శివుడు స్థాణువు. కదలడు. అమ్మవారు కదలిక. సైన్సు పరిభాషలో అయితే అయ్య స్టాటిక్ ఎనర్జి. అమ్మ కైనెటిక్ ఎనర్జీ. జగతి గతికి రెండు శక్తులూ కావాలి. ఇద్దరూ కలిస్తేనే మన మనుగడ కు కావాల్సిన జడ శక్తి; చిత్ శక్తి దొరుకుతున్నాయి.
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపిం
అని అంటాడు శంకరాచార్యులు సౌందర్యలహరిలో. శక్తితో కలిసి ఉంటేనే శివుడు ఏదైనా చేయగలుగుతాడు. శివుడు– శక్తి వేరు కాదని శంకరుడు సౌందర్యలహరి మొట్టమెదటి శ్లోకంలోనే సూత్రీకరించాడు.
‘కలాభ్యాం చూడాలంకృత–శశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం’’ అంటూ శివుడిని పొందడానికి పార్వతి; పార్వతిని పొందడానికి శివుడు తపస్సు చేయడాన్ని అనన్యసామాన్యంగా ఆవిష్కరించాడు శంకరులు శివానందలహరి మొట్టమొదటి శ్లోకంలో. ఒకరినొకరు కలవడానికి, కొలవడానికి వారిది నిజమైన తపోఫలం.
ఆధునిక జీవనంలో మన మనుగడ సుఖంగా ఉండడానికి ఈ రెండు శ్లోకాలను పట్టుకుంటే చాలు. వీటి అర్థాన్ని, అంతరార్థాన్ని ఆకళింపు చేసుకుని... ఆచరిస్తే చాలు– శోకాలన్నీ మాయమవుతాయి.
ఆధ్యాత్మిక కోణంలో శక్తిగా మనం అమ్మవారిని కొలుచుకుంటాం. లౌకిక విషయాల్లో మహిళల శక్తిని కొలిచేప్పుడు చిన్నచూపు చూస్తాం. అమ్మవారి శక్తి లేకపోతే అంతటి శివుడే కనీసం అటు గడ్డి పోచను ఇటు జరపలేడని శంకరుడన్న మాటను నోరు నొవ్వంగ స్తోత్రం చేస్తూ ఉంటాం కానీ... ఆచరణలో ఎంతవరకు పాటిస్తున్నామన్నది ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం.
‘సర్వతీర్థాత్మికే; సర్వమంత్రాత్మికే; సర్వయంత్రాత్మికే; సర్వతంత్రాత్మికే; సర్వచక్రాత్మికే; సర్వశక్త్యాత్మికే; సర్వపీఠాత్మికే; సర్వవేదాత్మికే; సర్వవిద్యాత్మికే; సర్వయోగాత్మికే; సర్వవర్ణాత్మికే; సర్వగీతాత్మికే; సర్వనాదాత్మికే; సర్వశబ్దాత్మికే; సర్వవిశ్వాత్మికే; సర్వవర్గాత్మికే...’ అంటూ శ్యామలాదండకం చివరిలో కాళిదాసు అందరిలో, అన్నిటిలో, విశ్వమంతా అమ్మవారినే దర్శించాడు.
‘అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ...’ అన్నాడు బమ్మెర పోతన. లక్ష్మి, పార్వతి, సరస్వతి– ముగ్గురు అమ్మలు. ఈ ముగ్గురు అమ్మలను కన్నది ఆదిపరాశక్తి దుర్గ. దేవతల తల్లి అదితి. రాక్షసుల తల్లి దితి. ఆ దితికి కడుపు కోత కలిగించిన తల్లి. అంటే రాక్షసులను సర్వనాశనం చేసిన తల్లి. తనను నమ్మే దేవతల మనసులో కొలువై ఉండే తల్లి. అలాంటి తల్లి నాకు గొప్ప పటుత్వం ఉన్న కవిత్వం ప్రసాదించుగాక. ఇది పైకి ధ్వనించే అర్థం.
ఇంతకుమించి ఇందులో ఇంకా లోతయిన అర్థం ఉంది. పద్యం మొదట ఉన్న అమ్మలగన్న అమ్మ... ముగ్గురమ్మలను మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను క్రమాలంకారంలో అన్వయించుకుంటే–
మహత్వం – ఓం,
కవిత్వం– ఐం,
వశిత్వం– క్లీం
పటుత్వం– హ్రీమ్,
సంపద– శ్రీమ్
అవుతుంది. బీజాక్షరాలను ఎలాపడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు కాబట్టి– వాటి సంకేతాలను పోతన ఈ రూపంలో ఆవిష్కరించాడు. ‘చాల పెద్ద’ అద్భుతమయిన ప్రయోగం. సంస్కతంలో ‘మహా శక్తి’ అన్న మాటకు తెలుగు అనువాదం.
చదవండి: లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే?
దురితాలను పోగొట్టేది; దుర్గంలా మన చుట్టూ రక్షణకవచంలా నిలబడేది దుర్గ. మనలో, మన చుట్టూ ఉండి నడిపించే శక్తిని కాళిదాసు దర్శించినట్లు మనం కూడా సర్వవిశ్వాత్మికగా దర్శించగలిగితే మనకు కూడా దుర్గ కట్టని కోటగా నిలబడి రక్షణనిస్తుంది.
– పమిడికాల్వ మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment