బతుకు రెండు విధాలు...
గ్రంథపు చెక్క
బతుకు రెండు విధాలు. సంగడి బతుకు. అంగడి బతుకు.
సంగడి అంటే స్నేహం, మైత్రి.
అంగడి అంటే బజారు, వ్యాపారం జరిగే చోటు.
బజారుల సంఘర్షణలు, వైరుద్ధ్యాలు, అంతా వ్యాపారం. ‘సంగడి’ బతుకులో అంతా స్నేహం. అందుకని సంగడి బతుకు కావాలె, అంగడి బతుకు కాదు.
సంతసముగా జీవింపగా
సతతము యత్నింతు గాని
ఎంతటి సౌఖ్యానికైన
ఇతరుల పీడింపబోను (‘నా గొడవ’)
‘ది ప్రాఫెట్’ మొదటి అధ్యాయం, చివరి అధ్యాయం మధ్య ఇరవై ఎనిమిది ప్రశ్నలున్నయి. అన్నీ జీవితానికి సంబంధించినవే. పిల్లల గురించి, ఇండ్ల గురించి, పెండ్లి గురించి, పని గురించి.
భక్త తుకారాం తన భజనలో అంటడు -
‘‘ఏ జీవినీ తప్పుపట్టకు. ప్రతి ఒక్కడూ ఏదో పని చేస్తున్నడు. పని దేవునితో సమానం’’ అని.
గిబ్రాన్, ‘‘ప్రేమతో పనిచేయి, ఏహ్యతతో కాదు’’ అంటడు.
ఏ పని చేసినా నీకు ప్రాణప్రదమైన వ్యక్తి కోసం చేస్తున్నట్లు చెయ్యమంటడు. ‘నేరం-శిక్ష’ గురించి మాట్లాడినప్పుడు-
‘‘చెట్టు అంతటికీ ఎరుక లేకుండా ఒక్క ఆకు కూడా పండు బారనట్లే, మీ అందరి రహస్య సమ్మతి లేకుండా ఏ ఒక్కడూ తప్పు చేయలేడు’’ అంటడు.
స్నేహం గురించి చెప్పినప్పుడు నీ అవసరాల సమాధానమే నీ స్నేహితుడంటాడు. చట్టం తప్పుతుంది, మతం తప్పుతుంది, ప్రభుత్వం తప్పుతుంది, న్యాయం తప్పుతుంది కానీ బతుకు తప్పదు. బతక్క తప్పదు. బతుక్కు సంబంధించిన పుస్తకం కనుకనే ‘ది ప్రాఫెట్’ ఇప్పటికీ కొత్తగా ఉంటుంది.
- కాళోజీ నారాయణరావు
(‘జీవన గీతం’ పుస్తకానికి రాసిన ముందు మాట నుంచి)