ఆ భరోసానిచ్చింది అమ్మే! | acharya N.gopi he's mother special story | Sakshi
Sakshi News home page

ఆ భరోసానిచ్చింది అమ్మే!

Published Wed, Nov 9 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

ఆ భరోసానిచ్చింది అమ్మే!

ఆ భరోసానిచ్చింది అమ్మే!

ఆచార్య ఎన్. గోపి
‘అమ్మ కూడా చచ్చిపోతుంది...’ అంటూ సాగే కవిత 1985 మే నెలలో అమ్మ చితి దగ్గర కూర్చుని రాసింది. ఆ భ్రష్టుణ్ణి నేనే. అమ్మ పోయిందని దేవరకొండ నుంచి టెలిగ్రామ్ పంపారు చిన్నక్క వాళ్లు. అది నాకు మరుసటి రోజు సాయంత్రానికి అందింది. అందిన వెంటనే పరుగులు తీశాను. కానీ అమ్మ అప్పటికే కాలి బుగ్గి అయిపోయింది. అమ్మ ఇంక కనిపించదని తెలిసిన ఆ క్షణంలో నాలోని భావావేశం కవితగా పొంగి వచ్చింది. కాలుతున్న కాష్టం కూడా వెలుగుని ప్రసాదించినట్లే... అమ్మ దూరమైనా కూడా ఆమె నేర్పిన లక్షణాలు, ఆమె నుంచి నేర్చుకున్న అలవాట్లు నాలో ఇంకా బతికే ఉన్నాయి. అవే నన్ను నడిపిస్తున్నాయి. జీవించడం కష్టమేమీ కాదు, చాలా సులభం అని మళ్లీ మళ్లీ నా చేత చెప్పిస్తున్నాయి.

 మాది నల్గొండ జిల్లా భువనగిరి. స్వాతంత్య్రం దేశానికి వచ్చింది కానీ మా తెలంగాణాకు ఇంకా రాలేదప్పటికి. నేను నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు పెద్దక్కకు పెళ్లయింది. కొత్త పెళ్లికూతురి ఒంటి మీద సొమ్ముల కోసం రజాకార్లు ఆమెను చంపేశారు. అప్పటి నుంచి అమ్మ రోజూ సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు భోరున శోకాలు పెట్టి ఏడ్చేది. పొలం పనుల నుంచి వచ్చి ఏడ్చి ఏడ్చి, తర్వాత ఇంటి పనులు చేసుకునేది. అలా ఇరవై ఏళ్లు కొనసాగింది. ఊరి వాళ్లకు ఎంతగా గుర్తుండిపోయిందంటే... ‘నక్కా లక్ష్మమ్మ ఏడుపు ఆపింది, దీపాలు వెలిగించండి’ అనుకునేటంతగా అందరిలో నాటుకుపోయిందా ఏడుపు.

 అమ్మ పొలం పనులు, నాన్న బట్టల మూట వ్యాపారంతో ఇల్లు గడిచిపోతుండేది. మాకెవరికీ పెద్ద పెద్ద కోరికలు లేకపోవడంతో కొరత అనిపించలేదు. అమ్మ రోజంతా పని చేస్తూనే కనిపించేది. అదే పిల్లలకూ అలవాటు చేసింది. ఇంటి పనుల్లో సాయం చేయకపోతే ఆమెకి కోపం వచ్చేది. అమ్మ బావిలో నీళ్లు చేదితే నేను మోసేవాడిని. నేను చేదితే అమ్మ మోసేది. ఆమెకు చదువురాదు. కానీ జ్ఞాని. అక్షరజ్ఞానం ఉంటే జీవితం బాగుంటుందని నమ్మింది. తన సొమ్ములమ్మి అన్నను చదివించింది. నా చదువుకి అవీ లేకపోవడంతో ట్యూషన్ చెప్తూ చదువుకున్నాను. నాకు వచ్చిన నూట ముప్ఫై రూపాయల నుంచి అమ్మ ఆకు వక్క (తమలపాకులు- వక్కలు) కోసం ముప్ఫై రూపాయలు పంపేవాడిని. నేను వెళ్లేటప్పుడు ఆకుల కట్ట తీసుకెళ్తే ఆమె కళ్లు మెరిసేవి. అంతకంటే ఆమెకు కోరికలేవీ లేవు.

ఆత్మగౌరవం మెండు!
ఆమెకు ఎవ్వరి మీదా ఆధారపడడం ఇష్టం ఉండేది కాదు. నాన్న యాభై ఏళ్లకే పోయారు. దాంతో అన్నయ్య ఇంటి ఖర్చుల కోసం డబ్బు పంపేవాడు. మనియార్డరు వచ్చినప్పుడు ఒక్కసారి కూడా ఎంత డబ్బు పంపించాడని అడగలేదు. ప్రతిసారీ ‘వాడింటి ఖర్చులకు సరిపోతున్నాయంటనా’ అనేది. ఓసారి అన్న ‘నేను పెద్ద ఉద్యోగినయ్యాను. నువ్వింకా కూలికి పోవడం ఎందుకు మానెయ్’ అన్నాడు. అప్పుడు చూడాలి అమ్మలో పొడుచుకు వచ్చిన పౌరుషాన్ని. ‘నన్ను పోషించడానికి నువ్వెవర్రా. నాకు రెక్కలున్నాయి’ అన్నది. నాకు ఉద్యోగం వచ్చాక కూడా ‘పెద్ద పంతులుద్యోగం. నీకు బాగానే వస్తుందిరో’ అనేది కానీ, ఆమె తన కోసం ఏమీ అడిగేది కాదు.

అమ్మ కూడా చచ్చిపోతుంది!
యవ్వన ప్రాదుర్భావ ప్రాంగణంలో

విచ్చిన మృత్యుపుష్పాలు,
గుట్టుగా కళ్ల మడతల్లోకి వచ్చి చేరిన స్వార్థబాష్పాలు, అమ్మను కాస్త కాస్త చంపుతూ ఇవాళ పూర్తిగా చంపేశాయి

 కానీ, అమ్మ ఓ పట్టాన చావదు కాలుతున్న కాష్టంలోంచి వెలుగును ప్రసాదం చేస్తుంది
శవం చుట్టూ అల్లిన వేదాంతం పక్షిని గూట్లో బంధిస్తుంది

మనసు నిండా పేరిన మాలిన్యం జ్ఞాపకాలను ఏటిపాలు చేస్తుంది

ఇప్పుడు పూర్తిగా నువ్వే! అమ్మ స్మృతి ఓ దివ్వె...
ఆరని వేదనతో పెనుగులాట ప్రారంభమవుతుంది  భ్రష్టుడా!
అమ్మ రుణం తీరదు అమ్మకు అమ్మవై పుడితే తప్ప.

ఆమె రూపంతో పాటు ఆమెలోని శ్రమించే తత్వమూ నాకు అబ్బింది. 68 ఏళ్ల వయసులో కూడా రోజుకి పది గంటలు పని చేస్తాను. కూలీ కోసం అట్టే చూడను. నా మూటలు నేనే మోసుకుంటాను. తమ శ్రమను నమ్ముకున్న వారికి జీవితం భయంగొల్పదు. అక్క పోవడాన్ని తల్లిగా భరించలేక ఏడ్చింది కానీ నాన్న పోయాక ఇంటి బాధ్యత మోయడానికి భయపడలేదామె. ఆ ధైర్యమే ఆమెను నడిపించింది. పౌరుషంగా, ఆత్మగౌరవంతో జీవించడానికి దోహదం చేసింది. అమ్మలోని లక్షణాలను తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. జీవించడానికి భయపడాల్సిన పనిలేదు. జీవించడం చాలా సులభం అనే భరోసా నాలో కలిగించింది మాత్రం నేను చూసిన అమ్మ జీవితమే. విపరీతమైన కోరికలకు, అత్యాశకు పోతే జీవించడం కష్టం. కానీ చేతిలో ఎంత ఉందనే స్పృహ ఉంటే జీవించడం కష్టం కానే కాదు.’’
- సంభాషణ: వాకా మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement