‘నిబద్ధురాలైన స్త్రీవాద కవయిత్రి’ అనిపించుకున్న మందరపు హైమవతి తొలి కవితా సంపుటి ‘సూర్యుడు తప్పిపోయాడు’. రెండవ సంపుటి ‘నిషిద్ధాక్షరి’ 2004లో వచ్చిన తర్వాత, ఆమధ్య మూడవ సంపుటి ‘నీలి గోరింట’ వెలువరించారు. అందులోంచి ఒక కవిత:
కొత్త చీర కట్టుకొని
అద్దం ముందు నిలబడి
అందమైన ఈ దేహశిల్పం
నాదే కదా అని ఆనందిస్తా
నలుగు పెట్టుకొని తలస్నానం చేసి
జుట్టు ఆరబెట్టుకొంటూ
హాయి ఉయ్యాలలో ఆదమరిచి ఊగుతూ
ఈ తనువు తారక నాదేనని గర్విస్తా
జ్వర సూర్యుడు
శరీరాకాశంపై ప్రజ్వలిస్తుంటే
బాధాకారణం ఈ దేహమేనని చింతిస్తా
ప్రేమ ప్రతిపాదన సుమ గుచ్ఛంతోనో
పెళ్లి కామన పూలమాలతోనో
నా ఎదుట నిలిచిన నిన్ను
నిర్ద్వంద్వంగా తిరస్కరించినపుడు
నిర్దాక్షిణ్యంగా నాపై దాడి చేసి
ఆమ్ల వర్షం కురిపించినపుడు
నా దేహ దేశ సార్వభౌమాధికార హక్కు
నాకు భ్రమగానే మిగిలినపుడు
శత్రు రాజ్యాలను జయించినప్పటికన్నా
వారి స్త్రీల శరీర రాజ్యాలను
జయించిన సందర్భంలోనే
నీ అహంకారం తృప్తి పడినపుడు
ఎదురుపడిన వ్యక్తిని
వైదొలగమన్న శంకరాచార్యునితో
దేహాన్నా ఆత్మనా అని
సందేహ బాణం సంధించినట్లు
సర్వావయవాల ఈ దేహం
సకలానుభూతులు ఈ శరీరం
నాది కాదా అని / తీరని సందేహం
నిజంగా / ఈ దేహం ఎవరిది
-మందరపు హైమవతి
Comments
Please login to add a commentAdd a comment