విశేషాలు సమూహం వినాయక స్వరూపం | Vinayaka Chavithi festival on August 29 | Sakshi
Sakshi News home page

విశేషాలు సమూహం వినాయక స్వరూపం

Published Sun, Aug 24 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

విశేషాలు సమూహం వినాయక స్వరూపం

విశేషాలు సమూహం వినాయక స్వరూపం

29న వినాయక చవితి
పర్వం:‘దైవం గురించి సందేహంతో ఓ ప్రశ్నని వేయడమా?’ అనుకుంటూ లెంపలు వేసుకుని, ఆ సందేహాన్ని అలాగే లోపల నొక్కి ఉంచుకున్నంత కాలం మనకి ఆ దైవం గూర్చిన ఏ విశేషమూ అర్థం కాదు.  సంప్రదాయం తెలియదు. మన దైవాల విశిష్టత ఎంతటిదో చెప్పే శక్తీ మనకి రాదు. కాబట్టి ఎన్ని సందేహాలొస్తే అన్ని సమాధానాలని పొందుతూ ఉంటే, అంతగానూ మనం ఆ దైవానికి దగ్గరవుతూ పూజని చేస్తున్నట్లే. ఈ నేపథ్యంలో కొన్ని సందేహాల్నీ సమాధానాల్నీ చూద్దాం!
 
 వినాయకుడి రూపం  కనపడగానే, ‘శుక్లాం బరధరం విష్ణు’మ్మంటూ శ్లోకాన్ని చదివేసి, దణ్నం పెట్టేస్తాం కదా. నిజంగా ఈ శ్లోకం వినాయకునిదేనా?‘శుక్ల+అంబర+ధరమ్’ అంటే తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. వినాయకుడెప్పుడూ ఎర్రని వస్త్రాలే కడతాడు. మరి ఇదేమిటి శ్లోకం ఇలా అంటోంది?
 ‘విష్ణుమ్’ అనేది శ్లోకంలో కనిపించే రెండో మాట. దీన్నిబట్టే తెలుస్తోంది కదా! ఈ శ్లోకం విష్ణువుకి సంబంధించినదే అని! మరి వినాయకుని దగ్గరెందుకు చదవడం?
 ‘శశి వర్ణమ్’ అనేది శ్లోకంలోని మూడో పదం. శశి అంటే చంద్రుడు కాబట్టి ‘శశి వర్ణమ్’ అంటే చంద్రునితో సమానమైన శరీరచ్ఛాయతో ఉంటాడనేది అర్థం మరి. వినాయకుడు చంద్రునిలా తెల్లగా ఉండడు. ఆయన కు-జుడు (పృథివికి సంబంధించినవాడు) కాబట్టి, ఎరుపు రంగులో ఉంటాడు.  ఇలా విష్ణువుకి సంబంధించిన శ్లోకాన్ని వినాయకుని దగ్గర చదువుతున్నాం కదాని, పోనీ విష్ణువుకి సంబంధించినదా! అనుకుంటూ ఆయన వైపు నుండి అర్థాన్ని చూస్తే? శుక్ల+అంబర+ధరమ్ - తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. శ్రీహరి పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరిస్తాడు కదా! (పీతాంబరః) మరి ఇదేమిటి? శశి వర్ణమ్ - తెల్లని శరీరచ్ఛాయ ఆయనకెక్కడిది? నీలమేఘశ్యాముడు కదా! ఇలా ఉండటమేమిటి? ఇలా ఆలోచన పరంపర సాగిపోతోంది. మరి ఎలా సందేహ నివృత్తి?
 
