సాధారణంగా కష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనిషి నిరాశకు గురవుతాడు. తన ప్రార్థనలు, వినతులు దైవం వినిపించుకోడా ఏమిటి అనే సందేహం కలుగుతుంది. భగవంతునికి అనేక మంది భక్తులుంటారు. వాళ్ళు గొప్పగా పూజలు చేస్తుంటారు. అంతమందిలో తానేం గుర్తుంటాడు? ఇలా ఆలోచిస్తూ సాధారణంగా నిస్పృహకు లోనవుతుంటారు మానవులు.
సరిగ్గా భక్త హృదయాలను చదివినట్లుగా నరసింహ శతక కవి, ‘ఓ దేవా! నా వంటి సేవకుల సమూహం నీకు కోట్ల కొలది ఉంటారు. వారి సందడిలో, వారి సేవలలో నన్ను అశ్రద్ధతో మర్చిపోవద్దు. వారి పుణ్యాతిశయం చేత చాలా మంది సేవకులు నీవెంట పడేవారుండగా నీకు నేనే మాత్రం! నీవు మెచ్చే పనులు నేను చేయలేను. ఈ భూజనులలో నేను పనికిమాలిన వాణ్ణి. అయినా, నీ శుభమైన చూపు నాపై ప్రసరించు’ అని ప్రార్థిస్తాడు.
అలాగే ‘నా రెండు కన్నులతో నిన్ను చూసే భాగ్యం నాకెప్పుడు? నా మనసులో కోర్కె తీరునట్లు నీ రూపం చూపించు. పాపం చేసినవారికి కనిపించనని ప్రమాణం చేసుకున్నావా? కానీ, పాపులను పరిశుద్ధు లను చేసే దేవుడివి నువ్వే అని మహాత్ములంతా నిన్ను స్తుతిస్తారు. పాపులను రక్షించి నందుకే నీకింత కీర్తి. చెడ్డవాడినైననూ నాకు కనిపించవా!’ అని వేడు కుంటాడు.
ఇందులో భక్తులందరి వేదనా ఉంది. ఆర్తి ఉంది. తనను మాత్రమే దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే సందేహం ఉంది. భగవంతుని కరుణ శీఘ్రంగా తనపై ప్రసరించాలని, ఆ దివ్య రూపాన్ని కళ్లారా దర్శించి తరించాలనే తపన ఉంది. తాను భగవంతుడు మెచ్చే పనులు చేయటం లేదేమో, అందుకే ఆయన దయ తనకు లభించడం లేదేమో, అలా మెప్పించే శక్తి తనకు లేదుకదా అనే నిస్సహాయత ఉంది. భగవంతుని విషయంలో భక్తుల హృదయాలలో సహజంగా కనిపించే వేదన ఇదే! – డా. చెంగల్వ రామలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment