ఎంత కమ్మని పద్యమో! | Nandi timmana one of those who ran the Telugu poem is very elegance | Sakshi
Sakshi News home page

ఎంత కమ్మని పద్యమో!

Published Sun, Dec 7 2014 2:46 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

ఎంత కమ్మని పద్యమో! - Sakshi

ఎంత కమ్మని పద్యమో!

అనవిని వ్రేటుబడ్డ యురగాంగనయుంబలె నేయివోయ
బగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సం
జనిత నవీన కాంతి వెద జల్లగ గద్గద ఖిన్న కంఠియై!


పద్యానవనం
తెలుగునాట పద్యాన్ని ఎంతో రమ్యంగా నడిపిన వారిలో నంది తిమ్మన ఒకరు. సాహితీ సమరాంగణ  సార్వభౌముడని పేరు గడించిన కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఆయనొకరు. అందమైన మహిళ ముక్కును సహజాతి సహజమైన సంపెంగ పూలతో పోలుస్తూ అత్యద్భుతంగా వర్ణించినందుకు ఆయన్ని ముక్కుతిమ్మన అని కూడా పిలిచేవారట. భాష మీద పట్టు, విలక్షణమైన శైలి కారణంగా విషయం అలవోకగా చదువరుల హృదయాలను తడుతూ, మెదళ్లను కదిలిస్తుంది.

తిమ్మన ప్రబంధ యుగంలో కాకుండా ప్రబోధ యుగంలో ఉండి ఉంటే,  తెలుగుజాతి మరింత ప్రయోజనం పొంది ఉండేదనిపిస్తుంది. కృష్ణ లీలల్లోని ఓ సందర్భాన్ని తీసుకొని ‘పారిజాతాపహరణం’ అనే రసవత్తర ప్రబంధ కావ్యాన్ని రాశారాయన. నారదుడిచ్చిన అరుదైన వేయిరెక్కల పారిజాత పుష్పాన్ని కృష్ణుడు పోయి పోయి రుక్మిణికిచ్చాడు. సత్యభామ లాంటి మరో భార్య ఉన్న భర్తగా కృష్ణుడు చేసే ఇంతకు మించిన తప్పిదమేముంటుంది వాతావరణం రచ్చ రచ్చ కావడానికి! అంతిమంగా అదే జరిగింది. ఇదీ సన్నివేశం.
 
విషయం తెలియగానే దిగ్గున మంచం నుంచి లేచి సత్యభామ ఎలా స్పందించిందో చెబుతున్నాడీ పద్యంలో. మాటలు వినగానే, ఒంటిపై దెబ్బ పడగానే చర్రున లేచే ఆడపాములాగా సత్య లేచిందట! ఇంకొక పోలిక చూడండి, ఎంత పెద్ద పద సముచ్ఛయమో! ఇందులో ఇరవై అక్షరాలున్నాయి. ‘నేయివోయ భగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల’ అన్నట్లు లేచిందట! అగ్నిలో నేయి పోస్తే మంటలెలా ఎగుస్తాయి? భగ్గుమని, అలా జ్వాలలా ఎగిసిందని! లేచి ఏం చేసింది? గద్గద స్వరంతో ఏదో మాట్లాడింది. అది తర్వాతి పద్యంతో అన్వయం. ఏవో మాటలు చెబితే (పూర్వపు పద్యంతో అన్వయం) విని, ఎలా స్పందించింది అన్నదే ఈ పద్యంలో పేర్కొన్నాడు.
 
బాధ, కోపం, ఆవేశం ముప్పిరిగొనగానే కళ్లల్లో ఎర్రజీరలొస్తాయి, సహజం. ఆ ఎరుపునకు మరో ఎరుపు తోడయింది. అలంకరణలో భాగంగా కొన్ని పూల, పత్రాల లేపనాలను చెంపలపై రంగరించుకుంటారు. అటువంటి కుంకుమ పత్రపు అలంకరణ చెడిపోయి అదోరకమైన ఎరుపు కాంతి జనించిందట. ఈ రెండు ఎరుపులు కలగలిసి ఓ నూతన కాంతి ఆవిష్కృతమైంది, వెదజల్ల బడింది. అదుగో ఆ దృశ్యం గోచరమౌతున్నపుడు దుఃఖం పొంగుకొస్తుంటే, ఆమె గద్గద స్వరంతో...
 
రమ్యమైన పదాల వాడుక ఒక్కటే భాషకు అందం తీసుకురాదు. అదొక అంశం అంతే! ఇంగ్లీషులో ఫ్రేజ్ అని చెప్పే పదసముచ్ఛయాలు, సంక్లిష్ట పదాలు తెలుగు పద్య సాహిత్యంలో చాలానే ఉంటాయి. నన్నయ లాంటి వాళ్లు ‘నిజోజ్వలత్కవచుడు’ ‘శశ్వత్కుండలోద్భాసితుడు’ ‘జగత్కర్ణపూర్ణాలోలద్గుణుడు’ వంటి పదసముచ్ఛయాల్ని ఒక్క కర్ణుడిని వర్ణించడానికే వాడారు. ఇవి ఒక రకంగా టంగ్‌ట్విస్టర్స్. ‘రిపుమర్ధనదోర్దాముడు భీముడు శపథనిబద్ద గదాయుధుడు’ (23 అక్షరాలు) అని, భీముడిని వర్ణిస్తూ ఓ సినీగీతంలో శ్రీశ్రీ వాడారు.

ఇటువంటి పదాలు చక్కని శబ్దాలంకారాలౌతాయి. భాషను సుసంపన్నం చేయడానికి శబ్దాలంకారాలకు తోడు అర్థాలంకారాలూ ముఖ్యమే! శబ్దం-అర్థం శివపార్వతుల్లా అవిభాజ్యమైనవి. ఇదే విషయాన్ని ‘వాగార్థా వివసంప్రక్షౌ వాగర్త ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ!’ అని కాళిదాసు అత్యద్భుతంగా చెప్పారు.

పార్వతీపరమేశ్వరౌ అన్న పదాన్ని ఉమాశంకరులు గానే కాకుండా ‘పార్వతీప’(పార్వతి పతియైన శివా!) ‘రమేశ్వర’ (లక్ష్మీ పతివైన కేశవా!) అని కూడా విడదీయవచ్చని భాషా పరిశోధకుడు వేటూరి ప్రభాకర శాస్త్రి  గొప్పగా విడమర్చారు. అలా ఇంపైన పద్యాలతో అర్థ-శబ్ద రమ్యతను సాధించిన నంది తిమ్మన కీర్తి తెలుగునాట అజరామరమైనది.              
  - దిలీప్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement