానపద కథలు, బుర్ర కథలు, దేవుళ్ల కథలు, దెయ్యాల కథలు, బూతు కథలు, నీతి కథలు, తమాషా కథలు.. నాగరాజు ఊహకు పదునుపెట్టాయి. బహుజనుల శ్రమతత్వం కవితకు ప్రేరణ కలిగించాయి. పాఠశాల స్థాయి నుంచే చిన్న చిన్న కవితలు, పాటలకు పేరడీలు రాసేందుకు సన్నద్ధం చేశాయి. ఏదో చేయాలని.. పోరాటంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కోణం. కొందరు తుపాకీ పడతారు, కొందరు శాంతి బాట పడతారు. ఇంకొకరు ఇంకొకటి.. ఇలా నాగరాజు ఎంచుకున్న బాట కవిత్వం. అక్షర శక్తి తెలిసిన వ్యక్తిగా పీడిత జనం పక్షాన నిలిచి అక్షర సేద్యం చేశారు. ఇలా రూపుదిద్దుకున్నదే ‘యాలైపూడ్సింది’. తొలి వచన కవితా సంపుటి 2021, జనవరి 31న కవి సంగమం ప్రచురణల ద్వారా తిరుపతిలో ఆవిష్కృతమైంది. ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది సామాన్య శ్రమజీవుల జీవన విధానాలను అక్షరాలుగా పేర్చి కూర్చిన తొలి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. తొలి రచనకే అనూహ్యంగా యువ పురస్కారం రావటం నా బాధ్యతను తెలియజేస్తోంది. సామాన్యుల కష్టాలు, వారి నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులే కథావస్తువులుగా రచనలు కొనసాగిస్తాం. ఇది నా తల్లిదండ్రుల శ్రమకు తగిన ఫలితం. శ్రమ జీవులు, బహుజనుల జీవితాల సంఘర్షణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. తల్లిదండ్రులకు ఈ అవార్డును అంకితమిస్తా. – పల్లిపట్టు నాగరాజు -
తెలుగు పద్యాలను అలవోకగా చెప్తున్న చిన్నారి
-
అట జని కాంచె భూమిసురుడు..
సాక్షి, హైదరాబాద్ : తెలుగు భాషపై, సాహిత్యంపై ఎంతో మక్కువ ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రపంచ తెలుగు మహాసభల్లో పద్యాలతో అలరించారు. తాను 40 ఏళ్ల కింద చదువుకున్న సాహిత్యం ఇప్పటికీ గుర్తు ఉందని చెబుతూ.. రెండు పద్యాలను శ్రావ్యంగా ఆలపించి ఆకట్టుకున్నారు. అల్లసాని పెద్దన రచించిన మను చరిత్రములోని పద్యం... ‘అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కర కంపిత జాలము శీతశైలమున్’ నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణంలోని పద్యం... నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుగిన్క బూనీ దాచిన యది నాకు మన్ననయె, చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే ననియెద నల్క మానవుగదా యికనైన నరాళకుంతలా! .. కేసీఆర్ ఈ రెండు పద్యాలను ఆలపించడంతో సభికులంతా హర్షధ్వానాలు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఆదివారం తెలంగాణ సారస్వత పరిషత్తులో శతావధాని గౌరీభట్ల మెట్టు రామశర్మ ఆధ్వర్యంలో జరిగిన శతావధానం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో వర్ణించారు. తర్వాత కేసీఆర్ రామశర్మను శాలువాతో సత్కరించి.. ప్రసంగించారు. ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచి పోయేలా దేదీప్యమానంగా జరుగుతున్నా యని, ఈ సభలతో సాహిత్యానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. సాహిత్య సమావేశా లకు అద్భుత స్పందన వస్తుంటే గుండెల నిండా సంతోషంగా ఉందన్నారు. రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, సారస్వత పరి షత్తు వేదికల వద్ద చోటు సరిపోనంతగా సాహితీప్రియులు హాజరుకావడం సంతోషం గా ఉందని చెప్పారు. సభల ముగింపు రోజున చరిత్రాత్మకమైన నిర్ణయాలు వెల్లడిస్తామని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షించే లా తీర్మానాలు ప్రకటిస్తామని చెప్పారు. సాహితీవేత్తలకు తగిన గుర్తింపు ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా సాహిత్యా నికి పూర్వ వైభవం వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. కవి సమ్మేళనాలు, చర్చలు ఆసక్తి కరంగా సాగుతున్నాయని.. సభ నిర్వహణ, అతిథులకు భోజన సదుపాయం వంటివి బాగున్నాయని పేర్కొన్నారు. ఈ మధ్య కాలం లో సాహితీవేత్తలకు కాస్త ఆదరణ తగ్గిందని చెప్పారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని.. సాహితీవేత్తలకు తగిన గుర్తింపు దక్కుతుందని తెలిపారు. తెలంగాణలో రస స్ఫూర్తికి కొదవ లేదని వ్యాఖ్యానించారు. అందరికీ తెలుగు నేర్పండి.. తెలుగువారందరికీ తెలుగు నేర్పాలని కేసీఆర్ ఉపాధ్యాయులకు విన్నవించారు. మహాసభల నిర్వహణ కోసం జరిపిన చర్చల్లో.. ‘మమ్మీ.. డాడీ అనే రోజుల్లో పద్యాలు, కవిత్వాలు వింటారా..’ అంటూ తనకు, నందిని సిధారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని చెప్పారు. కానీ ఇప్పుడు అన్ని వేదికలు కిటకిటలాడు తున్నాయని.. ప్రపంచ తెలుగు మహాసభలు పూర్తిగా విజయవంతమైనట్లుగా అనిపిస్తోంద ని కేసీఆర్ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కె.కేశవరావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు. గురువులే దారి చూపారు.. తాను డాక్టర్‌గానీ, ఇంజనీర్గానీ కావాలని తన తండ్రి కోరుకునే వారని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ దారి మళ్లిన తనను గురువుగారు తిరిగి దారికి మళ్లించారని.. సాహితీ కవాటాలు తెరిచి సాహిత్యం వైపు తీసుకెళ్లారని తెలిపారు. ఒకప్పుడు తనకు మూడు వేల తెలుగు పద్యాలు కంఠస్థం వచ్చేవని గుర్తు చేసుకున్నారు. ఇంటర్ చదివే రోజుల్లో గురువులు తనను ఎంతో ప్రోత్సహించారని.. ప్రిన్సిపాల్ ఏది కోరితే అది ఇచ్చేవారని చెప్పారు. ‘‘1974లో హైదరాబాద్‌లో జరిగిన తెలుగు మహాసభలకు అధ్యాపకులతో కలసి వచ్చాం. నాతో అప్పుడు మిత్రుడు ఓంకార్, ప్రిన్సిపాల్ గంగారెడ్డి ఉన్నారు. రాత్రి బ్యాగులు పట్టుకుని నగరంలో విడిది వద్దకు వెళ్తుండగా 60 మంది పోలీసులు మమ్మల్ని ఆపి పుస్తకాల పెట్టెలు చెక్‌చేశారు. చాలా భయపడ్డాం. పెట్టెలు తెరిచి చూసిన పోలీసులు.. ‘పెట్టెల్లో అన్నీ పుస్తకాలే.. ఏమీ లేవు సార్.. పాగల్ హై(పిచ్చోళ్లు)’ అని తమ పైఅధికారికి చెప్పి మమ్మల్ని వదిలేశారు. అయినా మహాసభల్లో జరిగిన పోటీలలో తృతీయ బహుమతి గెలుచుకొన్నాం. మేమంతా తిరిగి వెళ్లాక ప్రిన్సిపాల్.. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. భయపెట్టారు. లేకుంటే మొదటి స్థానమే వచ్చి ఉండేదన్నారు..’’ అని కేసీఆర్ వెల్లడించారు. -
వర్షపుదారి
- కవిత ఒక్క చినుకు దారి మరచి అరచేతిలో రాలినా చినుకులో ఏమీ వుండవు చేతిలో పడగానే స్పర్శ మొదలవుతుంది ఒక నాటి వాన జల్లు తడి జ్ఞాపకం వేళ్ల కొసలని తాకుతుంది పసుపు గన్నేరు పూలు భుజాల మీద మెడ ఒంపులో రాలుతున్న మెత్తటి సుఖం ఖాళీతనంలో చొరబడి చెవి పక్కనే వినిపించే నవ్వు ఎగిరిపోయిన గొడుగు దొరికిపోయిన శరీరం కాస్త ఖాళీ చోటులో కాగితం పడవతో ఆడుకోవడం దూరంగా వినిపించే చిన్న పిట్ట కూత రెక్కలో తడి ఆకాశం మబ్బులని తోసుకుంటున్న దృశ్యంలోకి చినుకు తలుపులు తోసుకు వచ్చిన గాలి గుర్తులని ఆ వర్షపు హాయిని ఈ వేడిదారిలో వెతుక్కుంటూ చాచిన అరచేయిలో రాలి పడిన ఒక్క చినుకు తడిలో వర్షపు దారి ఆనవాళ్లు పొడి పొడిగా - రేణుక అయోల, 9963889298 నిశ్శబ్దభేదం అధరాల మధ్యలో ఉక్కిరిబిక్కిరవుతూ పరస్పర పరవశాల పరాకాష్ట పరవళ్లలో మునిగిపోయింది... అపార్థాల మధ్యలో బిక్కుబిక్కుమంటూ మరింతగా ముడుచుకుని ముఖాన్ని మాడ్చుకుంటూ మూలన కూర్చుంది... అప్పటికీ ఇప్పటికీ మనిద్దరి మధ్యా నిశ్శబ్దంలో ఎంత భేదం?! - రాజేష్ యాళ్ళ, 9700467675 రెండు బాణాలు కురిస్తే ఖాళీ అవుతాయి మబ్బులు కానీ ఎప్పటికీ కురిసేవే కళ్లు చినుకు రాలితే నేలకు తడి గొంతు పాడితే గుండెకు తడి - డా॥బాణాల శ్రీనివాసరావు 9440471423 -
పుస్తక సమీక్షణం
అద్వైతపు వెన్నముద్ద ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్. పేజీలు: 284; వెల: 120 పుస్తకం : సాగర ఘోష కావ్యం - సామాజికాద్వైతం జానర్ : నాన్ఫిక్షన్/సిద్ధాంత గ్రంథం రచన : డా॥తలారి వాసు తెలుగు పద్యం ప్రాభవాన్ని కోల్పోతుందనే భావన ఆధునిక కవుల మెదళ్లను తొలుస్తున్న నేటి సమాజంలో పద్య ప్రాశస్త్యాన్ని ప్రభావిత పరచే విధంగా హృద్యంగా రాస్తూ, అవధాన ప్రక్రియ ద్వారా, ఉపన్యాసాల ద్వారా పద్యానికి ప్రాణం పోస్తున్నవారు డా॥గరికపాటి నరసింహారావు. పద్యం రాయడంలోను, చెప్పడంలోను ప్రావీణ్యత ఉండాలే కాని, బతుకు తెరువుకు పద్యం పనికొస్తుందని నిరూపించిన మహాసహస్రావధాని. వీరి కావ్యం ‘సాగర ఘోష’. 1116 పద్యాలతో భారతీయ తాత్త్విక చింతనా నేపథ్యంలో, జగద్గురు ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతానికి అద్దం పట్టే విధంగా, సామాజిక భౌతిక పర్యావరణ కలుషితాలను ఎత్తి చూపుతుంది. ‘సాగర ఘోష’ కావ్యంలోని సామాజికాద్వైతం దర్శింపజేస్తూ సిద్ధాంత గ్రంథాన్ని రాశారు డా॥తలారి వాసు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 2010లో డాక్టరేట్ పట్టం పొందిన సిద్ధాంత గ్రంథమిది. పరిజ్ఞానం, పరిపక్వత రెండూ కలిగిన వాసు, దశమాంతరంగాలు గల ఈ కావ్యాన్ని పరిశోధనతో చిలికి షష్ఠ్యాంతరంగాలుగా వడగట్టి సామాజికాద్వైతాన్ని వెన్నముద్దగా అందించారు. సాగర ఘోష కవితా లోతులు, రీతులు తెలియాలంటే ఈ సిద్ధాంత గ్రంథాన్ని పఠించాల్సిందే! - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి మ్యాజిక్ సృజన పేజీలు : 160 వెల: 150 ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయా పుస్తక కేంద్రాలు పుస్తకం : హృదయంలో ఉదయం (నవల) రచన : డా.జి.సురేశ్‌బాబు విషయం : ఒక రచయిత సృజన ప్రపంచం అతని మనస్సు తిరుగాడిన లోకాలలోంచి బహిర్గతమవుతుంది. ఓ రకంగా ఆ రచన ఆ రచయిత అవగాహనా పరిధిని పాఠకులకు పరిచితం చేస్తుంది. ఒక్కోసారి రచయిత చూడలేకపోయిన ప్రపంచాన్ని ‘భ్రమ’గానైనా ఆ రచన వ్యక్తీకరిస్తుంది. దీనినే క్రిస్టఫర్ కాడ్వెల్ ‘ఇల్యూజన్’ అన్నది. సరిగ్గా, ఈ ఇల్యూజన్‌ను వాస్తవికతలో ముంచి ఆధ్యాత్మిక లోకంలోకి ప్రయాణింపజేసే నవల ఇది. చిత్రమైన నవల. పాఠకుడి అవగాహనాపరిధిని విశాలం చేసేది కూడా. కాళిదాసు, శ్రీశ్రీ, చలం, కృష్ణశాస్త్రి, యండమూరి లాంటి కవులు, రచయితలు పరిచయమవుతారు. ఉపనిషత్ వాక్యాలు హృదయంలోకి చొచ్చుకుపోతాయి. జీవితం, దాంపత్యం, అలౌకికత, ఆధ్యాత్మికత మధ్య గిరికీలు కొట్టే మానవ మనస్తత్వాన్ని బ్యాలెన్స్ చేయాలనే రచయిత తపన నవలంతా కనిపిస్తుంది. రుషి, ఆశ, శిఖర్, నిష్ఠ, నయన, రంగాచారి, మస్తాన్, ఫరీదా, సుషుమ్న లాంటి పాత్రలు జీవితం చుట్టూ ముసిరిన హిపోక్రసీని బహిర్గతం చేస్తూ గుర్తుండిపోతారు. ఫాంటసీ అంతర్లీనంగా సహజత్వం ఉన్న ఈ నూతన ధోరణి నవల పాఠకులకు మంచి అనుభూతిని వాగ్దానం చేస్తుంది. - డా. నూకతోటి రవికుమార్ ద్రవరూప అక్షరాలు ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయా పుస్తకం : నేను నా పైత్యం రచన: శంభుమహంతి రత్నకిశోర్ విషయం: గబ్బర్‌సింగ్ సినిమాలోని వెటకారపు ఉటంకింపునే పుస్తక టైటిల్‌గా స్వీకరించాడంటే ఆ రచయితకు నిజంగానే తిక్కేదో ఉండాలి! మణిరత్నం, వర్మ, బాల, సుకుమార్, ఎంఎస్ రెడ్డి, ఇళయరాజా, హరీష్‌శంకర్; తనకు నచ్చినవాళ్ల మీద తనకు నచ్చినట్టు రాసుకున్న కొన్ని వ్యాసాలున్నాయీ పుస్తకంలో (పుస్తకం? అట్లాస్ సైజు, ఆర్ట్ పేపర్, 18 పేజీలు). శృంగారం దేహగతమా ఆత్మగతమా లాంటి సందేహాలు; ‘సత్యం స్వప్నం మధ్య ప్రయాణమే జీవితం’ లాంటి సందేశాలు; ‘ప్రేమని పొందలేనిచోట మరణం ఆకస్మికమైనా వాంఛితమే’ లాంటి కవిసమయాలు అక్కడక్కడా! జీఎం ఫుడ్ గురించి, అమ్మాయిల 50 శాతం వాటా గురించి కూడా మాట్లాడుతాడు. ‘మా నేతల నుంచి, మా పోలీసు బాసుల నుంచి ఏమీ ఆశించకండి. రెండు నిమిషాలు మౌనం తప్ప’ అని దిల్సుఖ్నగర్ పేలుళ్ల బాధితుల కోసం దుఃఖపడతాడు కూడా! తన ద్రవరూప పైత్యాన్ని ఒక నిర్మాణంలోకి తేగలిగితే మంచి ప్రోజ్ రైటర్ అవగల శక్తి ఉన్నవాడు కిశోర్. - ఆర్.ఆర్. కొత్త పుస్తకాలు వెల: 36 ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు జీవితం- రచనలు-సమాలోచన సంపాదకులు: డా.వీరాచారి పేజీలు: 184; వెల: 90 ప్రతులకు: అధ్యక్షుడు, అరసం వరంగల్ జిల్లా, 3-83, శ్రీవెంకటేశ్వర కాలనీ, గోపాలపురం, హన్మకొండ-15. ఫోన్: 9963610842 ఒక దీపం వెలిగింది (వికలాంగుల జీవనపథం) రచన: అలపర్తి పిచ్చయ్య చౌదరి పేజీలు: 118; వెల: 80 ప్రతులకు: రచయిత, 42/169, జయనగర్ కాలనీ, కడప-516002; ఫోన్: 08562-253734 హిందూ సంప్రదాయ పండుగలు- ఉత్సవాలు రచన: కప్పగంతు వెంకట రమణమూర్తి పేజీలు: 158; వెల: 125 ప్రతులకు: గ్లోబల్ న్యూస్, బి 2, ఎఫ్ 12, రామరాజా నగర్, సుచిత్రా జంక్షన్, సికింద్రాబాద్-67; ఫోన్: 9246375694