చెక్కు చెదరని బుద్ధవాక్యం
గ్రంథపు చెక్క
బుద్ధప్రతిమలానే సాంచీస్థూపం కూడా ఏదో అనాది, శాశ్వత సందేశాన్ని వింటున్నట్లుగా, ఆ సందేశాన్ని ధ్యానిస్తున్నట్లుగా అక్కడొక అపూర్వమైన నిశ్శబ్దం, ప్రశాంతి నెలకొని ఉన్నాయి. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తున కొండ మీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధస్థూపాలన్నిటిలో కూడా అత్యంత సురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యంలాగా ఈ నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది.
ఆశ్చర్యమేమిటంటే బుద్ధుడి జీవితంలోని ఏ ప్రముఖ సంఘటనతోటీ సాంచికీ సంబంధం లేదు. బుద్ధుడు తన జీవిత కాలంలో ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని పర్యటించిన చీనా యాత్రికుడు జువాన్ జంగ్ భారతదేశంలో తాను చూసిన ప్రతి ఒక్క బౌద్ధస్థలం గురించి ఎంతో వివరంగా నమోదు చేసినప్పటికీ సాంచి గురించి కనీసం ఒక్కవాక్యం కూడా ప్రస్తావించలేదు. బుద్ధపాద స్పర్శకు నోచుకోనప్పటికీ, బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధసంఘ నివాసంతో పునీతమైన నేలగా సాంచీ చరిత్రలో నిలబడింది.
బహుశా అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విదిశ నుండి ఉజ్జయిని వెళ్లేటప్పుడో, ఉజ్జయిని నుండి విదిశ వెళ్లేటప్పుడో ఈ అడవిలో ఈ కొండను చూసి ఉంటాడు. ప్రజల్ని ప్రబోధించగల వాక్యాలు ఎక్కడ ఏ కొండ మీద రాస్తే నలుగురు చదువుతారో అశోకుడికి తెలిసినట్టుగా ఈ దేశంలో మరెవరికీ తెలియదు. బహుశా అశోకుడి చూపులోనే ఆ ‘దృష్టి’ ఉంది. అందుకే మొదటిసారి అతడీ కొండని చూసినప్పుడు అతడికి ఈ కొండ మీద ఒక బౌద్ధస్థూపం కూడా కనబడి ఉండాలి. అంతరంగంలో దర్శించిన ఆ స్థూపాన్ని తక్కిన దేశమంతా చూసేటట్టు కూడా అతడు ఈ స్థూపనిర్మాణం చేపట్టాడు.
- వాడ్రేవు చినవీరభద్రుడు
‘నేను తిరిగిన దారులు’ పుస్తకం నుంచి.