కార్ఖానలో దారుణం
- మంటల బారినపడిన తల్లీ, ఇద్దరు కూతుళ్లు
- గాంధీ ఆస్పత్రికి తరలింపు
- ప్రమాదకరంగా ముగ్గురి పరిస్థితి
- భర్త నిర్లక్ష్యం చేయడం వల్లేనని భార్య వాంగ్మూలం
రసూల్‌పురా: అనుమానాస్పదస్థితిలో తల్లి, ఇద్దరు కూతుళ్లు మంటల బారినపడ్డారు. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ యజమాని దినేష్ కథనం ప్రకారం... కార్ఖాన ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో నివసించే దినేష్ సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లో మామా జ్యుయెలర్స్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య కవిత(40), వైష్ణవి(18), భావన (16) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9గంటల ప్రాంతంలో ముగ్గురికి ఒకేసారి మంటలు అంటుకున్నాయి. దినేష్ ఉంటున్న పైఅంతస్తులో అతని సోదరుడి కుటుంబం నివాసం ఉంటోంది. దినేష్ సోదరుని ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరుపులు, కేకలు విని కిందికి దిగివచ్చిన దినేష్ మంటలార్పేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో అతని చేతులకు కూడా గాయాలయ్యాయి.ఈ ముగ్గురిని వెంటనే స్థానికుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.
భర్త నిర్లక్ష్యం వల్లే...
భర్త పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది తానే వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నానని కవిత మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిందని ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు తెలిపారు. తల్లి లేకుండా తాము బతకలేమని ఇద్దరు కూతుళ్లు కూడా ఆత్మహత్యకు యత్నించినట్టు కవిత పేర్కొన్నట్టు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. అయితే ఇద్దరు పిల్లలు మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.