అప్పుల ఊబిలో రైతన్నలు
►పెట్టుబడికి అందని రుణ సాయం
►కాయకష్టం చేసినా వడ్డీలకే సరిపోదు..
►వ్యవసాయం మాని వలస కూలీలుగా మారి..
►ఒక్కో రైతుకు సగటున రూ.47 వేల అప్పు
►నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వెల్లడించిన నిజాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. తెలంగాణలో 89 శాతం మంది అప్పుల భారాన్ని మోయలేక చచ్చీబతుకున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు గరిష్టంగా రైతుకు 60 శాతానికి మించి పెట్టుబడులు ఇవ్వలేకపోతున్నాయి. దిక్కులేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రతి రైతు కుటుంబానికి సగటున రూ.47 వేల చొప్పున అప్పు ఉంది. సంపాదనలో ఎక్కువ మొత్తం వడ్డీలే కడుతున్నారు..’ అని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనే సంస్థ తేల్చి చెప్పింది.వ్యవసాయం చేయలేక రైతన్న రోజు రోజుకూ కుంగిపోతున్నాడు. కాయకష్టం వృథా అవుతోంది.రెక్కల కష్టం వడ్డీలకూ సరిపోతలేదు. దిక్కులేక కొందరు రైతులు ఉరి కొయ్య ఎక్కుతున్నారు. మరికొందరు వలస కూలీలుగా మారుతున్నారు. అయినా కష్టాలనుంచి గట్టెక్కే పరిస్థితి కన్పించడం లేదు. ఇందుకు కాలం కలిసి రాకపోవడం ఓ కారణమైతే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకపోవడం మరో కారణం. కిందామీద పడి పండించిన దిగుబడులను మార్కెట్‌కు తరలిస్తే మద్దతు ధర రాకపోవడం కూడా మరింత సంక్షోభానికి తోడవుతుంది.
సాగు విస్తీర్ణం ఇలా..
జిల్లాలో సుమారు 6.50 లక్షల హెక్టార్లలో ఖరీఫ్, దాదాపు 1.75 లక్షల హెక్టార్లలో రబీలో సాగు చేస్తుంటారు. సన్న, చిన్నకారు రైతులను కలుపుకొంటే దాదాపు ఏడు లక్షలకుపైగా రైతు కుటుంబాలున్నట్టు అంచనా.
అదును పోయి... అప్పులు మిగిలి..
రైతు అవసరాల మేరకు వ్యవసాయ రుణ ప్రణాళిక ఉండటం లేదు. గత ఏడాది రుణ ప్రణాళికను భారీగా పెంచినా రుణమాఫీ తదితర కారణాలతో సకాలంలో రైతుకు సాయం అందలేదు. జూన్ మొదటి వారం నుంచి రైతులు విత్తనాలు వేస్తుంటారు. అంటే మే నెలాఖరుకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు సిద్ధం చేసుకోవాలి. ఈ లెక్కన మే నెల రెండు, మూడో వారంలో బ్యాంకులు పంట రుణాలివ్వాలి. కానీ బ్యాంకులు మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రుణాలిస్తున్నాయి.
రబీ సీజన్ కోసం ఫిబ్రవరి, మార్చి నెలల్లో రుణాలు ఇస్తున్నారు. అదును నెత్తిమీదికి రావడంతో రైతులు గత్యంతరం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నా రు. రైతు అవసరాన్ని ఆస రా చేసుకునే వ్యాపారులు రూ.3 నుంచి రూ.7 వరకు వడ్డీలతో అప్పులిస్తున్నారు. అదీకూడా నేరుగా వెళ్లి తెచ్చుకునే అవకాశం లేదు. రెండు, మూడు రోజులు వ్యవసాయ పనులు వదులు కొని, ఓ మధ్యవర్తులను పట్టుకొని తెచ్చుకుంటారు. అందుకు ఓ జమానతు కూడా అవసరం. మధ్యవర్తి, జమానతు ఊరికే రారుకదా..! వారికి మర్యాద చేయాలి అంటే రూ.500, రూ.1,000 పెట్టి వారికి మద్యం తాగించాలి. ఇక ఇక్కడి నుంచే రైతుల సమస్యలు మొదలవుతాయి.
రూ.లక్షల్లో పెట్టుబడి... రూ.వేలల్లో రాబడి
సాధారణంగా రైతులు పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తుంటారు. దాదాపు 70 శాతం మంది చిన్నకారు రైతులే కావడంతో తమకున్న ఎకరం, రెండు ఎకరాల భూమికి తోడు మరో నాలుగైదు ఎకరాలు కౌలుకు తీసుకుంటారు. పత్తి పంటకు విత్తనాలు, యూరియా, ట్రాక్టర్ కిరాయి, పెస్టిసైడ్స్, కౌలు బాడుగ కలుపుకొంటే ఎకరానికి రూ.35 నుంచి రూ.40 వేలు ఖర్చవుతుంది. దీనికి వడ్డీ కూడా కలుపుకొంటే ఎకరా ఖర్చు రూ.50 వేలుదాటుతుంది. కనీసం మూడు ఎకరాలు సాగు చేస్తే రూ1.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి.
కాలం కలిసివచ్చి సేద్యం సరిగా సాగి పంట చేతికందితే పెట్టుబడి పోనూ రూ.30 నుంచి రూ.40 వేలు మిగులుతుంది. అదే పంట ఎండిపోతే రూ.1.50 లక్షలు మీదపడినట్టే. మూడేళ్లు కాలం గడిచిపోతే వడ్డీలు, చక్రవడ్డీలు కలుపుకొంటే తడిసిమోపెడవుతున్నాయి. ధైర్యంలేని రైతులు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి కొంతమంది వ్యవసాయం మానేసి పట్టణాలకు వలసపోతున్నారు. అక్కడ సంపాదించిన డబ్బుతో వడ్డీలు కూడా కట్టలేకపోతున్నారు.
ఐదేళ్లుగా వెంటాడుతున్న కరువు
గత ఐదేళ్లుగా రైతన్నను కరువు వెంటాడుతోంది. అదీగాక ఈ ఐదేళ్ల కాలంలో యూరియా, ఎరువులు, విత్తనాలు, రసాయన మందుల ధరల 180 శాతం పెరిగాయి. రెక్కలు ముక్కలు చేసి విత్తనం వేస్తే వర్షాభావం, కరువు కాటకాలు, అకాల వర్షాలు, చీడపీడల దాడులు, కరెంట్ కోతలు, నకిలీ విత్తనాలు చావుదెబ్బ తీస్తున్నాయి. ఇన్ని కష్టాలను తట్టుకొని చేతికొచ్చిన కొద్దోగొప్పో పంటను తీసుకొని మార్కెట్‌కు పోతే మద్దతు ధర ఉండటం లేదు.
ఈ ఐదేళ్ల కాలంలో వరికి, పత్తికి కేవలం 10 శాతం మద్దతు ధర మాత్రమే పెరిగినట్టు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ఎగుమతులు, దిగుమతుల గురించి రైతులకు పెద్దగా తెలియక, స్థానిక మార్కెట్ల పైనే ఆధారపడి గిట్టుబాటు ధర రాక అప్పుల పాలవుతున్నారు. మార్కెట్‌లో ఇంత దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. మరి రైతుల పరిస్థితి బాగుపడేదెలాగో సర్కార్ పెద్దలకే తెలియాలి.