ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే
కవిత
మనమూ వొట్టిపోయాం. స్పందనలకు చచ్చిపోయాం. నడుస్తున్న
శవాలమై నానాజాతి సమితిగా తయారయ్యాం.
పక్షికన్ను పంచింగ్ టైమ్. వీరపనుల కట్ట బ్రహ్మలమై గసపోసే
వొగిరింపులు. చెమటల నిగారింపులు.
పరధ్యాన పరమేశ్వర. మిస్టేకుల స్టేక్ హోల్డర. అక్షింతల ఆహారమె
భక్షింతుము భక్ష్యాలుగ.
సిటీబస్సే నా రుణభూమి. ప్రయాణికులందరూ నా సహోదరులు.
వారిని రౌరవించుట నా విధి సీరియల్.
ఇల్లే ఇలలో హెల్లు అని, ఇల్లాలే దొరికిన సాధువని, కవితలల్లిన
కచ్రాగాళ్లమై. డస్సిపోయిన డల్ హౌసీలమై.
ఆ నాలుగ్గోడల మధ్యనా. నవ్వు పులుముకొని. కెవ్వుకేకల ప్రళయ
భీకర పాటల పాలబడి. తిన్న అన్నం వొంటబట్టక వొంటిగా నువ్వా
బాల్కనీలో ఎదురింటి కరెంట్ మీటర్ ఎర్రలైటులో చిక్కుకుని
గిరికీలు కొడ్తుండగా.
ఒక ఆత్మీయమైన ఫోన్ కాల్ వచ్చి నిన్ను అవాక్కయ్యేలా, దాని
అక్కయ్యేలా సంభ్రమాశ్చర్యానందాంబుధిన ఓలలాడిస్తే ఎంత
బాగుంటుందో. ముఖ్యంగా ఆ యొక్క కాల్ ఒక అపోజిట్ సెక్స్ నుండి
అయ్యుండినప్పుడు.
- మోహన్ రుషి 8341725452