పద్యమా, పది కాలాలు పదిలంగా విరాజిల్లు! | A poem to make alive for 100 years | Sakshi
Sakshi News home page

పద్యమా, పది కాలాలు పదిలంగా విరాజిల్లు!

Published Sun, Oct 12 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

పద్యమా, పది కాలాలు పదిలంగా విరాజిల్లు!

పద్యమా, పది కాలాలు పదిలంగా విరాజిల్లు!

పద్యానవనం: అది రమణీయ పుష్పవనమా వనమందొక మేడ మేడపై నదియొక మారుమూల గది యా గది తల్పులు తీసిమెల్లగా పదునయిదేండ్ల యీడుగల బాలిక, పోలిక రాచపిల్ల, చంకొదవెడు కాళ్లతోడ దిగుచున్నది కిందకు మెట్లమీదుగాన్
 
 ఇది పద్యమా! గద్యమా! అనిపిస్తుంది కదూ!! నిజమే. పేరుకు పద్యమే అయినా ఫక్తు వచనం లాగే ఉంటుంది. ఇలా చదివి చూడండి...
 అది రమణీయ పుష్పవనం,
 ఆ వనమందు ఒక మేడ,
 మేడ పైన ఆదొక మారుమూల గది,
 ఆ గది తల్పులు తీసి మెల్లగా
 పదునయిదేళ్ల ఈడుగల బాలిక,
 పోలిక రాచపిల్ల,
 చంకొదవెడు కాళ్లతోడ
 దిగుచున్నది కిందకు మెట్ల మీదుగా!
 ఇదేం పద్యం! ఇది కచ్చితంగా వచనమే కదా! ఇదీ పద్యమే! జాతి పద్యం. అదీ చంపకమాల. ప్రతి పద్యపాదంలో నగణం, జగణం, భగణం, జగణం, జగణం, జగణం, రగణం (న,జ,భ,జ,జ,జ,ర) వరుసగా వస్తాయి. పాదంలో 21 అక్షరాలుంటాయి. 11వ అక్షరంతో యతిమైత్రి ఉంటుంది. ప్రాసనియమం పాటించారు. సమర్థుడైన శిల్పి శిల్పం చెక్కే ప్రక్రియ చేపట్టగానే రాళ్లు మైనంముద్దలో, మంచుదిమ్మెలో, వెన్నరాశులో అయిపోతాయని చెబుతారు. అలాగే ప్రతిభావంతుడైన కవి పద్యం రాసేప్పుడు భాష ఆయన కోరుకున్న రీతిలో ఒదిగిపోతుందని విశ్లేషకులంటారు. దుర్వాస మహాముని ఇచ్చిన ఒక మంత్రవరాన్ని భోజరాజ పుత్రి కుంతి మననం చేసుకుంటున్న ప్రయత్నంలో కర్మసాక్షి సూర్యుడు ప్రత్యక్షమై అయాచిత వరం ప్రసాదిస్తాడు. ఆ వరప్రసాదమే కన్య కుంతికి పుత్ర యోగం. జగతి ఏమనుకుంటుందోనని జడిసిన ఆమె తరుణోపాయం దొరక్క పసికందును ఎక్కడైనా వదిలేద్దామని ఇంట్లోంచి బయటకొస్తున్న సందర్భానికి ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పద్యమిది.
 
 సర్ప పరిష్వంగాల వంటి ఛందో అలంకారాల మధ్య కవితను బందీగా చూశానంటాడు మహాకవి శ్రీశ్రీ. ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదదో...’ అన్న ఆదికవి నన్నయ తొలి పద్యం నుంచి తీసుకున్నా అది అనేక మార్పులకు గురైంది. చాలా మంది అపోహ పడ్డట్టు పద్యమెప్పుడూ కఠినమనో, వచనమెప్పుడూ సరళమనో చెప్పడానికి లేదు. పద్య ప్రక్రియలోనూ సరళత, గాఢత చూపిన కవులున్నట్టే, వచన రచనల్లో కూడా పద కాఠిన్యాన్ని, భావ సంక్లిష్టతను ప్రదర్శించిన వారున్నారు. తమకు చేత కాకపోయినా పద్యం రాసి గొప్పవాళ్లం అనిపించుకోవాలనే తపనతో కుస్తీపట్టి, పాఠకులకు సుస్తీ తెప్పించిన ప్రయోక్తలూ ఉన్నారు.
 
 వీళ్లను చూసే కాబోలు, ‘గురువు లఘువు చేసి కుదియించి కుదియించి, లఘును గురువు చేసి లాగి లాగి, కవిని నేనటంచు ఖలుడెవ్వడన్నను...’  అంటూ తిట్టిపోశారు లాక్షణికులు గతంలోనే! భావ స్పష్టత, భాషపై సాధికారత ఉన్నపుడు ఛందస్సు ప్రతిబంధకం కాదనేది పద్య కవిత్వాన్ని ఇష్టపడే వారి బలమైన వాదన. పద్యం అజరామరమైందని ఆరాధించిన వారున్నారు. ఆధునిక వచన కవిత్వమనే దుడ్డుకర్రలతో పద్యం నడుములిరగ్గొడతామని హెచ్చరించిన వారూ ఉన్నారు. ఎవరి దారి వారిది! ఇంపైన భాష వాహకమై వ్యక్తీకరణ గొప్పగా ఉన్నపుడు అది పద్యమా, గద్యమా అన్న మీమాంస రసప్రియులకు ఉండనే ఉండదంటారు విమర్శకులు. భావం-భాష శివపార్వతుల్లా జతకట్టి ఓ రసఝరీ ప్రవాహమైనపుడు, ఆ పరవళ్లు తొక్కే నదికి పద్యం-గద్యం తటద్వయం లాంటివంటాడో లాక్షణికుడు.
 
 ఓ రైతు దయనీయ స్థితి గురించి చెబుతూ ‘...ఆయన చేలో పండిన పత్తి, సరిగ్గా ఉరితాడుకు సరిపోయింది’ అన్న వ్యక్తీకరణకు ఏ ఛందస్సు కావాలి? ఏం అలంకారం వాడాలి? ‘పాల సంద్రమందు పవ్వలించిన వాడు గొల్లలింటి పాలు కోరనేల? ఎదుటి వారి సొత్తు ఎల్లవారికి తీపి...’ అన్న వేమన తార్కిక వ్యక్తీకరణకు ఛందస్కెక్కడ ప్రతిబంధకమైంది? శతాబ్దాల తర్వాత కూడా ఆయన ఆటవెలదులు జనం నాలుకలపై సజీవ సవ్వడులవుతున్నాయంటే, అందుకు పద్య ప్రక్రియలోని శాశ్వతత్వపు లక్షణ ప్రభావం కూడా కారణమే! కట్టుబాట్ల నడుమ సాగినా... పొరుగునున్న కన్నడలో కొంచెం కొంచెం తప్ప, మరే ఇతర భాషలోనూ లేని విలక్షణమైన సాహితీ ప్రక్రియ పద్యం. పద్యం నిజంగా తెలుగు సాహితీ జగత్తు  చేసుకున్న పుణ్య ఫలమేమో! పద్యమా విజయీభవ! తెలుగు పద్యమా దీర్ఘాయుష్మాన్‌భవ!!
 -  దిలీప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement