పద్యానవనం: చివరకు ఏం మిగుల్చుకుంటాం?
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై బేరైనన్ గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై ఈరే కోర్కులు, వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా?
స్వార్థానికీ, త్యాగానికీ నడుమ అంతరాన్నీ; లోభి గుణానికీ, దాన గుణానికి మధ్య వ్యత్యాసాన్నీ గొప్పగా చెప్పిన పద్యమిది. సమాధానాల వంటి ప్రశ్నలు ఆరు ఒక వైపూ, ప్రశ్నల వంటి సమాధానాలు రెండు మరోవైపూ ఉన్నాయి. కఠిన పదాలు దాదాపు లేవు. విషయం తేటతెల్లం. పదాల కూర్పు, పద్య పాదాల నడక అత్యద్భుతం. ఎంత మంది రాజులు కాలేదు? మహా మహా విశాలమైన రాజ్యాల్ని విస్తరించలేదు! సదరు సంపదతో వారి గర్వం తారాస్థాయికి చేరలేదు! మరి వారిప్పుడెక్కడున్నారు? అంటే, అలా ఉంటారా? ఉండటం సాధ్యమా? ఎవరి జీవితాలూ శాశ్వతం కాదని చెప్పడం. ‘జాతస్య మరణం ధృవం.’ పుట్టినవారల్లా మరణించాల్సిందే! చావు ఖాయం. మరలాంటప్పుడు... పోనీ, పోతే పోయారు, ఏమైనా తాము గడించిన సంపద కొంతలో కొంతయినా వెంట తీసుకెళ్లారా? అంటే, అదీ లేదు. పోయినవాళ్లంతా ఉత్తి చేతుల్తోనే వెళ్లారు. అందుకేనేమో, ఈ భూమ్మీద సువిశాలమైన రాజ్యాన్ని స్థాపించిన రారాజు అలెగ్జాండర్ ద గ్రేట్, తన మరణానంతరం చేతులు రెండూ పైన ఉండేలా పార్థివ శరీరాన్ని ఖననం చేయమని తన వారికి ముందే నిర్దేశించినట్టు చెబుతారు. భూమండలం చూట్టూతా రాజ్యాన్ని విస్తరించినా, చిల్లిగవ్వ వెంట తీసుకెళ్లకుండా ఉత్తి చేతులతోనే పెకైళ్లినట్టు లోకానికి తెలియజెప్పే సందేశమది.
ఎలాగూ ఈ సంపద ఏదీ వెంట తీసుకెళ్లలేం గనుక, కనీసం మంచి పేరైనా సంపాదించాలి. అదే చివరకు మిగిలేది అంటుంటారు. లెక్కలేనంత మంది రాజులు, రారాజులు పుట్టి గిట్టారీ నేలమీద. కడకు వారికి కనీసం అటువంటి మంచి పేరైనా మిగలలేదన్నది ఆ అరడజను ప్రశ్నల సారం. మరోపక్క, అలా పేరు మిగుల్చుకొని పోయిన శిబి చక్రవర్తి, హరిశ్చంద్ర, దదీచ... తదితర ప్రముఖుల్ని గుర్తుచేస్తూ రెండు ప్రశ్నలు. కీర్తి కాంక్షతోనైనా కొందరు, సంతోషంగా ఎదుటివారి అవసరాల్ని తీర్చలేదా? అని అడుగుతాడు. ఆకలితో ఉన్న డేగ ఒక పావురాన్ని తరుముకు రావటం, తనను రక్షించమని ఆ పావురం శిబిని శరణు కోరడం మనకు తెలిసిన కథే! తన తొడను కోసి పావురమెత్తు మాంసాన్ని ఆహారంగా ఇచ్చి ఆకలి తీర్చడం ద్వారా డేగనూ, ప్రాణ రక్షణ చేసి పావురాన్నీ రెంటినీ కాపాడిన త్యాగపురుషుడు శిబి. అలాంటి ప్రముఖుల్ని, యుగాలు గడచినా మనం ఇప్పటికీ మరచిపోలేదు కదా! అంటాడు కవి. ఎంత గొప్ప పోలిక! మానవ జీవితపు లక్ష్యం-ఆదర్శం వంటి బరువైన పదాలు తెలియని సామాన్యుడైన సగటు మానవుడు, ఈ సూక్ష్మాన్ని గ్రహించినపుడు తనదైన భాషలో ‘‘... పోయేటప్పుడు ఏం కట్టుకుపోతాం?’’ అంటాడు. అదీ, తనదైన వ్యక్తీకరణ.
ఇక, ఇప్పుడు మళ్లీ చదవండి పై పద్యాన్ని. వీలయితే రెండు మార్లు చదవండి. యవ్వనంలో బలిష్టంగా ఉన్న ఓ గుఱ్ఱం లయబద్దమైన తూపుతో దౌడు తీస్తున్నట్టు సాగుతుందీ పద్యం. అది బమ్మెర పోతన గొప్పదనం. శ్రీమద్భాగవతం, వామనావతారంలోని ఈ సొగసరి/గడసరి పద్యంలో విషయం ఎంత లోతైనదో ఎత్తుగడా అంతే గొప్పగా ఉంటుంది. విషయం, భాష, అభివ్యక్తి... ముప్పిరిగొన్నట్టుంటాయి. ఆధునిక ‘కార్పొరేట్ గురు’లు చెప్పే టన్నులు, టన్నుల కిటుకులు ఈ పద్యంలో ఇమిడి ఉన్నాయి. ముఖ్యంగా ప్రసారమాధ్యమాలు, ఇతర కమ్యూనికేషన్ రంగంలోని వారికిది సిలబస్ లాంటి మంచి పాఠం. ఎంచుకున్న రంగమేదైనా, తనకున్న డిగ్రీ ఎటువంటిదైనా... 1) విషయ పరిజ్ఙానం (సబ్జెక్ట్ నాలెడ్జ్), 2) భాషపై పట్టు (ప్రొఫిషియెన్సీ ఆఫ్ లాంగ్వేజ్), 3) భావ ప్రసార ప్రావీణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్)... ఈ మూడూ ఉంటే ప్రపంచాన్ని దున్నేయొచ్చంటారు. ఇవి పుష్కలంగా ఉన్న బమ్మెర పోతన సాహిత్యం నేర్చుకోదగ్గ పాఠం అనడానికి ఈ పద్యం నిలువెత్తు నిదర్శనం.
- దిలీప్‌రెడ్డి