సంపాదించడం తప్పా? | Making it a crime? | Sakshi
Sakshi News home page

సంపాదించడం తప్పా?

Published Sat, Nov 26 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

సంపాదించడం తప్పా?

ఇవాళ దేశంలో ఎవరిని కదిలించినా కరెన్సీ కబుర్లే! ఒకప్పుడు మన జేబులో విలాసంగా ఉన్న విలువైన వెయ్యి నోటు ఇవాళ చిత్తు కాగితంతో సమానమంటే, మరేదో కొత్త నోటు సంపాదిస్తే దాని విలువ రెండు వేలని అంటే - అసలు విలువ దేనిది? ఆ కాగితానిదా? లేక మనం దానికి ఇస్తున్న ప్రాధాన్యానిదా? ఇంతకీ డబ్బు సంపాదన మంచిదా? చెడ్డదా? ఎంత సంపాదిస్తే మంచి? మరెంత సంపాదిస్తే చెడు?


డబ్బు సంపాదన తప్పు అని మన ధర్మం ఎక్కడా చెప్పలేదు. మానవ జీవితంలో దానికున్న విలువనూ తోసిపుచ్చలేదు. కాకపోతే, ఎలా సంపాదించాలో స్పష్టంగా చెప్పాయి. మనిషి తన జీవితంలో నాలుగు పురుషార్థాల కోసం శ్రమించాలని శాస్త్రవచనం. ఆ నాలుగూ ఏమిటంటే ధర్మం, అర్థం (డబ్బు), కామం (కోరిక), మోక్షం! ఈ చతుర్విధ పురుషార్థాల్లో - రెండోది ధన సంపాదన. మొట్టమొదటిది - ధర్మం. అంటే, జీవితాన్ని ధర్మంగా గడపాలి. అది మొదటిది. అలా ధర్మంగా జీవిస్తూ, ‘అర్థం’... అంటే డబ్బు సంపాదించాలి. అది రెండోది. అలా ధర్మమార్గాల్లో కష్టపడి సంపాదించిన డబ్బు ద్వారా, ధర్మబద్ధంగా కోరిక తీర్చుకోవాలి. అది మూడోది. ఇలా మూడింటితో, నాలుగో పురుషార్థమూ, అత్యున్నతమైన మోక్షసాధన చేయమన్నారు.


అలాగే, ప్రతి గృహస్థూ నిత్యం అయిదు రకాల కర్మలు చేయాలని శాస్త్రమే చెబుతోంది. అవి - ‘బ్రహ్మ యజ్ఞం’ (పరమాత్మను సేవించడం), ‘దేవ యజ్ఞం’ (దేవతల సేవ), ‘పితృ యజ్ఞం’ (పితృదేవతల సేవ), ‘మనుష్య యజ్ఞం’ (తోటి మానవుల్ని సేవించడం), ‘భూత యజ్ఞం’ (ఇతర జీవకోటిని సేవించడం). ఈ అయిదూ నిత్యజీవితంలో ఆచరించాలంటే, ద్రవ్యం కావాలి. అంటే, గృహస్థుగా జీవితం సాగిస్తున్నవారు డబ్బు సంపాదించడం తప్పు కానేకాదు. కాకపోతే, మనిషి ఆ డబ్బును ధర్మంగా సంపాదించకపోతేనే తప్పు. అలా ధర్మంగా సంపాదించిన డబ్బును కూడా తన అవసరాలకు వినియోగించుకోగా మిగిలినది సమాజ హితం కోసం, తోటివారి బాగు కోసం వినియోగించకపోతే మరీ తప్పు. భగవంతుణ్ణీ, తోటివారినీ సేవించకుండా కేవలం తమ కోసం తాము బతికేవారు నరకంలో పడతారని ‘భగవద్గీత’ పేర్కొంది. 


గృహస్థుగా మన ధర్మం నిర్వహిస్తున్నప్పుడు, నిజజీవిత సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఉద్యోగ బాధ్యతలు వహిస్తున్నప్పుడు అనుకోకుండా - మాటలతోనో, చేతలతోనో, ఆలోచనలతోనో ఇతరులను బాధించే ప్రమాదం ఉంది. అది ఉద్దేశపూర్వకం కాకపోయినా దుష్కర్మే. అందుకే, నిస్వార్థంగా తోటివారికి సేవ చేస్తూ, చేసిన కర్మలన్నిటినీ భగవంతుడికి అర్పించాలి. అప్పుడు ఆ దుష్కర్మ తీరుతుందని పెద్దల మాట. అంటే, డబ్బు సంపాదించేది స్వార్థం కోసం, మన అహంకారాన్ని పెంచుకోవడం కోసం కాదు! మన నిత్యావసరాలు తీర్చుకొంటూనే, తోటి మానవుల్లో ఉన్న మాధవుణ్ణి సేవించడం కోసం! అలాగే, మనది కానిది తీసుకోవడం దొంగతనంతో సమానం. సంపాదించే క్రమంలో మరొకరికి కష్టం, నష్టం కలిగించడం, అవతలివారిని వాడుకొని వదిలేయడం పరమ తప్పు.


కానీ, ఇవేవీ మనం గ్రహించడం లేదు. ఎంత సంపాదించినా, ఇంకా ఇంకా కావాలనే దురాశలో పడిపోతున్నాం. ‘నాకు, నా పిల్లలకు, వాళ్ళ పిల్లలకు...’ అంటూ తరతరాలకూ సరిపడా ఆస్తుల్ని స్వార్థంతో పోగేసుకోవడం మీద దృష్టిపెడుతున్నాం. నిజానికి, పోగు చేసుకోవాల్సింది ధర్మాన్ని ఆచరించడం ద్వారా వచ్చే పుణ్యాన్ని! అంతేతప్ప, పోయినప్పుడు వెంట రాని ఈ ఆస్తుల్ని కాదు!! అది మనం గుర్తించడం లేదు. సౌకర్యంగా జీవించడం తప్పు కాదు. దాని కోసం అక్రమ మార్గాలకు మళ్ళడం తప్పు. అధర్మంగా డబ్బు సంపాదిస్తే, అది తాత్కాలికంగా సుఖం ఇచ్చినట్లు అనిపించవచ్చు కానీ, ఆ పాపం మాత్రం వెంటాడి వేధిస్తుంది. ఎవరైనా, అవసరానికి మించి కూడబెడితే, ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎరవైనట్లు...’ అని శతకకారుడు చెప్పినట్లుగా ఆ డబ్బంతా చివరకు ప్రభుత్వాల సొమ్ము, పరుల సొమ్ము అవుతుంది. అసలు సిసలు ‘బ్లాక్ మనీ’ బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నది అందుకే!       - రెంటాల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement