National Sample Survey Organisation
-
45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగిత..!
న్యూఢిల్లీ: కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్రమోదీతో సహా 58 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఎన్నికల ముందు తయారైన జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్ఎస్ఎస్ఓ) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) వివరాలు వెల్లడయ్యాయి. సర్వే వివరాలను కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం బహిర్గతం చేసింది. 2017–18 సంవత్సరంలో దేశంలో నిరుద్యోగం రేటు 6.1 శాతంగా ఉందని తెలిపింది. ఇది గడిచిన 45 ఏళ్లలో గరిష్టమని వెల్లడించింది. గత ఏడాది(2017–18) పట్టణ ప్రాంత పురుషుల్లో 7.8 శాతం, మహిళల్లో 5.3 శాతం నిరుద్యోగంలో ఉన్నారని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా గత ఏడాది (2017–18) పురుషుల్లో 6.2 శాతం, మహిళల్లో 5.7 శాతం నిరుద్యోగిత ఉందని సర్వే పేర్కొంది. ఇక ఎన్నికలకు ముందే పీఎల్ఎఫ్ఎస్ పూర్తయింది. సర్వే వివరాలు కూడా అనధికారికంగా ఫిబ్రవరిలోనే వెల్లడయ్యాయి. అయితే, ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో సర్వే వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. ఈ నివేదిక ముసాయిదా మాత్రమేననీ, దీనిని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తెలిపారు. (50 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం) -
ఇదీ మోదీ తరహా ‘ధర్మం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్యపై ‘నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్’ నిర్వహించిన అధ్యయన వివరాలను వెల్లడించవద్దంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హుకుం జారీ చేయడాన్ని నిరసిస్తూ ‘నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్’ నుంచి గత వారంలో ఇద్దరు స్వతంత్య్ర సభ్యులు రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సభ్యులు మాత్రమే కమిషన్లో కొనసాగుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వారించినా సర్వే నివేదికలోని అంశాలను ‘బిజినస్ స్టాండర్ట్’ పత్రిక వెతికి పట్టుకొని బయట పెట్టడంతో అన్ని పత్రికలు ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. దేశంలో 2011–12 సంవత్సరంలో నిరుద్యోగ సమస్య 2.2 శాతం ఉండగా, 2017–2018 సంవత్సరంలో అది 6.1 శాతానికి చేరుకుందని, ఇది గడిచిన 45 ఏళ్లలో ఇదే గరిష్టమని వెల్లడించడమే మోదీ ప్రభుత్వం ఆ నివేదిక విడుదలను అడ్డుకోవడానికి కారణం. ఇలాంటి నివేదికలను ఇలా అడ్డుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం పనితీరు బాగా లేదని సూచించే అధికార గణాంకాలను, నివేదికలను మోదీ ప్రభుత్వం మొదటి నుంచి అడ్డుకుంటోంది. 2017లో ‘ఉద్యోగ నియామకాలు–నిరుద్యోగం’ అంశంపై నిర్వహించాల్సిన జాతీయ సర్వేను రద్దు చేసింది. దేశంలోని ఉద్యోగ అవకాశాలపై ‘లేబర్ బ్యూరో’ ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన సర్వేలను వద్దన్నది. ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తానంటూ 2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమవడం వల్లనే మోదీ ప్రభుత్వం ఇలాంటి నివేదికలను బయటకు రానీయడం లేదన్నది సుస్పష్టం. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుపై ఇదే ‘నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్’ ఇచ్చిన నివేదికను కూడా మోదీ ప్రభుత్వం తిరస్కరించడం గమనార్హం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలో ఉన్న జీడీపీ వృద్ధి రేటు నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో పడిపోయినట్లు ఆ గణాంకాలు సూచించడమే ఆ నివేదికను తిరస్కరించడానికి కారణం. నివేదిక విడుదలకు కేంద్రం అనుమతించకపోయినా ఇప్పటి ‘నిరుద్యోగంపై నివేదిక’లోని అంశాల్లాగే అవి బయటకు వచ్చాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలోకన్నా మోదీ ప్రభుత్వం హయాంలో వరుసగా జీడీపీ వృద్ధి రేటు పడిపోతున్నట్లు గణాంకాలు తెలియజేస్తుండడంతో అసలు లెక్కలోనే తప్పుందని, కొత్త ప్రాతిపదికన లెక్కలు చెప్పాలని మోదీ ప్రభుత్వం 2017లో ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రాతిపదికన జీడీపీ వృద్ధిని అంచనా వేసినప్పుడు అదే పద్ధతిన అంతకు ఐదేళ్ల ముందున్న వృద్ధి రేటు కూడా అంచనా వేయడం తప్పనిసరని ఆర్థిక నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో మోదీ హయాంలో వృద్ధి రేటును కొత్త పద్ధతిన లెక్కించిన ‘నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్’ వృద్ధి రేటును 5.7 శాతంగా పేర్కొంది. అదే పద్ధతిన 2011–2012 సంవత్సరంలోని వృద్ధి రేటును అంచనా వేయగా 7.1 శాతంగా తేలింది. ఈ కారణంగా నివేదిక విడుదలను మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఈ అంకెలతో విభేదించిన ‘నీతి ఆయోగ్ (ప్రధాని సలహా మండలి)’ పాత లెక్కల జోలికి వెళ్లకుండా మోదీ ప్రభుత్వం 7.2 శాతం వృద్ధి రేటును సాధించిందని అసాధారణ నివేదికను ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్నే ప్రచారం చేసుకుంటోంది. ప్రతి ఏటా విడుదల చేసే ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ నివేదికను కూడా ఈ సారి మోదీ ప్రభుత్వం విడుదల చేయకపోవడం గమనార్హం. 1986లో ఏర్పాటయిన ఈ బ్యూరో దేశంలో జరుగుతున్న వివిధ నేరాల డేటాను సమీక్షించి ఏట వార్షిక నివేదికను విడుదల చేస్తోంది. 2016లో జరిగిన నేరాలకు సంబంధించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2017, నవంబర్ 30వ తేదీన క్రైమ్ నివేదికను విడుదల చేశారు. 2017లో జరిగిన నేరాలకు సంబంధించిన నివేదికను 2018 నవంబర్లో విడుదల చేయాల్సిన కేంద్ర హోం శాఖ ఇంతవరకు విడుదల చేయలేదు. దీని వెనకనున్న పరమార్థం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించాలంటే ప్రభుత్వ సంస్థల ప్రతిపత్తిని, వాటి విధులను గౌరవించడం పాలకపక్షం ధర్మం! -
అప్పుల ఊబిలో రైతన్నలు
►పెట్టుబడికి అందని రుణ సాయం ►కాయకష్టం చేసినా వడ్డీలకే సరిపోదు.. ►వ్యవసాయం మాని వలస కూలీలుగా మారి.. ►ఒక్కో రైతుకు సగటున రూ.47 వేల అప్పు ►నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వెల్లడించిన నిజాలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. తెలంగాణలో 89 శాతం మంది అప్పుల భారాన్ని మోయలేక చచ్చీబతుకున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు గరిష్టంగా రైతుకు 60 శాతానికి మించి పెట్టుబడులు ఇవ్వలేకపోతున్నాయి. దిక్కులేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రతి రైతు కుటుంబానికి సగటున రూ.47 వేల చొప్పున అప్పు ఉంది. సంపాదనలో ఎక్కువ మొత్తం వడ్డీలే కడుతున్నారు..’ అని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనే సంస్థ తేల్చి చెప్పింది.వ్యవసాయం చేయలేక రైతన్న రోజు రోజుకూ కుంగిపోతున్నాడు. కాయకష్టం వృథా అవుతోంది.