 శుక్ల+అంబర+ధరమ్ అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడు అని. (అంబర శబ్దానికి వస్త్రం అని మాత్రమే కాదు అర్థం)  ఆ ఆకాశం నుండి కదా క్రమంగా ఒకదాని నుండి ఒకటి చొప్పున వాయువు, అగ్ని, నీరు, నేల, సస్యాలు (పంటలు) మనుష్యులనేవాళ్లు వచ్చారు. ఆ కారణంగా ఆకాశాన్ని ధరించాడంటే ఇంత జీవరాశికీ ఆధారభూతుడని అర్థం. ఇంతకీ ఈ వర్ణన.. విష్ణువు, వినాయకుడు.. ఈ ఇద్దరిలో ఎవరిదో చూద్దాం!
 శశి వర్ణమ్ - శశి అంటే చంద్రుడనేది నిజమే కానీ, ఆ అర్థమెలా వచ్చింది? శశ (కుందేలు) వర్ణం (లక్షణం) ఆయనకి ఉండటం బట్టి వచ్చింది. కుందేలుది ఏ లక్షణంట? నేలమీద ఓ క్షణం - గాలిలో (ఆకాశంలో) ఓ క్షణం ఉండటం. అంటే పూర్తిగా నడవనూ నడవదు. పూర్తిగా ఎగరనూ ఎగరదు. ఇలా ద్వంద్వ విధానం దానిది. ఆ లక్షణమే కదా చంద్రునిది! ఓసారి పూర్ణిమ, ఓసారి అమావాస్య. ఓసారి ఎదుగుతూ పోవడం, మరోసారి తరుగుతూ రావడం. అలాంటి చంద్ర లక్షణం కలవాడు విష్ణువులో, వినాయకుడిలో ఎవరో చూద్దాం.
 
 చతుః+భుజమ్ - చతుర్భుజమ్ - విష్ణువుకి నాలుగు చేతులు ఉండే మాట నిజమే. వినాయకుణ్ని కూడా అలా చూస్తాం కానీ, వినాయకునికి రెండు చేతులు కూడా ఉంటాయి. విష్ణువుకి మాత్రం అలా ఏనాడూ లేదు - ఉండదు.
 ఇక ప్రసన్న వదనమ్ - చూడగానే ప్రసన్నంగా కనిపించే ముఖం ఇద్దరికీ ఉండచ్చుగా. అయితే ఇందులో పేచీ లేదనుకోకూడదు. ముఖంలోని భావాలని మనుష్య ముఖమైతే గమనించగలం. మరి అదే గజ ముఖం నుండి ఎలా తెలుసుకోగలం! ఓ ఆవు నవ్వుతోందనీ, ఓ లేడి వెక్కిరిస్తోందనీ అర్థం చేసుకో వీలౌతుందా? కాబట్టి ఈ విశేషణం కూడా విష్ణువుకి సంబంధించినదే అనిపిస్తుంది.
 సర్వ విఘ్న ఉపశాంతయే - ఈ విఘ్నాలు తొలగించడం అనే మాటకొచ్చేసరికి, ఇది వినాయకుడిదే అనక తప్పదు. ఇంతకీ ఏదోలా తికమకగా ఉన్న ఈ శ్లోకం ఇద్దరిదీనా మరి?
 ఔను. ఈ శ్లోకం ఇద్దరిదీను. రహస్యమేమంటే శ్రీహరే కాలాన్ని రక్షించే కార్యాన్ని చేపట్టిన వేళ (సర్వాధారః కాలః - కాలః కలయతా మహమ్) వినాయకుడని పిలిపించుకుంటాడు. అంతే!
 
 ఇప్పుడు ఈ నేపథ్యంలో అర్థాన్ని చూద్దాం! కాలస్వరూపుడైన శ్రీహరి వినాయకునిగా మారిన వేళ అంటే సరైన అర్థమేమంటే - అన్నింటికీ ఆధారం ఏ ఆకాశమో ఆ ఆకాశాన్ని నిరంతరం తన అదుపులో పెట్టుకుని ఉన్నవాడు, శుద్ధ పక్ష కృష్ణ పక్షాలతో ఉంటూ ఎగుదల దిగుదల లక్షణాలు కలిగించేవాడు (జీవులకి ఆనందాన్నీ దుఃఖాలనీ కలిగిస్తూ ఉండేవాడు), ఒక చేయి రోజులకి ప్రతీకగా, మరో చేయి 15 రోజుల పక్షానికి (శుద్ధ + కృష్ణ) సంకేతంగా, మరో చేయి 2 పక్షాలు కలిసిన నెలలకి (చైత్రం, వైశాఖం...) ప్రతీకగా, మరో చేయి ఈ 12 నెలలకీ (ప్రభవ, విభవ....) ప్రతీకగాను కలిగి, మనకి కాలంలో ఏర్పడే అన్నిటికీ తానే కర్తగా ధర్తగా హర్తగా ఉన్నవాడు  ఆయన.
 
