Prophet life
-
భయంకరం... అత్యుత్తమం
లుఖ్మాన్ (అ.లై) ఒక గొప్ప దార్శనికుడు. ఒకసారి అతని యజమాని అతన్ని పిలిచి, ఒక మేకను జుబా చేసి అందులో నుండి శ్రేష్టమైన రెండు అవయవాలు తీసుకుని రమ్మని చెప్పాడు.యజమాని చెప్పిన విధంగానే లుఖ్మాన్ మేకను జుబా చేసి అందులో నుండి హృదయం, నాలుకను తెచ్చి యజమానికి ఇచ్చాడు.యజమాని మరో మేకను జుబా చేసి అందులో నుండి భయంకరమైన రెండు అవయవాలు తీసుకుని రమ్మని చెప్పాడు. యజమాని చెప్పినట్టే మరో మేకను జుబా చేసి అందులో నుండి హృదయం, నాలుకను తెచ్చి యజమానికి ఇచ్చాడు లుఖ్మాన్.‘‘అరే! శ్రేష్టమైన అవయవాలు తెమ్మన్నా హృదయాన్నీ, నాలుకనే తెచ్చావు. అతి భయంకరమైన అవయవాలు తెమ్మన్నా మళ్లీ వాటినే తెచ్చావు ఏంటీ?’’ అని ఆశ్చర్యంగా అడిగాడతను. ‘‘అయ్యా! ‘మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు హృదయం, నాలుకే. ఈ రెండు తమ పనిని సక్రమంగా నిర్వహిస్తే మనిషి జీవితం సాఫీగా సుఖంగా సాగుతుంది. ఈ రెండు గతి తప్పాయా... ఇంతే సంగతులు. అందుకే నేను మీరు శ్రేష్టమైనవి తెమ్మన్నా, భయంకరమైన అవయవాలు తెమ్మన్నా అవే తెచ్చాను‘ అని బదులిచ్చాడు. నిజమే కదా! మనిషి ఆచరణల అంకురార్పణ హృదయంలోనే జరుగుతుంది. నిష్కల్మషమైన మదిలో మంచి ఆలోచనలు వస్తాయి. ఈర‡్ష్య, ద్వేషం, పగ ప్రతీకారాలతో రగిలే మనసు వల్ల స్వయంగా మనిషికి ప్రశాంతత, సుఖసంతోషాలు కరువైతాయి. ఇలాంటి వారివల్ల సమాజానికి కూడా ఎలాంటి మేలు చేకూరదు.పైగా ప్రమాదమే ప్రమాదం. ఇంకా నరం లేని నాలుక సమాజంలో అశాంతికి అల్లకల్లోలానికి అసలు కారణం అంటే అతిశయోక్తి కాదేమో. ప్రవక్త (స)‘ నాలుకతో జాగ్రత్తగా ఉండండి. అదే మిమ్మల్ని స్వర్గానికి లేదా నరకానికి తీసుకుని వెళ్ళుతుంది ‘ అని అన్నారు. అందుకే ప్రతి రంజాన్మాసంలో ఈ రెంటినీ పరిశుద్ధ పరుచుకునే శిక్షణ పొందే ఏర్పాటే రోజాలు... కేవలం ఉపవాసం చేయడం మాత్రమే కాదు... నాలుకతో చెడు మాట్లాడకూడదు. హృదయం నిండా సాటి మనిషి పట్ల ప్రేమను నింపుకోవాలి. అదే రంజాన్ ఉపవాసాల ల క్ష్యం. – షేక్ అబ్దుల్ బాసిత్ -
అబూబకర్ దైవ విశ్వాస ప్రకటన
ప్రవక్త జీవితం అలీతో ముహమ్మద్ (స) పెంపుడు కొడుకు జైద్కు మంచి స్నేహం ఉండేది. ఎటు వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసి చేసేవారు. ఈ కారణంగా జైద్ కూడా అలీ బాటలోనే నడిచి ధర్మాన్ని స్వీకరించాడు. వీరిద్దరూ ముహమ్మద్ ప్రవక్తను అమితంగా అభిమానించేవారు.ఆయన మాటను రవ్వంతైనా జవ దాటేవారు కాదు. ఆయన(స) కూడా వారిని అంతగానే ప్రేమించేవారు. కంటికి రెప్పలా చూసుకునేవారు. ఈక్రమంలోనే ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) ప్రియ స్నేహితుడు అబూబకర్ ఆయన వద్దకు వచ్చారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్నారు. చర్చ ఆధ్యాత్మిక విషయాలవైపు మళ్లింది. ‘అబూబకర్! నా గురించి నీకు పూర్తిగా తెలుసు గదా!’ అన్నారు ముహమ్మద్ (స). ‘ఏమిటి ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు. నీగురించి నాకు తెలియకపోవడం ఏమిటి? చిన్నప్పటినుండీ చూస్తున్నాను నిన్ను’. ‘అది సరే, నేనేదైనా చెబితే నువ్వు నమ్ముతావా?’ ‘అదేమిటీ అలా అడుగుతావు? నువ్వు ఏనాడైనా అబద్ధమాడావా, నేనీరోజు నమ్మకపోడానికి? నువ్వు అత్యంత సత్యసంధుడవని, నిజాయితీ పరుడవని, మానవతా మూర్తివని నేనే కాదు, యావత్ జాతి నమ్ముతోంది’ అన్నారు అబూబకర్. ‘నేను దేవుని ప్రవక్తను అంటే నమ్ముతావా?’ మళ్లీ రెట్టించారు ముహమ్మద్ (స). ‘తప్పకుండా నమ్ముతాను. అసత్యం అన్నది నీ జీవితంలో నేను చూడలేదు, వినలేదు’ అన్నారు అబూబకర్ స్థిర నిశ్చయంతో. ‘అయితే విను. దైవం నన్ను తన ప్రవక్తగా ఎంచుకున్నాడు. దైవదూత జిబ్రీల్ నావద్దకు వస్తున్నారు. నాపై దేవుని సందేశం అవతరిస్తోంది. కనుక నువ్వు కూడా దైవేతర శక్తులన్నిటినీ వదిలిపెట్టి, ఒక్క దైవాన్నే నమ్ముకో. ఆయనే సర్వ సృష్టికర్త. విశ్వ వ్యవస్థను, సమస్త జీవకోటిని ఆయనే సృజించాడు. అందరి జీవన్మరణాలూ ఆయన చేతుల్లోనే ఉన్నాయి’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త (స). ‘అవును, నిస్సందేహంగా నువ్వు దైవ ప్రవక్తవే. నేను నమ్ముతున్నాను. విశ్వ సృష్టికర్త అయిన ఏకేశ్వరుణ్ణి విశ్వసిస్తున్నాను. నువ్వు చెప్పే ధర్మాన్నీ స్వీకరిస్తున్నాను’ అని స్పష్టంగా ప్రకటించారు అబూబకర్ (ర). ఈ ప్రకటన విన్న బీబీ ఖదీజ (ర) పరమ సంతోషంతో పొంగిపోయారు. సంతోషం పట్టలేక తలపై చెంగు కప్పుకొని బయటకొచ్చారు. ‘అబూ ఖహాఫా కుమారా నీకు శుభం. దేవుడు నీకు రుజుమార్గం చూపించాడు. ఆయనకు కృతజ్ఞతలు’అన్నారు. అబూబకర్ (ర) విశ్వాస ప్రకటన పట్ల ముహమ్మద్ ప్రవక్త (స) కూడా చాలా ఆనందించారు. ఆయన ఇస్లామ్ స్వీకరణతో ముహమ్మద్ (స) కు మంచి ఊతం లభించింది.ప్రచారమార్గం కూడా సుగమం అయింది. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతా వచ్చేవారం) -
బహీరా వినిపించిన భవిష్యవాణి
చిన్నారి ముహమ్మద్ (స)ను సమీపించాడు బహీరా. తన స్థాయిని, హోదాను, అధికారాన్ని పక్కనబెట్టి నేలపైనే కూర్చున్నాడు. క్షేమ సమాచారం అడిగాడు. అనేక ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ చిన్నారి ముహమ్మద్ (స) సరైన, సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడంతో బహీరా అమితానందభరితుడయ్యాడు. భావిప్రవక్తగా చిన్నారి ముహమ్మద్ (స)ను మనసులోనే విశ్వసించాడు. అబూతాలిబ్ నుద్దేశించి, ‘ఈ చిన్నారి మీకేమవుతాడు’ అని ప్రశ్నించాడు బహీరా. ‘మా అబ్బాయే. అన్నాడు అబూతాలిబ్. ఇకనుండి ఈ చిన్నారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ యూదులకంట పడనీయకండి. దైవసాక్షిగా చెబుతున్నా. వారు ఇతన్ని చూసినా, ఇతని విషయంలో నేను తెలుసుకున్న విషయాలు వారు కూడా తెలుసుకున్నా ఈ చిన్నారి ప్రాణం ప్రమాదంలో పడినట్లే. ‘అంటే..?’ ‘అంటే ఏమిటి? నా కొడుకండీ బాబు’ అన్నాడు అబూతాలిబ్ . ‘కానీ, ఇది అసంభవం. ఈ చిన్నారి మీ కొడుకా. ఇతని తండ్రి బతికి ఉండే అవకాశాల్లేవు’ అన్నాడు బహీరా దృఢనిశ్చయంగా. ‘అదేమిటి? అంతనమ్మకంగా ఎలా చెప్పగలరు?’ అబూ తాలిబ్ నిజంగానే ఆశ్చర్యచకితులయ్యారు. ‘ఈ చిన్నారిని చూసి, ఇతనితో మాట్లాడిన తరువాత, గ్రంధజ్ఞానం వెలుగులో సమీక్షించుకొని చెబుతున్నాను’ అన్నాడు బహీరా మరింత నమ్మకంగా. చిన్నారి ముహమ్మద్ (స) విషయంలో అతడి అవగాహనకు అబ్బురపడ్డాడు. ‘అవును, ఇతను నా సోదరుని కొడుకు. నేనితని బాబాయిని’. ‘మరి ఇతని తండ్రి?’ ‘‘ఈ పిల్లవాడు తల్లిగర్భంలో ఉన్నప్పుడే నా సోదరుడు అబ్దుల్లాహ్ చనిపోయాడు’’. ‘మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం. ఇకనుండి ఈ చిన్నారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ యూదులకంట పడనీయకండి. దైవసాక్షిగా చెబుతున్నా. వారు ఇతన్ని చూసినా, ఇతని విషయంలో నేను తెలుసుకున్న విషయాలు వారు కూడా తెలుసుకున్నా ఈ చిన్నారి ప్రాణం ప్రమాదంలో పడినట్లే. జాగ్రత్తగా చూసుకోండి. మీ అబ్బాయి మహా పురుషుడవుతాడు. మహిమాన్వితు డవుతాడు’ అన్నాడు బహీరా. తరువాత, చిన్నారి ముహమ్మద్ విషయంలో తన అంచనా నిజమైనందుకు ఆనందంతో పొంగిపోతూ వారినుండి సెలవు తీసుకున్నాడు. సిరియా ప్రయాణం ముగించుకొని మక్కాకు చేరుకున్న అబూతాలిబ్కు బహీరా మాటలే మనోమస్తిష్కాల్లో సుడులు తిరుగుతున్నాయి. చిన్నారి ముహమ్మద్ (స) విషయంలో బహీరా వినిపించిన భవిష్యవాణి చెవుల్లో మార్మోగుతోంది. ఆలోచనలు పరిపరివిధాలా పరుగులు పెడుతున్నాయి. - యం.డి. ఉస్మాన్ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు)