ఫేస్బుక్లో ఓ బామ్మ సంచలనం!
ఆమె వయసు 92.. జీవితాన్ని ఎంతో చదివింది. ఎన్నో అనుభవాలు ఆ కళ్లతో చూసింది.. వాటిలో కొన్నింటిని మాటలుగా మార్చి.. కవితరూపంలో తీసుకొచ్చింది. ఆ కవిత.. కర్కశ హృదయులనూ కన్నీరు పెట్టిస్తోంది. గిఫ్ట్ ప్యాక్లో బంగారు ఆభరణాలు ఉంటాయని మీరు చూస్తున్నారా? అంటూ వృద్ధాప్యంపై వాండా బి. గోయిన్స్ అనే మహిళ కవిత వల్లిస్తున్న వీడియో ఫేస్బుక్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆ వీడియోను 40 లక్షల మంది చూశారు. ప్రపంచజ్ఞానాన్నిపదుగురికీ పంచే ప్రయత్నంలో భాగంగా... 'యు ఆర్ లుకింగ్ ఎట్ ది గిఫ్ట్ ర్యాప్... అండ్ నాట్ ద జ్యుయెల్ ఇన్ సైడ్' అంటూ ఆమె జీవితానుభవాలను వల్లె వేస్తుండగా.. ఆమె సంరక్షకురాలు కేథరిన్ క్లాస్ నిట్జర్ విల్సన్ తీసిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
సంపూర్ణాయుష్షుతో జీవించిన విండా.. తన జీవితకాలంలో ప్రపంచయుద్ధం, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, సెప్టెంబర్ 11 తీవ్రవాద దాడులతో పాటు ఎన్నో చారిత్రక సంఘటనలను చూసింది. ప్రస్తుతం పోర్ట్ ల్యాండ్ ఆరిజన్లో నివసిస్తున్న ఆమె... తన జీవనసారాన్ని, అనుభవాల దొంతరను ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసింది. ముందుగా తన కవితను కేర్ టేకర్ విల్సన్కు వినిపించింది. కవిత వింటూనే కరగిపోయిన ఆమె... వెంటనే దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇటువంటి గొప్ప మహిళకు తాను కేర్టేకర్గా ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. ఫేస్ బుక్ లో ఈ వీడియోను 40 లక్షల మంది పైగా వీక్షించారు. లక్షా 84 వేల సార్లు షేర్ చేశారు.