బిగ్ ఎఫ్ఎంలో జూ॥జాకీ
మాటల ఊటలు.. స్పాంటేనిటీకి కేరాఫ్‌లు.. పంచ్‌లకు పర్మినెంట్ అడ్రస్‌లు.. రేడియో జాకీలు. ఎఫ్ఎంలో ముచ్చట్లు వినిపించే
ప్రొఫెషనల్ ఆర్జేలకు ధీటుగా ఓ పన్నెండేళ్ల వసపిట్ట గొంతు సవరించింది. గలగల గోదారిలా.. మాటలతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ‘విను వినిపించు లైఫ్ అందించూ’ అంటూ బిగ్ ఎఫ్ఎం శ్రోతలను పలకరించింది. బాలల దినోత్సవం సందర్భంగా 92.7 ఎఫ్ఎం నిర్వహించిన చిన్నారి ఆర్జే హ ంట్లో ఒయాసిస్ స్కూల్‌కు చెందిన భావన సెలక్టయింది. ‘హియర్ హియర్ మేక్ ఏ లైఫ్ బ్యూటిఫుల్’ అంటూ జూనియర్ ఆర్జేగా అదరగొట్టింది.
ఒయాసిస్ స్కూల్లో ఏడో తగరతి చదువుతున్న భావన మామూలుగానే కబుర్ల పోగు. ఫ్రెండ్స్ ధరణి, తన్మయి కలిశారంటే వాళ్ల మధ్య సరదా సంభాషణలు నాన్ స్టాప్‌గా సాగుతూనే ఉంటాయి. గతేడాది క్రిస్మస్ వేడుకల్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 92.7 ఎఫ్ఎం ఆర్జేలు సందీప్, సుందరి.. భావన చదివే ఒయాసిస్ స్కూల్‌కు వచ్చారు. ఎవరైనా సరదాగా కాసేపు ఏదైనా టాపిక్‌పై మాట్లాడతారా? అనడమే తరువాత భావన, తన్మయి, ధరణి సై అంటూ ముందుకొచ్చి వహ్వా అనిపించారు.
టెస్ట్.. వన్.. టూ.. త్రీ..
బాలల దినోత్సవం సందర్భంగా ఏటా 92.7 ఎఫ్ఎం జూనియర్ ఆర్జేలను సెలెక్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒయాసిస్ స్కూల్‌కూ ఓ చాన్సిచ్చారు. మూడు రౌండ్ల సెలెక్షన్ ప్రాసెస్‌లో భావన అన్నింటా ముందు నిలిచింది. మొదటి రౌండ్లో కాస్త కామెడీగా వాళ్లను వాళ్లు పరిచయం చేసుకోవాలి. సెకండ్ రౌండ్లో దర్శకుడు ఒక సీన్‌కు యాక్షన్ చెప్పే సన్నివేశాన్ని కామెడీగా చేయాలి. మూడో రౌండ్లో రౌడీలు స్కూల్‌ను ఆక్రమిస్తే హీరో వచ్చి కాపాడే సన్నివేశాన్ని కామెడీ యాంగిల్లో నటించి చూపాలి. మూడు రౌండ్లకు కలిపి 30 మార్కులకు భావన 27 మార్కులు, ధరణి 26.5 మార్కులు సాధించి జూనియర్ ఆర్జేలుగా ఎంపికయ్యారు. సిటీలోని 13 స్కూల్స్ నుంచి బిగ్ ఎఫ్ఎం మొత్తం 40 మందిని ఎంపిక చేసింది. ఫైనల్స్‌లో అందరినీ వెనక్కి నెట్టి భావన ఈ సీజన్ జూనియర్ ఆర్జేగా ఎంపికైంది. తొలిరోజే సీనియర్ ఆర్జే జ్యోత్స్నతో కలసి తన సత్తా చాటింది.
ఆదితో చిట్‌చాట్..
భావన తొలి రోజే హీరో ఆదితో ‘హాయ్ బాగున్నారా?.. నేను జూనియర్ ఆర్జే భావనను’ అంటూ మాట కలిపింది. పెళ్లి, భార్య వివరాలు, రఫ్ సినిమా విశేషాలను ఆసక్తికరంగా రాబట్టింది.
చదువు, ఆటపాటలు..
చదువుతోపాటు ఆటపాటలు, ఉపన్యాస పోటీలంటే భావనకు ఆసక్తి ఎక్కువ. ఆయా అంశాల్లో ఇప్పటి వరకు 11 మెడల్స్, మూడు ట్రోఫీలు, 85 వివిధ రకాల సర్టిఫికెట్లు సాధించింది. చదువులోనూ రాణిస్తూ క్లాస్‌లో మొదటి ర్యాంక్ సాధిస్తోంది. గతేడాది బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్‌గా ఎంపికైంది కూడా.