రెక్కల కష్టం వడ్డీలకూ సరిపోతలేదు. దిక్కులేక కొందరు రైతులు ఉరి కొయ్య ఎక్కుతున్నారు. మరికొందరు వలస కూలీలుగా మారుతున్నారు. అయినా కష్టాలనుంచి గట్టెక్కే పరిస్థితి కన్పించడం లేదు. ఇందుకు కాలం కలిసి రాకపోవడం ఓ కారణమైతే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకపోవడం మరో కారణం. కిందామీద పడి పండించిన దిగుబడులను మార్కెట్కు తరలిస్తే మద్దతు ధర రాకపోవడం కూడా మరింత సంక్షోభానికి తోడవుతుంది. సాగు విస్తీర్ణం ఇలా.. జిల్లాలో సుమారు 6.50 లక్షల హెక్టార్లలో ఖరీఫ్, దాదాపు 1.75 లక్షల హెక్టార్లలో రబీలో సాగు చేస్తుంటారు. సన్న, చిన్నకారు రైతులను కలుపుకొంటే దాదాపు ఏడు లక్షలకుపైగా రైతు కుటుంబాలున్నట్టు అంచనా. అదును పోయి... అప్పులు మిగిలి.. రైతు అవసరాల మేరకు వ్యవసాయ రుణ ప్రణాళిక ఉండటం లేదు. గత ఏడాది రుణ ప్రణాళికను భారీగా పెంచినా రుణమాఫీ తదితర కారణాలతో సకాలంలో రైతుకు సాయం అందలేదు. జూన్ మొదటి వారం నుంచి రైతులు విత్తనాలు వేస్తుంటారు. అంటే మే నెలాఖరుకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు సిద్ధం చేసుకోవాలి. ఈ లెక్కన మే నెల రెండు, మూడో వారంలో బ్యాంకులు పంట రుణాలివ్వాలి. కానీ బ్యాంకులు మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రుణాలిస్తున్నాయి. రబీ సీజన్ కోసం ఫిబ్రవరి, మార్చి నెలల్లో రుణాలు ఇస్తున్నారు. అదును నెత్తిమీదికి రావడంతో రైతులు గత్యంతరం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నా రు. రైతు అవసరాన్ని ఆస రా చేసుకునే వ్యాపారులు రూ.3 నుంచి రూ.7 వరకు వడ్డీలతో అప్పులిస్తున్నారు. అదీకూడా నేరుగా వెళ్లి తెచ్చుకునే అవకాశం లేదు. రెండు, మూడు రోజులు వ్యవసాయ పనులు వదులు కొని, ఓ మధ్యవర్తులను పట్టుకొని తెచ్చుకుంటారు. అందుకు ఓ జమానతు కూడా అవసరం. మధ్యవర్తి, జమానతు ఊరికే రారుకదా..! వారికి మర్యాద చేయాలి అంటే రూ.500, రూ.1,000 పెట్టి వారికి మద్యం తాగించాలి. ఇక ఇక్కడి నుంచే రైతుల సమస్యలు మొదలవుతాయి. రూ.లక్షల్లో పెట్టుబడి... రూ.వేలల్లో రాబడి సాధారణంగా రైతులు పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తుంటారు. దాదాపు 70 శాతం మంది చిన్నకారు రైతులే కావడంతో తమకున్న ఎకరం, రెండు ఎకరాల భూమికి తోడు మరో నాలుగైదు ఎకరాలు కౌలుకు తీసుకుంటారు. పత్తి పంటకు విత్తనాలు, యూరియా, ట్రాక్టర్ కిరాయి, పెస్టిసైడ్స్, కౌలు బాడుగ కలుపుకొంటే ఎకరానికి రూ.35 నుంచి రూ.40 వేలు ఖర్చవుతుంది. దీనికి వడ్డీ కూడా కలుపుకొంటే ఎకరా ఖర్చు రూ.50 వేలుదాటుతుంది. కనీసం మూడు ఎకరాలు సాగు చేస్తే రూ1.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. కాలం కలిసివచ్చి సేద్యం సరిగా సాగి పంట చేతికందితే పెట్టుబడి పోనూ రూ.30 నుంచి రూ.40 వేలు మిగులుతుంది. అదే పంట ఎండిపోతే రూ.1.50 లక్షలు మీదపడినట్టే. మూడేళ్లు కాలం గడిచిపోతే వడ్డీలు, చక్రవడ్డీలు కలుపుకొంటే తడిసిమోపెడవుతున్నాయి. ధైర్యంలేని రైతులు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి కొంతమంది వ్యవసాయం మానేసి పట్టణాలకు వలసపోతున్నారు. అక్కడ సంపాదించిన డబ్బుతో వడ్డీలు కూడా కట్టలేకపోతున్నారు. ఐదేళ్లుగా వెంటాడుతున్న కరువు గత ఐదేళ్లుగా రైతన్నను కరువు వెంటాడుతోంది. అదీగాక ఈ ఐదేళ్ల కాలంలో యూరియా, ఎరువులు, విత్తనాలు, రసాయన మందుల ధరల 180 శాతం పెరిగాయి. రెక్కలు ముక్కలు చేసి విత్తనం వేస్తే వర్షాభావం, కరువు కాటకాలు, అకాల వర్షాలు, చీడపీడల దాడులు, కరెంట్ కోతలు, నకిలీ విత్తనాలు చావుదెబ్బ తీస్తున్నాయి. ఇన్ని కష్టాలను తట్టుకొని చేతికొచ్చిన కొద్దోగొప్పో పంటను తీసుకొని మార్కెట్కు పోతే మద్దతు ధర ఉండటం లేదు. ఈ ఐదేళ్ల కాలంలో వరికి, పత్తికి కేవలం 10 శాతం మద్దతు ధర మాత్రమే పెరిగినట్టు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ఎగుమతులు, దిగుమతుల గురించి రైతులకు పెద్దగా తెలియక, స్థానిక మార్కెట్ల పైనే ఆధారపడి గిట్టుబాటు ధర రాక అప్పుల పాలవుతున్నారు. మార్కెట్లో ఇంత దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. మరి రైతుల పరిస్థితి బాగుపడేదెలాగో సర్కార్ పెద్దలకే తెలియాలి. -
పల్లె మహిళ పరిస్థితే బాగుంది..!
ఇంతి పని పట్టణాలు అంటే సౌకర్యాలకు నెలవులు. ఇక్కడ లభించే సౌకర్యాలు మనిషి జీవితంలో సుఖప్రదం చేస్తాయి. ప్రత్యేకించి ఆడవాళ్లకు... పట్టణ ఆవాసం చాలా కష్టాన్ని తగ్గిస్తుంది. పల్లెల్లోని ఆడవాళ్లు ఇంటిపని, వంటపని అంటూ కష్టపడాల్సి ఉంటుంది. పుర మహిళలకు మాత్రం అలాంటి కష్టమేదీ ఉండదు... అనేవి మన మధ్యన సహజంగా వినిపించే అభిప్రాయాలు. పట్టణ, పుర ప్రాంతాల్లోని జీవనశైలిని పరిశీలించి... అక్కడా, ఇక్కడ మహిళలు చేయాల్సిన, చేసే పనులను చూసి ఈ అభిప్రాయానికి వస్తుంటారు. అయితే ఈ అభిప్రాయాలు ఒట్టిభ్రమలు మాత్రమే. పల్లెల్లోని మహిళలతో పోలిస్తే చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లోనూ నివసించే మహిళలకే ఈ కష్టం చాలా ఎక్కువ అని అంటున్నారు భారత ప్రభుత్వ అధికారిక గణాంక సంస్థ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఎస్వో) అధ్యయనకర్తలు. ఎన్ఎస్ఎస్వో చేపట్టిన ఈ అధ్యయనం ప్రకారం పట్టణ, నగరాల్లో నివసించే మహిళలకు ఇంటి పని చాలా భారంగా పరిణమించింది. దాదాపు 64 శాతం మంది మహిళలకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకూ ఏదో విధంగా ఇంటిపనులే కలవరపెడుతున్నాయి. వీరిలో ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు. వీళ్లు అయితే అటు ఆఫీస్ పని, ఇటు ఇంటిపని రెండు భారాలనూ మోయాల్సి వస్తోంది. వీళ్లతో పోలిస్తే పల్లెల్లోని మహిళలే చాలా సుఖంగా జీవిస్తున్నట్టు లెక్క! ఇంతే కాదు అనేక రకాలుగా పరిశీలించి చూసినా... పట్టణ మహిళల కన్నా వ్యవసాయపు పనుల్లో భాగస్వామ్యులు అవుతూ ఇంటిని తీర్చిదిద్దుకొనే పల్లె మహిళల పరిస్థితే బాగుందనేది ఎన్ఎస్ఎస్వో విశ్లేషణ. అదెలా అంటే... పల్లెల్లో ఉండే మహిళకు ఇంట్లోని అత్తగారో, అదే ఊర్లో ఉండే బంధువుల తోడు ఉంటుంది. వాళ్లతో అనుబంధాన్ని బట్టి పనిని షేర్ చేసుకొనే అవకాశం ఉంటుంది. అయితే పట్టణంలోని మహిళకు ఆ అవకాశమే లేదు. ఎవరికి వారుగా బతికే చోట పనులను పంచుకోవడం ఏముంటుంది?! అని అధ్యయనకర్తలు పరిస్థితిని తెలియజెప్పుతున్నారు. 15 యేళ్లు దాటగానే అమ్మాయిలకు ఇంటి పని ఒక బాధ్యత అవుతోందని కూడా అధ్యయనకర్తలు గుర్తించారు. పల్లెల్లోని, పట్టణాల్లోని మహిళలను కలుపుకొని చూస్తే 34 శాతం మంది పనిమనిషి ఉంటే బావుంటుందన్న కోరికను వెలిబుచ్చారు. మిగిలిన వారు మాత్రం తమ ఇంటి పనిని తాము చేసుకొంటేనే తమకు సంతృప్తి ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు. భారతదేశం మొత్తం మీదున్న పరిస్థితిని పరిశీలించి చూసుకొంటే... 92 శాతం మంది మహిళలకు ఇంటిపని చేయడమే పని. ఇవి భారతీయ మహిళ జీవన చిత్రం గురించి నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ చెప్పిన విషయాలు.