Bammera pothana
-
Dussehra 2024: అమ్మలగన్న అమ్మ... మన రక్షణ దుర్గం
శివుడు స్థాణువు. కదలడు. అమ్మవారు కదలిక. సైన్సు పరిభాషలో అయితే అయ్య స్టాటిక్ ఎనర్జి. అమ్మ కైనెటిక్ ఎనర్జీ. జగతి గతికి రెండు శక్తులూ కావాలి. ఇద్దరూ కలిస్తేనే మన మనుగడ కు కావాల్సిన జడ శక్తి; చిత్ శక్తి దొరుకుతున్నాయి.శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపిం అని అంటాడు శంకరాచార్యులు సౌందర్యలహరిలో. శక్తితో కలిసి ఉంటేనే శివుడు ఏదైనా చేయగలుగుతాడు. శివుడు– శక్తి వేరు కాదని శంకరుడు సౌందర్యలహరి మొట్టమెదటి శ్లోకంలోనే సూత్రీకరించాడు.‘కలాభ్యాం చూడాలంకృత–శశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం’’ అంటూ శివుడిని పొందడానికి పార్వతి; పార్వతిని పొందడానికి శివుడు తపస్సు చేయడాన్ని అనన్యసామాన్యంగా ఆవిష్కరించాడు శంకరులు శివానందలహరి మొట్టమొదటి శ్లోకంలో. ఒకరినొకరు కలవడానికి, కొలవడానికి వారిది నిజమైన తపోఫలం. ఆధునిక జీవనంలో మన మనుగడ సుఖంగా ఉండడానికి ఈ రెండు శ్లోకాలను పట్టుకుంటే చాలు. వీటి అర్థాన్ని, అంతరార్థాన్ని ఆకళింపు చేసుకుని... ఆచరిస్తే చాలు– శోకాలన్నీ మాయమవుతాయి. ఆధ్యాత్మిక కోణంలో శక్తిగా మనం అమ్మవారిని కొలుచుకుంటాం. లౌకిక విషయాల్లో మహిళల శక్తిని కొలిచేప్పుడు చిన్నచూపు చూస్తాం. అమ్మవారి శక్తి లేకపోతే అంతటి శివుడే కనీసం అటు గడ్డి పోచను ఇటు జరపలేడని శంకరుడన్న మాటను నోరు నొవ్వంగ స్తోత్రం చేస్తూ ఉంటాం కానీ... ఆచరణలో ఎంతవరకు పాటిస్తున్నామన్నది ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం.‘సర్వతీర్థాత్మికే; సర్వమంత్రాత్మికే; సర్వయంత్రాత్మికే; సర్వతంత్రాత్మికే; సర్వచక్రాత్మికే; సర్వశక్త్యాత్మికే; సర్వపీఠాత్మికే; సర్వవేదాత్మికే; సర్వవిద్యాత్మికే; సర్వయోగాత్మికే; సర్వవర్ణాత్మికే; సర్వగీతాత్మికే; సర్వనాదాత్మికే; సర్వశబ్దాత్మికే; సర్వవిశ్వాత్మికే; సర్వవర్గాత్మికే...’ అంటూ శ్యామలాదండకం చివరిలో కాళిదాసు అందరిలో, అన్నిటిలో, విశ్వమంతా అమ్మవారినే దర్శించాడు.‘అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ...’ అన్నాడు బమ్మెర పోతన. లక్ష్మి, పార్వతి, సరస్వతి– ముగ్గురు అమ్మలు. ఈ ముగ్గురు అమ్మలను కన్నది ఆదిపరాశక్తి దుర్గ. దేవతల తల్లి అదితి. రాక్షసుల తల్లి దితి. ఆ దితికి కడుపు కోత కలిగించిన తల్లి. అంటే రాక్షసులను సర్వనాశనం చేసిన తల్లి. తనను నమ్మే దేవతల మనసులో కొలువై ఉండే తల్లి. అలాంటి తల్లి నాకు గొప్ప పటుత్వం ఉన్న కవిత్వం ప్రసాదించుగాక. ఇది పైకి ధ్వనించే అర్థం.ఇంతకుమించి ఇందులో ఇంకా లోతయిన అర్థం ఉంది. పద్యం మొదట ఉన్న అమ్మలగన్న అమ్మ... ముగ్గురమ్మలను మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను క్రమాలంకారంలో అన్వయించుకుంటే–మహత్వం – ఓం,కవిత్వం– ఐం,వశిత్వం– క్లీం పటుత్వం– హ్రీమ్,సంపద– శ్రీమ్ అవుతుంది. బీజాక్షరాలను ఎలాపడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు కాబట్టి– వాటి సంకేతాలను పోతన ఈ రూపంలో ఆవిష్కరించాడు. ‘చాల పెద్ద’ అద్భుతమయిన ప్రయోగం. సంస్కతంలో ‘మహా శక్తి’ అన్న మాటకు తెలుగు అనువాదం. చదవండి: లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే?దురితాలను పోగొట్టేది; దుర్గంలా మన చుట్టూ రక్షణకవచంలా నిలబడేది దుర్గ. మనలో, మన చుట్టూ ఉండి నడిపించే శక్తిని కాళిదాసు దర్శించినట్లు మనం కూడా సర్వవిశ్వాత్మికగా దర్శించగలిగితే మనకు కూడా దుర్గ కట్టని కోటగా నిలబడి రక్షణనిస్తుంది.– పమిడికాల్వ మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు -
తపాలా బిళ్ల ఉన్నట్టా లేనట్టా?
