
ఏది ప్రేమ?
కవిత
కవిత
ఒక ఆశాకం పిగిలిపోయాక
ఒక అడవీ కుంగిపోయాక
కళ్లల్లోంచి రాలిన నల్లని పదాలు
ఖాళీ చేతుల్లోకి ఇంకిపోతున్నప్పుడు
విచ్చుకోవాలో, ముడుచుకోవాలో తేల్చుకోలేక
మనసు విరుచుకు పడిపోతున్నప్పుడు, సరిగ్గా అప్పుడే
మారుమూల ద్వీపంలో అవ్వాతాతల సమాధుల సాక్షిగా
పేర్చుకున్న తన కలలన్నీ ఇంకా మన ఇళ్లకు రాని
ప్రళయానికి ఇచ్చి
కొన్ని గ్నాపకాలను మూటగట్టుకుంటూ ఒక అమ్మాయి
మనల్ని చూసి పకాలున నవ్వుతుంది
అంతలోనే, ఉప్పగా ఏడుస్తూ నిలదీస్తుంది
‘దేనికోసం మీ పలవరింత?
ఏది విరహం? ఏది ప్రేమ?’
–మమత