ఈ విశ్వంలో ఆలోచనలు, భావనలను మనిషి మాత్రమే మాటల ద్వారా తెలుపగలడు. ఏ ఇతర జీవికీ మాట్లాడే శక్తి లేదు. మాట్లాడటం అనేది భగవంతుడు మానవునికి అనుగ్రహించిన వరప్రసాదం. మానవుడు తన జీవితాన్ని సంతోషమయం లేక దుఃఖమయం కావించుకోవడం అనేది దేవుడు ఇచ్చిన వరప్రసాదాన్ని ఉపయోగించుకొనే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. మాటను సరిగా, విచక్షణతో ఉపయోగించుకొన్న మానవుడు... తాను ఆనందంగా ఉండడమే కాక ఇతరులను కూడా సంతోషపరచగలడు.
దీనికి భిన్నంగా విచక్షణారహితమైన, అస్తవ్యస్తమైన మాటలు మాట్లాడుట వల్ల సమస్యలు వస్తాయి. ఫలితంగా మనిషి జీవితం దుఃఖమయం అవుతుంది. ఈ కారణం వల్లనే ‘మాట్లాడడానికి ముందు ఆలోచించు’ అని పెద్దలు చెప్పారు. మనం సర్వకాల, సర్వావస్థలయందు తియ్యగా, ఇంపుగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. మనం మాట్లాడే పద్ధతి ఇతరులను కోపోద్రిక్తులను చేయకుండా జాగ్రత్త పడాలి. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి. నియమాలను ఉల్లంఘించకుండా ఉండడమే వినయం. ఈ పద్ధతి భగవద్గీతలో ‘వాజ్మయ తపస్సు’అని తెలుపబడినది.
మనం చేయు భౌతికపరమైన పనులన్నీ ఆలోచనలపైననే ఆధారపడి ఉంటాయి. ఆలోచించడం, మంచి– చెడులను తెలుసుకొనడం బుద్ధికి సంబంధించిన పని. బుద్ధిబలాన్ని ఉపయోగించి ‘ఏది ఉచితం, ఏది ఉచితంకాదు’ అని మనం తెలుసుకో గలుగుతున్నాం. మనం చేసే పనిని బట్టి మన ఆలోచన వ్యక్తమవుతుంది.
ఉదాహరణకు ఒక వక్త ముందు మైక్ ఏర్పాటు చేసినా... ఆ వక్త ఆలోచన మాటల రూపంలో బయటికి రానంత వరకూ మైక్ మనకు వినిపింపచేయలేదు. అలాగే క్రియ అనేది దానంతట అది మంచి కాదు లేక చెడు కాదు. దీని (చర్య) మంచి, చెడులు దీనికి మూలాధారమైన ఆలోచనలోనే ఉంటాయి. అందువల్లనే మనం చేసే పని మంచిగానూ, గౌరవప్రదంగానూ ఉండాలి. మంచి ఆలోచనలకే తావునిచ్చి, వాటిని వృద్ధి చేసుకోవాలి.
– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి
Comments
Please login to add a commentAdd a comment