
భార్య మరణాన్ని తట్టుకోలేక గంట వ్యవధిలోనే భర్త మృతి
మహబూబ్‌నగర్ జిల్లాచిల్వేర్‌లో ఘటన
మిడ్జిల్: వారి దాంపత్య జీవితం అర్ధ శతాబ్దంపాటు అన్యోన్యంగా సాగింది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ వారి మరణంలోనూ తోడయ్యింది. భార్య మరణాన్ని తట్టుకోలేక గంట వ్యవధిలోనే భర్త మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని చిల్వేర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చిల్వేర్ గ్రామానికి చెందిన బొల్గం అనసూయ(72) వారం రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది.
అయితే మూడు నెలల క్రితం కాలు విరిగి మంచానికే పరిమితమైన ఆమె భర్త మాసయ్యగౌడ్(76)కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన మాసయ్యగౌడ్.. గంట వ్యవధిలోనే మృతిచెందాడు. ఒకే రోజు భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను గుర్తుచేసుకొని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.