యుగాంతానికి 2 నిమిషాలే!
వాషింగ్టన్: ప్రపంచ వినాశనం అత్యంత దగ్గరపడుతోందనడానికి సూచికగా డూమ్స్‌డే క్లాక్‌లో నిమిషాల ముల్లును మరో 30 సెకన్లు ముందుకు జరిపారు. ప్రస్తుతం డూమ్స్ డే క్లాక్‌లో సమయం రాత్రి 11.58 గంటలు. అంటే డూమ్స్ డే గడియారం ప్రకారం వినాశనానికి (12 గంటల సమయాన్ని వినాశనానికి గుర్తుగా భావిస్తారు) మనం రెండే నిమిషాల దూరంలో ఉన్నామన్నమాట. డూమ్స్ డే గడియారం ఎవరు నిర్వహిస్తారు, వినాశనానికి ఎంత దూరంలో ఉన్నామనేవి ఆసక్తికరంగా మారాయి.
1947లో ఏర్పాటు...
మానవాళి తన మతిలేని చర్యల వల్ల ప్రపంచ వినాశనానికి చేజేతులా ఎంత దగ్గరగా వెళుతోందో హెచ్చరించేందుకు ఏర్పాటు చేసిందే ఈ డూమ్స్‌డే గడియారం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మొదటిసారిæ అణ్వాయుధాలను తయారుచేసిన మాన్‌హట్టన్ ప్రాజెక్టులో భాగస్వాములైన అమెరికా సైంటిస్టులు 1945లో ‘బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్’ అనే జర్నల్ను ప్రారంభించారు.
ఈ జర్నల్ను శాస్త్రవేత్తలే నిర్వహిస్తున్నారు. వారే 1947లో తొలిసారిగా డూమ్స్ డే గడియారం విధానాన్ని ఏర్పాటు చేశారు. తొలుత అణ్వాయుధాలు, అణు యుద్ధాల వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రమే డూమ్స్‌డే గడియారం ద్వారా హెచ్చరించేవారు. 2007 నుంచి వాతావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును కూడా దీని ద్వారా హెచ్చరిస్తున్నారు.
అర్ధరాత్రి 12 అంటే వినాశనమే
గడియారంలో సమయం అర్ధరాత్రి 12 గంటలు అయ్యిందంటే ప్రపంచం అంతమైపోయినట్లే లెక్క. దీనిలో సమయం అర్ధరాత్రి 12కు ఎంత దగ్గరగా ఉంటే ప్రపంచం అంత ప్రమాదంలో ఉందని అర్థం. ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. 1947 నుంచి ఇప్పటి వరకు ఈ గడియారంలో సమయాన్ని 20 సార్లు మార్చారు. మానవాళి వినాశనానికి ఎంత దూరంలో ఉందన్న దానిని బట్టి సమయాన్ని ముందుకు, వెనక్కు మారుస్తూ ఉంటారు. 1991లో అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక గడియారంలో సమయాన్ని రాత్రి 11.43కు మార్చారు. అంటే నాడు ప్రపంచం వినాశనానికి 17 నిమిషాల దూరంలో ఉందని అర్థం.
రెండోసారి రెండు నిమిషాల వ్యవధి
ప్రపంచం వినాశనానికి అత్యంత దగ్గరగా ఉన్నట్లు తొలిసారిగా 1953లో ఈ గడియారం చూపించింది. ఆ ఏడాది అమెరికా, సోవియట్ యూనియన్లు హైడ్రోజన్ బాంబులు పరీక్షించడంతో సమయాన్ని 11.58కి మార్చారు. అంటే వినాశనానికి రెండు నిమిషాల దూరంలో ప్రపంచం ఉందని అర్థం. మళ్లీ ఈ ఏడాది, ఈ నెలలోనే దీనిని 11.58కి మార్చారు. అణ్వాయుధాలు, వాతావరణ మార్పులకు సంబంధించి రేకెత్తుతున్న ఆందోళనలపై ప్రపంచ దేశాల అధినేతలు సరైన విధంగా స్పందించడం లేదంటూ ఈ నెలలో సమయాన్ని 11.58కి మార్చారు. ఉత్తర కొరియాపై అణు దాడికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ పరోక్షంగా ప్రకటించడం, పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయం తీసుకోవడం తదితరాలను ఇందుకు కారణాలుగా భావించవచ్చు.
గడియారంలో ముఖ్య ఘట్టాలు
► 1947లో ఏర్పాటు చేసినప్పుడు సమయం రాత్రి 11:53. అంటే వినాశనానికి ఏడు నిమిషాల దూరం.
► 1949లో సోవియట్ యూనియన్ తొలి అణుపరీక్ష. సమయం 4 నిమిషాల ముందుకు. అంటే 11:57
► 1953లో అమెరికా తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష. మరో నిమిషం ముందుకు. అంటే 11:58.
► 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో 14 నిమిషాలు వెనక్కు జరిపారు. అంటే11:43గా మార్చారు.
► 1998లో భారత్, పాక్‌లు అణ్వాయుధాలను పరీక్షించడంతో ఎనిమిది నిమిషాలు ముందుకు జరిపారు. అంటే 11:51
► 2016– తీవ్రమైన వాతావరణ మార్పులు, భారీ అణ్వాయుధ పరీక్షలు. 2 నిమిషాలు ముందుకు–11:57
► 2017– అణ్వాయుధాల ఆధునికీకరణ, వాతావరణ మార్పులతో సమయం 30 సెకన్లు ముందుకు–11:57:30