Mylavarapu srinivasa rao
-
ప్రతి అమ్మా దుర్గమ్మే
విజయ దశమి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు సాక్షి ఫ్యామిలీకి ప్రత్యేకంగా చెప్పిన ముఖ్య విశేషాలు...పదవరోజుతో ఎందుకు ముగించాలి...లోకంలోని ప్రతి అమ్మా ఆ లోకంలోని జగదంబకి ప్రతిరూపం. ఈమె కనిపిస్తుంది. ఆమె కన్పించదు. ఈమె ఎలాగైతే తొమ్మిది నెలలపాటు తనలో జరిగే వ్యాధులూ అలజడీ... తోపోరాడి 10వ నెలలో సంతాన విజయాన్ని సాధిస్తోందో– అలా అమ్మ ఈమెకి మార్గదర్శకురాలిగా తొమ్మిది రాత్రులపాటు (రాక్షసులకి రాత్రే బలం అధికం. నిశాచరులు కదా) పోరాడి పోరాడి 10వ నాడు దశమి విజయాన్ని సాధించింది కాబట్టి దేవీ నవరాత్రులంటే ప్రతి స్త్రీ విజయానికీ సాక్ష్యమన్నమాట. సంతానాన్ని కనగలగడమంటే అమ్మ అనుగ్రహంతో జయాన్ని సాధించి పండంటి బిడ్డని పొందడమన్నమాట. జయమంటే గెలుపు. అమ్మ అనుగ్రహం దానికి అండగా నిలిస్తే అది విజయం అన్నమాట!రోజూ అమ్మకి కొత్తకొత్తగా ముస్తాబు...అమ్మ అలంకారాల విషయానికి వద్దాం... స్థూలంగా చెప్తే– యోగసాధన చేయదలచిన సాధకుడు మొదటి రోజున బాల్య స్థితిలో ఉంటాడు. అదే బాలా త్రిపుర సుందరీ రూపం. అమ్మ తన సంతానాన్ని బడికి పంపేముందు కడుపునిండుగా అన్నం పెట్టి పంపుతుంది. అదుగో అదే అన్నపూర్ణా రూపం. సంతానం బడికెళ్లాక మూడవ కన్నయిన జ్ఞానాన్ని పొందుతారు. అదే గాయత్రీ రూపం. గాయత్రీ మంత్రానుష్ఠానం సాగగానే ఆ వ్యక్తికి ఓ వాక్ఛక్తి వచ్చి, అతడు ఏం చెప్తే అది జరగడం ప్రారంభమౌతుంది. ఆ శక్తిని ధనార్జనకి ఉపయోగిస్తాడా? లేక పై చదువుకోసం వినియోగిస్తాడా... అని పరీక్షించడం కోసం 4వ రోజున పరీక్ష కోసం మహాలక్ష్మీ రూపం వేస్తారు. ఆ ఆలోచనని జయిస్తే సరస్వతి లక్ష్మి ఇతర దేవతలూ... ఇలా అందర్నీ శాసించగల లలితారూపాన్ని దర్శించేలా 5వ రోజున లలితా రూపాన్ని వేస్తారు. ఆరవ రోజున షష్ఠి తిథి మూలా నక్షత్రం ఉండే కారణంగా సరస్వతీ రూపాన్ని వేయించి జ్ఞాన అజ్ఞానాలకీ, విరోధం విచక్షణం అనే రెంటికీ మూలమైన శక్తిని తెలుసుకునేలా చేస్తారు.7వ రోజున వివాహిత అయిన స్త్రీ తన భర్తతో కలిసి ఉన్నప్పుడే భోగాన్నీ (మానసికానందం) పొందగలదని ఉపదేశిస్తూ భవానీ రూపాన్ని వేస్తారు. 8వ రోజున ఎంతటి కష్టానికైనా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ దుర్గారూపాన్నీ– 9వ రోజున శత్రువుని ఎదుర్కొనే సాహసాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండాలనే దృష్టిని నేర్పుతూ మహానవమి నాడు క్రోధ రూపిణి అయిన కాలి రూపాన్నీ– 10వ రోజున మహిసాసుర మర్దినీ రూపాన్నీ (జాడ్యం బద్ధకం నిర్లక్ష్యం సిగ్గులేనితనం.. వంటి లక్షణాలని తొలగించగల) వేస్తారు. స్త్రీ అలా ఉన్న రోజున రాజరాజేశ్వరిగా సర్వులకీ అధిపత్ని గా ఉంటూ అ–పరాజిత (చేపట్టిన కార్యక్రమంలో ఓటమి లేనిది) గా అవుతుందని ఈ రూపాలతో నిరూపిస్తారు.అమ్మ చేతిలో మారణాయుధాలా?మనింట్లో ఉండే కూరగాయల్ని తరుక్కునే కత్తిపీట– వంటింట్లో ఉండే పొయ్యిమంటా... ఏవి కావు మారణాయుధాలు? వాటి ఉపయోగాన్ని బట్టి అవి ప్రయోజనాన్ని సాధించుకునే ఉపాయాలూ లేదా మారణాయుధాలూ ఔతాయి. అమ్మ చేతిలో పాశం అనురాగపాశం. అందుకే మనం ఈ ఉత్సవాలను చేసుకునేలా దాంతో బంధించింది. అమ్మ చేతిలోని అంకుశం మనం అహంకారం గర్వం హోదా ఉందనే దర్పంతో ఉన్నప్పుడు (తమోగుణం)– ఆ మదగజంలా ఉన్న మనని తోవలో పెట్టేందుకు ఉపయోగించే సాధనం. అలాగే ఆమె చేతిపుష్పబాణం మనని తన దగ్గరకి రప్పించుకునేందుకు చూపే ఆకర్షణా కుసుమం. మనని కోరికకి లొంగి΄ోకుండా నిలబడగల ధైర్యాన్ని పొందవలసిందిగా సూచించే పుష్పబాణం. పరిస్థితుల్ని దాటినట్లైతే మనని వధించడానికి లేదా శిక్షించి తోవలోకి తెచ్చేందుకు అమ్మ వాడే చాపం. అర్థం చేసుకోగలగాలి! అవి రక్షణాయుధాలు– వ్యతిరేకించిన పక్షంలో మారణాయుధాలు.దేవీ నవరాత్రుల ద్వారా తెలుసుకోవలసింది..?సంవత్సర చక్రంలో ఉగాది రాగానే అమ్మకి వసంత నవరాత్రోత్సవాలు పేరిట 9 రోజులపాటు ఉత్సవాలు, కొందరైతే పూర్ణిమ వరకూ పండుగ చేస్తారు. మళ్లీ శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు మంగళవారాలు, మళ్లీ నాలుగు లేదా ఐదు శుక్రవారాలూ అమ్మ పండుగలే. ఇదుగో ఈ ఆశ్వయుజంలో పాడ్యమినుండి అమావాస్య వరకూ ఆమె పండుగలే 30 రోజులపాటు. కార్తికమాసం అంతటా శివునితో కలిపి పూజాఉత్సవాలే ఆమెకి. మొత్తం అమ్మకి పండుగరోజులెన్ని... అని ఆలోచిస్తే.. కనిష్ఠంగా 9+4+4+30+15=62 స్త్రీని ఓ దేవతగా ప్రతి సంవత్సరమూ ఆరాధించే ఉత్తమ సంస్కారం భారత దేశానిదే.లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే...అమ్మకున్న వెయ్యి నామాల్లో అమ్మవారి భౌతిక రూప వర్ణనం– ఆమె ఏ మంత్ర రూపంలో ఉంటుందో ఆ మంత్ర స్వరూప విధానం– స్త్రీలలో చైతన్యాన్ని ఎలా అమ్మ నింపి ‘శక్తి సేన’ అనే ఓ దాన్ని సిద్ధం చేసిందో ఆ పద్ధతీ– ఆమెకి తన సాహస పరాక్రమాలతో దుర్మార్గులూ లోకకంటకులూ అయిన పురుష రాక్షసుల్ని ఎలా సహరించిందో తన సైన్య సహాయంతో ఆ దృశ్యం – గర్భవతి అయిన ఆమెలో ఎదుగుతున్న శిశువుకి ఏ నెలలో ఏ తీరు ఆహారసారాన్ని అందించాలో ఆ వైద్యక్రమం, శత్రువుల్ని ఎలా వధించాలో ఆ తీరుతెన్నులూ, భర్తతో ఎలా అన్యోన్యంగా ఉండాలో ఆ జీవన విధానం.. ఇలా వివరింపబడ్డాయి.దేవీ నవరాత్రాల ముఖ్యోద్దేశం అరాచకాలు చేసే పురుషుల్ని సాహస పరాక్రమాలని తోటి స్త్రీల సహాయంతో ఎదిరించి వాళ్లకి భయం కలిగేలా చేయడం– భర్తతో కలిసే ఉండే తీరుని నేర్పడం– కుటుంబ రహస్యాలని గోప్యంగా ఉంచుకుంటూ సత్త్వ గుణంతో పరిస్థితిని సానుకూలత ఉండేలా చేసుకోవడం– ఎవరో వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలనుకోవడం, ఎదురు చూడ్డం కాకుండా తమె కుటుంబాన్ని తామే రక్షించుకోగల నేర్పరితనాన్ని సధైర్యంగా సాధించుకోగల విధానాన్ని నేర్పడమనేవి వీటి ముఖ్యోద్దేశాలు. -
గాయత్రీ దేవికి ఇది పెట్టండి మీ జీవితం మారిపోతుంది!
-
దీపావళి ధర్మ సందేహాలు
-
బాబాకు భోజనం పెడదామా!
సాయి గొప్పదనాన్ని వినడమే కాదు... ప్రత్యక్షంగా కూడా ఎన్నో నిదర్శనాలతో సహా చూసిన తాత్యా (తాత్యా పటేల్) దంపతులు ఎప్పుడు తమకు కొంత ఖాళీ దొరికినా వెంటనే షిర్డీ గ్రామానికి వచ్చేస్తుండేవారు. ’సర్వస్య శరణా గతిః’ అన్నట్లు సాయి దగ్గరే ఉంటూ ఆయన ఏం చేస్తే దాన్ని చేయడం.. ఆయన దేన్ని వద్దంటే ఆ పని తమ మనసుకి ఇష్టమైనదైనా సరే మానేయడం.. ఇలా సాయికి నీడలాగ ఉంటూ ఉండేవారు. కొందరికి అనిపిస్తుండేది.. ‘ఇక వీళ్లకు ఇట్లా పనీ పాటా, గొడ్డు గోదా, ఉద్యోగం సద్యోగమంటూ ఏమీ లేదా?’ అని.. తత్యా దంపతులు ఒకేమాట అంటుండేవారు. మాకు ఇళ్లు లేకా కాదు.. పని పాటా ఉండక కాదు.. అన్నీ ఉన్నాయి కానీ ప్రతిపనిలోనూ.. ప్రారంభంలోనూ.. మధ్యలోనూ..ముంపులోనూ ఒక అశాంతి ఉంటుంది. లేదా అసంతృప్తి కలుగుతుంది, కలిగే వీలు ఉంటుంది. అయితే సాయి సన్నిధిలో ఆ అసంతృప్తి, నిరాశ, అశాంతి అనేవి మచ్చుకి కూడా ఉండవు. తల్లి దగ్గర ఉన్న దూడకు మరో ఆలోచన ఎలా ఉంటుందో.. గూటిలో అమ్మతో ఉన్న పక్షి పిల్లకి ఆకాశంలో ఎగురుదామనే ఊహ ఉన్నా ఎలా ఇష్టం పుట్టదో అలా ఇంత విశాల ప్రదేశం మాకంటూ తిరగడానికి ఉన్నా శరీరంలో ఓపిక ఉన్నా.. ఖర్చు చేసుకుని తిరిగే ఆర్థిక శక్తి ఉన్నా ఇక్కడ ఉంటే ఆ ఆనందం ఎక్కడా మరెక్కడా ఉండదు. లేదంతే. ఇక మాకు కాశీ, ఇదే మాకు ప్రయాగ, ఇదే మాకు ద్వారకా, మీరు ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటున్నారో అవన్నీ మాకు మాకోసం షిర్డీకే వచ్చేశాయి. అందుకే మేము రోజుకో పుణ్య క్షేత్రానికి వచ్చిన ఆనందంతో సాయిసన్నిధిలో గడుపుతూ ఉంటామని స్పష్టమైన అవగాహనతో, విశ్వాసంతో చెబుతూ ఉండేవారు. అంతటి శరణా గతి ధర్మం ఉన్నవాళ్లు ఆ దంపతులు. ఇలా ఉంటే ఒక రోజున తాత్యా భార్య సాయి దగ్గరకు వచ్చి మౌనంగా నిలబడి చూపులతో ఆయన్నేదో ప్రార్థించినట్లుగా చూసింది. సాయి ఆమెను చూస్తూ ‘‘సందేహించకు..! అడిగేది ఏదో అడుగు.. ఆలోచనను లోలోపల దాచేసుకోవడం పిరికితనానికి చిహ్నం. తప్పు పని గురించి అడుగుతున్నామేమో అనే భయానికి సాక్ష్యం అడుగు’’ అన్నాడు. వెంటనే చెప్పలేనంత ఉత్సాహంతో ఆమె సాయికి సాగిలపడి లేచి ఆయన మొఖంలోకి చూస్తూ.. ‘దేవా ! ప్రతి రోజూ నేను విందును తీసుకొస్తే ఆరగిస్తున్నావు కదా.. ఈ దీనురాలి ప్రార్థన మన్నించి ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఎందుకు ఆరగించకుడదూ..? నీకు ఏమేమి పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాలు నాకు తెలుసు.. వండే అవకాశం నాకు ఉంది. దయచేసి రావూ?’ అని అడిగి ఆయన ఏమంటాడో అని అలా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆయన సమాధానం ఇవ్వకుండానే.. ‘సాయి! మా ఇల్లు ఇక్కడకు చాలా దగ్గర. పైగా సమయం పాటించే లక్షణం కూడా మా దంపతులది. నిన్ను రప్పించి నువ్వొచ్చాక నేను ఆలస్యం చేయను నీ భోజనానికి దయచేసి రావూ !’ అంది. సాయి నవ్వుతూ ‘అమ్మా..! భిక్షం కోసమని అన్ని వీధులు తిరిగే నాకు దగ్గర దూరం అనేది ఓ లెక్కా? ఇక బిడ్డకు అన్నం పెడతానని తల్లిలా నువ్వు అంటుంటే ఎందుకు రానూ.. పిలవడమే ఓ అదృష్టంగా భావించి వచ్చి తీరుతాను.. నువ్వన్నావే సమయ నియమాన్ని పాటిస్తున్నానని.. దానికి సరిపోయేలా 5 కొట్టేసరికల్లా మీ ఇంటికి వస్తాను. భిక్షగాడైన నాకు మీ ఇంటి చిరునామాను, దూరాన్ని వివరించి చెప్పాలి కూడానా..? నాకు పోళీలు (మహారాష్ట్ర వంటకం) బాగా ఇష్టమని తెలిసిందంటున్నావే..! తల్లికి కదామ్మా బిడ్డకు ఇష్టమేదో తెలుస్తుంది. సరే రమ్మంటున్నావుగా వస్తాను అన్నాడు. అంతే ! ఆమె ఉరుకులాంటి నడకతో ఇంటికి వెళ్లి వంటింటిని ఒకటికి రెండు మార్లు శుభ్రం చేసి ఏ ఒక్కరిని కూడా సహాయానికి పిలవకుండా అంతా తానే చేసి సాయికి వడ్డించాలనే ఆనందంతో మొత్తానికి పోళీలని చక్కగా చేసింది. మంచి వెండిపళ్లెంలో చక్కగా సర్ది మరీ పెట్టింది. ఇటు వంటకాన్ని చేస్తుండడం అటు గడియారాన్ని చూస్తూండడం.. ఇలా మొత్తానికి 5 గంటల ముందే అంటే 4 గంటలకే సిద్ధం చేసి సాయి రాకకోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే కూచుంది ఈ వీధిలోకి కళ్లని ప్రసరింపజేస్తూ. వంటింటి ముందున్న గదిలో అగరువత్తుల ధూపాన్ని బాగా వేసి మరీ ఆమె ఎదురు చూస్తూ ఉండిపోయింది.సమయం 4 దాటింది. నాలుగున్నర అయింది. సాయికి ముగ్గులు బాగా ఇష్టం కదా! అని ఆ వడ్డించబోయే గదిలో ముగ్గులు వేయడం ప్రారంభమయింది అటు 5 గంటలనే మాట గుర్తుంచుకుని. ఈ పనిధ్యాసలో ఈమె ఉండగా ఎక్కడినుండో ఓ నల్లకుక్క గబగబా ఇంట్లోకి దూరి ఆ పోళీలని తినడం కోసం నోరు తెరిచి పళ్లెం దగ్గరకి వెళ్లింది. వెంటనే అపరిమిత కోపం వచ్చిన ఆమె– పాడుకుక్కా! సాయికోసం నైవేద్యంగా పెడితే నువ్వెక్కడ దాపురించావంటూ దగ్గర్లో కర్ర కనపడబోతే చిన్న ఇనుప కడ్డీని దాని మీదికి విసిరింది. అది దానికి తగిలి బాధతో అరుచుకుంటూ వెళ్లిపోయింది. సమయం ఆరు ఆరున్నర ఏడు కూడా అయింది. ఎంతో నిరాశతో ఆమె సాయి మందిరానికి ఈ పోళీలున్న పళ్లాన్నే పట్టుకుని వెళ్లింది. సాయి అప్పటికి తన భక్తులూ శిష్యులైన వాళ్లందరి మధ్యా కూర్చుని ఈమెని ఉద్దేశిస్తూ– ‘చూశారా! ఈమెకెంత కోపం వచ్చిందో! నన్ను విందుకి పిలిచింది తన ఇంటికి. నేను వస్తానని కూడా అన్నాను. తీరా నేను కచ్చితంగా ఆమెతో అన్నట్టుగానే ఆమె కూడా ఒప్పుకున్నట్టుగానే 5కే వెళ్లాను ఆమె ఇంటికి. మంచి ముగ్గులు వేసింది. అగరు ధూపం వేసింది. ఇదుగో! ఈ వెండిపళ్లెంలోనే పోళీలని చూడముచ్చటగా కూడా సర్ది ఉంచింది.అయితే ఏం లాభం? నేను తినబోయేసరికి ఓ ఇనుప కమ్మీని నా మీదికి విసిరింది. భయంతో అరుచుకుంటూ పారిపోయి వచ్చానని ఆమె వంక చూస్తూ ముగించాడు. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. మహల్సాపతితో పాటు అక్కడున్న భక్తులందరికి ముందు ఏమీ అర్థం కాకపోయినప్పటికీ ఆమె వివరించిన విషయం తెలిసి అందరూ నివ్వెరపోయారు. ఆమె మళ్లీ సాయిని ప్రార్థిస్తూ.. ‘సాయి దేవా..! జరిగిందేదో జరిగిపోయింది నాదే తప్పు. పొరపాటైంది మన్నించు. ఇన్నినాళ్ల నుంచి నిన్ను సేవిస్తున్నా నీ తత్వం తెలియని అజ్ఞానిని. మన్నించు. రేపు సాయంత్రం ఇదే సమయానికి మాల్ పూరీలను పానకంలో ముంచి సిద్ధం చేసి ఉంచుతాను. నీ కోసం ఎదురుచూస్తుంటున్నానని దీనాతిదీనంగా పలికింది. సాయి అన్నాడు.. ‘‘తల్లీ ! అంత దీనంగా వేడుకోవాల్సిన అవసరం లేదు. నేను తప్పక వస్తాను. విందు ఆరగిస్తాను. సరేనా’’ అన్నాడు. అంతే! ఆమె కిందటి రోజులాగే.. అంతా సిద్ధం చేసుకుని కూర్చుంది. మాల్ పూరీలను పానకంలో ముంచి ఉంచేసరికి ఆ చక్కని సువాసన ఆ వీధి వెంట వెళుతుంటే అందరి ముక్కుపుటాలకు తాకనారంభించింది. ఏదో విశేషముందని అందరూ లోపలికి రాబోతుంటే ఆమెకు ఒక పక్కసాయేనేమో అని భయం. మరోపక్క ఇతడు.. వాడు నాకు తెలిసిన వాడే కదా అని ఊరటా.. ఇంతలో ఏ కుక్క వస్తోందని ఆత్రుత. కుక్క వచ్చినా సాయిలానే భావిద్దామని ఉత్సాహం. కొన్ని కుక్కకు పెట్టి మరికొన్ని సాయికి పెడదామనే ఆలోచన. ఒకటేమిటి వేలవేల ఊహలు.. ఆపోహలు ఆమెకు మనసులో అలా తాండవించ సాగాయి. అటు వీధిని.. ఇటు ఇంటిని మరోవైపు వచ్చి పోతూ వినోదంగా చూస్తుండే మనుషులను చూస్తుంటే ఎక్కడ నుంచో ఒక పెద్ద దున్నపోతులా ఉన్నటు వంటి శరీరంతో కనిపిస్తున్న గవిడిగేదె తన ముందు కాళ్ల రెంటిని లోపలి గదిలోనికి పెట్టి ఆనందంతో అంబా అని అరుస్తూ లోపలికి పోబోయింది. చెప్పలేని కోపంతో కర్రతో బలంగా కొట్టి పంపేసింది ఆమె. అంతకుముందు తను ఎప్పుడూ చూడని.. ఎన్నడూ రాని కుక్క వచ్చింది కాబట్టి ‘సాయి’ అని గుర్తించలేకపోయాను గాని, ఈ గేదెని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను కాబట్టి ఇది సాయి రూపం కానేకాదనుకుని తనకు తాను సమాధానపడిందామె. అనుకున్నట్టుగా 5 దాటింది. ఐదున్నర ఆరుకూడా అయ్యింది. ఆరు దాటింది. మళ్లీ నిన్నటి లాగానే తీవ్ర నిరుత్సాహంతో ఆ వంటకాన్ని తీసుకుని సాయి తన భక్తులకి ఏదో అధ్యాత్మిక విశేషాలను వివరిస్తున్న ఆ మందిరానికి వెళ్లి సాయికి నమస్కరించబోయింది. వెంటనే సాయి తన భక్తులందరితో ‘ఈ అమ్మ పిలిచింది కదా ఈ బిడ్డని’ అనే అభిప్రాయంతో ఆమె ఇంటికి సకాలంలో వెళ్లి ఎప్పుడు తిందామా? అనే ఆకలి కడుపుతో పోతే వెంటనే బలంగా కర్ర తీసుకుని మోదింది. చూడండి బలంగా ఎంత దెబ్బ నాకు తగిలిందో! ఇదేదో ఆమె ఇష్టంగా పిలిస్తే నేను నిందని ఆమె మీద వేస్తున్నానేమిటని భావించకండి అంటూ తన కఫ్నీ (పెద్ద పొడుగాటి చొక్కా) పైకెత్తాడు. బలంగా కర్రతో కొట్టిన వాత అందరికీ కనిపించింది. తాత్యా భార్యకి మాట రాలేదు. రెండుసార్లు అపచారం చే శాననే మనోబాధ పెల్లుబికింది. నిన్నయితే ఇనుపకమ్మీని విసిరిందే గాని కుక్క తప్పించుకుంది. ఈ రోజున ఆ గేదెకి తగలనే తగిలింది. అది కాస్తా సాయి శరీరానికే తగిలిందని బాధపడుతూ అనేక పర్యాయాలు క్షమించవలసిందంటూ సాయిని ప్రార్ధించింది. ‘అమ్మా! నేను ఈ భౌతిక శరీరంలో వస్తేనే కాని వచ్చినట్టుగా భావించకు.. అన్ని రూపాల్లోనూ సాయి ఉన్నట్టుగా భావించి ఏది ఆ సమయానికి నీకు కనబడినా నాకు పెట్టినట్టుగానే భావించు. నేను కోరుకునేది కూడా భూతదయ ఉండాలనే. జీవించి ఉన్న ప్రతి ప్రాణినీ భూతమంటారు కదా! నేనూ ప్రాణినే. నువ్వూ ప్రాణివే. ఇక్కడ అందరూ కూడా ప్రాణం ఉన్నవాళ్లు కాబట్టి అందరూ కూడా భూతాలే. గుర్తుంచుకో! అన్నాడు సాయి. ఆమె కన్నీరు కారుస్తూ దీనాతిదీనంగా నిలబడితే ఆమె లోపలి భావాన్ని గ్రహించిన సాయి.. తల్లీ! ఇదిగో ఊదీ (విభూతి) నిచ్చాను తీసుకో! సాయంత్రం 5 కే వస్తాను. చక్కని పేణీలనే సిద్ధంగా ఉంచు! అవే నాకు ఇష్టం కదా! అన్నాడు. పరుగు లాంటి నడకతో ఆమె ఇల్లు చేరి మధ్యాహ్నం 2 గంటలకే పేణీలని సిద్ధం చేసి ఇక 5 గంటలకి ఏ కుక్క వచ్చినా గేదె వచ్చినా ఆవు వచ్చినా.. ఇక ఏది వచ్చినా దాన్నే సాయిరూపంగా భావించాలనే అభిప్రాయంతో దృఢంగా నిశ్చయబుద్ధితో ఉండిపోయి ఎదురుచూడ సాగింది. సాయి వచ్చే మార్గమంటూ తమయింటిని ఒకటే ఉండటం వల్ల ఆమెకి అటూ ఇటూ చూడాల్సిన అవసరం తప్పింది. తగిన విధంగా గది తలుపులు దగ్గరకి వేసి సాయి రావలసిన తోవనే చూస్తూ ఉండిపోయింది. ఎందుకు సమయాన్ని వ్యర్ధపరచాలనుకుంటూ సాయి సంకీర్తనాన్ని శ్రావ్యంగా తాను పాడుతుంటే ఆ సమీపంలో ఉన్న గృహిణులు కూడ గొంతు కలిపారు. మొత్తానికి ఆ ఇల్లు వాయిద్యధ్వనితో నిండిన ఓ సంగీతవేదికలా అన్పించింది అందరికీ. ఆమెకి నిన్న రాత్రి నిద్రపట్టలేదు. దానిక్కారణం సాయిని కర్రతో కొట్టాననే తీవ్ర మనోవేదన. పైగా ఇంటికి పిలిచి కొట్టానుకదా! అనే దుఃఖం. మళ్లీ అంతలోనే ‘నాకు సాయియే అనే భావం ఉంటే అలా చేసి ఉండేదాన్ని కాదు గదా!’ అనే దోషంలేని ఊహ. ఇలా ఊహా అపోహా నేరమూ శిక్షా.. ఈ తీరు భావనలతో ఉండిపోయింది. 5 అయింది. అయిదున్నర అయింది. సాయి జాడలేదు. దిక్కుతోచని ఆమె ఆ పేణీలని పెట్టిన పళ్లాన్ని తీసుకుని సాయి ఉన్న మసీదు వద్దకి వెళ్దామని లోనికి వచ్చి చూసి వాటికి పట్టిన గండు చీమల్ని దులిపి మసీదులో సాయి వద్దకి వెళ్లి నమస్కరిద్దామనుకుని ఆయన్నే ప్రార్ధించి రప్పించాల్సిందే! అనుకుంటూ ఆయనకి మొక్కింది. సాయి ఆమెని చూస్తూనే.. అమ్మా! పేణీలు ఎంత రుచిగా ఉన్నాయమ్మా.. చాలా చక్కగా చేశావు నాకోసం! ఇంత ప్రేమతో నాకు ఆ వంటకాన్ని నువ్వు పెట్టావుగా! కడుపు మొత్తం నిండిపోయింది. నాకెంతో ఇష్టమైన తీపిని సమపాళ్లలో పెట్టి మరీ సిద్ధం చేశావు. ఇక ఇలా నాకు తీపి పదార్ధాలని సిద్ధం చేస్తూ అస్తమానం పిలుస్తూ ఉంటే నా ఆరోగ్యం కూడా చెడిపోతుంది! చాలునమ్మా.. అంటూ పూర్ణిమచంద్రుని లాంటి నవ్వుని నవ్వాడు సాయి. ఆమెకేమీ పాలు పోలేదు. ‘వంటకమంతా ఇంట్లో ఉంటే ఆయనెప్పుడు తిన్నాడు?’ అనేది ఆమె చింత–అనుమానం. ఆ స్థితిని గమనించిన సాయి ఆమెని చూస్తూ.. ‘అదేమిటమ్మా! తీపిని సిద్ధం చేసింది నువ్వేకదా! ఆ వెనుక గదిలో కిటికీ పక్కన ఉంచింది నువ్వే కదా! రంగురంగుల ముగ్గులతో నిండిన గదిని దాటి అగరువత్తుల వాసనలతో గది మొత్తాన్ని నింపి నాకోసం కొత్త పళ్లెంలో కొత్త ఆకుల మీద పేణీలని పెట్టిందీ నువ్వే కదా! తినలేదని ఎందుకంటావు? ఎన్ని చీమలు సుఖంగా తిన్నాయి! వాటిని చూడగానే రుచికి ఆశపడ్డ నోరు నీకు కన్పించాలనే ఆలోచనని కూడా వేయలేదు. అందుకే అలా తినేసా’నన్నాడు. ఆమె నివ్వెరపోతుంటే.. సాయి అన్నాడు– ‘‘అమ్మా.. భగవంతుడు 84 లక్షల జీవరాసుల్ని సృష్టి చేశాడు. తెలుసా నీకు? ఓ తండ్రి తన ఇంట్లో తానొక్కడే ఎప్పుడూ భోజనం చేసి నిద్రపోడు. తమ సంతానం భోజనం చేసిందా? అని గమనించి వాళ్లు తింటూంటే తాను ఆకలితో ఉన్నా తృప్తిగా చూపులతో భోజనాన్ని ముగించి ఆ మీదట భౌతికంగా తాను తింటాడు నోటితో. తల్లివి నీవు! బిడ్డల ఆకలి నీకు తెలిసినట్టుగా నాకెలా తెలుస్తుంది? ‘‘తల్లీ.. ! నీ విందుకి చాలా ఆనందమమ్మా! ఎప్పుడు నాకు భోజనాన్ని పెట్టాలని నీకు అన్పించినా ఏదో ఒక ప్రాణిని పిలిచి లేదా తనంతటి తానే వస్తే దానికి పెట్టు. పెట్టేటప్పుడు నా పేరుని ఒక్కమారు అనుకో! అంతే!! అది నన్నే చేరుతుంది విందూ లేదా నైవేద్యం రూపంగా! సంతోషమమ్మా’’ అని ముగించాడు సాయి. ఆమె తన్మయత్వంతో అలా ఆనందబాష్పాలని విడుస్తూనే ఉండిపోయింది. నేను వేదాలని చదివిన వాడిని. మసీదుకొస్తే మైలబడతా! అని పలికిన పండితుని కథ ఏమిటోచూద్దాం! – సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
సాయి యోగ్యశక్తి
షిర్డీ గ్రామంలో ఏ రోజుకారోజు సాయి స్వయంగా అందరు అంగడులవారి వద్దకి వెళ్లి, మసీదులో, మరికొన్ని ప్రదేశాల్లో దీపాలని వెలిగించవలసి ఉందని చెప్పి నూనెని అడగడం చేస్తుండేవాడు. అందరూ కూడా సాయి గొప్పదనాన్ని విని ఉండటం, చూస్తూ ఉండటం కారణంగా ఎవరూ కాదనకుండా యథాశక్తి నూనెని దీపాల నిమిత్తం ఇస్తూనే ఉండేవాళ్లు. అంతా సవ్యంగా జరిగిపోతూ ఉంటే చెప్పుకోవాల్సిందంటూ ఏముంటుంది? సాయి అంటే కిట్టనివాళ్లు కొందరు పగ అనే వత్తిని, ద్వేషమనే నూనెలో తడిపి, వ్యతిరేకత అనే దీపాన్ని వెలిగించారు అంగడిదారుల బుద్ధులందరిలో. అంతే! ఎవ్వరూ కూడా నూనెని సాయికి ఇవ్వరాదని తీర్మానించుకున్నారు. ‘అంతమంది భక్తులొస్తున్నారుగా!? అందరిలో ఎవరో ఒకరితోనో, లేదా అందరితోనో నూనెని ఏర్పాటు చేసుకోలేడా?’ అని కొందరు, ‘అయినా మసీదులో కిరసనాయిలతో వెలిగే లాంతర్లు ఉండగా, ఈ నూనె దీపాలని కూడా వెలిగించాల్సిన అవసరమేమిటి?’ అని ఇంకొందరు, ‘ఇదంతా కాదు. మసీదేమిటి? హిందూ ఆచారం ప్రకారం నూనె దీపాలు వెలిగించడమేంటి?’ అని మరికొందరు మాట్లాడుకోసాగారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు అనుకుని, సాయికి నూనె ఇవ్వరాదని తీర్మానించుకున్నారు. ఎప్పటిలానే సాయి నూనె కోసం వస్తే, వ్యాపారస్థులంతా ముభావంగా ఉండటం, ముఖం తిప్పుకోవడం, అయిష్టంగా ఇవ్వదలచడం, రేపటిరోజున రండి అనడం వంటివేం చెయ్యలేదు. ముఖానే చెప్పారు ఇవ్వడం సాధ్యంకాదని. ఇలాంటి అకస్మాత్ వ్యతిరేకతకు సాయి ఏ మాత్రం దుఃఖపడలేదు. వ్యతిరేకత సామూహికమైనందుకు అశ్చర్యపడలేదు. తన మసీదుకి తిరిగొచ్చేశాడు. తన దగ్గరున్న డబ్బాలో అట్టడుగున ఉన్న నూనెలో నీటిని పోశాడు. కలియదిప్పాడు డబ్బాని. ఆ నూనె, నీరు కలిసిన మిశ్రమాన్ని తాగి ఊశాడు. ఆ మీదట నిండుగా నీటిని డబ్బాలో నింపాడు. ఆ నీటినే వత్తులు ఉన్న ప్రమిదల్లో నిండుగా పోశాడు. ఎవరికీ ఏం అర్థంకాని స్థితిలో నూనె దీపాలులాగానే వాటిని క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వెలిగించసాగాడు. అలా వెలిగిన నీటి దీపాలు రాత్రి రాత్రంతా కాంతిని ఇస్తూనే, వెలుగుతూనే ఉండిపోయాయి. ఇది అందరూ చూస్తుండగా జరిగిన కథ కాదు, చరిత్ర. విశ్వనిర్మాణ రహస్యం ఏదైనా ఒక వస్తువు మరమ్మతుకి గాని వస్తే దాన్ని బాగు చేయవలసిన వానికి, ఆ వస్తువుకి సంబంధించిన, మొత్తం నిర్మాణానికి సంబంధించిన అంత సమాచారం ఎలా తెలిసి ఉండాలో, అదే తీరుగా విశ్వంలో జరిగిన ఈ విచిత్రానికి సంబంధించిన నిజానిజాలు తెలియాలంటేనూ, దాన్ని వివరించి చెప్పాలంటేనూ ఆ విశ్వానికి సంబంధించిన నిర్మాణ రహస్యం తెలిసి ఉండి తీరాల్సిందే కదా! ఆ దృష్టితో చూస్తే పృధ్వి – అప్ – తేజస్ – వాయు – ఆకాశం అనే ఐదింటితో ఈ జగత్తు ఏర్పడింది కాబట్టే దీన్ని ‘ప్ర–పంచము’ (ఐదింటి సమాహారం) అన్నారు. ఇది బ్రహ్మ చేత నిర్మింపబడింది కాబట్టి, బ్రహ్మకి మాత్రమే దీన్ని సృష్టించే అధికారాన్ని ఇచ్చారు కాబట్టి దీన్ని బ్రహ్మా+అండము ‘బ్రహ్మా అనే దీర్ఘం చివర ఉంటే పురుషుడైన బ్రహ్మ’ అని అర్థం. అదే ‘బ్రహ్మ+అండము’ అన్నట్లయితే స్త్రీ పురుష భేదం లేని బ్రహ్మపదార్ధమనే అర్థం వస్తుంది. ఈ జగత్తుని సృష్టించగల అధికారాన్ని పురుషుడైన బ్రహ్మే పొందాడు కాబట్టి ‘బ్రహ్మా+అండము’ అనేదే సరైన పదవిభాగం. అలాంటి బ్రహ్మ చేత సృష్టించబడిన ‘అండం’ ( స్త్రీయో, పురుషుడో తెలియని స్థితిలో ఉండే ముద్ద – ప్రాణియో, అప్రాణియో తెలియని స్థితిలో ఉండే ముద్ద) కాబట్టి దీన్ని బ్రహ్మాండము అన్నారు. ఈ బ్రహ్మాండమే జగత్తంతా. దీనికి సరైన పోలికతో ఉండేది మనం. మనందరం తల్లి గర్భంలో ఉన్న పిండం నుంచి పుట్టాం కాబట్టి మనం ‘పిండాండం’ నుంచి పుట్టినవాళ్లం. బ్రహ్మాండానికి ఎలా పంచభూతాలు సహకరించాయో అలాగే పిండాండానికి కూడా పంచభూతాలు సహకరించి ఉన్నాయి. అంటే బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాలు, పిండాండంలో కూడా ఉండనే ఉన్నాయన్నమాట! బ్రహ్మాండంలోని ‘పృ«థ్వి’ మనకి కన్పించే నేల. పిండాండం అంటే మనలో పృ«థ్వి మన శరీరంలో ఉన్న మాంసం, మజ్జ అనేవి. బ్రహ్మాండంలోని ‘అప్’ మనకి కన్పించే నదులు, సముద్రాలు అన్నీను. పిండాండం అంటే మనలో ‘అప్’ మన శరీరంలోన ఉన్న నీరు. రక్తంలో ఎక్కువశాతం నీరే. బ్రహ్మాండంలోని ‘తేజస్’ (వేడిమి) మనకి కన్పించే సూర్యుని ఉష్ణత. పిండాండంలో కన్పించే ‘తేజస్’ మన శరీరంలో ఎప్పుడూ ఒకేలా ఉండే 98.4 డిగ్రీల వేడిమి. బ్రహ్మాండంలోని ‘వాయువు’ మనకి అనుభవంతో కన్పించే వాయువు. పిండాండంలో అంటే మన శరీరంలో (5+5) దశవిధాలైన వాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన మొదలైనవి ఉన్నాయి. బ్రహ్మాండంలోని ‘ఆకాశం’ మనకి కన్పిస్తున్నట్లుగా ఉంటూ ఎంత దూరం వెళ్లినా కన్పించని శూన్యమైన పదార్థం. ఇక పిండాండంలో ఉండే ఆకాశమంటే అనుభవంలో కన్పిస్తూ ఎవరూ చూడడానికి అవకాశం లేని మనస్సు. ఇలా బ్రహ్మాండ – పిండాండాలు అనే రెండూ పరస్పరం సమానంగా ఉంటూ రెంటి స్వభావం, స్వరూపం ఒకటే అయినా ఆ రెండూ వేర్వేరుగానే ఉంటాయి. ఒకటిగా ఉండలేవు. ఉండవు. ఇదంతా ఎందుకంటే ఈ పంచభూతాలు పైకి వేర్వేరుగా కన్పిస్తున్నా అన్నీ ఆకాశం నుంచి వచ్చాయని చెప్పడానికి. తద్వారా నీటిని గురించిన, అలాగే అగ్నిని గురించిన తత్వాన్ని తెలుసుకుని నీటిలో అగ్నితనం ఎలా ఉంటుందో నిరూపించడానికీను. ఆకాశాద్వాయుః – ఆకాశం నుండి వాయువు పుట్టింది. ‘గాలి బిగదీసింది’ అంటూ ఉంటాం. అంటే ఆకాశం ఆ సమయంలో తన శూన్య ప్రదేశం నుండి వాయువుని విడుదల చేయడం లేదని అర్థమన్నమాట. అంతే కాక వాయువెప్పుడూ శూన్యం నుండే వస్తుందని కూడా భావమన్నమాట. వాయో రగ్నిః – ఇలా వచ్చిన వాయువు నుండే అగ్ని పుట్టిందని దీనర్థం. ఇదేమిటి? ఎక్కడైనా నిప్పుంటే ఆ సమయంలో గాలి బలంగా వీస్తే నిప్పు ఆరిపోతుందిగా!? అని అనుకుంటాం మనం. నిప్పు ఆరిపోవాలన్నా, బాగా రాజుకుని నిప్పు మరింతగా పెరిగి, తన ప్రతాపాన్ని చూపాలన్నా వాయువు వీచినప్పుడే అని అనుకోం. దానికి కారణం సాధారణమైన దృష్టితో ఆలోచించడమే. లో–దృష్టితో పరిశీలించకపోవడమే!!అగ్నే రాపః – ఆ అగ్ని నుంచి నీరు పుట్టిందని దీనర్థం. ఇదేమిటి? ఇది మరీ వింతగా ఉంది! అనిపిస్తుంది. అగ్ని అనేది నీటిని వేడి చేస్తుంది. అలాగే నీరు అనేది నిప్పుని ఆర్పుతుంది. అంతేతప్ప అగ్ని నుండి నీరు పుట్టడమేమిటి? అన్పిస్తుంది. దీనికి కూడా కారణం సాధారణ దృష్టితో మాత్రమే చూడడం. లో–దృష్టి పెట్టాలనే ఆలోచన కూడా లేకుండా ఉండడమూనూ. అబ్భ్యః – పృధ్వి అలాంటి నీటి నుండి నేల పుట్టిందని దీనర్థం. ఎక్కడైనా నేల అనేది కణాలు కణాలుగా ఉంటే ఆ భూకణాలని తొలగించడానికి దూరంగా నెట్టివేయడానికీ నీటిని వాడతాం తప్ప నీటి నుండి భూమి ఎలా పుట్టే వీలుంది? అన్పిస్తుంది. దీనికి కూడా సమాధానం సాధారణ దృష్టితో ఆలోచించడమే తప్ప లో–దృష్టిని పెట్టకపోవడమే అనేదే. అంటే ఏమన్నమాట? నీటితో దీపాల్ని వెలిగించడం వంటి అనూహ్యమైన, ఎన్నడూ వీలుకాని సంఘటనలని విన్నట్లయితే, చూసినట్లయితే సాధారణ దృష్టితో కాకుండా లో–దృష్టితో పరిశీలించి తీరాల్సిందే అని దీని భావమన్నమాట! మరొక్క మాటని అనుకుని సమాధానాన్ని తెలుసుకుందాం! మన శరీరానికి నవ(9) రంధ్రాలున్నాయి. రంధ్రం అంటే కన్నం లేదా చిల్లు అని కదా అర్థం. మరి ఈ తొమ్మిదింటి నుంచి శరీరంలోకి మనం నీటిని పంపినా, అన్నాన్ని పంపినా, మరి దేన్ని తిన్నా వెంటనే అన్నీ కన్నాల నుండి లేదా ఏవో ఒకటో రెండో కన్నాల నుంచి బయటికొచ్చేయాలి కదా! అనుకుంటాడు సామాన్య దృష్టి మాత్రమే ఉన్నవాడు. సహజంగా పిల్లలు ఈ ప్రశ్నని చిన్నపిల్లలు అడిగే ఉన్నారు కదా! దాన్ని వివరించి చెప్తేగదా వాడు ఆ రోజున అర్థం చేసుకోగలిగాడు! ఇదే తీరుగా పంచభూతాల్నీ వివరించుకోకుండా (అసందర్భం అవుతుంది కాబట్టి) నీటిని గురించి మాత్రమే అనుకుందాం! నీరు అనేది ‘అగ్నేరాపః’ నిప్పునుంచి పుట్టిందే. అయితే ఈ నీరు నిప్పుని ఆర్పగల శక్తితో కన్పిస్తోంది. లౌకికంగా ముందు ఒక సమాధానాన్ని చూద్దాం! నీటిని బాగా వేడి చేశాం. వేడి నీళ్లు అయ్యాయి. మనం ముట్టుకుంటే మన శరీరభాగం కాలేంతటి నిప్పుదనం (ఉష్ణత) ఆ నీటికి పట్టుకుంది. అవును కదా! ఆ నిప్పుదనంతో నిండిన నీటిలోనికి నీళ్లని ఎక్కువగా పంపితే... పూర్తి ఉష్ణతని కోల్పోయి మళ్లీ చల్లబడిపోయి, వేడిమి చేయడానికి ముందు ఏ చల్లదనంతో ఉన్నాయో ఆ స్థితికే వచ్చేస్తాయి నీళ్లు. అంతే కదా! ఇప్పుడు నీళ్లు అనేవి ఎలా ఏర్పడ్డాయో ఈ ఉదాహరణతో గమనిద్దాం! నీళ్లు అనేవి రెండు వాయువుల కలయిక వల్ల ఏర్పడి వాయురూపాన్ని మార్చుకుని, ద్రవరూపాన్ని పొందాయి. వాయువులు రెండు కలిస్తే ఆ పదార్థం వాయువే కావలసి వస్తూంటే ఆ రెండు వాయువుల సమ్మేళనం ద్రవంగా (నీరు) కావడమేమిటి? ఇక్కడే ఉంది రహస్యం. పంచభూతాలు వేటికి అవిగా ఉన్నప్పుడు చెప్పుకోవలసిందంటూ ఏమీ ఉండదు. పృధ్వి(నేల)+అప్(నీరు) = ప్రవాహం అప్(నీరు)+ తేజస్(ఉష్ణత) = వేడి నీరు తేజస్(ఉష్ణత)+ వాయువు(గాలి) = వేడిగాలి(గాడుపు) వాయువు + ఆకాశం = శూన్యం (కన్పించని ఆకాశం) ఇదే తీరుగా ఉష్ణతని కలిగించే శక్తి ఉన్న వాయువు (ఆక్సిజన్) మరో ఉష్ణత ఏమాత్రం ఉండని వాయువుతో (హైడ్రోజన్) కలిసినట్లయితే ఆ రెంటి సంయోగం ‘నీరు’గా మారుతుంది. (ఏ2+ౖ2 ఏ2ౖ అని తీర్మానించారు విజ్ఞాన శాస్త్రజ్ఞులు). పైన చెప్పుకున్న ఉదాహరణలో వేడిగా ఉన్న నీళ్లలో చన్నీళ్లని అతిమాత్రంగా కలిపితే ఎలా ఆ వేన్నీళ్లు కాస్తా చల్లబడిపోతాయో, అలా ఈ ఉష్ణత కలిగిన గాలి(ఆక్సిజన్) అలాగే ఉష్ణతలేని గాలి(హైడ్రోజన్) అనే రెంటి సంయోగంలో తీవ్రమైన ఉష్ణతకల వాయువు (ౖ2 లేదా ఆక్సిజన్) అనేది మరింత స్థాయి కలిగినదైన పక్షంలో నీరుగా కన్పిస్తున్న ఈ పదార్థానికి మండించగల శక్తి మాత్రమే ఎక్కువ అయి, ఆ నీరు దేన్నైనా మండించగలిగిందిగా అయిపోతుంది. ఇది నిజం కాబట్టే సాయి ఎప్పుడైతే నీటిని తెచ్చాడో, ఆ నీటిలో మండించగల ఉష్ణతాశక్తిని తన యోగశక్తితో పెంపొందేలా (అభివృద్ధి అయ్యేలా) చేసాడో వెంటనే ఆ నీరు తనలోని చల్లదనాన్ని కోల్పోయి, తనలో ఉన్న రెండవదైన ఉష్ణతాశక్తి ఆధిక్యంతో ఉండిపోయింది. అంటే నిప్పుగా అయింది. గుడ్డతోనో, పత్తితోనో చేయబడిన వత్తికి ఉన్న నూనె అనేది మండే అవకాశాన్నిచ్చేది కాబట్టి, ఈ నీటిలో ఉన్న దహించే శక్తి ఆ వత్తికంటుకుని దీపంగా వెలగడం ప్రాంభించింది. అయితే ఇక్కడ ‘మరి సాయి గొప్పదనమేంముంది?’ అనుకోకూడదు. తన యోగశక్తి ద్వారా సాయి నీటిని రెండు వాయువులుగా విభజించేసి, రెండవదైన ఉదజని (హైడ్రోజన్) శక్తిని పూర్తిగా కోల్పోయేలా చేసి ప్రాణశక్తిని (ఆక్సిజన్) మరింత పెంపుచేసి ఉండడమే. ఇలాంటిదే మరో ఉదాహరణ. శ్రీమద్రామాయణంలో ఆంజనేయస్వామి తోకకి రావణుని సేనలైన రాక్షసులు నిప్పు పెట్టారు. రావణ ఆజ్ఞకి అనుగుణంగా ఆంజనేయస్వామి ఆ తోకకున్న నిప్పుతో మొత్తం లంకని తగులబెట్టాడని చెప్పింది ఆ ఇతిహాసం. అంతవరకూ బాగానే ఉంది. మరి నిప్పుకి కాల్చివేయడమనేది లక్షణం కాబట్టి, ఆ ఆంజనేయస్వామి తోకకి ఉన్న నిప్పు లంకాజనాన్ని మంటలకి గురి చేసి చంపినట్లే. ఆంజనేయస్వామి శరీర భాగాలకు కూడా వ్యాపించి ఎందుకు ఆంజనేయుడ్ని గాయపరచలేదనేది ప్రశ్న కదా! సాయి కథలో నీటి నుండి నిప్పు కన్పిస్తూంటే, ఆ నిప్పుద్వారా వత్తులన్నీ మండి వెలుగుతుంటే, ఇక్కడ నిప్పులోని నిప్పుదనం(ఉష్ణత) లేకుండా ఆంజనేయునికి చల్లదనం గోచరించడమేమిటి? ఇక్కడ కూడా లోతుగా ఆలోచిస్తే తప్ప సమాధానం దొరకదు. దొరికినా మరింత లోతుగా భావిస్తే తప్ప ఆ సమాధానం అర్థం కాదు. నీటికుండే లక్షణం చల్లదనం. (శీతస్పర్శవత్య ఆపః) అలాగే నిప్పుకుండే లక్షణం ఉష్ణత. (ఉష్ణస్పర్శవత్తేజః) నీటికుండే చల్లదనాన్ని వేడిగా మార్చి దీపాలని వెలిగేలా చేస్తే, సీతమ్మ తన మంత్రశక్తితో అగ్నికుండే ఉష్ణతని చల్లబరిచింది. రెంటికీ ఎంత సామ్యముందో గుర్తించగలగాలి. గుర్తుంచుకోగలగాలి కూడా! ఏ చల్లదనమనేది లేని పక్షంలో దాన్ని నీరు అనమో, ఏ ఉష్ణత లేని పక్షంలో దాన్ని అగ్ని అనమో, చల్లదనమనేది నీటితో కలిసి మాత్రమే ఉంటుందో అలాగే వేడితనమనేది నిప్పుతో కలిసి మాత్రమే ఉంటుందో అలా కలిసి ఉన్న రెంటిలో నుంచి ఒకదాన్ని వేరు చేయడమనేది మంత్రశక్తితోనే సాధ్యం! ఆ మంత్రశక్తి అనేది దేవతల్లో ఉంటే ఆ దేవతలని ప్రార్థించి ప్రార్థించి ఉన్న కారణంగా ఆ తపస్సు శక్తే వ్యక్తుల్లో యోగశక్తిగా మారుతుంది. ఆ యోగశక్తి ఉన్న వ్యక్తి యోగిగా మారుతాడు. తనకున్న ఆ యోగశక్తి కారణంగానే ఇలాంటి లోకాతీతమైన కొన్నింటిని చేయగలుగుతాడు. శంకరాచార్యులవారు రాసిన సౌందర్యలహరిలో ఓ శ్లోకం (మహీం మూలాధారే..)లో యోగశక్తి గురించి మరింత వివరంగా కన్పిస్తుంది. మూలాధార చక్రాన్ని బాగా ఉపాసించినట్లయితే భూమిలోపల దాగి ఉండగల శక్తిని సాధకుడు సంపాదించగలడట. కపిల మహర్షి అలాగే తపస్సు చేస్తూ ఉండిపోయాడు. సగరుని పుత్రులైన అరవై వేల మందిని భస్మం చేసింది ఆ యోగశక్తితోనే. అలాగే మణిపూరక చక్రాన్ని బాగా ఉపాసించినట్లయితే నీటిని గురించిన మహాశక్తిమంతుడవుతాడు. దాంతో నీళ్లలో దాగి ఉండగలుగుతాడు. దుర్వాసో మహర్షి అలాగే తపస్సు చేసి ఆ యోగశక్తితోనే అంబరీషుని మీదికి కృత్య అనే రాక్షసిని పంపగలిగాడు. ఇదే తీరుగా మిగిలిన ఐదు చక్రాలనీ కూడా ఉపాసించినట్లయితే.. ఆయా లోకాతీత శక్తులు లభిస్తాయి ఉపాసించినవారికి. సాయి ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్లు కన్పించినా నిరంతరమైన తన ఏకాగ్రతతో కూడిన ఉపాసన సాగిపోతూనే ఉంటూ ఉండేది. కాబట్టి అన్ని శక్తులు ఆయనకి లభించాయి. అంతటి శక్తిమంతుడు కాబట్టే కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, బాల, వితంతు... వంటి భేదాలు ఆయనకి లేనే లేవు. అంతే కాక ఉరుసు – శ్రీరామనవమి జెండా ఉత్సవం, చందనోత్సవం వంటి ఈ ఆ మతాలకి సంబంధించిన పండుగలన్నీ ఆయనకి ఒకటిగానే అన్పించాయి, కన్పించాయి. మనకి మనం, అలాగే మన పక్కనున్న మరో కొంతమంది మాత్రమే కన్పిస్తాం గానీ పర్వతమెక్కిన వారికి అందరం కన్పిస్తాం! దాన్నే సమదృష్టి, సరైన దృష్టి అంటారు. - డా. మైలవరపు శ్రీనివాసరావు -
విశేషాలు సమూహం వినాయక స్వరూపం
29న వినాయక చవితి పర్వం:‘దైవం గురించి సందేహంతో ఓ ప్రశ్నని వేయడమా?’ అనుకుంటూ లెంపలు వేసుకుని, ఆ సందేహాన్ని అలాగే లోపల నొక్కి ఉంచుకున్నంత కాలం మనకి ఆ దైవం గూర్చిన ఏ విశేషమూ అర్థం కాదు. సంప్రదాయం తెలియదు. మన దైవాల విశిష్టత ఎంతటిదో చెప్పే శక్తీ మనకి రాదు. కాబట్టి ఎన్ని సందేహాలొస్తే అన్ని సమాధానాలని పొందుతూ ఉంటే, అంతగానూ మనం ఆ దైవానికి దగ్గరవుతూ పూజని చేస్తున్నట్లే. ఈ నేపథ్యంలో కొన్ని సందేహాల్నీ సమాధానాల్నీ చూద్దాం! వినాయకుడి రూపం కనపడగానే, ‘శుక్లాం బరధరం విష్ణు’మ్మంటూ శ్లోకాన్ని చదివేసి, దణ్నం పెట్టేస్తాం కదా. నిజంగా ఈ శ్లోకం వినాయకునిదేనా?‘శుక్ల+అంబర+ధరమ్’ అంటే తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. వినాయకుడెప్పుడూ ఎర్రని వస్త్రాలే కడతాడు. మరి ఇదేమిటి శ్లోకం ఇలా అంటోంది? ‘విష్ణుమ్’ అనేది శ్లోకంలో కనిపించే రెండో మాట. దీన్నిబట్టే తెలుస్తోంది కదా! ఈ శ్లోకం విష్ణువుకి సంబంధించినదే అని! మరి వినాయకుని దగ్గరెందుకు చదవడం? ‘శశి వర్ణమ్’ అనేది శ్లోకంలోని మూడో పదం. శశి అంటే చంద్రుడు కాబట్టి ‘శశి వర్ణమ్’ అంటే చంద్రునితో సమానమైన శరీరచ్ఛాయతో ఉంటాడనేది అర్థం మరి. వినాయకుడు చంద్రునిలా తెల్లగా ఉండడు. ఆయన కు-జుడు (పృథివికి సంబంధించినవాడు) కాబట్టి, ఎరుపు రంగులో ఉంటాడు. ఇలా విష్ణువుకి సంబంధించిన శ్లోకాన్ని వినాయకుని దగ్గర చదువుతున్నాం కదాని, పోనీ విష్ణువుకి సంబంధించినదా! అనుకుంటూ ఆయన వైపు నుండి అర్థాన్ని చూస్తే? శుక్ల+అంబర+ధరమ్ - తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. శ్రీహరి పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరిస్తాడు కదా! (పీతాంబరః) మరి ఇదేమిటి? శశి వర్ణమ్ - తెల్లని శరీరచ్ఛాయ ఆయనకెక్కడిది? నీలమేఘశ్యాముడు కదా! ఇలా ఉండటమేమిటి? ఇలా ఆలోచన పరంపర సాగిపోతోంది. మరి ఎలా సందేహ నివృత్తి? శుక్ల+అంబర+ధరమ్ అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడు అని. (అంబర శబ్దానికి వస్త్రం అని మాత్రమే కాదు అర్థం) ఆ ఆకాశం నుండి కదా క్రమంగా ఒకదాని నుండి ఒకటి చొప్పున వాయువు, అగ్ని, నీరు, నేల, సస్యాలు (పంటలు) మనుష్యులనేవాళ్లు వచ్చారు. ఆ కారణంగా ఆకాశాన్ని ధరించాడంటే ఇంత జీవరాశికీ ఆధారభూతుడని అర్థం. ఇంతకీ ఈ వర్ణన.. విష్ణువు, వినాయకుడు.. ఈ ఇద్దరిలో ఎవరిదో చూద్దాం! శశి వర్ణమ్ - శశి అంటే చంద్రుడనేది నిజమే కానీ, ఆ అర్థమెలా వచ్చింది? శశ (కుందేలు) వర్ణం (లక్షణం) ఆయనకి ఉండటం బట్టి వచ్చింది. కుందేలుది ఏ లక్షణంట? నేలమీద ఓ క్షణం - గాలిలో (ఆకాశంలో) ఓ క్షణం ఉండటం. అంటే పూర్తిగా నడవనూ నడవదు. పూర్తిగా ఎగరనూ ఎగరదు. ఇలా ద్వంద్వ విధానం దానిది. ఆ లక్షణమే కదా చంద్రునిది! ఓసారి పూర్ణిమ, ఓసారి అమావాస్య. ఓసారి ఎదుగుతూ పోవడం, మరోసారి తరుగుతూ రావడం. అలాంటి చంద్ర లక్షణం కలవాడు విష్ణువులో, వినాయకుడిలో ఎవరో చూద్దాం. చతుః+భుజమ్ - చతుర్భుజమ్ - విష్ణువుకి నాలుగు చేతులు ఉండే మాట నిజమే. వినాయకుణ్ని కూడా అలా చూస్తాం కానీ, వినాయకునికి రెండు చేతులు కూడా ఉంటాయి. విష్ణువుకి మాత్రం అలా ఏనాడూ లేదు - ఉండదు. ఇక ప్రసన్న వదనమ్ - చూడగానే ప్రసన్నంగా కనిపించే ముఖం ఇద్దరికీ ఉండచ్చుగా. అయితే ఇందులో పేచీ లేదనుకోకూడదు. ముఖంలోని భావాలని మనుష్య ముఖమైతే గమనించగలం. మరి అదే గజ ముఖం నుండి ఎలా తెలుసుకోగలం! ఓ ఆవు నవ్వుతోందనీ, ఓ లేడి వెక్కిరిస్తోందనీ అర్థం చేసుకో వీలౌతుందా? కాబట్టి ఈ విశేషణం కూడా విష్ణువుకి సంబంధించినదే అనిపిస్తుంది. సర్వ విఘ్న ఉపశాంతయే - ఈ విఘ్నాలు తొలగించడం అనే మాటకొచ్చేసరికి, ఇది వినాయకుడిదే అనక తప్పదు. ఇంతకీ ఏదోలా తికమకగా ఉన్న ఈ శ్లోకం ఇద్దరిదీనా మరి? ఔను. ఈ శ్లోకం ఇద్దరిదీను. రహస్యమేమంటే శ్రీహరే కాలాన్ని రక్షించే కార్యాన్ని చేపట్టిన వేళ (సర్వాధారః కాలః - కాలః కలయతా మహమ్) వినాయకుడని పిలిపించుకుంటాడు. అంతే! ఇప్పుడు ఈ నేపథ్యంలో అర్థాన్ని చూద్దాం! కాలస్వరూపుడైన శ్రీహరి వినాయకునిగా మారిన వేళ అంటే సరైన అర్థమేమంటే - అన్నింటికీ ఆధారం ఏ ఆకాశమో ఆ ఆకాశాన్ని నిరంతరం తన అదుపులో పెట్టుకుని ఉన్నవాడు, శుద్ధ పక్ష కృష్ణ పక్షాలతో ఉంటూ ఎగుదల దిగుదల లక్షణాలు కలిగించేవాడు (జీవులకి ఆనందాన్నీ దుఃఖాలనీ కలిగిస్తూ ఉండేవాడు), ఒక చేయి రోజులకి ప్రతీకగా, మరో చేయి 15 రోజుల పక్షానికి (శుద్ధ + కృష్ణ) సంకేతంగా, మరో చేయి 2 పక్షాలు కలిసిన నెలలకి (చైత్రం, వైశాఖం...) ప్రతీకగా, మరో చేయి ఈ 12 నెలలకీ (ప్రభవ, విభవ....) ప్రతీకగాను కలిగి, మనకి కాలంలో ఏర్పడే అన్నిటికీ తానే కర్తగా ధర్తగా హర్తగా ఉన్నవాడు ఆయన. లక్ష్మీ గణపతి శ్రీహరీ వినాయకుడూ ఒకే రూపమే కాబట్టి ఉద్యోగ బాధ్యతలని బట్టి పేరు మాత్రమే భేదం కాబట్టి, గణపతికి ఎడమ తొడమీద లక్ష్మీదేవి కనిపిస్తుంది, లక్ష్మీ గణపతి రూపంలో. స్త్రీ ఎప్పుడూ తన పురుషుని ఎడమ తొడ మీదే కూర్చోవాలి. సంతానం మాత్రం కుడి తొడమీద కూర్చోవాలి! అందుకే అక్షరాభ్యాసాది సర్వ శుభకార్యాల్లోనూ కుడి తొడమీదే కూచోబెట్టుకుని, చేయవలసిన ప్రక్రియని ముగించాక, గురువుగారికి అందించి వారితో అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు శిశువుకి. ప్రయాగలో త్రివేణీ సంగమ స్థలంలో వేణీదానం (స్త్రీల శిరోజాల చివరి భాగాన్ని తుంచడం) చేసే సందర్భంలో స్త్రీని పురుషుని ఎడమ తొడ మీదే కూర్చోబెడతారు. ఇదంతా ఆ లక్ష్మీగణపతి విగ్రహం మనకి నేర్పిన సంప్రదాయమే. వి-ఘ్నం ‘వి - విశేషంగా ప్రారంభించబడిన పని, ఘ్న - మరింక ఏ తీరుగాను కూడ బాగుచేయ వీల్లేని రీతిలో ధ్వంసం కావడ’మని విఘ్నమనే పదానికర్థం. తిరిగి ప్రారంభించగల విధానమున్న పద్ధతిలో కలిగేది తాత్కాలిక విఘ్నం. దీనివల్ల కొంత మనో వైకల్యమున్నా పెద్ద ఇబ్బంది లేదు. అదే శాశ్వత విఘ్నమైతే చెప్పేదేముంది? పాల సముద్రాన్ని చిలికే వేళ మందరమనే పర్వతం సముద్రంలోకి దిగబడి, బురదలో కూరుకుపోవడం తాత్కాలిక విఘ్నం. దాన్నుండి ఉద్ధరించి విఘ్న నివారణాన్ని చేసింది (కూర్మావతారాన్నెత్తి) శ్రీహరే కదా! ఇక విశ్వామిత్రుడు త్రిశంకుడనే పేరున్న రాజుని బొందితో స్వర్గానికి పంపించదలచి చేయవలసిన ప్రయత్నాలన్నింటినీ చేసి, స్వర్గ మర్త్య మధ్యభాగంలో విడిచి వేయడమనేది శాశ్వత విఘ్నానికి కలిగిన ఫలితం. విఘ్నమనేది ఏ ఆహారాన్ని తినడం వల్లనో, ఏ ప్రదేశానికి వెళ్లడం వల్లనో వచ్చేది కాదు. కాలం గడుస్తూ ఉండగా కాలవశంగా వచ్చేది మాత్రమే. అందుకే శ్రీహరి తనని గురించి తాను భగవద్గీతలో - కాలః కలయతా మహమ్ - లెక్కింపబడే వాటిలో కాలాన్ని నేను (కాలో స్మి) అని స్పష్టంగా చెప్పుకున్నాడు. ఇక వినాయకుడూ శ్రీహరీ ఒక్క రూపమే అయిన కారణంగానే వినాయకుడు కొన్ని ప్రదేశాల్లో ఊర్ధ్వ పుండ్రధారిగా కనిపిస్తాడు. విష్వక్సేనుడు ఈయనే. ఈయన పరివారమంతా కూడా ఈ రూపంతోనే ఉంటారంటుంది శ్రీ విష్ణు సహస్రనామం. శ్రీహరి రక్షణ బాధ్యతని చేపట్టే దైవం కాబట్టే, ఆయన కాలస్వరూపాధి దేవతా రూపంగా - అంటే - వినాయకునిగా మారి మమ్మల్ని రక్షిస్తూ ఉండవలసిందని ప్రార్థిస్తూ పెట్టే విగ్రహమే మనకి వీధి శూల ఉన్న ఇళ్ల ముందు కనిపిస్తుంది. ‘ఓ కాలస్వరూప వినాయకుడా! శ్రీహరి రూపమా! కాల గతిలో రావలసిన విఘ్నాలు రాకుండా నీవున్న ఇంటిలోని జనుల్ని రక్షిస్తూ ఉండవలసిం’దని ప్రార్థించడం దీని భావం. అయితే వట్టిగా ఆ విగ్రహాన్ని వీధిశూల ఉన్న ఇంటికి పెట్టేయడం కాకుండా, ఆ విగ్రహానికి శక్తి వచ్చేందుకై రోజూ అష్టోత్తర నామార్చననైనా చేయించాల్సిందే తప్ప లేని పక్షంలో అక్కడ వినాయక విగ్రహం పెట్టినా మరో బొమ్మని పెట్టినా ప్రయోజనం ఒకటే. కాల స్వరూపం గజం. అంటే ఏనుగుది ఎలా మందబుద్ధి విధానమో, అలాంటిదే కాలానిది కూడ. అలా కానినాడు మనం జీవితంలో పొందిన దుఃఖాలని, అవమానాలని, కష్టాలని ఏనాడూ మరిచిపోలేం. కాలంలో ఉత్తరాయణం, దక్షిణాయనం ఉన్నట్లు, కాలస్వరూపమైన వినాయకుని తొండం కుడిగా ఎడమవైపుగా విగ్రహాల్లో రెండు తీరులుగాను ఉంటుంది. పంచాయతనం ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరుడు అనే ఈ ఐదుగురినీ నాలుగు దిక్కులా నలుగురినీ ఉంచి, మధ్యలో ఎవరిని ప్రధాన దైవంగా భావించాలనుకుంటున్నామో అలా ఆరాధించడం పంచ+ఆయతన విధానం (ఐదుగురికి స్థానాన్ని ఏర్పాటుచేసి, ఐదుగురూ ఒకచోట ఉండగా అందరినీ పూజించే తీరు) అన్నారు పెద్దలు. ప్రసిద్ధ అన్నవర క్షేత్రానికెళ్తే ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో సూర్యుడు, వాయవ్యంలో అంబిక, ఈశాన్యంలో మహేశ్వరుడు, ఈ అందరికీ మధ్యలో విష్ణువు. ఆ స్తంభం పైభాగంలో పై అంతస్థు మీద శ్రీ వీర వేంకట సత్యనారాయణమూర్తి, ఇటు శంకరుడు అటు అమ్మవారు ఉండగా దర్శనమిస్తారు. అక్కడ అన్నిటి మధ్యా విష్ణువున్న కారణంగా అది విష్ణు పంచాయతనమన్నమాట. ఈ పంచాయతన విధానాన్ని నేర్పింది మనకి శ్రీహరే. అందుకే భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో మహేశ్వరుణ్ని, మార్గశిరంలో శ్రీహరిని, పుష్యమాసంలో సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉండవలసిందని కాలచక్రంలో ఓ స్థిర నిర్ణయాన్ని చేసేశాడు. ఆ కారణంగా వినాయక చవితి పేరిట ఈ ఒక్కరోజునే గణపతి పూజని చేసేసుకుని ముగించుకోవడం కాకుండా, ఈ కాల పంచాయతనంలో మరో నలుగురు దైవాలు క్రమంగా నెలకొక్కరు రాబోతున్నారని గ్రహించి, వారిని కూడా ఆరాధించడాన్ని చేస్తే, అక్కడికి పంచాయతన పూజ ముగిసినట్లన్నమాట! ఆ కారణంగా ఈ చేయబోయే పంచాయతన పూజకి ఏ విఘ్నమూ కలగకుండా చేయవలసిందంటూను, బుద్ధికి అధిష్ఠాత వినాయకుడే కాబట్టే ఏ విఘ్నమూ లేకున్నా కూడా పూజచేసే బుద్ధిని ప్రసాదించవలసిందిగాను ప్రార్థిద్దాం! గం గణపతియే నమః! - డా॥మైలవరపు శ్రీనివాసరావు -
వివరం: అమ్మ పాఠం శక్తి పీఠం
ఏ పురుషుడైనా స్త్రీని తనకి ఎదురునిల్చి పోరాడేంత స్థాయికి తెచ్చుకొనేకూడదు. సర్దుకుపోతూ ఉండాలి. ఆ స్థాయి దాటితే స్త్రీని ఏ తీరుగానూ ఎంతమంది పురుషులైనా కట్టడి చేయలేరని గమనించుకోగలగాలి. ఏ ఇంట్లో ఉన్న తల్లి అయినా తన కూతురికి తలంటు పోస్తూ ఒళ్లు తుడుస్తూ జడవేస్తూ అన్నం పెడుతూ... అలా ఏమేమో ఏమేమో విశేషాలని చెప్పేస్తూ ఉంటుంది. ఆ చెప్పేవాటిలో కొన్ని తనవీ కొన్ని ఆయనవీ మరికొన్ని ఎలా ఉండాలో అవీ, ఎలా ఉండకూడదో అవీ... ఇలా వెళ్లిపోతూ ఉంటాయి. ఈ లక్షణం ఈ అమ్మకి ఎక్కణ్నించి వచ్చింది? వాళ్ల అమ్మ నుండి. ఆమెకి? వాళ్ల అమ్మ నుండి. ఆమెకో?... అలా అలా వెనక్కి వెళ్లిపోతే అదుగో 14 భువనాలనీ ఏలే అమ్మ నుండి ఈ చెప్పడం ప్రారంభమైంది. ఎందుకని? ఇంటిని రక్షించాల్సిన బాధ్యత ఆడపిల్లది కాబట్టే, ఈ బరువంతా ఆమె మీద పడింది. అందుకే ఆమె ఆలోచించింది - ప్రపంచమనే ఇంటిని రక్షించడానికి తనకి ఏవి అవసరమయ్యాయో ఆ గుణాలు తన వారసురాళ్లకీ అవసరమని. ఇంతకీ ఆడపిల్లకి ఏవి అవసరం? చదువు-ధనం-అన్యోన్య దాంపత్యం. ఇది అమ్మ తీర్పూ - ఆలోచనా కూడ. త్రి-మూర్తులూ+ త్రి-శక్తులూ అమ్మ బాగా ఆలోచించింది. మొదటగా ప్రధానమైనది ‘విద్య’ అని. అందుకే సరస్వతిని ఏర్పాటు చేసింది. మరి ఈ చదివిన చదువుని వ్యాప్తి చేసేందుకెవరో కావాలిగా. బ్రహ్మని రంగస్థలానికి తెచ్చింది. ఈ చదువూ ఆ వ్యాప్తీ చెరో దారికీ పోకూడదని భావించి, బ్రహ్మ నాలుక మీద సరస్వతి నుంచి (అంటే నిరంతరం చదువుతుండే లక్షణం) ఆ ఇద్దర్నీ విడదీయరాని జంటని చేసింది. (వాణీ హిరణ్య గర్భాభ్యాన్నమః అంటే ఇదే). విద్య తరువాత ఏది అవసరమని ఊహించింది. ‘ధనం’ అని తోచింది. ధనానికి అధిష్ఠాత్రిగా ‘లక్ష్మి’ని నిలిపింది. అయితే ఆ లక్ష్మిని రక్షించేందుకెవరో కావాలిగా! దాంతో శ్రీహరిని ఏర్పాటు చేసింది. ఆ చేయడంలో కూడా ఓ మెళకువ ఉంది. శ్రీలక్ష్మి అయిన ఆమె సర్వాభరణాలనీ ధరిస్తే, ఆమెని రక్షించే శ్రీహరి శేషశయ్య మీద పరుండి, ఆమె చేత పాదాలని ఒత్తించుకునేలా చేసింది. ఎందుకని? నిజమైన భర్త అయితే భార్య ధనాన్ని ఆశించకూడదనీ, ఆమె పాలన, పోషణలను భర్తగా (భరించేవాడు కదా!) తానే చేయవలసి ఉన్నాడనీ, ధనం చేత దాస్యం చేయించుకునేవాడు గొప్పవాడు కానీ, ధనానికి దాసుడైనవాడు గొప్పవాడు కానే కాడని తెలియజేయడానికే! ఇంతర్థం ఉంది కాబట్టే అమ్మ తనని తాను లలితాంబికగా వేషాన్ని వేసుకున్నవేళ సరస్వతిని కుడివైపున, లక్ష్మిని అప్రధానమని భావిస్తూ ఎడమవైపున నిలబెట్టి వింజామరల్ని వీయించుకునే ఏర్పాటు చేసుకుంది. (సచామర రమా వాణీ సవ్య దక్షిణ సేవితా). కేవలం విద్య, కేవలం ధనం లేదా విద్యా ధనాలు రెండూ ఉంటే చాలదని నిరూపిస్తూ అమ్మ, ఈ రెండింటితో పాటు స్త్రీకి తగిన అన్యోన్య దాంపత్యముండాలని సూచిస్తూ తాను శంకరునిలో తల నుండి పాదం వరకూ (ఆలోచన నుండి ఆచరణ వరకూ ఆయనతో సమానురాలిగా) సమభాగంగా నిలుస్తూ అర్ధ నారీశ్వర రూపాన్ని ధరించింది. పురుషులైన ఆ ముగ్గుర్నీ త్రి-మూర్తులని వ్యవహరిస్తే, స్త్రీలైన ఈ ముగ్గుర్నీ త్రి-శక్తులని పిలిచింది సంప్రదాయం. మూర్తులు శక్తుల్ని విడిచీ శక్తులు మూర్తుల్ని విడిచీ ఉండ(లే) రు కాబట్టి, త్రిశక్తి ఉత్సవం అంటే మూడు రెళ్లు ఆరుగురికి సాగుతున్న ఉత్సవం ఈ విజయదశమీ ఉత్సవమన్నమాట. పార్వతీ పరమేశ్వరులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు కాబట్టే కాళిదాస మహాకవి ఆ జంటని పలుకూ అర్థమూ (వాగర్థాలు) అన్నాడు. మనం కూడా ఉత్తమ దంపతులు కనిపిస్తే, సీతారాములు, రుక్మిణీ కృష్ణులనకుండా ‘పార్వతీ పరమేశ్వరుల’ని అనడానికి కారణం ఇదే. మూడు కొప్పులు... లోకంలో ఓ భయంకరమైన సామెత వ్యాప్తిలో ఉంది. మూడు కొప్పులు (స్త్రీలు) ఒకచోట చేరితే, ‘ఆ సంసారం ఇక ముక్క చెక్కలే’ అని. అయితే, ఈ త్రి-శక్తులూ ఒకచోట ఉంటూ ‘త్రిశక్తి పీఠమ’నే దేవాలయంలో కనిపిస్తూ మూడు కొప్పులుంటే ముక్క చెక్కలు కానే కావని, అలా అనడం సరికాదనీ, ఎక్కడైనా అలా కాబోతుంటే ఈ మూడు జంటల్నీ చూసి సంసారాన్ని సరిదిద్దుకోవాలనీ సూచిస్తుంటారు. లోకంలో ఈ అంతరార్థం తెలియనివారు, కొందరు కవులు, హరిదాసులు చమత్కారం కోసం లక్ష్మీ సరస్వతులకి, అలాగే శివ కేశవులకి, వారి కారణంగా గౌరీ లక్ష్మీ దేవతలకి ఏవేవో తగవులు వచ్చినట్లుగా కథల్ని, పద్యాల్ని అల్లేసి చెప్పేశారు. చెప్పేస్తుంటారు కూడా. వీళ్ల చమత్కార కుతూహలం ఎంతదాకా వెళ్లిపోయిందంటే, లోకంలో ఎక్కడా ఏ ముగ్గురు స్త్రీలూ కలిసి ఉండనే ఉండరన్నంత వరకూ. కాబట్టి స్త్రీకి కావలసిదేమని అమ్మ చెప్తోందంటే, తాను చదివిన చదువును గౌరవించే భర్త (బ్రహ్మ వంటివాడు), తన ధనాన్ని ఏనాడూ ఆశించక, తన సపర్యని ఇష్టపడే భర్త (విష్ణువు వంటివాడు), తన ఆలోచనని చేస్తూ ఆచరణ వరకూ కూడా తనని సంప్రదిస్తుండే భర్త (శంకరుని వంటివాడు) కావాలని. ఒక్క క్షణం ఈ రోజుల్లోని స్త్రీ తలపుల తలుపుల్ని కొట్టిచూస్తే, విద్య తద్వారా ధనం ఉంటే దాంపత్యం తనంతట తానే దారికి వచ్చితీరుతుందనే దృష్టి కనిపిస్తుంది. ఆకూ వక్కా సున్నమనే మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా, ఏ ఒక్కటి ఎక్కువైనా తాంబూలం నోటికి చేటును తెచ్చేటట్లు ఈ మూడింటిలో ఏది లేకున్నా, ఏది ఎక్కువైనా సంసారమనే నోరు పండదు. ఎండి కనిపిస్తుంది. సరిదిద్దుకోగలగాలి జీవిత తాంబూలాన్ని. అమ్మ పిల్లల్లో లోపం? అమ్మ అనుక్షణం తన పిల్లల్ని తడిమి తడిమి చూసుకుంటుంది. పిల్లలు దూరంగా ఉంటే అమ్మ కళ్లే కొలతని వేసే కొలబద్దలు. పిల్లలు మరెక్కడో కనిపించని దూరంలో ఉంటే వారి గురించిన ఆలోచనలే ఆమె ఊహల కొలబద్దలు. అందుకే ఆమె మరింత బాగా ఆలోచించింది - తన ఆడపిల్లల్లో ఏం తక్కువగా ఉందా అని. అర్థమైందామెకి - ‘ధైర్య సాహసాలే’-లేవని. అంతే! తల్లి తుమ్మెద ఎలా తన పిల్ల తుమ్మెదని ఓ పద్మంలో కూచోబెట్టి గిర్రున తిరుగుతూ తిరుగుతూ నాదం చేస్తూ ఆ నాదాన్ని తన తుమ్మెద పిల్లకొచ్చేలా చేస్తుందో, అలా అమ్మ కూడా ఈ పిల్లలందరికీ తన ధైర్య సాహసాలని చూపించాలని భావించి, తానొక యోధురాలిగా మారింది. ఒట్టిగా వేషాన్ని వేసుకుని కనిపిస్తే, తానాశించిన ప్రయోజనం ఉండబోదని భావించి, ప్రతి యోధునిగా ఎవరున్నారా అని గమనించి, భండాసురుణ్ని విశుక్ర విషంగ రక్త బీజ చండ ముండ కుంభ నికుంభ అతికాయ మహాకాయాది రాక్షసుల్ని మట్టుబెట్టాలని, ఆ దృశ్యాలని (తుమ్మెద తన పిల్లకి నేర్పినట్లుగా తానూ యుద్ధ దృశ్యాలని చూపించాలని భావించి) తన సంతానం చూడాలని నిశ్చయించుకుంది. చూస్తుండగానే అశ్వ బలాన్ని, రథ బలాన్ని, గజ బలాన్ని ,పదాతి దళాన్ని (చతురంగ బలాలు) ఏర్పాటు చేసుకుని వెళ్తుండటమే కాక, ఓ దండనాయిక (సేనాధిపత్ని)ని, మరో మంత్రిని, ఇంకా తపశ్శక్తి దాగిన స్త్రీ దేవతలని ముందుగా యుద్ధానికి పంపింది. ఈ యోధురాళ్ల ఉత్సాహంతో చతురంగ బలాలతో - అమ్మ ఆ శత్రువు మీదికి వెళ్తూనే యుద్ధ ప్రారంభంమై విజయాన్ని సాధించడంతో తన స్త్రీ సంతానానికంతటికీ స్త్రీశక్తి అర్థమైంది. లోకంలో ప్రతి స్త్రీ కూడా సహజంగా తల్లి లక్షణాలతోనే ఉంటుంది ఎక్కడైనా (మాతర మంగనాః). కాబట్టే ఏ పురుషుడైనా స్త్రీని తనకి ఎదురునిల్చి పోరాడేంత స్థాయికి తెచ్చుకొనేకూడదు. సర్దుకుపోతూ ఉండాలి. ఆ స్థాయి దాటితే స్త్రీని ఏ తీరుగానూ ఎంతమంది పురుషులైనా కట్టడి చేయలేరని గమనించుకోగలగాలి. ఇది అమ్మ తన సంతానానికి చేసిన ఉపదేశం - స్త్రీ జాతిలో కనిపించే స్వభావమున్నూ. తగిన గౌరవాన్ని ఇయ్యకుంటే... ‘మేం ఆడవాళ్లం. పురుషులు అలా ప్రవర్తిస్తే ఏం చేయగల’మంటూ చేతులు ముడుచుకు కూర్చోవద్దని చెప్తోంది అమ్మ. అమ్మ, మహాలావణ్య శేవధి కదా! దాంతో జులాయిగా తిరిగే శుంభ నిశుంభులు ఆమెని ఈ మాటతో ఆ మాటతో పొగుడుతూ పరిహాసమాడుతూ దగ్గరకొస్తూ కొప్పు పట్టుకోబోతూ మీది మీదికొస్తుంటే ముందుగా సూచించింది - మంచిది కాదని. స్త్రీలందరూ ఇలా కాక మరేమంటారన్నట్టుగా వెకిలి నవ్వు నవ్వి, మరింత దగ్గరికి రాబోతుంటే, భర్తకి చెప్తాను- జాగ్రత్త అంది. ఈమె ఏమీ చేయలేదని తేలిపోయింది కాబట్టే కదా భర్తకి చెప్తానంటోందని గ్రహించి, ఆ పాపిష్ఠులిద్దరూ ఆమె చేతిని పట్టుకోబోతే (ఈవ్ టీజింగ్ అనుకోవచ్చేమో) ఒక్క ఉదుటున వాళ్ల జుట్టు పట్టింది. గిరగిర తిప్పింది. పళ్లూడగొట్టింది. గదతో మోదింది. శూలాన్ని తీసింది. ఒక పోటు పొడిచింది. వ్యాఘ్రాన్ని పిలిచింది. మీదికి దూకవలసిందని ఆజ్ఞ చేసింది. మరో సందర్భంలో మీ ఇద్దరిలో సమర్థ యోధుడెవరో తేల్చుకుని రావలసిందంటూ చెప్పి, ఆ ఇద్దరిలో ఇద్దరికీ వైరుధ్యాన్ని (విరోధ భావం) కల్పించి, ఒకళ్లనొకళ్లు చంపుకునేలా తెలివితేటలతో కార్యాన్ని సాధించి, తన సంతానానికి కొత్త కొత్త పద్ధతులని (రాక్షస లక్షణాలున్న పురుషుల పట్ల ప్రవర్తించాల్సిన తీరు తెన్నుల్ని) చూపించింది. ఎంత మేధావిని అమ్మ! స్త్రీకి తగిన గౌరవాన్ని ఇయ్యకపోతే నోరు చేసుకోవడమే కాదు, చేయి చేసుకోవడం కూడా తెలిసుండాలని ప్రబోధించింది లక్షల సంవత్సరాల క్రితమే. అమ్మకి వ్యాఘ్ర/ సింహ వాహనాలున్నట్టుగా ప్రతి స్త్రీకి ప్రాథమికమైన ఓ సహకారం మాత్రం ఉండాలని బోధిస్తోంది అమ్మ. అది నేటి కాలానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలి ఎవరికి వారు. ఎంత శక్తి ఉన్నా భర్తకి భార్యే సహజంగా తన భర్త కంటే తనకి విద్యా శక్తి, ధన శక్తి బాగా ఉన్న సందర్భంలో ఏ స్త్రీ అయినా తన భర్తకి సహకరించకపోవడం మాటటుంచి, ఆయన్ని అథఃకరించడం (తక్కువ చేయడం, తక్కువ చేస్తూ పది మందిలో మాట్లాడటం వంటివి) చేస్తుంటుంది. ఇది కొందరిలో ఎక్కువ, మరికొందరిలో తక్కువ పాళ్లలో ఉండచ్చు గాని, లేకపోవడమంటూ ఉండదు. అయితే అమ్మ మాత్రం అయ్య కంటే ఎంతెంతో శక్తిమతి అయ్యుండి కూడా ఆయన్ని ఏనాడూ తక్కువ చేయదు సరికదా, ఆయన విషయంలో పరమ జాగ్రత్త వహిస్తూ కనిపిస్తుంది. తనకింకా వివాహం కాని దశలో శంకరునికి సపర్యని చేస్తూ, తన లావణ్యానికి శంకరుడు మోహపడి శృంగార దృష్టితో చూడగానే (నిజానికి దీనికి మన్మథుడు కారణం పూలబాణాన్ని వేయడం ద్వారా) శంకరుడు మన్మథుణ్ని మసి చేసి వెళ్లిపోయాడు. పార్వతి ఆ శంకరుని పనిని ప్రశంసించిందే తప్ప, తప్పుబట్టలేదు. పైగా తన రూపం అతి రమణీయంగా ఉండటాన్ని బట్టి కదా శంకర తపస్సు కాస్తా కూలిపోయిందని నిందించుకుంది కూడ! (నినింద రూపం హృదయేన పార్వతీ) తన రూపం కారణంగా దేవతలకి సహాయపడిన మన్మథుని భార్యకి భర్త లేనితనాన్ని తాను కల్పించానని బాధపడి, ఇటు శంకరుణ్ని ధిక్కరించినట్లూ అటు తాను మన్మథుణ్ని బతికించగల శక్తి ఉన్నదానినన్నట్లూ లోకం భావించకుండా - ఓ తుని తగవు చేసిందామె. మన్మథుడు శరీరంతో (సశరీరుడై) ఆ రతీదేవికి మాత్రమే కనిపించేలాగ, లోకంలోని అందరికీ శరీరం లేనివానిగా ఉండేలా చేస్తూ ఉభయ తారకంగా వ్యవహరించిన వ్యవహారదక్షురాలు ఆమె. కర్తవ్యమేమిటి? ఇంతటి స్త్రీ శక్తిని లోకానికి చాటుతూ ఉన్న అమ్మ పండుగ రోజున మన కర్తవ్యమేమిటని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రోజుకి ఇన్ని నివేదనలనుకుంటూ ఇల్లంతా ఓ వంటశాలగా మార్చేసుకోవడం కాకుండా, అమ్మ నామాలని ఎంతగా పారాయణం చేస్తే, అంతగా ఆనందపడే స్వభావమున్నది కాబట్టి (నామ పారాయణం ప్రీతా) ఈ పదిరోజుల్లోనూ లలితా సహస్ర నామాలని రోజుకి ఎన్ని మార్లు చదివినా సరే, మొత్తమ్మీద 108 పర్యాయాలు పారాయణమయ్యేలా చేసుకోగలిగితే ముగ్గురమ్మల శక్తి స్త్రీలో ప్రవేశించి, ఆ కష్టానికి తగ్గ ఆలోచ, సమస్యని పరిష్కరించుకోగల ఉపాయం నిశ్చయంగా తట్టి తీరుతుంది ప్రతి స్త్రీకి. అయినా ‘ఇంత గొప్పది అమ్మ! అంత గొప్ప అమ్మ’ అని ఉండే ఈ నామాల్లో గొప్పదనమేముందని కొందరు ఈ నామాలలో భావం తెలియనివాళ్లు, పాపం వారి అజ్ఞాన దశాస్థాయి మేరకు వాపోతూ ఉంటారు. అమ్మ గొప్పదనాలని గుదిగుచ్చిన వశిని మొదలైన స్త్రీలు ఒక ప్రయోజనాన్నే ఆశించి, ఏర్చి కూర్చి అందించారు మనకి ఈ నామాలని. ఏమిటా ప్రయోజనం? అమ్మ ఎంత గొప్ప పనుల్ని ఓ స్త్రీ అయ్యుండి కూడా సాధించిందో సాధించగలిగిందో గ్రహించగలిగితే, ఆ స్త్రీ శక్తి ఉన్న నీక్కూడా ఆ ధైర్య సాహసాలు నిరంతరం మననం వల్ల కలిగి తీరుతాయని చెప్పడమే మనకి కలిగే ప్రయోజనం. నిజంగా అమ్మ నామాలని పారాయణం చేస్తుండే భక్తురాలే అయ్యుంటే ‘అమ్మా! నాన్నా! ఈ జన్మకి నన్ను క్షమించండి! మరో జన్మలోనూ మీకే కూతురిగా పుట్టి...’ అంటూ దీనాతి దీనంగా ఉత్తరం రాసి తనువు చాలించే పిరికితనం ఏ స్త్రీకీ రానే రాదు. భర్త ప్రాణాల కోసం యముని వెంట వెళ్లి సాధించుకున్న సావిత్రి, తన జుట్టుపట్టుకులాగిన దుశ్శాసనుని వంకతో కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చేసిన ద్రౌపది, తననెత్తుకుపోగా లంకా రాజ్యాన్ని నామమాత్రం చేసిన సీత... ఇందరూ స్త్రీలే. అమ్మ చెప్తున్నదీ ఇదే. ధర్మబద్ధంగా స్త్రీ ఓ గెలుపుని సాధిస్తే ఆ దశమి ‘విజయదశమి’ అవుతుందని! - డా॥మైలవరపు శ్రీనివాసరావు