 లక్ష్మీ గణపతి
 శ్రీహరీ వినాయకుడూ ఒకే రూపమే కాబట్టి ఉద్యోగ బాధ్యతలని బట్టి పేరు మాత్రమే భేదం కాబట్టి, గణపతికి ఎడమ తొడమీద లక్ష్మీదేవి కనిపిస్తుంది, లక్ష్మీ గణపతి రూపంలో. స్త్రీ ఎప్పుడూ తన పురుషుని ఎడమ తొడ మీదే కూర్చోవాలి. సంతానం మాత్రం కుడి తొడమీద కూర్చోవాలి! అందుకే అక్షరాభ్యాసాది సర్వ శుభకార్యాల్లోనూ కుడి తొడమీదే కూచోబెట్టుకుని, చేయవలసిన ప్రక్రియని ముగించాక, గురువుగారికి  అందించి వారితో అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు శిశువుకి. ప్రయాగలో త్రివేణీ సంగమ స్థలంలో వేణీదానం (స్త్రీల శిరోజాల చివరి భాగాన్ని తుంచడం) చేసే సందర్భంలో స్త్రీని పురుషుని ఎడమ తొడ మీదే కూర్చోబెడతారు. ఇదంతా ఆ లక్ష్మీగణపతి విగ్రహం మనకి నేర్పిన సంప్రదాయమే.
 
 వి-ఘ్నం
 ‘వి - విశేషంగా ప్రారంభించబడిన పని, ఘ్న - మరింక ఏ తీరుగాను కూడ బాగుచేయ వీల్లేని రీతిలో ధ్వంసం కావడ’మని విఘ్నమనే పదానికర్థం. తిరిగి ప్రారంభించగల విధానమున్న పద్ధతిలో కలిగేది తాత్కాలిక విఘ్నం. దీనివల్ల కొంత మనో వైకల్యమున్నా పెద్ద ఇబ్బంది లేదు. అదే శాశ్వత విఘ్నమైతే చెప్పేదేముంది?
 
 పాల సముద్రాన్ని చిలికే వేళ మందరమనే పర్వతం సముద్రంలోకి దిగబడి, బురదలో కూరుకుపోవడం తాత్కాలిక విఘ్నం. దాన్నుండి ఉద్ధరించి విఘ్న నివారణాన్ని చేసింది (కూర్మావతారాన్నెత్తి) శ్రీహరే కదా!
 ఇక విశ్వామిత్రుడు త్రిశంకుడనే పేరున్న రాజుని బొందితో స్వర్గానికి పంపించదలచి చేయవలసిన ప్రయత్నాలన్నింటినీ చేసి, స్వర్గ మర్త్య మధ్యభాగంలో విడిచి వేయడమనేది శాశ్వత విఘ్నానికి కలిగిన ఫలితం.
 విఘ్నమనేది ఏ ఆహారాన్ని తినడం వల్లనో, ఏ ప్రదేశానికి వెళ్లడం వల్లనో వచ్చేది కాదు. కాలం గడుస్తూ ఉండగా కాలవశంగా వచ్చేది మాత్రమే. అందుకే శ్రీహరి తనని గురించి తాను భగవద్గీతలో - కాలః కలయతా మహమ్ - లెక్కింపబడే వాటిలో కాలాన్ని నేను (కాలో స్మి) అని స్పష్టంగా చెప్పుకున్నాడు.
 ఇక వినాయకుడూ శ్రీహరీ ఒక్క రూపమే అయిన కారణంగానే వినాయకుడు కొన్ని ప్రదేశాల్లో ఊర్ధ్వ పుండ్రధారిగా కనిపిస్తాడు. విష్వక్సేనుడు ఈయనే. ఈయన పరివారమంతా కూడా ఈ రూపంతోనే ఉంటారంటుంది శ్రీ విష్ణు సహస్రనామం.
 
 శ్రీహరి రక్షణ బాధ్యతని చేపట్టే దైవం కాబట్టే, ఆయన కాలస్వరూపాధి దేవతా రూపంగా - అంటే - వినాయకునిగా మారి మమ్మల్ని రక్షిస్తూ ఉండవలసిందని ప్రార్థిస్తూ పెట్టే విగ్రహమే మనకి వీధి శూల ఉన్న ఇళ్ల ముందు కనిపిస్తుంది. ‘ఓ కాలస్వరూప వినాయకుడా! శ్రీహరి రూపమా! కాల గతిలో రావలసిన విఘ్నాలు రాకుండా నీవున్న ఇంటిలోని జనుల్ని రక్షిస్తూ ఉండవలసిం’దని ప్రార్థించడం దీని భావం. అయితే వట్టిగా ఆ విగ్రహాన్ని వీధిశూల ఉన్న ఇంటికి పెట్టేయడం కాకుండా, ఆ విగ్రహానికి శక్తి వచ్చేందుకై రోజూ అష్టోత్తర నామార్చననైనా చేయించాల్సిందే తప్ప లేని పక్షంలో అక్కడ వినాయక విగ్రహం పెట్టినా మరో బొమ్మని పెట్టినా ప్రయోజనం ఒకటే. కాల స్వరూపం గజం. అంటే ఏనుగుది ఎలా మందబుద్ధి విధానమో, అలాంటిదే కాలానిది కూడ. అలా కానినాడు మనం జీవితంలో పొందిన దుఃఖాలని, అవమానాలని, కష్టాలని ఏనాడూ మరిచిపోలేం. కాలంలో ఉత్తరాయణం, దక్షిణాయనం ఉన్నట్లు, కాలస్వరూపమైన వినాయకుని తొండం కుడిగా ఎడమవైపుగా విగ్రహాల్లో రెండు తీరులుగాను ఉంటుంది.
 
 పంచాయతనం
 ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరుడు అనే ఈ ఐదుగురినీ నాలుగు దిక్కులా నలుగురినీ ఉంచి, మధ్యలో ఎవరిని ప్రధాన దైవంగా భావించాలనుకుంటున్నామో అలా ఆరాధించడం పంచ+ఆయతన విధానం (ఐదుగురికి స్థానాన్ని ఏర్పాటుచేసి, ఐదుగురూ ఒకచోట ఉండగా అందరినీ పూజించే తీరు) అన్నారు పెద్దలు.
 
 ప్రసిద్ధ అన్నవర క్షేత్రానికెళ్తే ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో సూర్యుడు, వాయవ్యంలో అంబిక, ఈశాన్యంలో మహేశ్వరుడు, ఈ అందరికీ మధ్యలో విష్ణువు. ఆ స్తంభం పైభాగంలో పై అంతస్థు మీద శ్రీ వీర వేంకట సత్యనారాయణమూర్తి, ఇటు శంకరుడు అటు అమ్మవారు ఉండగా దర్శనమిస్తారు. అక్కడ అన్నిటి మధ్యా విష్ణువున్న కారణంగా అది విష్ణు పంచాయతనమన్నమాట. ఈ పంచాయతన విధానాన్ని నేర్పింది మనకి శ్రీహరే. అందుకే భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో మహేశ్వరుణ్ని, మార్గశిరంలో శ్రీహరిని, పుష్యమాసంలో సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉండవలసిందని కాలచక్రంలో ఓ స్థిర నిర్ణయాన్ని చేసేశాడు.
 
 ఆ కారణంగా వినాయక చవితి పేరిట ఈ ఒక్కరోజునే గణపతి పూజని చేసేసుకుని ముగించుకోవడం కాకుండా, ఈ కాల పంచాయతనంలో మరో నలుగురు దైవాలు క్రమంగా నెలకొక్కరు రాబోతున్నారని గ్రహించి, వారిని కూడా ఆరాధించడాన్ని చేస్తే, అక్కడికి పంచాయతన పూజ ముగిసినట్లన్నమాట!  ఆ కారణంగా ఈ చేయబోయే పంచాయతన పూజకి ఏ విఘ్నమూ కలగకుండా చేయవలసిందంటూను, బుద్ధికి అధిష్ఠాత వినాయకుడే కాబట్టే ఏ విఘ్నమూ లేకున్నా కూడా పూజచేసే బుద్ధిని ప్రసాదించవలసిందిగాను ప్రార్థిద్దాం!
 గం గణపతియే నమః!
 - డా॥మైలవరపు శ్రీనివాసరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement