అంతరాంతరాల్లో రగులుతున్న పద్యం
జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి
జననం 12 జనవరి 1954
మరణం 12 జనవరి 1993
గుండెనిండా బాధ కళ్లనిండా నీళ్లున్నప్పుడు
మాట పెగలదు కొంత సమయం కావాలి.
దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై
హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధి కావాలి.
భారమవుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యే
మృత్యువును పరిహసించేందుకు ఒకింత సాహసం కావాలి.
ఉండి ఉండి ఉధృతమయ్యేందుకు
ఉద్వేగ భరితమైన సన్నివేశం కావాలి...
సరళమైన భాషనుంచి సంక్లిష్టమైన వ్యాకరణంలోకి ప్రవేశించినట్టు
కలల వంతెన కూలి కన్నీటి నదిలోకి దూకినట్టు
హైదరాబాదనే మానవారణ్యంలోకి అడుగిడి
సరిగ్గా ఇప్పటికి పది సంవత్సరాలు
మధ్యతరగతి కౌగిట్లోని మాధుర్యం కూడా తరిగిపోయి
పరిపరి విధాల మానసిక వేదనతో పాటు
పెరిగే ఇద్దరు పిల్లల భారాన్ని మోయటమెలాగనే ఆరాటం
మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో
మళ్ళీ మళ్ళీ ఊపిరితిత్తుల్లో క్షయ రాజుకోవటం పరిపాటయిపోయింది
... నానించి ఏమీ ఆశించని వాళ్ళే నాకెంతగానో సహకరించారు
‘ఐసోనెక్స్’ నుంచి ‘సైక్లోసెరిన్’ వరకూ ఉచితంగా మందులందించిన
మహానుభావులెందరో ఉన్నారు.
అయితే నాలోని అరాచకం, వేళకి మందులు వాడని
క్రమశిక్షణా రాహిత్యం వల్ల రాను రాను నా శరీరంలోని
రోగ నిరోధక శక్తి సన్నగిల్లి ఆరు నెలల్లో అవలీలగా నయం
చేసుకోగలిగిన వ్యాధి పదేళ్లు అంచెలంచెలుగా ముదిరి
నా రెండు ఊపిరితిత్తుల్ని పాడుచేసింది.
దశలవారీగా 45, 60, 90, 120 ఇలా వందలాది
స్ట్రెప్టోమైసిన్, క్యానమైసిన్ ఇంజక్షన్లు నా వొంటిమీద
స్వైరవిహారం చేసిన ఫలితంగా వ్యాధి సంగతటుంచి
భయంకరమైన సెడెఫైక్ట్స్ ప్రారంభమై
ఆపాదమస్తకం నా దేహమే ఒక ఆసుపత్రి రోదనగా మారిపోయింది.
(చనిపోవడానికి ఆరు నెలల ముందు, ‘సిటీ లైఫ్’ నేపథ్యం పేరిట
1992 జూలైలో అలిశెట్టి రాసిన ముందుమాటలోంచి కొంత భాగం.)