పద్యం మరి దేనికి!
► 2016 కవిత సంపాదకీయం
సరిహద్దుల్లో జనం గద్యం మాట్లాడతారు
మురికివాడల్లో, ఫ్యాక్టరీల్లో గద్యం మాట్లాడతారు
పగటివేళ నగరం గద్యం మాట్లాడుతుంది
వర్తమాన క్లేశాలన్నీ గద్యం మాట్లాడతాయి
ఎండిపోయిన పొలమూ,
మాడిపోయిన మనిషీ గద్యం మాట్లాడతారు
కత్తుల నాగరికత సమస్తం గద్యం మాట్లాడుతుంది
మరి పద్యం దేనికి?
– సునీల్ గంగోపాధ్యాయ బెంగాలీ కవి (1934–2012)
సాహితీమిత్రులు ప్రచురణ ‘కవిత 2016’కి ఒక సంపాదకుడిగా నాకు శ్రీశ్రీ విశ్వేశ్వరరావు గారు అప్పగించిన బాధ్యతని సంతోషంతో స్వీకరించాను. మొదటి నుంచీ ఇటువంటి పనులంటే మక్కువకొద్దీ, కవి మిత్రులు ఒమ్మి రమేష్‌బాబు, తల్లావఝల శశిశేఖర్‌లతో కలిసి ‘కంజిర’(1990–96) కవిత్వ పత్రికను తీసుకువచ్చాను. అటు పిమ్మట ఒక దినపత్రికలో ఉపసంపాదకుడిగా సాహిత్యానుబంధం కోసం విధులను నిర్వర్తించాను. ప్రస్తుతం కవిత్వ ప్రచురణకే నిబద్ధమైన ‘ప్రేమలేఖ’లో భాగస్వామినయ్యాను. ఈ అభ్యాసంతోనే అసంఖ్యాక కవితల నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసేందుకు పూనుకున్నాను.
సమకాలీన కవులు ఏ అనుభూతులను నవనవంగా వ్యక్తీకరిస్తున్నారు? నా తోటి కవులు ఏయే అనుభవాలను దృశ్యమానం చేస్తున్నారు? వర్ధమాన కవులు ఎంతటి అన్వేషణలోంచి ఆగమగీతాలను ఆలపిస్తున్నారు? అనే ఉత్సుకతతో, ప్రతి కవితలో ఒకటికి మూడుమార్లు వెదికాను. కవిత్వం పట్ల విధేయతతో సంవత్సరకాలపు పంటని తూర్పారబట్టాను. ఇదే విధంగా కవి మిత్రుడు జూకంటి జగన్నాథం గారు మరొక సంపాదకుడిగా ఎంపికలో పాలుపంచుకొన్నారు. ఇరువురి సమన్వయంతోనూ మేలిమి కవిత్వం స్వల్పంగానే దక్కింది.
వర్తమాన తెలుగు కవిత్వం మునుపటి ధోరణులకి శక్తిహీనమైన కొనసాగింపుగా మనగలుగుతుంది. కవులలో ఎవరి నామమాత్రపు పాయ వారిది. ఒక్కరే అందరి తరఫున నినదిస్తుంటే, అక్కడక్కడ మరికొందరు ఒంటరి ద్వీపాల మాదిరి తమలో తాము మాట్లాడుకొంటున్నారు. ఈనాటికీ ఎక్కువగా సామాజిక స్పృహవాదంతో కూడిన కవిత్వ రచనకే మొగ్గు చూపుతున్నారు. ఎప్పటికప్పుడు ఒక వివాద విషయమే కవిత్వ వస్తువుగా అందుకొనేందుకు ప్రాధాన్యత నిస్తున్నారు.
పలువురు మేటి కవులమల్లే గొప్ప సహజత్వంతో రాస్తున్నారు. భావుకతలో నూతనత్వం సాధిస్తున్నారు. పరిభాషని వాడుక మాటల్లోకి సడలిస్తున్నారు. అభివ్యక్తిలో భిన్నత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తమ్మీద కవిత్వాన్ని స్వేచ్ఛాయుతం, సులభతరం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అనుభూతి గాఢత, ఆర్ద్రత, క్లుప్తతలు నిండిన గాంభీర్యంతో రాస్తున్న వారున్నారు. అలానే వస్తువ్యామోహంలో పడిన కొందరు కవిత్వ సృష్టికి ఆవశ్యకమైన మూలధాతువులని విస్మరిస్తున్నారు.
యువ కవులను కొన్ని పత్రికల్లో వస్తున్న అకవిత్వం తప్పుదారి పట్టిస్తుంది. అదే కవిత్వమన్న భ్రమని కలిగిస్తుంది. దానితో అలవోక రచనకి వారు సంసిద్ధమవుతున్నారు. పత్రికల్లో ప్రకటించుకోవాలని ఉబలాటపడుతున్నారు. అక్కడితో తమ సామాజిక బాధ్యత నెరవేరిందనుకొంటున్నారు. ఈ ధోరణి మన కవిత్వంలో లోతుగా పాదుకొనిపోయింది. దేశదేశాల అద్భుతమైన కవిత్వం పత్రికలకి వెలుపల గ్రంథాలయాల్లోనూ, అంతర్జాలంలోనూ అందుబాటులో ఉన్నదని నేను చెప్పనక్కరలేదనుకొంటాను.
పాఠకులు తీరని దాహార్తితోనే కవిత్వాన్ని సమీపిస్తారు కదా. అటువంటి వేళ కవిహృదయం వారిలో ఎక్కడ లంగరు వేస్తుంది? ఏమి ఏకరువు పెడుతుంది? రహస్యంగా ఏమి సంభాషిస్తుంది? మరేమి ఉపదేశించాలని ఆరాటపడుతుంది? జీవితంలోంచి తమని తవ్వుకొని పఠిత అనుభవంలోకి కొత్తగా ఊరే జలని కవులు ఎలా తీసుకురాగలుగుతున్నారు? అని ప్రశ్నించుకొన్నాను.
ఈ నేపథ్యంలో తొలుత అది కవిత్వమై తీరాలని, విలక్షణత, కాలానికి నిలవగలిగే నిండుదనం ఉండాలనే ప్రాతిపదికన ‘కవిత 2016’ రూపుదిద్దుకొంది. అంతమాత్రాన కవితల స్థాయిలో తారతమ్యం లేకపోలేదు. అలానే ఒక ఘటనకి సంబంధించి ఒక ప్రాతినిధ్య కవితని మాత్రమే తీసుకోవడం వల్ల పుస్తకంలో వైవిధ్యానికి తావు ఏర్పడుతుందనిపించింది.
∙∙∙
పద్యం ద్విహృదయ, బిడ్డని మోస్తున్న గర్భిణి
పద్యంలోనే శిశువు మాటలు కూడబలుకుతుంది
పద్యంలోనే పంజరపు పక్షి రెక్కలు కొట్టుకుంటుంది
పద్యంలోనే మూగవాని కేక మారుమ్రోగుతుంది
పద్యంలోనే అంధుడి చింత సూర్యచంద్రుల కాంతిని
తాకుతుంది
పద్యంలోనే బీడువారిన భూమి మరల సేద్యానికి
సమాయత్తమవుతుంది
పద్యంలోనే మానవాళి విషాదోల్లాసపు జీవన జలధి
అలలు అలలుగా ఎగిసిపడుతుంది.
-నామాడి శ్రీధర్ మొబైల్ నెం: 93968 07070