అబూబకర్ దైవ విశ్వాస ప్రకటన
ప్రవక్త జీవితం
అలీతో ముహమ్మద్ (స) పెంపుడు కొడుకు జైద్‌కు మంచి స్నేహం ఉండేది. ఎటు వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసి చేసేవారు. ఈ కారణంగా జైద్ కూడా అలీ బాటలోనే నడిచి ధర్మాన్ని స్వీకరించాడు.
వీరిద్దరూ ముహమ్మద్ ప్రవక్తను అమితంగా అభిమానించేవారు.ఆయన మాటను రవ్వంతైనా జవ దాటేవారు కాదు. ఆయన(స) కూడా వారిని అంతగానే ప్రేమించేవారు. కంటికి రెప్పలా చూసుకునేవారు.
ఈక్రమంలోనే ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) ప్రియ స్నేహితుడు అబూబకర్ ఆయన వద్దకు వచ్చారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్నారు. చర్చ ఆధ్యాత్మిక విషయాలవైపు మళ్లింది. ‘అబూబకర్! నా గురించి నీకు పూర్తిగా తెలుసు గదా!’ అన్నారు ముహమ్మద్ (స). ‘ఏమిటి ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు. నీగురించి నాకు తెలియకపోవడం ఏమిటి? చిన్నప్పటినుండీ చూస్తున్నాను నిన్ను’.
‘అది సరే, నేనేదైనా చెబితే నువ్వు నమ్ముతావా?’ ‘అదేమిటీ అలా అడుగుతావు? నువ్వు ఏనాడైనా అబద్ధమాడావా, నేనీరోజు నమ్మకపోడానికి? నువ్వు అత్యంత సత్యసంధుడవని, నిజాయితీ పరుడవని, మానవతా మూర్తివని నేనే కాదు, యావత్ జాతి నమ్ముతోంది’ అన్నారు అబూబకర్. ‘నేను దేవుని ప్రవక్తను అంటే నమ్ముతావా?’ మళ్లీ రెట్టించారు ముహమ్మద్ (స). ‘తప్పకుండా నమ్ముతాను. అసత్యం అన్నది నీ జీవితంలో నేను చూడలేదు, వినలేదు’ అన్నారు అబూబకర్ స్థిర నిశ్చయంతో.
‘అయితే విను. దైవం నన్ను తన ప్రవక్తగా ఎంచుకున్నాడు. దైవదూత జిబ్రీల్ నావద్దకు వస్తున్నారు. నాపై దేవుని సందేశం అవతరిస్తోంది. కనుక నువ్వు కూడా దైవేతర శక్తులన్నిటినీ వదిలిపెట్టి, ఒక్క దైవాన్నే నమ్ముకో. ఆయనే సర్వ సృష్టికర్త. విశ్వ వ్యవస్థను, సమస్త జీవకోటిని ఆయనే సృజించాడు. అందరి జీవన్మరణాలూ ఆయన చేతుల్లోనే ఉన్నాయి’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త (స).
‘అవును, నిస్సందేహంగా నువ్వు దైవ ప్రవక్తవే. నేను నమ్ముతున్నాను. విశ్వ సృష్టికర్త అయిన ఏకేశ్వరుణ్ణి విశ్వసిస్తున్నాను. నువ్వు చెప్పే ధర్మాన్నీ స్వీకరిస్తున్నాను’ అని స్పష్టంగా ప్రకటించారు అబూబకర్ (ర). ఈ ప్రకటన విన్న బీబీ ఖదీజ (ర) పరమ సంతోషంతో పొంగిపోయారు. సంతోషం పట్టలేక తలపై చెంగు కప్పుకొని బయటకొచ్చారు. ‘అబూ ఖహాఫా కుమారా నీకు శుభం. దేవుడు నీకు రుజుమార్గం చూపించాడు. ఆయనకు కృతజ్ఞతలు’అన్నారు. అబూబకర్ (ర) విశ్వాస ప్రకటన పట్ల ముహమ్మద్ ప్రవక్త (స) కూడా చాలా ఆనందించారు. ఆయన ఇస్లామ్ స్వీకరణతో ముహమ్మద్ (స) కు మంచి ఊతం లభించింది.ప్రచారమార్గం కూడా సుగమం అయింది.
- ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతా వచ్చేవారం)