
రెప్పలు మూస్తే నువ్వు
తెరిస్తే ఈ లోకం:
రెప్పపాటే దూరం!
పువ్వుకు ఫ్రేమ్ కట్టగలిగింది
అద్దం,
పరిమళానికి కాదు!
ముక్కలైనా మోదమే:
చూపించింది కదా అద్దం
నీ వేయి సొగసులు!
నిమురుతున్న కొద్దీ
ఉబుకుతోంది గాయం:
జ్ఞాపకం నెమలీక!
పక్షి ఎగిరిపోయింది
కొన్ని పూలు రాలాయి
అశ్రువుల్లా!
జ్ఞాపకం నీడలో నేను
నా నీడలో జ్ఞాపకం
కలిసే నడుస్తున్నాం
చితికిపోతూ
తనను తాను జారవిడుచుకుంటూ
పాదరస బిందువు మనసు!
లోకాన్ని అదృశ్యం చేసే
దీపాలుంటాయని తెలిసింది
నీ కనులు చూశాకే!
ఎక్కడ వాలాలన్నా
పలుమార్లు ఆలోచిస్తుంది
ఎదలో ఎన్ని గాయాలో తూనీగకు!
జననం వాగ్దానం చేసింది
దేహానికి ఒక మరణాన్ని
మనసుకు నిత్య మరణాన్ని!
-పెన్నా శివరామకృష్ణ