మకుటంలేని మహారాజు | Muhammad life story | Sakshi
Sakshi News home page

మకుటంలేని మహారాజు

Published Sun, Apr 2 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

మకుటంలేని మహారాజు

మకుటంలేని మహారాజు

ముహమ్మద్‌ ప్రవక్త (స), ఆయన అనుచరులు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిన దగ్గరి నుండి మక్కా ఖురైషీలు ఆగ్రహంతో రగిలిపోయేవారు. చివరికి భావికార్యాచరణ గురించి సమాలోచనలు జరిపి మదీనాపై దాడికి పథకం రచించారు.

మక్కాలో శతృవుల పోరుపడలేక ప్రవక్త, ఆయన అనుచరులు మదీనాకు వలస వస్తే, ఇక్కడ కూడా కొంతమంది విశ్వాసుల రూపంలో కపటులు పోగయ్యారు. అబ్దుల్లాబిన్‌ ఉబై వీరికి నాయకుడు. అయినా ప్రవక్త మహనీయులు ఈ దుష్టుల కుటిల పన్నాగాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. రోజురోజుకూ ఆగడాలు మితిమీరిన క్రమంలో జరిగిన కొన్ని పరిణామాల నేప«థ్యంలో ఆత్మరక్షణకోసం శతృవుతో తలపడడం అనివార్యమంది. ‘బద్ర్‌’ పేరుతో ప్రసిద్ధిగాంచిన ఈ సమరంలో విజయం విశ్వాసులనే వరించినప్పటికీ, ముహమ్మద్‌ ప్రవక్త (స) జీవితం నిరంతరం సంఘర్షణలతోనే గడిచిపోయింది.

సత్యాసత్యాల పోరులో ఎన్నో త్యాగాలు చేయవలసివచ్చింది. దుష్టశక్తులతో పోరాటాలు సలుపవలసి వచ్చింది. తరువాతి పరిణామ క్రమంలో ఉహద్, కందక పోరాటాలు కూడా సంభవించాయి. ఒప్పందాలూ, ఒడంబడికలూ జరిగాయి. ఎట్టి పరిస్థితిలోనూ పోరుకంటే సంధికే అధిక ప్రాధాన్యతనిచ్చేవారు ప్రవక్త మహనీయులు. విలువల పునాదులపైనే చివరికి మక్కాను కూడా జయించారు. విజేతగా మక్కాలో అడుగు పెట్టిన ప్రవక్త మహనీయులు ఒక ప్రకటన చేశారు. కాబా గృహంలో రక్షణ పొందినవారిని మన్నించడం జరుగుతుంది. తమతమ ఇళ్ళలోనే ద్వారాలు మూసుకొని ఉన్నవారికి రక్షణ ఉంటుంది. అబూసుఫ్యాన్‌ ఇంట రక్షణ పొందిన వారికీ మన్నింపు ఉంటుంది.

జన్మభూమిని వదిలి ఒంటరిగా, అవమానభారంతో మదీనాకు వలసవెళ్ళడానికి కారణమైన, చంపడానికి పథకాలు రచించిన శతృవులను సైతం కారుణ్యమూర్తి కనికరించారు. వారిపై ఎలాంటి పగ, ప్రతీకారమూ లేకుండా మనసారా మన్నించారు. ఈ విజయం సందర్భంగా ఆయన ఒక చారిత్రక ప్రసంగం చేశారు. దేవుని ఏకత్వాన్ని, ఆయన గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడారు. పగలు ప్రతీకారాలు, హత్యలు ప్రతిహత్యలను అంతం చేస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలో మానవ హక్కుల్ని, మానవ సమానత్వాన్ని విశదీకరించారు. ఉచ్చనీచాల నిమ్నోన్నతాభేదభావాల్ని అంతమొందించారు. వడ్డీ వ్యవస్థను, జూదం, మద్యం లాంటి దురలవాట్లను నిషేధించారు.

స్త్రీ పురుష హక్కుల్ని నిర్వచించారు. మానవులంతా ఒకే రాశికి చెందినవారని, ఎవరికీ ఎవరిపై ఎలాంటì æఆధిక్యమూ లేదని విడమరచి చెప్పారు. మూగజీవాల పట్ల బాధ్యతను ప్రోదిచేశారు. దైవాన్ని నమ్ముకున్నవాడు, సత్యధర్మంపై స్థిరంగా ఉన్నవాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడని భరోసా ఇచ్చారు. ఆయన ఏనాడూ మానవీయ విలువలను, ఆదర్శాలను విడనాడలేదు. రణరంగానికి సైతం మానవత్వం నేర్పి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రేమ, దయ, జాలి, కరుణ, సహనం, త్యాగం, పరోపకారం, న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఆ మహనీయుని సుగుణాలలో కొన్ని.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement