
మృత్యువుకే పరీక్ష: మనిషి ఆయుష్షును వెల్లడించే పరికరం
అనాదిగా మనిషిని వెంటాడుతున్న భయం ‘మృత్యువు’! అదెప్పుడు కబళి స్తుందో ఎవరికీ అంతుచిక్కని దేవ రహస్యం. పొంచి ఉన్న చావును తప్పించుకోవటం అసాధ్యం. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం మరణానికీ ‘పరీక్ష’ పెట్టి విధిరాతకు సవాల్ విసురుతున్నారు. ఈ భూమిపై మనిషి ఆయువు ఎన్ని రోజులు మిగిలి ఉందో తెలుసుకునేందుకు ప్రపంచంలో తొలిసారిగా తాము ఓ పరీక్షను రూపొందించినట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. చేతి గడియారం లాంటి ఓ పరికరాన్ని శరీరానికి అమర్చి లేజర్ కిరణాలను ప్రసరించటం ద్వారా ఆయుష్షును లెక్కించవచ్చని వీరు చెబుతున్నారు.
దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు. రక్తనాళాల్లోని కణాలను విశ్లేషించటం ద్వారా మనిషి దేహం వయసు ప్రభావంతో ఎలా క్షీణిస్తుందో ఇది లెక్కిస్తుంది. కేన్సర్, మనోవైకల్యం లాంటి జబ్బుల ప్రమాదాన్ని పసిగట్టే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. వచ్చే మూడేళ్లలో ఈ విధానం సాధారణ వైద్యులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ‘పెద్ద ఎత్తున డేటాబేస్ రూపకల్పనకు కృషి చేస్తున్నాం. పరీక్షించిన వారు ఈ వివరాలతో పోల్చుకోవచ్చు. దీనివల్ల కచ్చితమైన సంవత్సరాలను అంచనా వేయటానికి వీలుపడుతుంది’ అని లాన్‌కాస్టర్ వర్సిటీ అధ్యాపకుడు స్టెఫానోవస్కా చెప్పారు. ఇలాంటి మృత్యు పరీక్ష రూపొందించటం ఇదే మొదటిసారి.