పల్లె మహిళ పరిస్థితే బాగుంది..!
ఇంతి పని
పట్టణాలు అంటే సౌకర్యాలకు నెలవులు. ఇక్కడ లభించే సౌకర్యాలు మనిషి జీవితంలో సుఖప్రదం చేస్తాయి. ప్రత్యేకించి ఆడవాళ్లకు... పట్టణ ఆవాసం చాలా కష్టాన్ని తగ్గిస్తుంది. పల్లెల్లోని ఆడవాళ్లు ఇంటిపని, వంటపని అంటూ కష్టపడాల్సి ఉంటుంది. పుర మహిళలకు మాత్రం అలాంటి కష్టమేదీ ఉండదు... అనేవి మన మధ్యన సహజంగా వినిపించే అభిప్రాయాలు. పట్టణ, పుర ప్రాంతాల్లోని జీవనశైలిని పరిశీలించి... అక్కడా, ఇక్కడ మహిళలు చేయాల్సిన, చేసే పనులను చూసి ఈ అభిప్రాయానికి వస్తుంటారు. అయితే ఈ అభిప్రాయాలు ఒట్టిభ్రమలు మాత్రమే. పల్లెల్లోని మహిళలతో పోలిస్తే చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లోనూ నివసించే మహిళలకే ఈ కష్టం చాలా ఎక్కువ అని అంటున్నారు భారత ప్రభుత్వ అధికారిక గణాంక సంస్థ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్‌ఎస్‌ఎస్‌వో) అధ్యయనకర్తలు.
ఎన్‌ఎస్‌ఎస్‌వో చేపట్టిన ఈ అధ్యయనం ప్రకారం పట్టణ, నగరాల్లో నివసించే మహిళలకు ఇంటి పని చాలా భారంగా పరిణమించింది. దాదాపు 64 శాతం మంది మహిళలకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకూ ఏదో విధంగా ఇంటిపనులే కలవరపెడుతున్నాయి. వీరిలో ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు. వీళ్లు అయితే అటు ఆఫీస్ పని, ఇటు ఇంటిపని రెండు భారాలనూ మోయాల్సి వస్తోంది. వీళ్లతో పోలిస్తే పల్లెల్లోని మహిళలే చాలా సుఖంగా జీవిస్తున్నట్టు లెక్క!
ఇంతే కాదు అనేక రకాలుగా పరిశీలించి చూసినా... పట్టణ మహిళల కన్నా వ్యవసాయపు పనుల్లో భాగస్వామ్యులు అవుతూ ఇంటిని తీర్చిదిద్దుకొనే పల్లె మహిళల పరిస్థితే బాగుందనేది ఎన్‌ఎస్‌ఎస్‌వో విశ్లేషణ. అదెలా అంటే... పల్లెల్లో ఉండే మహిళకు ఇంట్లోని అత్తగారో, అదే ఊర్లో ఉండే బంధువుల తోడు ఉంటుంది. వాళ్లతో అనుబంధాన్ని బట్టి పనిని షేర్ చేసుకొనే అవకాశం ఉంటుంది. అయితే పట్టణంలోని మహిళకు ఆ అవకాశమే లేదు. ఎవరికి వారుగా బతికే చోట పనులను పంచుకోవడం ఏముంటుంది?! అని అధ్యయనకర్తలు పరిస్థితిని తెలియజెప్పుతున్నారు.
15 యేళ్లు దాటగానే అమ్మాయిలకు ఇంటి పని ఒక బాధ్యత అవుతోందని కూడా అధ్యయనకర్తలు గుర్తించారు. పల్లెల్లోని, పట్టణాల్లోని మహిళలను కలుపుకొని చూస్తే 34 శాతం మంది పనిమనిషి ఉంటే బావుంటుందన్న కోరికను వెలిబుచ్చారు. మిగిలిన వారు మాత్రం తమ ఇంటి పనిని తాము చేసుకొంటేనే తమకు సంతృప్తి ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు. భారతదేశం మొత్తం మీదున్న పరిస్థితిని పరిశీలించి చూసుకొంటే... 92 శాతం మంది మహిళలకు ఇంటిపని చేయడమే పని. ఇవి భారతీయ మహిళ జీవన చిత్రం గురించి నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ చెప్పిన విషయాలు.