ప్రత్యేక సందర్భాల్లో ఇలా తపాలా బిళ్లలను ముద్రించటం సహజం. మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న తొలి ప్రపంచ తెలుగు మహాసభలను ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఈసారి తపాలా బిళ్లపై ఏ చిత్రాన్ని ఎంపిక చేసింది? భాగవతాన్ని తెలుగులో అమృతమయంగా మలిచిన పోతనదా, తెలంగాణ సంప్రదాయానికి చిహ్నంగా భాసిల్లుతున్న బతుకమ్మదా? త్వరలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కాబోతున్నా ఇప్పటి వరకు తపాలా శాఖకు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదు. గతంలో బతుకమ్మ చిత్రాన్ని పోస్టల్ స్టాంపుగా తేవాలని తెలంగాణ భావించింది. ఇప్పుడు తెలుగు మహాసభలకు గుర్తుగా దాన్ని ప్రతిపాదిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ తెలుగు సాహితీ అభిమానులు మాత్రం బమ్మెర పోతన చిత్రంపై మక్కువ చూపుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోతన సమాధిని దర్శించి ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించిన నేపథ్యంలో తపాలా అధికారులు కూడా పోతన చిత్రాన్నే ఎంపిక చేస్తారని భావిస్తూ కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించారు. కానీ అక్కడ్నుంచి వారికి ఎలాంటి స్పష్టత అందలేదు. దీంతో అసలు తపాలా బిళ్ల ముద్రణ ఉంటుందా లేదా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఏపీ, కర్ణాటక ప్రతిపాదనలతో తపాలా బిళ్లలు ఇటీవల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రతిపాదనలతో తపాలా శాఖ మూడు తపాలా బిళ్లలను ముద్రించింది. ఆదికవి నన్నయ, ద్రాక్షారామం భీమేశ్వరాలయం ప్రతిపాదనలను ఏపీ, మహాకవి ముద్దన ప్రతిపాదనను కర్ణాటక సమర్పించటంతో గత నవంబర్ ఒకటిన వాటిని తపాలా శాఖ ఆవిష్కరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గురజాడ, కందుకూరి, కవయిత్రి మొల్ల, విశ్వనాథ సత్యనారాయణ, తరిగొండ వెంగమాంబ లాంటి వైతాళికుల స్టాంపులు విడుదలయ్యాయి. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినవారి చిత్రాలతో రూపొందలేదు. మరి ఇప్పటి వరకు తెలంగాణ వైతాళికులతో తపాలాబిళ్లలు రూపొందించనందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతిపాదిస్తే బాగుంటుందని తెలంగాణ తెలుగు భాషాభిమానులు కోరుతున్నారు. –గౌరీభట్ల నరసింహమూర్తి ఇది తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విడుదల చేసిన తపాలా బిళ్ల. 1975 ఉగాది రోజున హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో మొదలైన తెలుగు మహాసభల్లో లక్ష మంది భాషాభిమానుల సాక్షిగా నాటి ముఖ్యమంత్రి ఈ స్టాంపును ఆవిష్కరించారు. ‘దేశభాషలందు తెలుగు లెస్స... ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.. పంచదార కన్న, పనస తొనలకన్న, కమ్మని తేనెకన్న తెలుగు మిన్న’ అని తెలుగు భాష వైభవాన్ని సూచించే వాక్యాల మధ్య సాక్షాత్కరించిన సరస్వతీదేవి రూపాన్ని ఈ తపాలా బిళ్లలో ముద్రించారు. అప్పట్లో 25 పైసల ధరతో ముద్రించిన ఈ స్టాంపులు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. తెలుగువారు ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ తపాలాబిళ్లనే అతికించేందుకు ఇష్టపడటంతో మార్కెట్లో అప్పట్లో వాటికి కొరత ఏర్పడింది. -
మనం తెలుగువారమే
ఓరుగల్లులో పుట్టిన బమ్మెర పోతన ఒంటి మిట్ట రామాలయంలో కూర్చుని భాగవతాం ధ్రీకరణ చేశారు. అంటే సంస్కృతంలోని గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. దీనిని తెలంగాణీకరణ అని ఏ చరిత్ర చెప్పలేదు. అయితే ఈ మధ్య ఉన్నత పదవులలో ఉన్న ఒక మహిళ చేసిన వ్యాఖ్య వాస్తవానికి దూరంగా, అవగా హనారాహిత్యంతో ఉందని చెప్పక తప్పదు. ఆంధ్రీకరణకు, తెలంగాణీకరణకు తేడా తెలియకుండా ఆమె మాట్లాడారని చెప్పక తప్పడం లేదు. తెలంగాణ తెలుగులో ఒక యాస. ఆంధ్ర శాతవాహన వంశం తెలు గుకు జన్మస్థానం. ఈ భాష వర్ధిల్లినది విజ యనగర ఆస్థానం. తెలుగువల్లభుడు శ్రీకృష్ణ రాయలు. పెద్దన, నంది తిమ్మన, మాదయ గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి, రామరాజ భూషణుడు (భట్టు మూర్తి), పిన వీరభద్రుడు, తెనాలి రామలిం గడు ఆయన ఆస్థాన కవులు. వీరే అష్టదిగ్గ జాలు. కాకతి గణపతిదేవునికి కూడా ఆంధ్ర, సంస్కృత భాషలను ఆదరించిన చరిత్ర ఉంది. మనం తెలుగు నేల మీద ఎక్కడ ఉన్నా, మనం ఢిల్లీ లేదా ఇతర ప్రాం తాలకు వెళితే తెలుగువారిగానే గుర్తి స్తారు. మన భౌగోళిక ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలను బట్టి మనకు గుర్తింపు రాదు. తెలుగు నేల మీద నివసిస్తున్నవారు ఆలుగడ్డని బంగాళాదుంప అనండి. సొరకాయను ఆనప అనండి. టెంకాయ, కొబ్బరికాయ అని పిలుచుకోవచ్చు. కానీ తెలుగంటే తెలం గాణ అని తీర్మానించడం సరికాదు. భౌగోళి కంగా విడిపోయినా, ఒక భాషకు చెందిన వారిగా చెప్పడానికి సందేహం ఎందుకు? దానికి ఎవరికి తోచిన భాష్యాలు వారు చెప్ప డం ఎందుకు? శ్రీపతి వెంకటరంగరాజు హైదరాబాద్ -
పద్యానవనం: చివరకు ఏం మిగుల్చుకుంటాం?
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై బేరైనన్ గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై ఈరే కోర్కులు, వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా? స్వార్థానికీ, త్యాగానికీ నడుమ అంతరాన్నీ; లోభి గుణానికీ, దాన గుణానికి మధ్య వ్యత్యాసాన్నీ గొప్పగా చెప్పిన పద్యమిది. సమాధానాల వంటి ప్రశ్నలు ఆరు ఒక వైపూ, ప్రశ్నల వంటి సమాధానాలు రెండు మరోవైపూ ఉన్నాయి. కఠిన పదాలు దాదాపు లేవు. విషయం తేటతెల్లం. పదాల కూర్పు, పద్య పాదాల నడక అత్యద్భుతం. ఎంత మంది రాజులు కాలేదు? మహా మహా విశాలమైన రాజ్యాల్ని విస్తరించలేదు! సదరు సంపదతో వారి గర్వం తారాస్థాయికి చేరలేదు! మరి వారిప్పుడెక్కడున్నారు? అంటే, అలా ఉంటారా? ఉండటం సాధ్యమా? ఎవరి జీవితాలూ శాశ్వతం కాదని చెప్పడం. ‘జాతస్య మరణం ధృవం.’ పుట్టినవారల్లా మరణించాల్సిందే! చావు ఖాయం. మరలాంటప్పుడు... పోనీ, పోతే పోయారు, ఏమైనా తాము గడించిన సంపద కొంతలో కొంతయినా వెంట తీసుకెళ్లారా? అంటే, అదీ లేదు. పోయినవాళ్లంతా ఉత్తి చేతుల్తోనే వెళ్లారు. అందుకేనేమో, ఈ భూమ్మీద సువిశాలమైన రాజ్యాన్ని స్థాపించిన రారాజు అలెగ్జాండర్ ద గ్రేట్, తన మరణానంతరం చేతులు రెండూ పైన ఉండేలా పార్థివ శరీరాన్ని ఖననం చేయమని తన వారికి ముందే నిర్దేశించినట్టు చెబుతారు. భూమండలం చూట్టూతా రాజ్యాన్ని విస్తరించినా, చిల్లిగవ్వ వెంట తీసుకెళ్లకుండా ఉత్తి చేతులతోనే పెకైళ్లినట్టు లోకానికి తెలియజెప్పే సందేశమది. ఎలాగూ ఈ సంపద ఏదీ వెంట తీసుకెళ్లలేం గనుక, కనీసం మంచి పేరైనా సంపాదించాలి. అదే చివరకు మిగిలేది అంటుంటారు. లెక్కలేనంత మంది రాజులు, రారాజులు పుట్టి గిట్టారీ నేలమీద. కడకు వారికి కనీసం అటువంటి మంచి పేరైనా మిగలలేదన్నది ఆ అరడజను ప్రశ్నల సారం. మరోపక్క, అలా పేరు మిగుల్చుకొని పోయిన శిబి చక్రవర్తి, హరిశ్చంద్ర, దదీచ... తదితర ప్రముఖుల్ని గుర్తుచేస్తూ రెండు ప్రశ్నలు. కీర్తి కాంక్షతోనైనా కొందరు, సంతోషంగా ఎదుటివారి అవసరాల్ని తీర్చలేదా? అని అడుగుతాడు. ఆకలితో ఉన్న డేగ ఒక పావురాన్ని తరుముకు రావటం, తనను రక్షించమని ఆ పావురం శిబిని శరణు కోరడం మనకు తెలిసిన కథే! తన తొడను కోసి పావురమెత్తు మాంసాన్ని ఆహారంగా ఇచ్చి ఆకలి తీర్చడం ద్వారా డేగనూ, ప్రాణ రక్షణ చేసి పావురాన్నీ రెంటినీ కాపాడిన త్యాగపురుషుడు శిబి. అలాంటి ప్రముఖుల్ని, యుగాలు గడచినా మనం ఇప్పటికీ మరచిపోలేదు కదా! అంటాడు కవి. ఎంత గొప్ప పోలిక! మానవ జీవితపు లక్ష్యం-ఆదర్శం వంటి బరువైన పదాలు తెలియని సామాన్యుడైన సగటు మానవుడు, ఈ సూక్ష్మాన్ని గ్రహించినపుడు తనదైన భాషలో ‘‘... పోయేటప్పుడు ఏం కట్టుకుపోతాం?’’ అంటాడు. అదీ, తనదైన వ్యక్తీకరణ. ఇక, ఇప్పుడు మళ్లీ చదవండి పై పద్యాన్ని. వీలయితే రెండు మార్లు చదవండి. యవ్వనంలో బలిష్టంగా ఉన్న ఓ గుఱ్ఱం లయబద్దమైన తూపుతో దౌడు తీస్తున్నట్టు సాగుతుందీ పద్యం. అది బమ్మెర పోతన గొప్పదనం. శ్రీమద్భాగవతం, వామనావతారంలోని ఈ సొగసరి/గడసరి పద్యంలో విషయం ఎంత లోతైనదో ఎత్తుగడా అంతే గొప్పగా ఉంటుంది. విషయం, భాష, అభివ్యక్తి... ముప్పిరిగొన్నట్టుంటాయి. ఆధునిక ‘కార్పొరేట్ గురు’లు చెప్పే టన్నులు, టన్నుల కిటుకులు ఈ పద్యంలో ఇమిడి ఉన్నాయి. ముఖ్యంగా ప్రసారమాధ్యమాలు, ఇతర కమ్యూనికేషన్ రంగంలోని వారికిది సిలబస్ లాంటి మంచి పాఠం. ఎంచుకున్న రంగమేదైనా, తనకున్న డిగ్రీ ఎటువంటిదైనా... 1) విషయ పరిజ్ఙానం (సబ్జెక్ట్ నాలెడ్జ్), 2) భాషపై పట్టు (ప్రొఫిషియెన్సీ ఆఫ్ లాంగ్వేజ్), 3) భావ ప్రసార ప్రావీణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్)... ఈ మూడూ ఉంటే ప్రపంచాన్ని దున్నేయొచ్చంటారు. ఇవి పుష్కలంగా ఉన్న బమ్మెర పోతన సాహిత్యం నేర్చుకోదగ్గ పాఠం అనడానికి ఈ పద్యం నిలువెత్తు నిదర్శనం. - దిలీప్‌రెడ్డి