విజయ దశమి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు సాక్షి ఫ్యామిలీకి ప్రత్యేకంగా చెప్పిన ముఖ్య విశేషాలు...
పదవరోజుతో ఎందుకు ముగించాలి...
లోకంలోని ప్రతి అమ్మా ఆ లోకంలోని జగదంబకి ప్రతిరూపం. ఈమె కనిపిస్తుంది. ఆమె కన్పించదు. ఈమె ఎలాగైతే తొమ్మిది నెలలపాటు తనలో జరిగే వ్యాధులూ అలజడీ... తోపోరాడి 10వ నెలలో సంతాన విజయాన్ని సాధిస్తోందో– అలా అమ్మ ఈమెకి మార్గదర్శకురాలిగా తొమ్మిది రాత్రులపాటు (రాక్షసులకి రాత్రే బలం అధికం. నిశాచరులు కదా) పోరాడి పోరాడి 10వ నాడు దశమి విజయాన్ని సాధించింది కాబట్టి దేవీ నవరాత్రులంటే ప్రతి స్త్రీ విజయానికీ సాక్ష్యమన్నమాట. సంతానాన్ని కనగలగడమంటే అమ్మ అనుగ్రహంతో జయాన్ని సాధించి పండంటి బిడ్డని పొందడమన్నమాట. జయమంటే గెలుపు. అమ్మ అనుగ్రహం దానికి అండగా నిలిస్తే అది విజయం అన్నమాట!
రోజూ అమ్మకి కొత్తకొత్తగా ముస్తాబు...
అమ్మ అలంకారాల విషయానికి వద్దాం... స్థూలంగా చెప్తే– యోగసాధన చేయదలచిన సాధకుడు మొదటి రోజున బాల్య స్థితిలో ఉంటాడు. అదే బాలా త్రిపుర సుందరీ రూపం. అమ్మ తన సంతానాన్ని బడికి పంపేముందు కడుపునిండుగా అన్నం పెట్టి పంపుతుంది. అదుగో అదే అన్నపూర్ణా రూపం. సంతానం బడికెళ్లాక మూడవ కన్నయిన జ్ఞానాన్ని పొందుతారు. అదే గాయత్రీ రూపం.
గాయత్రీ మంత్రానుష్ఠానం సాగగానే ఆ వ్యక్తికి ఓ వాక్ఛక్తి వచ్చి, అతడు ఏం చెప్తే అది జరగడం ప్రారంభమౌతుంది. ఆ శక్తిని ధనార్జనకి ఉపయోగిస్తాడా? లేక పై చదువుకోసం వినియోగిస్తాడా... అని పరీక్షించడం కోసం 4వ రోజున పరీక్ష కోసం మహాలక్ష్మీ రూపం వేస్తారు. ఆ ఆలోచనని జయిస్తే సరస్వతి లక్ష్మి ఇతర దేవతలూ... ఇలా అందర్నీ శాసించగల లలితారూపాన్ని దర్శించేలా 5వ రోజున లలితా రూపాన్ని వేస్తారు. ఆరవ రోజున షష్ఠి తిథి మూలా నక్షత్రం ఉండే కారణంగా సరస్వతీ రూపాన్ని వేయించి జ్ఞాన అజ్ఞానాలకీ, విరోధం విచక్షణం అనే రెంటికీ మూలమైన శక్తిని తెలుసుకునేలా చేస్తారు.
7వ రోజున వివాహిత అయిన స్త్రీ తన భర్తతో కలిసి ఉన్నప్పుడే భోగాన్నీ (మానసికానందం) పొందగలదని ఉపదేశిస్తూ భవానీ రూపాన్ని వేస్తారు. 8వ రోజున ఎంతటి కష్టానికైనా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ దుర్గారూపాన్నీ– 9వ రోజున శత్రువుని ఎదుర్కొనే సాహసాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండాలనే దృష్టిని నేర్పుతూ మహానవమి నాడు క్రోధ రూపిణి అయిన కాలి రూపాన్నీ– 10వ రోజున మహిసాసుర మర్దినీ రూపాన్నీ (జాడ్యం బద్ధకం నిర్లక్ష్యం సిగ్గులేనితనం.. వంటి లక్షణాలని తొలగించగల) వేస్తారు. స్త్రీ అలా ఉన్న రోజున రాజరాజేశ్వరిగా సర్వులకీ అధిపత్ని గా ఉంటూ అ–పరాజిత (చేపట్టిన కార్యక్రమంలో ఓటమి లేనిది) గా అవుతుందని ఈ రూపాలతో నిరూపిస్తారు.
అమ్మ చేతిలో మారణాయుధాలా?
మనింట్లో ఉండే కూరగాయల్ని తరుక్కునే కత్తిపీట– వంటింట్లో ఉండే పొయ్యిమంటా... ఏవి కావు మారణాయుధాలు? వాటి ఉపయోగాన్ని బట్టి అవి ప్రయోజనాన్ని సాధించుకునే ఉపాయాలూ లేదా మారణాయుధాలూ ఔతాయి. అమ్మ చేతిలో పాశం అనురాగపాశం. అందుకే మనం ఈ ఉత్సవాలను చేసుకునేలా దాంతో బంధించింది. అమ్మ చేతిలోని అంకుశం మనం అహంకారం గర్వం హోదా ఉందనే దర్పంతో ఉన్నప్పుడు (తమోగుణం)– ఆ మదగజంలా ఉన్న మనని తోవలో పెట్టేందుకు ఉపయోగించే సాధనం. అలాగే ఆమె చేతిపుష్పబాణం మనని తన దగ్గరకి రప్పించుకునేందుకు చూపే ఆకర్షణా కుసుమం. మనని కోరికకి లొంగి΄ోకుండా నిలబడగల ధైర్యాన్ని పొందవలసిందిగా సూచించే పుష్పబాణం. పరిస్థితుల్ని దాటినట్లైతే మనని వధించడానికి లేదా శిక్షించి తోవలోకి తెచ్చేందుకు అమ్మ వాడే చాపం. అర్థం చేసుకోగలగాలి! అవి రక్షణాయుధాలు– వ్యతిరేకించిన పక్షంలో మారణాయుధాలు.
దేవీ నవరాత్రుల ద్వారా తెలుసుకోవలసింది..?
సంవత్సర చక్రంలో ఉగాది రాగానే అమ్మకి వసంత నవరాత్రోత్సవాలు పేరిట 9 రోజులపాటు ఉత్సవాలు, కొందరైతే పూర్ణిమ వరకూ పండుగ చేస్తారు. మళ్లీ శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు మంగళవారాలు, మళ్లీ నాలుగు లేదా ఐదు శుక్రవారాలూ అమ్మ పండుగలే. ఇదుగో ఈ ఆశ్వయుజంలో పాడ్యమినుండి అమావాస్య వరకూ ఆమె పండుగలే 30 రోజులపాటు. కార్తికమాసం అంతటా శివునితో కలిపి పూజాఉత్సవాలే ఆమెకి. మొత్తం అమ్మకి పండుగరోజులెన్ని... అని ఆలోచిస్తే.. కనిష్ఠంగా 9+4+4+30+15=62 స్త్రీని ఓ దేవతగా ప్రతి సంవత్సరమూ ఆరాధించే ఉత్తమ సంస్కారం భారత దేశానిదే.
లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే...
అమ్మకున్న వెయ్యి నామాల్లో అమ్మవారి భౌతిక రూప వర్ణనం– ఆమె ఏ మంత్ర రూపంలో ఉంటుందో ఆ మంత్ర స్వరూప విధానం– స్త్రీలలో చైతన్యాన్ని ఎలా అమ్మ నింపి ‘శక్తి సేన’ అనే ఓ దాన్ని సిద్ధం చేసిందో ఆ పద్ధతీ– ఆమెకి తన సాహస పరాక్రమాలతో దుర్మార్గులూ లోకకంటకులూ అయిన పురుష రాక్షసుల్ని ఎలా సహరించిందో తన సైన్య సహాయంతో ఆ దృశ్యం – గర్భవతి అయిన ఆమెలో ఎదుగుతున్న శిశువుకి ఏ నెలలో ఏ తీరు ఆహారసారాన్ని అందించాలో ఆ వైద్యక్రమం, శత్రువుల్ని ఎలా వధించాలో ఆ తీరుతెన్నులూ, భర్తతో ఎలా అన్యోన్యంగా ఉండాలో ఆ జీవన విధానం.. ఇలా వివరింపబడ్డాయి.
దేవీ నవరాత్రాల ముఖ్యోద్దేశం
అరాచకాలు చేసే పురుషుల్ని సాహస పరాక్రమాలని తోటి స్త్రీల సహాయంతో ఎదిరించి వాళ్లకి భయం కలిగేలా చేయడం– భర్తతో కలిసే ఉండే తీరుని నేర్పడం– కుటుంబ రహస్యాలని గోప్యంగా ఉంచుకుంటూ సత్త్వ గుణంతో పరిస్థితిని సానుకూలత ఉండేలా చేసుకోవడం– ఎవరో వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలనుకోవడం, ఎదురు చూడ్డం కాకుండా తమె కుటుంబాన్ని తామే రక్షించుకోగల నేర్పరితనాన్ని సధైర్యంగా సాధించుకోగల విధానాన్ని నేర్పడమనేవి వీటి ముఖ్యోద్దేశాలు.
Comments
Please login to add a commentAdd a comment