సాక్షి, హైదరాబాద్ : తెలుగు భాషపై, సాహిత్యంపై ఎంతో మక్కువ ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రపంచ తెలుగు మహాసభల్లో పద్యాలతో అలరించారు. తాను 40 ఏళ్ల కింద చదువుకున్న సాహిత్యం ఇప్పటికీ గుర్తు ఉందని చెబుతూ.. రెండు పద్యాలను శ్రావ్యంగా ఆలపించి ఆకట్టుకున్నారు.
అల్లసాని పెద్దన రచించిన మను చరిత్రములోని పద్యం...
‘అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్‌ఝరీ పటల
ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత జాలము శీతశైలమున్’
నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణంలోని పద్యం...
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుగిన్క బూనీ
దాచిన యది నాకు మన్ననయె, చెల్వగు నీ పదపల్లవంబు
మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద నల్క మానవుగదా యికనైన నరాళకుంతలా!
.. కేసీఆర్ ఈ రెండు పద్యాలను ఆలపించడంతో సభికులంతా హర్షధ్వానాలు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఆదివారం తెలంగాణ సారస్వత పరిషత్తులో శతావధాని గౌరీభట్ల మెట్టు రామశర్మ ఆధ్వర్యంలో జరిగిన శతావధానం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో వర్ణించారు. తర్వాత కేసీఆర్ రామశర్మను శాలువాతో సత్కరించి.. ప్రసంగించారు. ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచి పోయేలా దేదీప్యమానంగా జరుగుతున్నా యని, ఈ సభలతో సాహిత్యానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. సాహిత్య సమావేశా లకు అద్భుత స్పందన వస్తుంటే గుండెల నిండా సంతోషంగా ఉందన్నారు. రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, సారస్వత పరి షత్తు వేదికల వద్ద చోటు సరిపోనంతగా సాహితీప్రియులు హాజరుకావడం సంతోషం గా ఉందని చెప్పారు. సభల ముగింపు రోజున చరిత్రాత్మకమైన నిర్ణయాలు వెల్లడిస్తామని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షించే లా తీర్మానాలు ప్రకటిస్తామని చెప్పారు.
సాహితీవేత్తలకు తగిన గుర్తింపు
ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా సాహిత్యా నికి పూర్వ వైభవం వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. కవి సమ్మేళనాలు, చర్చలు ఆసక్తి కరంగా సాగుతున్నాయని.. సభ నిర్వహణ, అతిథులకు భోజన సదుపాయం వంటివి బాగున్నాయని పేర్కొన్నారు. ఈ మధ్య కాలం లో సాహితీవేత్తలకు కాస్త ఆదరణ తగ్గిందని చెప్పారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని.. సాహితీవేత్తలకు తగిన గుర్తింపు దక్కుతుందని తెలిపారు. తెలంగాణలో రస స్ఫూర్తికి కొదవ లేదని వ్యాఖ్యానించారు.
అందరికీ తెలుగు నేర్పండి..
తెలుగువారందరికీ తెలుగు నేర్పాలని కేసీఆర్ ఉపాధ్యాయులకు విన్నవించారు. మహాసభల నిర్వహణ కోసం జరిపిన చర్చల్లో.. ‘మమ్మీ.. డాడీ అనే రోజుల్లో పద్యాలు, కవిత్వాలు వింటారా..’ అంటూ తనకు, నందిని సిధారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని చెప్పారు. కానీ ఇప్పుడు అన్ని వేదికలు కిటకిటలాడు తున్నాయని.. ప్రపంచ తెలుగు మహాసభలు పూర్తిగా విజయవంతమైనట్లుగా అనిపిస్తోంద ని కేసీఆర్ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కె.కేశవరావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు.
గురువులే దారి చూపారు..
తాను డాక్టర్‌గానీ, ఇంజనీర్‌గానీ కావాలని తన తండ్రి కోరుకునే వారని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ దారి మళ్లిన తనను గురువుగారు తిరిగి దారికి మళ్లించారని.. సాహితీ కవాటాలు తెరిచి సాహిత్యం వైపు తీసుకెళ్లారని తెలిపారు. ఒకప్పుడు తనకు మూడు వేల తెలుగు పద్యాలు కంఠస్థం వచ్చేవని గుర్తు చేసుకున్నారు. ఇంటర్ చదివే రోజుల్లో గురువులు తనను ఎంతో ప్రోత్సహించారని.. ప్రిన్సిపాల్ ఏది కోరితే అది ఇచ్చేవారని చెప్పారు. ‘‘1974లో హైదరాబాద్‌లో జరిగిన తెలుగు మహాసభలకు అధ్యాపకులతో కలసి వచ్చాం. నాతో అప్పుడు మిత్రుడు ఓంకార్, ప్రిన్సిపాల్ గంగారెడ్డి ఉన్నారు. రాత్రి బ్యాగులు పట్టుకుని నగరంలో విడిది వద్దకు వెళ్తుండగా 60 మంది పోలీసులు మమ్మల్ని ఆపి పుస్తకాల పెట్టెలు చెక్‌చేశారు. చాలా భయపడ్డాం. పెట్టెలు తెరిచి చూసిన పోలీసులు.. ‘పెట్టెల్లో అన్నీ పుస్తకాలే.. ఏమీ లేవు సార్.. పాగల్ హై(పిచ్చోళ్లు)’ అని తమ పైఅధికారికి చెప్పి మమ్మల్ని వదిలేశారు. అయినా మహాసభల్లో జరిగిన పోటీలలో తృతీయ బహుమతి గెలుచుకొన్నాం. మేమంతా తిరిగి వెళ్లాక ప్రిన్సిపాల్.. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. భయపెట్టారు. లేకుంటే మొదటి స్థానమే వచ్చి ఉండేదన్నారు..’’ అని కేసీఆర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment