ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఇదివరకటి రోజుల్లో పరిస్థితులు వేరు. భర్త సంపాదిస్తే.. భార్య ఇంటి బాధ్యతలు చూసుకునేది. తన సంపాదనలో నుంచి ఇంటి ఖర్చులు పోను.. కొంత డబ్బును భార్యకు పాకెట్‌మనీగా ఇచ్చేవాడు భర్త. అదీగాక మన దేశంలో ఎక్కడ భర్త జీతం మొత్తం తీసుకొచ్చి భార్య చేతలో పెట్టడమనేది అస్సలు జరగని పని. కానీ జపాన్‌లో మాత్రం జీతం రాగానే రూపాయి ఖర్చు చేయకుండా డబ్బు మొత్తం భార్య చేతిలో పెట్టాల్సిందేనట!
ఆపై దానిపై అధికారమంతా ఆమెదే! డబ్బు నిర్వహణ మొత్తం భార్యలే చూసుకోవడం, కొంత మొత్తాన్ని భర్తకు పాకెట్‌మనీగా ఇవ్వడం అక్కడ ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ పద్ధతిని అక్కడ ‘కొజుకై’గా పిలుస్తారు. అక్కడి జనాభాలో దాదాపు 74 శాతం మంది దంపతులు ఇప్పటికీ ఈసంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదీగాక చైనా మహిళలు పొదుపు విషయంలో ఇతర దేశాల మహిళకు స్ఫూర్తిగా ఉంటారట.
ఇంటి ఖర్చుల గురించి ఇల్లాలి కంటే బాగా ఎవ్వరికీ తెలియదు. ! అందుకే మహిళల్ని హోమ్ మినిస్టర్లు అని పిలుస్తుంటారు. అయితే జపాన్‌లో భార్యలు ఉద్యోగం చేసినా, చేయకపోయినా.. ఇంటి ఖర్చుల కోసం కొంత డబ్బును భార్య చేతికిస్తారు భర్తలు.ఇది అక్కడ సర్వసాధారణం.
పొదుపు మదుపుల్లో నిష్ణాతులు వారే..
అక్కడ చాలావరకు ప్రతి ఇంట్లో సంపాదనంతా తెచ్చి భార్య చేతిలో పెట్టే భర్తలే కనిపిస్తారట! ఇలా భర్త సంపాదనను ఖర్చులు, పొదుపులు అనే రెండు వర్గాలుగా విభజించుకుంటారట జపాన్ మహిళలు. ఇంటికి సరిపడా నిత్యావసరాలు, రేషన్, ఇతర ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు.. వంటి వాటికి ఖర్చుల కోసం పక్కన పెట్టుకున్న డబ్బును వినియోగిస్తుంటారట అక్కడి మహిళలు!.
ఇక ఇందులో నుంచే తమ భర్తకు నెలకు సరిపడా ఖర్చుల కోసం కొంత డబ్బును పాకెట్‌మనీ రూపంలో అందిస్తుంటారు. ఇలా భర్త డబ్బును మేనేజ్ చేస్తూ.. వాళ్లకు పాకెట్‌మనీని అందించే ఈ పద్ధతిని ‘కొజుకై’ అనే పేరుతో పిలుస్తున్నారు జపనీయులు. ఇంటి అవసరాల కోసం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినంతగా.. పొదుపు-మదుపులపై మహిళలకు అవగాహన ఉండదనుకుంటారు చాలామంది. ఐతే జపాన్ మహిళలు ఇందులోనూ నిష్ణాతులేనట! భర్త తెచ్చిన సంపాదనను ఇంటి అవసరాల కోసం బ్యాలన్స్‌డ్‌గా ఖర్చు చేయడంతో పాటు.. మిగిలిన డబ్బును పొదుపు చేయడంలోనూ వారు ముందుంటారట!.
ఈ క్రమంలో లాభాలొచ్చే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొంత డబ్బును ప్రత్యేకమైన ‘మనీ పర్సు’లో దాచుకుంటారట! అత్యవసర పరిస్థితుల్లో ఇది తమను ఆదుకుంటుందని వారి నమ్మకం. అంతేకాదు.. ఒకవేళ ఎప్పుడైనా తమ భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చినా లేదంటే తమ భర్త నుంచి విడిపోవాల్సి వచ్చినా.. పరిస్థితులు సద్దుమణిగే దాకా ఈ డబ్బు వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని జపాన్ మహిళలు చెబుతున్నారు. ఏదేమైనా ఆర్థిక విషయాల్లో జపాన్ మహిళల ముందుచూపు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కదూ!!.
(చదవండి: 115 ఏళ్ల బామ్మ..! ఆమె సుదీర్ఘకాల జీవిత రహస్యం ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment