గాలి కొసల మీదుగా ప్రాణాలు ఎగిరిపోతున్నవి
అసహజమైన జీవనం నుండి
సహజ సిద్ధమైన చావు నవ్వుతున్నది
ఏ నాగరికత చూపులకు
ఇక్కడి జీవనంలో తేనెలంటుకున్నవి
ఇప్పుడు నేలంతా చావు చిత్తడి –
చెరువుల మీద విల్లాలు వెక్కిరిస్తున్నవి
గుట్టలు ముక్కలై మన అడుగులను మోస్తున్నవి
అడవి మన చూపుకు వణికి
మైదానమై మోకరిల్లింది
జంతువులు, పక్షులు
మన వంట గిన్నెల్లో దిగులుగా కూర్చున్నవి
పర్యావరణం మనకు పగటి వేషం –
మనను హెచ్చరిస్తూ సైరన్ మోగుతుంది
ఒక్కో కాలంలో ఒక్కో పేరుతో
చావు శబ్దం చెవికి సోకినప్పుడు
మంచి చెడుల లెక్క తవ్వుతం
ప్రసూతి వైరాగ్యంతో చేతులెత్తుతం
సమీపిస్తున్న మృత్యు ఘడియలను
కన్నీటి మీదుగా దాటుతుంటం –
మన ఆకలికి
భూమి బెదురుతున్నది
శ్మశానం విస్తరిస్తున్నది
కాలం కసిగా కాటేస్తున్నది
పువ్వులు జాలిగా రాలుతున్నవి.
-ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
లాక్‌డౌన్ కవిత.. చావు చిత్తడి
Published Mon, May 18 2020 1:20 AM | Last Updated on Mon, May 18 2020 1:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment