సైన్స్... మనిషిని దేశదిమ్మరిని చేసింది!
గ్రంథపు చెక్క
మానవుడు ఇంతకుముందు లాగా ఒకచోట జీవయాత్ర సాగించే అవకాశం లేకుండా చేసింది సైన్స్. మనిషిని దేశదిమ్మరిని చేసింది. ఈనాటి మనిషి ఉదయం ఒక ఊళ్లోనూ, రాత్రి ఇంకొక ఊళ్లోనూ ఉండవలసి వస్తుంది. కొంతమంది దేశాలనే మారుస్తున్నారు.
చెట్టు ఒకచోటనే పాతుకొని ఉండి బ్రతుకుతుంది. అక్కడి నుంచి కదలిస్తే, మరోచోట పాతితే తప్ప బ్రతకదు. మరోచోట పాతివేసినా బ్రతకని చెట్లున్నాయి.
జంతువు కదులుతూ బ్రతకగలుతుంది. ఒక పరిధిలో, ఒక పరిస్థితిలో మాత్రమే మనగలుగుతుంది. మానవుడూ అంతే. అయితే నూతన పరిస్థితులకు జంతువుల కంటే త్వరగా ఎడ్జెస్ట్ అవుతాడు.
ఈనాటికీ పల్లెటూరి నుంచి వచ్చిన రైతు, పట్టణ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరి కావడం మనకు నిత్యమూ కనిపించే దృశ్యమే. వచ్చిన దగ్గరి నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనే యావ తప్ప అతనికి ఇంకొకటి ఉండదు. అయినా జంతువు వలెకాక, ఎక్కడబడితే అక్కడ తనకు కావలసిన పరిస్థితులను తనకు తానై సృష్టించుకోగలుగుతున్నాడు. నూతన పరిస్థితులలో మనగలుగుతున్నాడు.
అంటే క్రమక్రమేణా అతను పరిస్థితుల ప్రభావాన్ని అధిగమించి బ్రతకగలుగుతున్నాడన్నమాట. మానవుని మీద పరిస్థితుల ప్రభావం నశిస్తూ వున్నదన్నమాట. ఇక మానవునికి వేళ్ళు ఒకచోట ఉండవలసిన అవసరం లేదు.
ఈ నూతన జీవితంలో అతనికి అనేక ప్రమాదాలు అపాయాలు ఎదురవుతుంటాయి. అందులో సందేహం లేదు. అయితే ఎప్పటికప్పుడు ప్రమాదాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడే కదా మానవుడు క్రొత్త క్రొత్త విషయాలను కనిపెట్టింది. మానవులో ఉన్న సృజనశక్తి విజృంభించేది. మానవుడు దేవుడయ్యేది. ఇందుకు మానసిక జీవితం ప్రగాఢం కావాలి.
- ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’కు గోపిచంద్ రాసిన ముందుమాట నుంచి.