కొడవలి
చేతిలో చంద్రవంకై
మెరిసినందుకే
కల్లం నిండుగా కండ్లచలువైంది
తట్ట
సుట్టబట్ట మీద
సూర్యదీపమై వెలిగినందుకే
భవంతులు
బహుళ అంతస్తులై తలెత్తుకుంది
దేహం
దిమ్మిసలా
దుమ్ముకొట్టుకుపోయి
ఇనుపపాదాల కింద దొర్లినందుకే
రహదారులన్నీ
నల్లతివాచీలై పరుచుకున్నది
వెన్నుపూసలు
మూలవాసాలై నిలబెడితేనే
పట్నం తొవ్వలు
ఫ్లైవోవర్లై పైకిలేచింది
కాలికి
బలపాలు కట్టుకున్న
కన్నీటిబొట్లు
నలుదిక్కులా
నల్లచీమల్లా పాకితేనే
నాలుగు మెతుకులు
కంచంలో రాలింది
అప్పుడెపుడో
ఆకలి విస్ఫోటనం జరిగి
తలోవైపు విసిరేయబడ్డ
వలస పక్షులు
మళ్ళీ తమ గూళ్ళకు మళ్ళుతున్నాయి
ముసుగేసుకున్న
మృత్యువును తప్పుకుంటూ
తల్లిచెట్టుమీద వాలేదెన్నో
పొలిమేర చేరక మునుపే రాలేదెన్నో
-కొండి మల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment