 
															కవిత
రసశిల...
	రసశిల
	ముకుళించిన మొగ్గని
	 తాజా కుసుమంగా విప్పిన
	 క్షణికం ఒక రహస్యదేవత
	 
	 చెలియలికట్టతో
	 ఎడతెగక ముచ్చటలాడిన
	 తరగ కోరిక ఒక తుమ్మెద
	 
	 ఒంటరి యాత్రికుడి
	 ఏకాంతచింతలో వెలిగిన
	 దీపజ్వాల ఒక చెలికత్తె
	 
	 కాలరాత్రిని
	 పాలవెన్నెలగా మార్చిన
	 చందమామ ఒక పరుసవేది
	 
	 పగటివేళ
	 నక్షత్రాలని నిర్బంధించిన
	 సూర్యుడు ఒక నియంత
	 
	 కన్నీటిచుక్కలో
	 విరహరోదనం దాచిన
	 హృదయం ఒక మధుపాత్ర
	 
	 ఏకాకివో జతగాడివో
	 ప్రేమికుడిగా యవనిక దించిన
	 జీవనరంగం ఒక ఉత్సవవేదిక
	 
	 కాలాగ్నికీలల్లో నిర్జీవదేహం
	 దహనమయ్యాక మిగిలిన
	 దోసిలి బూది ఒక తెల్లకలువ
	 
	 - నామాడి శ్రీధర్
	 9396807070

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
