వివరం: అమ్మ పాఠం శక్తి పీఠం | Power of Goddess Durga Mata | Sakshi
Sakshi News home page

వివరం: అమ్మ పాఠం శక్తి పీఠం

Published Sun, Oct 13 2013 2:59 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM

వివరం:  అమ్మ పాఠం శక్తి పీఠం - Sakshi

వివరం: అమ్మ పాఠం శక్తి పీఠం

ఏ పురుషుడైనా స్త్రీని తనకి ఎదురునిల్చి పోరాడేంత స్థాయికి తెచ్చుకొనేకూడదు. సర్దుకుపోతూ ఉండాలి. ఆ స్థాయి దాటితే స్త్రీని ఏ తీరుగానూ ఎంతమంది పురుషులైనా కట్టడి చేయలేరని గమనించుకోగలగాలి.
 
 ఏ ఇంట్లో ఉన్న తల్లి అయినా తన కూతురికి తలంటు పోస్తూ ఒళ్లు తుడుస్తూ జడవేస్తూ అన్నం పెడుతూ... అలా ఏమేమో ఏమేమో విశేషాలని చెప్పేస్తూ ఉంటుంది. ఆ చెప్పేవాటిలో కొన్ని తనవీ కొన్ని ఆయనవీ మరికొన్ని ఎలా ఉండాలో అవీ, ఎలా ఉండకూడదో అవీ... ఇలా వెళ్లిపోతూ ఉంటాయి. ఈ లక్షణం ఈ అమ్మకి ఎక్కణ్నించి వచ్చింది? వాళ్ల అమ్మ నుండి. ఆమెకి? వాళ్ల అమ్మ నుండి. ఆమెకో?... అలా అలా వెనక్కి వెళ్లిపోతే అదుగో 14 భువనాలనీ ఏలే అమ్మ నుండి ఈ చెప్పడం ప్రారంభమైంది. ఎందుకని? ఇంటిని రక్షించాల్సిన బాధ్యత ఆడపిల్లది కాబట్టే, ఈ బరువంతా ఆమె మీద పడింది. అందుకే ఆమె ఆలోచించింది - ప్రపంచమనే ఇంటిని రక్షించడానికి తనకి ఏవి అవసరమయ్యాయో ఆ గుణాలు తన వారసురాళ్లకీ అవసరమని. ఇంతకీ ఆడపిల్లకి ఏవి అవసరం? చదువు-ధనం-అన్యోన్య దాంపత్యం. ఇది అమ్మ తీర్పూ - ఆలోచనా కూడ.
 
 త్రి-మూర్తులూ+ త్రి-శక్తులూ అమ్మ బాగా ఆలోచించింది. మొదటగా ప్రధానమైనది ‘విద్య’ అని. అందుకే సరస్వతిని ఏర్పాటు చేసింది. మరి ఈ చదివిన చదువుని వ్యాప్తి చేసేందుకెవరో కావాలిగా. బ్రహ్మని రంగస్థలానికి తెచ్చింది. ఈ చదువూ ఆ వ్యాప్తీ చెరో దారికీ పోకూడదని భావించి, బ్రహ్మ నాలుక మీద సరస్వతి నుంచి (అంటే నిరంతరం చదువుతుండే లక్షణం) ఆ ఇద్దర్నీ విడదీయరాని జంటని చేసింది. (వాణీ హిరణ్య గర్భాభ్యాన్నమః అంటే ఇదే).
 
 విద్య తరువాత ఏది అవసరమని ఊహించింది. ‘ధనం’ అని తోచింది. ధనానికి అధిష్ఠాత్రిగా ‘లక్ష్మి’ని నిలిపింది. అయితే ఆ లక్ష్మిని రక్షించేందుకెవరో కావాలిగా! దాంతో శ్రీహరిని ఏర్పాటు చేసింది. ఆ చేయడంలో కూడా ఓ మెళకువ ఉంది. శ్రీలక్ష్మి అయిన ఆమె సర్వాభరణాలనీ ధరిస్తే, ఆమెని రక్షించే శ్రీహరి శేషశయ్య మీద పరుండి, ఆమె చేత పాదాలని ఒత్తించుకునేలా చేసింది. ఎందుకని? నిజమైన భర్త అయితే భార్య ధనాన్ని ఆశించకూడదనీ, ఆమె పాలన, పోషణలను భర్తగా (భరించేవాడు కదా!) తానే చేయవలసి ఉన్నాడనీ, ధనం చేత దాస్యం చేయించుకునేవాడు గొప్పవాడు కానీ, ధనానికి దాసుడైనవాడు గొప్పవాడు కానే కాడని తెలియజేయడానికే!
 
 ఇంతర్థం ఉంది కాబట్టే అమ్మ తనని తాను లలితాంబికగా వేషాన్ని వేసుకున్నవేళ సరస్వతిని కుడివైపున, లక్ష్మిని అప్రధానమని భావిస్తూ ఎడమవైపున నిలబెట్టి వింజామరల్ని వీయించుకునే ఏర్పాటు చేసుకుంది. (సచామర రమా వాణీ సవ్య దక్షిణ సేవితా). కేవలం విద్య, కేవలం ధనం లేదా విద్యా ధనాలు రెండూ ఉంటే చాలదని నిరూపిస్తూ అమ్మ, ఈ రెండింటితో పాటు స్త్రీకి తగిన అన్యోన్య దాంపత్యముండాలని సూచిస్తూ తాను శంకరునిలో తల నుండి పాదం వరకూ (ఆలోచన నుండి ఆచరణ వరకూ ఆయనతో సమానురాలిగా) సమభాగంగా నిలుస్తూ అర్ధ నారీశ్వర రూపాన్ని ధరించింది.
 
 పురుషులైన ఆ ముగ్గుర్నీ త్రి-మూర్తులని వ్యవహరిస్తే, స్త్రీలైన ఈ ముగ్గుర్నీ త్రి-శక్తులని పిలిచింది సంప్రదాయం. మూర్తులు శక్తుల్ని విడిచీ శక్తులు మూర్తుల్ని విడిచీ ఉండ(లే) రు కాబట్టి, త్రిశక్తి ఉత్సవం అంటే మూడు రెళ్లు ఆరుగురికి సాగుతున్న ఉత్సవం ఈ విజయదశమీ ఉత్సవమన్నమాట. పార్వతీ పరమేశ్వరులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు కాబట్టే కాళిదాస మహాకవి ఆ జంటని పలుకూ అర్థమూ (వాగర్థాలు) అన్నాడు. మనం కూడా ఉత్తమ దంపతులు కనిపిస్తే, సీతారాములు, రుక్మిణీ కృష్ణులనకుండా ‘పార్వతీ పరమేశ్వరుల’ని అనడానికి కారణం ఇదే.
 
 మూడు కొప్పులు...
 లోకంలో ఓ భయంకరమైన సామెత వ్యాప్తిలో ఉంది. మూడు కొప్పులు (స్త్రీలు) ఒకచోట చేరితే, ‘ఆ సంసారం ఇక ముక్క చెక్కలే’ అని. అయితే, ఈ త్రి-శక్తులూ ఒకచోట ఉంటూ ‘త్రిశక్తి పీఠమ’నే దేవాలయంలో కనిపిస్తూ మూడు కొప్పులుంటే ముక్క చెక్కలు కానే కావని, అలా అనడం సరికాదనీ, ఎక్కడైనా అలా కాబోతుంటే ఈ మూడు జంటల్నీ చూసి సంసారాన్ని సరిదిద్దుకోవాలనీ సూచిస్తుంటారు. లోకంలో ఈ అంతరార్థం తెలియనివారు, కొందరు కవులు, హరిదాసులు చమత్కారం కోసం లక్ష్మీ సరస్వతులకి, అలాగే శివ కేశవులకి, వారి కారణంగా గౌరీ లక్ష్మీ దేవతలకి ఏవేవో తగవులు వచ్చినట్లుగా కథల్ని, పద్యాల్ని అల్లేసి చెప్పేశారు. చెప్పేస్తుంటారు కూడా. వీళ్ల చమత్కార కుతూహలం ఎంతదాకా వెళ్లిపోయిందంటే, లోకంలో ఎక్కడా ఏ ముగ్గురు స్త్రీలూ కలిసి ఉండనే ఉండరన్నంత వరకూ.
 
 కాబట్టి స్త్రీకి కావలసిదేమని అమ్మ చెప్తోందంటే, తాను చదివిన చదువును గౌరవించే భర్త (బ్రహ్మ వంటివాడు), తన ధనాన్ని ఏనాడూ ఆశించక, తన సపర్యని ఇష్టపడే భర్త (విష్ణువు వంటివాడు), తన ఆలోచనని చేస్తూ ఆచరణ వరకూ కూడా తనని సంప్రదిస్తుండే భర్త (శంకరుని వంటివాడు)  కావాలని. ఒక్క క్షణం ఈ రోజుల్లోని స్త్రీ తలపుల తలుపుల్ని కొట్టిచూస్తే, విద్య తద్వారా ధనం ఉంటే దాంపత్యం తనంతట తానే దారికి వచ్చితీరుతుందనే దృష్టి కనిపిస్తుంది. ఆకూ వక్కా సున్నమనే మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా, ఏ ఒక్కటి ఎక్కువైనా తాంబూలం నోటికి చేటును తెచ్చేటట్లు ఈ మూడింటిలో ఏది లేకున్నా, ఏది ఎక్కువైనా సంసారమనే నోరు పండదు. ఎండి కనిపిస్తుంది. సరిదిద్దుకోగలగాలి జీవిత తాంబూలాన్ని.
 
 అమ్మ పిల్లల్లో లోపం?
 అమ్మ అనుక్షణం తన పిల్లల్ని తడిమి తడిమి చూసుకుంటుంది. పిల్లలు దూరంగా ఉంటే అమ్మ కళ్లే కొలతని వేసే కొలబద్దలు. పిల్లలు మరెక్కడో కనిపించని దూరంలో ఉంటే వారి గురించిన ఆలోచనలే ఆమె ఊహల కొలబద్దలు. అందుకే ఆమె మరింత బాగా ఆలోచించింది - తన ఆడపిల్లల్లో ఏం తక్కువగా ఉందా అని. అర్థమైందామెకి - ‘ధైర్య సాహసాలే’-లేవని. అంతే!


 తల్లి తుమ్మెద ఎలా తన పిల్ల తుమ్మెదని ఓ పద్మంలో కూచోబెట్టి గిర్రున తిరుగుతూ తిరుగుతూ నాదం చేస్తూ ఆ నాదాన్ని తన తుమ్మెద పిల్లకొచ్చేలా చేస్తుందో, అలా అమ్మ కూడా ఈ పిల్లలందరికీ తన ధైర్య సాహసాలని చూపించాలని భావించి, తానొక యోధురాలిగా మారింది. ఒట్టిగా వేషాన్ని వేసుకుని కనిపిస్తే, తానాశించిన ప్రయోజనం ఉండబోదని భావించి, ప్రతి యోధునిగా ఎవరున్నారా అని గమనించి, భండాసురుణ్ని విశుక్ర విషంగ రక్త బీజ చండ ముండ కుంభ నికుంభ అతికాయ మహాకాయాది రాక్షసుల్ని మట్టుబెట్టాలని, ఆ దృశ్యాలని (తుమ్మెద తన పిల్లకి నేర్పినట్లుగా తానూ యుద్ధ దృశ్యాలని చూపించాలని భావించి) తన సంతానం చూడాలని నిశ్చయించుకుంది.
 
 చూస్తుండగానే అశ్వ బలాన్ని, రథ బలాన్ని, గజ బలాన్ని ,పదాతి దళాన్ని (చతురంగ బలాలు) ఏర్పాటు చేసుకుని వెళ్తుండటమే కాక, ఓ దండనాయిక (సేనాధిపత్ని)ని, మరో మంత్రిని, ఇంకా తపశ్శక్తి దాగిన స్త్రీ దేవతలని ముందుగా యుద్ధానికి పంపింది. ఈ యోధురాళ్ల ఉత్సాహంతో చతురంగ బలాలతో - అమ్మ ఆ శత్రువు మీదికి వెళ్తూనే యుద్ధ ప్రారంభంమై విజయాన్ని సాధించడంతో తన స్త్రీ సంతానానికంతటికీ స్త్రీశక్తి అర్థమైంది. లోకంలో ప్రతి స్త్రీ కూడా సహజంగా తల్లి లక్షణాలతోనే ఉంటుంది ఎక్కడైనా (మాతర మంగనాః). కాబట్టే ఏ పురుషుడైనా స్త్రీని తనకి ఎదురునిల్చి పోరాడేంత స్థాయికి తెచ్చుకొనేకూడదు. సర్దుకుపోతూ ఉండాలి. ఆ స్థాయి దాటితే స్త్రీని ఏ తీరుగానూ ఎంతమంది పురుషులైనా కట్టడి చేయలేరని గమనించుకోగలగాలి. ఇది అమ్మ తన సంతానానికి చేసిన ఉపదేశం - స్త్రీ జాతిలో కనిపించే స్వభావమున్నూ.
 
 తగిన గౌరవాన్ని ఇయ్యకుంటే...
 ‘మేం ఆడవాళ్లం. పురుషులు అలా ప్రవర్తిస్తే ఏం చేయగల’మంటూ చేతులు ముడుచుకు కూర్చోవద్దని చెప్తోంది అమ్మ. అమ్మ, మహాలావణ్య శేవధి కదా! దాంతో జులాయిగా తిరిగే శుంభ నిశుంభులు ఆమెని ఈ మాటతో ఆ మాటతో పొగుడుతూ పరిహాసమాడుతూ దగ్గరకొస్తూ కొప్పు పట్టుకోబోతూ మీది మీదికొస్తుంటే ముందుగా సూచించింది - మంచిది కాదని. స్త్రీలందరూ ఇలా కాక మరేమంటారన్నట్టుగా వెకిలి నవ్వు నవ్వి, మరింత దగ్గరికి రాబోతుంటే, భర్తకి చెప్తాను- జాగ్రత్త అంది. ఈమె ఏమీ చేయలేదని తేలిపోయింది కాబట్టే కదా భర్తకి చెప్తానంటోందని గ్రహించి, ఆ పాపిష్ఠులిద్దరూ ఆమె చేతిని పట్టుకోబోతే (ఈవ్ టీజింగ్ అనుకోవచ్చేమో) ఒక్క ఉదుటున వాళ్ల జుట్టు పట్టింది. గిరగిర తిప్పింది.
 
  పళ్లూడగొట్టింది. గదతో మోదింది. శూలాన్ని తీసింది. ఒక పోటు పొడిచింది. వ్యాఘ్రాన్ని పిలిచింది. మీదికి దూకవలసిందని ఆజ్ఞ చేసింది. మరో సందర్భంలో మీ ఇద్దరిలో సమర్థ యోధుడెవరో తేల్చుకుని రావలసిందంటూ చెప్పి, ఆ ఇద్దరిలో ఇద్దరికీ వైరుధ్యాన్ని (విరోధ భావం) కల్పించి, ఒకళ్లనొకళ్లు చంపుకునేలా తెలివితేటలతో కార్యాన్ని సాధించి, తన సంతానానికి కొత్త కొత్త పద్ధతులని (రాక్షస లక్షణాలున్న పురుషుల పట్ల ప్రవర్తించాల్సిన తీరు తెన్నుల్ని) చూపించింది. ఎంత మేధావిని అమ్మ!
 
 స్త్రీకి తగిన గౌరవాన్ని ఇయ్యకపోతే నోరు చేసుకోవడమే కాదు, చేయి చేసుకోవడం కూడా తెలిసుండాలని ప్రబోధించింది లక్షల సంవత్సరాల క్రితమే. అమ్మకి వ్యాఘ్ర/ సింహ వాహనాలున్నట్టుగా ప్రతి స్త్రీకి ప్రాథమికమైన ఓ సహకారం మాత్రం ఉండాలని బోధిస్తోంది అమ్మ. అది నేటి కాలానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలి ఎవరికి వారు.
 
 ఎంత శక్తి ఉన్నా భర్తకి భార్యే
 సహజంగా తన భర్త కంటే తనకి విద్యా శక్తి, ధన శక్తి బాగా ఉన్న సందర్భంలో ఏ స్త్రీ అయినా తన భర్తకి సహకరించకపోవడం మాటటుంచి, ఆయన్ని అథఃకరించడం (తక్కువ చేయడం, తక్కువ చేస్తూ పది మందిలో మాట్లాడటం వంటివి) చేస్తుంటుంది. ఇది కొందరిలో ఎక్కువ, మరికొందరిలో తక్కువ పాళ్లలో ఉండచ్చు గాని, లేకపోవడమంటూ ఉండదు. అయితే అమ్మ మాత్రం అయ్య కంటే ఎంతెంతో శక్తిమతి అయ్యుండి కూడా ఆయన్ని ఏనాడూ తక్కువ చేయదు సరికదా, ఆయన విషయంలో పరమ జాగ్రత్త వహిస్తూ కనిపిస్తుంది.
 
 తనకింకా వివాహం కాని దశలో శంకరునికి సపర్యని చేస్తూ, తన లావణ్యానికి శంకరుడు మోహపడి శృంగార దృష్టితో చూడగానే (నిజానికి దీనికి మన్మథుడు కారణం పూలబాణాన్ని వేయడం ద్వారా) శంకరుడు మన్మథుణ్ని మసి చేసి వెళ్లిపోయాడు. పార్వతి ఆ శంకరుని పనిని ప్రశంసించిందే తప్ప, తప్పుబట్టలేదు. పైగా తన రూపం అతి రమణీయంగా ఉండటాన్ని బట్టి కదా శంకర తపస్సు కాస్తా కూలిపోయిందని నిందించుకుంది కూడ! (నినింద రూపం హృదయేన పార్వతీ)
 
 తన రూపం కారణంగా దేవతలకి సహాయపడిన మన్మథుని భార్యకి భర్త లేనితనాన్ని తాను కల్పించానని బాధపడి, ఇటు శంకరుణ్ని ధిక్కరించినట్లూ అటు తాను మన్మథుణ్ని బతికించగల శక్తి ఉన్నదానినన్నట్లూ లోకం భావించకుండా - ఓ తుని తగవు చేసిందామె.
 మన్మథుడు శరీరంతో (సశరీరుడై) ఆ రతీదేవికి మాత్రమే కనిపించేలాగ, లోకంలోని అందరికీ శరీరం లేనివానిగా ఉండేలా చేస్తూ ఉభయ తారకంగా వ్యవహరించిన వ్యవహారదక్షురాలు ఆమె.
 
 కర్తవ్యమేమిటి?
 ఇంతటి స్త్రీ శక్తిని లోకానికి చాటుతూ ఉన్న అమ్మ పండుగ రోజున మన కర్తవ్యమేమిటని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రోజుకి ఇన్ని నివేదనలనుకుంటూ ఇల్లంతా ఓ వంటశాలగా మార్చేసుకోవడం కాకుండా, అమ్మ నామాలని ఎంతగా పారాయణం చేస్తే, అంతగా ఆనందపడే స్వభావమున్నది కాబట్టి (నామ పారాయణం ప్రీతా) ఈ పదిరోజుల్లోనూ లలితా సహస్ర నామాలని రోజుకి ఎన్ని మార్లు చదివినా సరే, మొత్తమ్మీద 108 పర్యాయాలు పారాయణమయ్యేలా చేసుకోగలిగితే ముగ్గురమ్మల శక్తి స్త్రీలో ప్రవేశించి, ఆ కష్టానికి తగ్గ ఆలోచ, సమస్యని పరిష్కరించుకోగల ఉపాయం నిశ్చయంగా తట్టి తీరుతుంది ప్రతి స్త్రీకి.
 
 అయినా ‘ఇంత గొప్పది అమ్మ! అంత గొప్ప అమ్మ’ అని ఉండే ఈ నామాల్లో గొప్పదనమేముందని కొందరు ఈ నామాలలో భావం తెలియనివాళ్లు, పాపం వారి అజ్ఞాన దశాస్థాయి మేరకు వాపోతూ ఉంటారు. అమ్మ గొప్పదనాలని గుదిగుచ్చిన వశిని మొదలైన స్త్రీలు ఒక ప్రయోజనాన్నే ఆశించి, ఏర్చి కూర్చి అందించారు మనకి ఈ నామాలని. ఏమిటా ప్రయోజనం?
 అమ్మ ఎంత గొప్ప పనుల్ని ఓ స్త్రీ అయ్యుండి కూడా సాధించిందో సాధించగలిగిందో గ్రహించగలిగితే, ఆ స్త్రీ శక్తి ఉన్న నీక్కూడా ఆ ధైర్య సాహసాలు నిరంతరం మననం వల్ల కలిగి తీరుతాయని చెప్పడమే మనకి కలిగే ప్రయోజనం.
 
 నిజంగా అమ్మ నామాలని పారాయణం చేస్తుండే భక్తురాలే అయ్యుంటే ‘అమ్మా! నాన్నా! ఈ జన్మకి నన్ను క్షమించండి! మరో జన్మలోనూ మీకే కూతురిగా పుట్టి...’ అంటూ దీనాతి దీనంగా ఉత్తరం రాసి తనువు చాలించే పిరికితనం ఏ స్త్రీకీ రానే రాదు. భర్త ప్రాణాల కోసం యముని వెంట వెళ్లి సాధించుకున్న సావిత్రి, తన జుట్టుపట్టుకులాగిన దుశ్శాసనుని వంకతో కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చేసిన ద్రౌపది, తననెత్తుకుపోగా లంకా రాజ్యాన్ని నామమాత్రం చేసిన సీత... ఇందరూ స్త్రీలే. అమ్మ చెప్తున్నదీ ఇదే. ధర్మబద్ధంగా స్త్రీ ఓ గెలుపుని సాధిస్తే ఆ దశమి ‘విజయదశమి’ అవుతుందని!
 - డా॥మైలవరపు శ్రీనివాసరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement