
ఆయనో శాస్త్రవేత్త.. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇష్రో)లో పనిచేసి, వృత్తిలో తన ప్రతిభను కనబర్చిన విజ్ఞాన వేత్త. భారతీయ సాహిత్యం, సంస్కృతి సంప్రదాయంలోని విశిష్టతను అవసోపన పట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇందులో భాగంగానే తేనెలొలికే తెలుగు పదాలతో పుణ్య చరితుడు బమ్మెర పోతన రచించిన పద్య భాగవతాన్ని ఈ తరానికి మరింత చేరువ చేయాలనుకున్నారు. అంతటి బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని అచ్చు పుస్తక రూపంలో, ఇంటర్నెట్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయనే.. న్యూనల్లకుంటకు చెందిన మందడి కృష్ణారెడ్డి. –
ఇప్పటికే వివిధ రూపాల్లో లభ్యమవుతున్న భాగవత సంబంధిత సమాచారానికి ఆయన చేసిన ఆధునాతన రూపకల్పన ఈతరం భాగవత విశ్లేషకులకు, ఔత్సాహికులకు సులభతరం చేసింది. ఒక ఉన్నత శ్రేణి శాస్త్రవేత్తగా ఇస్రో ఐఐఎస్‌యూ తిరువనంతపురం నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఆయన.. తర్వాత విశ్రాంత సమయాన్ని దైవకార్యంగా భావించి సాహిత్య విశిష్టతలను కలగలిపి ఉన్న శ్రీమద్భాగవతాన్ని అందరికీ సులువైన మార్గంలో అందించడానికి సమగ్ర సంకలన రూపకల్పనకు నాంది పలికారు.
ఇందులో భాగంగా సాంకేతిక అభివృద్ధి ఆకాశాన్ని అంటుతున్న ఈ కాలంలో వినూత్నంగా ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ అనే మార్గాన్ని ఎంచుకుని శ్రీమద్భాగవతంలోని 12 స్కందాలు, 688 ఘట్టాలలోని 10,061 పద్యాలకు భావాన్ని, పదోచ్చారణ నేర్చుకోవడానికి వీలుగా ఆ పద్యాల ఆడియోను రూపొందించారు. ప్రతి పద్యంలోని పదాలకు అర్థం, ఆ పద్యానికి సంబంధించిన వ్యాకరణ అంశాలు ఛందస్సు, అలంకారాల వివరాలన్నీ ఒక పద్యం నుంచి మరొక పద్యానికి విషయ సూచిక
ఆధారంగా సులువుగా వెళ్లేలా సమకూర్చారు. ఇవన్నీ కేవలం ఒక ప్రధాన పవర్ పాయింట్ స్లయిడ్ నుంచి ఒక్క క్లిక్‌తో సాధ్యమయ్యేలా చేశారు. సాహిత్యం, శ్రీమద్భాగవతం వంటి గ్రంథ పఠనం కష్టతరమైన ప్రస్తుత కాలంలో ఇంత సులభతరంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం అమృతప్రాయమైన విషయంగా భావిస్తున్నారు. ఈ అనితర సాధ్యమైన సాధనం ఉపయోగించడంలో
ఒక ప్రధాన స్లయిడ్ నుంచి వేల పద్యాలకు సంబంధించిన పేజీలకు ఏర్పరచిన హైపర్ లింక్స్ ద్వారా సులువుగా వెళ్లేలా విస్తృతమైన ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ చేయటం ఇదే ప్రథమం. మందడి చెన్నకృష్ణారెడ్డి, రంగనాయకమ్మ పుత్రుడైన కృష్ణారెడ్డి ఒకప్పటి ఆర్‌ఈసీ ఇప్పటి నిట్ వరంగల్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్, ఐఐటీ చెన్నై నుంచి ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం పరిశోధనలోనూ తన ప్రతిభతో ఎన్నో అవార్డులు అందుకున్నారు.
సమగ్ర సంకలనంగా రూపొందించా..
ఈ సంకలనానికి, ‘శ్రీభాగవత సుధానిధి‘ అని నామకరణం చేశాను. ఎందరో మహానుభావులు పద్య భావాన్ని, ఆ పద్యాలకు సంబంధించిన ఎన్నో విశేషాలను క్రోడీకరించి అందుబాటులోకి తెచ్చారు. కానీ ఆ అంతర్యామి లీలా విశేష గ్రంథమైన శ్రీమద్భాగవతానికి సంబంధించి గ్రంథ విశేషాలను ఒక సమగ్ర సంకలనంగా రూపొందించాను.
తెలుగు భాష, గ్రంథ పఠనంపై ఆసక్తి మాత్రమే అర్హతగా విద్యార్థులు మొదలుకొని పెద్దల వరకు ఎవరైనా అమృత తుల్యమైన పోతనామాత్యుల విరచిత శ్రీమద్భాగవత గ్రంథ విశేషాలను సులువైన మార్గంలో ఆకళింపు చేసుకునేలా రూప కల్పన చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగా శ్రీమద్భాగవత పద్యాలు, ఆ పద్యాల భావాన్ని, పదోచ్చారణ, ప్రతిపదార్థం, పద్యాలలోని అలంకార విశేషాలు విడివిడిగా ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలలో లభ్యమవుతున్న వాటిని సమగ్ర సంకలనంగా మార్పు చేశాను.
– కృష్ణారెడ్డి
(చదవండి: మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!)