బాబాకు భోజనం పెడదామా! | Sai baba story from mylavarapu srinivasa rao | Sakshi
Sakshi News home page

బాబాకు భోజనం పెడదామా!

Published Sun, Sep 16 2018 12:47 AM | Last Updated on Sun, Sep 16 2018 12:47 AM

Sai baba story from mylavarapu srinivasa rao - Sakshi

సాయి గొప్పదనాన్ని వినడమే కాదు... ప్రత్యక్షంగా కూడా ఎన్నో నిదర్శనాలతో సహా చూసిన తాత్యా (తాత్యా పటేల్‌) దంపతులు ఎప్పుడు తమకు కొంత ఖాళీ దొరికినా వెంటనే షిర్డీ గ్రామానికి వచ్చేస్తుండేవారు. ’సర్వస్య శరణా గతిః’ అన్నట్లు సాయి దగ్గరే ఉంటూ ఆయన ఏం చేస్తే దాన్ని చేయడం.. ఆయన దేన్ని వద్దంటే ఆ పని తమ మనసుకి ఇష్టమైనదైనా సరే మానేయడం.. ఇలా సాయికి నీడలాగ ఉంటూ ఉండేవారు. కొందరికి అనిపిస్తుండేది.. ‘ఇక వీళ్లకు ఇట్లా పనీ పాటా, గొడ్డు గోదా, ఉద్యోగం సద్యోగమంటూ ఏమీ లేదా?’ అని.. తత్యా దంపతులు ఒకేమాట అంటుండేవారు. మాకు ఇళ్లు లేకా కాదు.. పని పాటా ఉండక కాదు.. అన్నీ ఉన్నాయి కానీ ప్రతిపనిలోనూ.. ప్రారంభంలోనూ.. మధ్యలోనూ..ముంపులోనూ ఒక అశాంతి ఉంటుంది. లేదా అసంతృప్తి కలుగుతుంది, కలిగే వీలు ఉంటుంది. అయితే సాయి సన్నిధిలో ఆ అసంతృప్తి, నిరాశ, అశాంతి అనేవి మచ్చుకి కూడా ఉండవు. తల్లి దగ్గర ఉన్న దూడకు మరో ఆలోచన ఎలా ఉంటుందో.. గూటిలో అమ్మతో ఉన్న పక్షి పిల్లకి ఆకాశంలో ఎగురుదామనే ఊహ ఉన్నా ఎలా ఇష్టం పుట్టదో అలా ఇంత విశాల ప్రదేశం మాకంటూ తిరగడానికి ఉన్నా శరీరంలో ఓపిక ఉన్నా.. ఖర్చు చేసుకుని తిరిగే ఆర్థిక శక్తి ఉన్నా ఇక్కడ ఉంటే ఆ ఆనందం ఎక్కడా మరెక్కడా ఉండదు. లేదంతే. ఇక మాకు కాశీ, ఇదే మాకు ప్రయాగ, ఇదే మాకు ద్వారకా, మీరు ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటున్నారో అవన్నీ మాకు మాకోసం షిర్డీకే వచ్చేశాయి.

అందుకే మేము రోజుకో పుణ్య క్షేత్రానికి వచ్చిన ఆనందంతో సాయిసన్నిధిలో గడుపుతూ ఉంటామని స్పష్టమైన అవగాహనతో, విశ్వాసంతో చెబుతూ ఉండేవారు. అంతటి శరణా గతి ధర్మం ఉన్నవాళ్లు ఆ దంపతులు. ఇలా ఉంటే ఒక రోజున తాత్యా భార్య సాయి దగ్గరకు వచ్చి మౌనంగా నిలబడి చూపులతో ఆయన్నేదో ప్రార్థించినట్లుగా చూసింది. సాయి ఆమెను చూస్తూ ‘‘సందేహించకు..! అడిగేది ఏదో అడుగు.. ఆలోచనను లోలోపల దాచేసుకోవడం పిరికితనానికి చిహ్నం. తప్పు పని గురించి అడుగుతున్నామేమో అనే భయానికి సాక్ష్యం అడుగు’’ అన్నాడు. వెంటనే చెప్పలేనంత ఉత్సాహంతో ఆమె సాయికి సాగిలపడి లేచి ఆయన మొఖంలోకి చూస్తూ.. ‘దేవా ! ప్రతి రోజూ నేను విందును తీసుకొస్తే ఆరగిస్తున్నావు కదా.. ఈ దీనురాలి ప్రార్థన మన్నించి ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఎందుకు ఆరగించకుడదూ..?  నీకు ఏమేమి పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాలు నాకు తెలుసు.. వండే అవకాశం నాకు ఉంది. దయచేసి రావూ?’ అని అడిగి ఆయన ఏమంటాడో అని అలా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆయన సమాధానం ఇవ్వకుండానే.. ‘సాయి! మా ఇల్లు ఇక్కడకు చాలా దగ్గర. పైగా సమయం పాటించే లక్షణం కూడా మా దంపతులది.

నిన్ను రప్పించి నువ్వొచ్చాక నేను ఆలస్యం చేయను నీ భోజనానికి దయచేసి రావూ !’ అంది. సాయి నవ్వుతూ ‘అమ్మా..! భిక్షం కోసమని అన్ని వీధులు తిరిగే నాకు దగ్గర దూరం అనేది ఓ లెక్కా? ఇక బిడ్డకు అన్నం పెడతానని తల్లిలా నువ్వు అంటుంటే ఎందుకు రానూ.. పిలవడమే ఓ అదృష్టంగా భావించి వచ్చి తీరుతాను.. నువ్వన్నావే సమయ నియమాన్ని పాటిస్తున్నానని.. దానికి సరిపోయేలా 5 కొట్టేసరికల్లా మీ ఇంటికి వస్తాను. భిక్షగాడైన నాకు మీ ఇంటి చిరునామాను, దూరాన్ని వివరించి చెప్పాలి కూడానా..? నాకు పోళీలు (మహారాష్ట్ర వంటకం) బాగా ఇష్టమని తెలిసిందంటున్నావే..! తల్లికి కదామ్మా బిడ్డకు ఇష్టమేదో తెలుస్తుంది. సరే రమ్మంటున్నావుగా వస్తాను అన్నాడు. అంతే ! ఆమె ఉరుకులాంటి నడకతో ఇంటికి వెళ్లి వంటింటిని ఒకటికి రెండు మార్లు శుభ్రం చేసి ఏ ఒక్కరిని కూడా సహాయానికి పిలవకుండా అంతా తానే చేసి సాయికి వడ్డించాలనే ఆనందంతో మొత్తానికి పోళీలని చక్కగా చేసింది. మంచి వెండిపళ్లెంలో చక్కగా సర్ది మరీ పెట్టింది.

ఇటు వంటకాన్ని చేస్తుండడం అటు గడియారాన్ని చూస్తూండడం.. ఇలా మొత్తానికి 5 గంటల ముందే అంటే 4 గంటలకే సిద్ధం చేసి సాయి రాకకోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే కూచుంది ఈ వీధిలోకి కళ్లని ప్రసరింపజేస్తూ. వంటింటి ముందున్న గదిలో అగరువత్తుల ధూపాన్ని బాగా వేసి మరీ ఆమె ఎదురు చూస్తూ ఉండిపోయింది.సమయం 4 దాటింది. నాలుగున్నర అయింది. సాయికి ముగ్గులు బాగా ఇష్టం కదా! అని ఆ వడ్డించబోయే గదిలో ముగ్గులు వేయడం ప్రారంభమయింది అటు 5 గంటలనే మాట గుర్తుంచుకుని. ఈ పనిధ్యాసలో ఈమె ఉండగా ఎక్కడినుండో ఓ నల్లకుక్క గబగబా ఇంట్లోకి దూరి ఆ పోళీలని తినడం కోసం నోరు తెరిచి పళ్లెం దగ్గరకి వెళ్లింది. వెంటనే అపరిమిత కోపం వచ్చిన ఆమె– పాడుకుక్కా! సాయికోసం నైవేద్యంగా పెడితే నువ్వెక్కడ దాపురించావంటూ దగ్గర్లో కర్ర కనపడబోతే చిన్న ఇనుప కడ్డీని దాని మీదికి విసిరింది. అది దానికి తగిలి బాధతో అరుచుకుంటూ వెళ్లిపోయింది. సమయం ఆరు ఆరున్నర ఏడు కూడా అయింది. ఎంతో నిరాశతో ఆమె సాయి మందిరానికి ఈ పోళీలున్న పళ్లాన్నే పట్టుకుని వెళ్లింది.

సాయి అప్పటికి తన భక్తులూ శిష్యులైన వాళ్లందరి మధ్యా కూర్చుని ఈమెని ఉద్దేశిస్తూ– ‘చూశారా! ఈమెకెంత కోపం వచ్చిందో! నన్ను విందుకి పిలిచింది తన ఇంటికి. నేను వస్తానని కూడా అన్నాను. తీరా నేను కచ్చితంగా ఆమెతో అన్నట్టుగానే ఆమె కూడా ఒప్పుకున్నట్టుగానే 5కే వెళ్లాను ఆమె ఇంటికి. మంచి ముగ్గులు వేసింది. అగరు ధూపం వేసింది. ఇదుగో! ఈ వెండిపళ్లెంలోనే పోళీలని చూడముచ్చటగా కూడా సర్ది ఉంచింది.అయితే ఏం లాభం? నేను తినబోయేసరికి ఓ ఇనుప కమ్మీని నా మీదికి విసిరింది. భయంతో అరుచుకుంటూ  పారిపోయి వచ్చానని ఆమె వంక చూస్తూ ముగించాడు. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. మహల్సాపతితో పాటు అక్కడున్న భక్తులందరికి ముందు ఏమీ అర్థం కాకపోయినప్పటికీ ఆమె వివరించిన విషయం తెలిసి అందరూ నివ్వెరపోయారు. ఆమె మళ్లీ సాయిని ప్రార్థిస్తూ.. ‘సాయి దేవా..! జరిగిందేదో జరిగిపోయింది నాదే తప్పు. పొరపాటైంది మన్నించు. ఇన్నినాళ్ల నుంచి నిన్ను సేవిస్తున్నా నీ తత్వం తెలియని అజ్ఞానిని. మన్నించు. రేపు సాయంత్రం ఇదే సమయానికి మాల్‌ పూరీలను పానకంలో ముంచి సిద్ధం చేసి ఉంచుతాను. నీ కోసం ఎదురుచూస్తుంటున్నానని దీనాతిదీనంగా పలికింది.

సాయి అన్నాడు.. ‘‘తల్లీ ! అంత దీనంగా వేడుకోవాల్సిన అవసరం లేదు. నేను తప్పక వస్తాను. విందు ఆరగిస్తాను. సరేనా’’ అన్నాడు. అంతే! ఆమె కిందటి రోజులాగే.. అంతా సిద్ధం చేసుకుని కూర్చుంది. మాల్‌ పూరీలను పానకంలో ముంచి ఉంచేసరికి ఆ చక్కని సువాసన ఆ వీధి వెంట వెళుతుంటే అందరి ముక్కుపుటాలకు తాకనారంభించింది. ఏదో విశేషముందని అందరూ లోపలికి రాబోతుంటే ఆమెకు ఒక పక్కసాయేనేమో అని భయం. మరోపక్క ఇతడు.. వాడు నాకు తెలిసిన వాడే కదా అని ఊరటా.. ఇంతలో ఏ కుక్క వస్తోందని ఆత్రుత. కుక్క వచ్చినా సాయిలానే భావిద్దామని ఉత్సాహం. కొన్ని కుక్కకు పెట్టి మరికొన్ని సాయికి పెడదామనే ఆలోచన. ఒకటేమిటి వేలవేల ఊహలు.. ఆపోహలు ఆమెకు మనసులో అలా తాండవించ సాగాయి. అటు వీధిని.. ఇటు ఇంటిని మరోవైపు వచ్చి పోతూ వినోదంగా చూస్తుండే మనుషులను చూస్తుంటే ఎక్కడ నుంచో ఒక పెద్ద దున్నపోతులా ఉన్నటు వంటి శరీరంతో కనిపిస్తున్న గవిడిగేదె తన ముందు కాళ్ల రెంటిని లోపలి గదిలోనికి పెట్టి ఆనందంతో అంబా అని అరుస్తూ లోపలికి పోబోయింది. చెప్పలేని కోపంతో కర్రతో బలంగా కొట్టి పంపేసింది ఆమె. అంతకుముందు తను ఎప్పుడూ చూడని.. ఎన్నడూ రాని కుక్క వచ్చింది కాబట్టి ‘సాయి’ అని గుర్తించలేకపోయాను గాని, ఈ గేదెని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను కాబట్టి ఇది సాయి రూపం కానేకాదనుకుని తనకు తాను సమాధానపడిందామె. అనుకున్నట్టుగా 5 దాటింది. ఐదున్నర ఆరుకూడా అయ్యింది.

ఆరు దాటింది. మళ్లీ నిన్నటి లాగానే తీవ్ర నిరుత్సాహంతో ఆ వంటకాన్ని తీసుకుని సాయి తన భక్తులకి ఏదో అధ్యాత్మిక విశేషాలను వివరిస్తున్న ఆ మందిరానికి వెళ్లి సాయికి నమస్కరించబోయింది. వెంటనే సాయి తన భక్తులందరితో ‘ఈ అమ్మ పిలిచింది కదా ఈ బిడ్డని’ అనే అభిప్రాయంతో ఆమె ఇంటికి సకాలంలో వెళ్లి ఎప్పుడు తిందామా? అనే ఆకలి కడుపుతో పోతే వెంటనే బలంగా కర్ర తీసుకుని మోదింది. చూడండి బలంగా ఎంత దెబ్బ నాకు తగిలిందో! ఇదేదో ఆమె ఇష్టంగా పిలిస్తే నేను నిందని ఆమె మీద వేస్తున్నానేమిటని భావించకండి అంటూ తన కఫ్నీ (పెద్ద పొడుగాటి చొక్కా) పైకెత్తాడు. బలంగా కర్రతో కొట్టిన వాత అందరికీ కనిపించింది. తాత్యా భార్యకి మాట రాలేదు. రెండుసార్లు అపచారం చే శాననే మనోబాధ పెల్లుబికింది. నిన్నయితే ఇనుపకమ్మీని విసిరిందే గాని కుక్క తప్పించుకుంది. ఈ రోజున ఆ గేదెకి తగలనే తగిలింది. అది కాస్తా సాయి శరీరానికే తగిలిందని బాధపడుతూ అనేక పర్యాయాలు క్షమించవలసిందంటూ సాయిని ప్రార్ధించింది. ‘అమ్మా! నేను ఈ భౌతిక శరీరంలో వస్తేనే కాని వచ్చినట్టుగా భావించకు.. అన్ని రూపాల్లోనూ సాయి ఉన్నట్టుగా భావించి ఏది ఆ సమయానికి నీకు కనబడినా నాకు పెట్టినట్టుగానే భావించు. నేను కోరుకునేది కూడా భూతదయ ఉండాలనే.

జీవించి ఉన్న ప్రతి ప్రాణినీ భూతమంటారు కదా! నేనూ ప్రాణినే. నువ్వూ ప్రాణివే. ఇక్కడ అందరూ కూడా ప్రాణం ఉన్నవాళ్లు కాబట్టి అందరూ కూడా భూతాలే. గుర్తుంచుకో! అన్నాడు సాయి. ఆమె కన్నీరు కారుస్తూ దీనాతిదీనంగా నిలబడితే ఆమె లోపలి భావాన్ని గ్రహించిన సాయి.. తల్లీ! ఇదిగో ఊదీ (విభూతి) నిచ్చాను తీసుకో! సాయంత్రం 5 కే వస్తాను. చక్కని పేణీలనే సిద్ధంగా ఉంచు! అవే నాకు ఇష్టం కదా! అన్నాడు. పరుగు లాంటి నడకతో ఆమె ఇల్లు చేరి మధ్యాహ్నం 2 గంటలకే పేణీలని సిద్ధం చేసి ఇక 5 గంటలకి ఏ కుక్క వచ్చినా గేదె వచ్చినా ఆవు వచ్చినా.. ఇక ఏది వచ్చినా దాన్నే సాయిరూపంగా భావించాలనే అభిప్రాయంతో దృఢంగా నిశ్చయబుద్ధితో ఉండిపోయి ఎదురుచూడ సాగింది. సాయి వచ్చే మార్గమంటూ తమయింటిని ఒకటే ఉండటం వల్ల ఆమెకి అటూ ఇటూ చూడాల్సిన అవసరం తప్పింది. తగిన విధంగా గది తలుపులు దగ్గరకి వేసి సాయి రావలసిన తోవనే చూస్తూ ఉండిపోయింది. ఎందుకు సమయాన్ని వ్యర్ధపరచాలనుకుంటూ సాయి సంకీర్తనాన్ని శ్రావ్యంగా తాను పాడుతుంటే ఆ సమీపంలో ఉన్న గృహిణులు కూడ గొంతు కలిపారు. మొత్తానికి ఆ ఇల్లు వాయిద్యధ్వనితో నిండిన ఓ సంగీతవేదికలా అన్పించింది అందరికీ. ఆమెకి నిన్న రాత్రి నిద్రపట్టలేదు. దానిక్కారణం సాయిని కర్రతో కొట్టాననే తీవ్ర మనోవేదన. పైగా ఇంటికి పిలిచి కొట్టానుకదా! అనే దుఃఖం. మళ్లీ అంతలోనే ‘నాకు సాయియే అనే భావం ఉంటే అలా చేసి ఉండేదాన్ని కాదు గదా!’ అనే దోషంలేని ఊహ.

ఇలా ఊహా అపోహా నేరమూ శిక్షా.. ఈ తీరు భావనలతో ఉండిపోయింది. 5 అయింది. అయిదున్నర అయింది. సాయి జాడలేదు. దిక్కుతోచని ఆమె ఆ పేణీలని పెట్టిన పళ్లాన్ని తీసుకుని సాయి ఉన్న మసీదు వద్దకి వెళ్దామని లోనికి వచ్చి చూసి వాటికి పట్టిన గండు చీమల్ని దులిపి మసీదులో సాయి వద్దకి వెళ్లి నమస్కరిద్దామనుకుని ఆయన్నే ప్రార్ధించి రప్పించాల్సిందే! అనుకుంటూ ఆయనకి మొక్కింది. సాయి ఆమెని చూస్తూనే.. అమ్మా! పేణీలు ఎంత రుచిగా ఉన్నాయమ్మా.. చాలా చక్కగా చేశావు నాకోసం! ఇంత ప్రేమతో నాకు ఆ వంటకాన్ని నువ్వు పెట్టావుగా! కడుపు మొత్తం నిండిపోయింది. నాకెంతో ఇష్టమైన తీపిని సమపాళ్లలో పెట్టి మరీ సిద్ధం చేశావు. ఇక ఇలా నాకు తీపి పదార్ధాలని సిద్ధం చేస్తూ అస్తమానం పిలుస్తూ ఉంటే నా ఆరోగ్యం కూడా చెడిపోతుంది! చాలునమ్మా.. అంటూ పూర్ణిమచంద్రుని లాంటి నవ్వుని నవ్వాడు సాయి. ఆమెకేమీ పాలు పోలేదు. ‘వంటకమంతా ఇంట్లో ఉంటే ఆయనెప్పుడు తిన్నాడు?’ అనేది ఆమె చింత–అనుమానం.

ఆ స్థితిని గమనించిన సాయి ఆమెని చూస్తూ.. ‘అదేమిటమ్మా! తీపిని సిద్ధం చేసింది నువ్వేకదా! ఆ వెనుక గదిలో కిటికీ పక్కన ఉంచింది నువ్వే కదా! రంగురంగుల ముగ్గులతో నిండిన గదిని దాటి అగరువత్తుల వాసనలతో గది మొత్తాన్ని నింపి నాకోసం కొత్త పళ్లెంలో కొత్త ఆకుల మీద పేణీలని పెట్టిందీ నువ్వే కదా! తినలేదని ఎందుకంటావు? ఎన్ని చీమలు సుఖంగా తిన్నాయి! వాటిని చూడగానే రుచికి ఆశపడ్డ నోరు నీకు కన్పించాలనే ఆలోచనని కూడా వేయలేదు. అందుకే అలా తినేసా’నన్నాడు. ఆమె నివ్వెరపోతుంటే.. సాయి అన్నాడు– ‘‘అమ్మా.. భగవంతుడు 84 లక్షల జీవరాసుల్ని  సృష్టి చేశాడు. తెలుసా నీకు? ఓ తండ్రి తన ఇంట్లో తానొక్కడే ఎప్పుడూ భోజనం చేసి నిద్రపోడు. తమ సంతానం భోజనం చేసిందా? అని గమనించి వాళ్లు తింటూంటే తాను ఆకలితో ఉన్నా  తృప్తిగా చూపులతో భోజనాన్ని ముగించి ఆ మీదట భౌతికంగా తాను తింటాడు నోటితో. తల్లివి నీవు! బిడ్డల ఆకలి నీకు తెలిసినట్టుగా నాకెలా తెలుస్తుంది? ‘‘తల్లీ.. ! నీ విందుకి చాలా ఆనందమమ్మా! ఎప్పుడు నాకు భోజనాన్ని పెట్టాలని నీకు అన్పించినా ఏదో ఒక ప్రాణిని పిలిచి లేదా తనంతటి తానే వస్తే దానికి పెట్టు. పెట్టేటప్పుడు నా పేరుని ఒక్కమారు అనుకో! అంతే!! అది నన్నే చేరుతుంది విందూ లేదా నైవేద్యం రూపంగా! సంతోషమమ్మా’’ అని ముగించాడు సాయి. ఆమె తన్మయత్వంతో అలా ఆనందబాష్పాలని విడుస్తూనే ఉండిపోయింది. నేను వేదాలని చదివిన వాడిని. మసీదుకొస్తే మైలబడతా! అని పలికిన పండితుని కథ ఏమిటోచూద్దాం!      – సశేషం

- డా. మైలవరపు శ్రీనివాసరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement