husband and wife died
-
మీరట్‌లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్‌షీట్‌లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు. -
మరణంలోనూ వీడని బంధం
మధురానగర్ (విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందటంతో తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎనీ్టఆర్ జిల్లా విజయవాడ అయోధ్యనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే భార్య కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించటంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యనగర్‌కు చెందిన రాచపూడి నాగరాజు(27) ప్రసాదంపాడులోని ఓ హోటల్లో టిఫిన్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. నాగరాజు సోమవారం సాయంత్రం 6 గంటలకు పని కోసం ద్విచక్ర వాహనంపై ప్రసాదంపాడుకు వెళ్లారు. పని ముగించుకుని మంగళవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా బీఆరీ్టఎస్ రోడ్డు భానూనగర్ జంక్షన్ సమీపంలో వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలిసి నాగరాజు భార్య ఉష(20) కుటుంబ సభ్యులతో ఘటనాస్థలికి చేరుకున్నారు. నాగరాజు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు విగతజీవిగా పడి ఉండటం చూసి ఉష చలించిపోయారు. స్థానికంగా విషాదఛాయలు అనంతరం గుణదల పోలీస్‌స్టేషన్‌లో ఉష ఫిర్యాదు చేసి, ఆమె తల్లి చల్లా ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తాము ఉండే ఇంటికి వెళ్లిన ఉష తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి ఆదిలక్ష్మి వెళ్లి చూడగా ఉష ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే భార్య కూడా మరణించడం దంపతుల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుందని స్థానికులు తెలిపారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు గంటల వ్యవధిలోనే మృతి చెందటంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. దంపతుల మృతితో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గుణదల, అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరణంలోనూ వీడని బంధం
మిడ్జిల్: వారి దాంపత్య జీవితం అర్ధ శతాబ్దంపాటు అన్యోన్యంగా సాగింది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ వారి మరణంలోనూ తోడయ్యింది. భార్య మరణాన్ని తట్టుకోలేక గంట వ్యవధిలోనే భర్త మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని చిల్వేర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చిల్వేర్ గ్రామానికి చెందిన బొల్గం అనసూయ(72) వారం రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది. అయితే మూడు నెలల క్రితం కాలు విరిగి మంచానికే పరిమితమైన ఆమె భర్త మాసయ్యగౌడ్(76)కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన మాసయ్యగౌడ్.. గంట వ్యవధిలోనే మృతిచెందాడు. ఒకే రోజు భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను గుర్తుచేసుకొని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. -
మృతదేహం వెంటే మృత్యు ఒడికి.. భార్య శవాన్ని తీసుకొస్తూ భర్త మృతి
సాక్షి, మంచిర్యాల: కడవరకూ తోడుంటానని పెళ్లిలో చేసిన ప్రమాణాన్ని దేవుడు నిజం చేయాలనుకున్నాడో ఏమో.. పిల్లలు చిన్నవారన్న దయ కూడా చూపలేదు. భార్య చనిపోయిందని పుట్టెడు దుఃఖంలో ఆమె మృతదేహం వెంటే స్వగ్రామానికి బయల్దేరాడు భర్త. తెల్లవారితే పిల్లలకు అమ్మ ఏదంటే ఏమని సమాధానం చెప్పాలని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. తనలోని బాధ పిల్లలకు కనిపించకూడదన్న ఆలోచనలో ఉన్నాడు. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. భార్య చనిపోయిన రెండు గంటల వ్యవధిలోనే లారీ రూపంలో అతడిని కబళించింది. ఈ విషా ద సంఘటన లక్సెట్టిపేట మండలంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మరణంతో పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనతో మండలంలోని ఎల్లారం గ్రామంలో విషాదం అలుముకుంది. చిచ్చుపెట్టిన పొరుగింటి గొడవ.. డ్రైవర్‌గా పనిచేసే భర్త, బంగారం లాంటి ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న ఆమె జీవితంలో పొరుగింటి వారితో జరిగిన గొడవ ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. చివరకు దంపతులిద్దరి మరణానికి కారణమైంది. లక్సెట్టిపేట ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన శరణ్య(28) గృహిణి. ఆమె భర్త మల్లికార్జున్(33) ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఓంకార్, ఇవాంక సంతానం. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితం ఇంటి పక్కన ఉండే రజినితో శరణ్యకు గొడవ జరిగింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఇద్దరికీ నచ్చజెప్పారు. ఇంతలో మరో మహిళ రాణి గొడవలో జోక్యం చేసుకుంది. రజినిని రెచ్చగొట్టి స్థానిక పోలీస్ స్టేషన్లో శరణ్యపై ఫిర్యాదు చేయించింది. మనస్తాపంతో పురుగుల మందు తాగి.. ఈ విషయం తెలిసిన శరణ్య మనస్తాపం చెందింది. చేయని తప్పుకు తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని మదన పడింది. క్షణికావేశంలో ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శరణ్య శనివారం రాత్రి 11 గంటలకు మృతిచెందింది. కోలుకుని ఇంటికి వస్తుందనుకున్న భార్య కానరాని లోకాలకు వెళ్లడంతో మల్లికార్జున్ కన్నీటిపర్యంతమయ్యాడు. అనంతరం తేరుకుని మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు బంధువు సాయంతో అంబులెన్స్ ఏర్పాటు చేశాడు. అంబులెన్స్ వెనకాలే.. ద్విచక్రవాహనంపై.. అమ్మ త్వరలోనే ఇంటికి వస్తుందని రాత్రి పడుకునే ముందే పిల్లలకు చెప్పాడు మల్లికార్జున్. ఇంతలో శరణ్య మరణించడంతో తెల్లవారి పిల్లలకు ఏం చెప్పాలని దుఃఖాన్ని దిగమింగుతూ తన ద్విచక్రవాహనంపై బంధువుతో కలిసి అంబులెన్స్ వెనకాలే గ్రామానికి బయల్దేరాడు. పిల్లలు రేపటి నుంచి ఎవరిని అమ్మ అని పిలుస్తారని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో లక్సెట్టిపేటలోని ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకున్నారు. మూత్రవిసర్జన కోసం అక్కడ ఆగారు. ద్విచక్రవాహనం రోడ్డు పక్కన నిలిపారు. మల్లికార్జున్ రోడ్డు దాటుతుండగా రాయపట్నం నుంచి లక్సెట్టిపేట వైపునకు వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉన్న బంధువు వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. రెండు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి.. రెండు గంటల వ్యవధిలో భార్య శరణ్య, భర్త మల్లికార్జున్ మృత్యువాత పడడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి మరణంతో పిల్లల గురించి ఆలోచిస్తూ వెళ్లిన తాను కూడా పిల్లలను చూడకుండానే దుర్మరణం చెందడంతో బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇద్దరికీ లక్సెట్టిపేట ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లారు. అమ్మా, నాన్న ఇద్దరినీ విగత జీవులుగా చూసిన పిల్లలు బోరున విలపించడం అందరినీ కలచివేసింది. సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. -
షిర్డీకని వెళ్లి అనంతలోకాలకు.. పాపం గాయాలతో చిన్నారి
ముంబై: షిర్డీ సాయిని దర్శించుకునేందుకు బయలుదేరిన భక్తులను కాలం కాటేసింది. ముంబై – నాసిక్ జాతీయ రహదారిపై యెవైనాకా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. వారి కూతురు గాయాలతో బయటపడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన భాండూప్‌లో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ భాండూప్ టెంభిపాడ తానాజీవాడి చాల్‌లోని మనోజ్ జోషి (36), మాన్సీ జోషి(34) దంపతులతో పాటు అదే ప్రాంతంలోని మరికొందరు కొత్తసంవత్సరంనాడు షిర్డీ సాయిని దర్శించుకోవాలని షిర్డీకి బయలుదేరారు. కొన్ని కుటుంబాలు మినీ బస్సులో బయలుదేరగా జోషి దంపతులతోపాటు మరి కొందరు ద్విచక్రవాహనాలపై బయలుదేరారు. జోషి దంపతులు.. భివండీ తాలూకాలోని యెవైనాకాకు చేరుకోగానే వేగంగా వచ్చిన ఓ కంటెయినర్ వెనుక నుంచి కొట్టింది. దీంతో మనోజ్ జోషి, మాన్సీ జోషీలిద్దరు ఘటన స్థలంలోనే మృతి చెందారు. వారి మూడేళ్ల కూతురు మన్మాయి మాత్రం గాయాలతో బయటపడింది. విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు మృతదేహాలను భివండీలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటెయినర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. -
అమెరికా మంచు తుపానులో గుంటూరు దంపతులు మృతి
పెదనందిపాడు(గుంటూరు జిల్లా): అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీలో నివాసముంటున్న గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు సరస్సు దాటుతున్న క్రమంలో గల్లంతయ్యారు. ఈ ఘటనలో భార్య హరిత మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నారాయణ, అతడి స్నేహితుడు ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తమ ఇద్దరు పిల్లలు, స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫీనిక్స్‌లో ఉన్న సరస్సు దాటే క్రమంలో మంచు ఫలకలు కుంగాయి. దీంతో నారాయణ, ఆయన భార్య హరిత, స్నేహితుడు సరస్సులో పడిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో హరిత మృతదేహం లభించింది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని అమెరికాలోని నారాయణ స్నేహితులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా ఈ ఘటనలో చిన్నారులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు. పాలపర్రుకు చెందిన ముద్దన వెంకట సుబ్బారావు, వెంకటరత్నం దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో కుమారుడు నారాయణ పెద్దవాడు. కష్టపడి చదివి విదేశాల్లో స్థిరపడిన కుమారుడు కుటుంబానికి అసరాగా ఉంటున్న సమయంలో విధి ఇలా చేస్తుందని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు, తోబుట్టువులు రోదిస్తున్నారు. కనీసం కడసారి చూపులకైనా మృతదేహాలను స్వగ్రామానికి తరలించేలా ప్రభుత్వం కృషి చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విన్నవించారు. ఇదీ చదవండి: బయల్దేరే సమయానికి మంచు తుపాను...ఏకంగా 18 గంటల పాటు కారులో -
కన్నీళ్లు తెప్పించే ఘటన.. నీవు లేక నేను లేను..
అమలాపురం టౌన్: భార్య మృతిని తట్టుకోలేని భర్త కొద్దిసేపటికే బలవన్మరణానికి పాల్పడ్డాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని కొంకాపల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన కలకలం రేపింది. పట్టణ ఇన్చార్జి సీఐ వీరబాబు, స్థానికుల కథనం ప్రకారం.. కొంకాపల్లిలో భార్యాభర్తలు బోనం తులసీలక్ష్మి(45), శ్రీరామ విజయకుమార్(47) ఇంట్లోనే కొద్ది నిమిషాల తేడాలో మృతి చెందారు. ఓఎన్జీసీ సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న విజయకుమార్ ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. భార్య తులసీలక్ష్మికి మూడు నెలల కిందట మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగి, అనారోగ్యంతో అవస్థలు పడుతోంది. శనివారం రాత్రి ఇద్దరూ ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారుజామున తులసీలక్ష్మి బెడ్ రూమ్‌లో మంచంపై విగతజీవిగా ఉంది. ఆమె మరణాన్ని భర్త విజయకుమార్ తట్టుకోలేకపోయాడు. అప్పటికే ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతున్న అతనికి భార్య మృతి మరింత కుంగదీసింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై తన ఇంటి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి కుమారుడు కృష్ణ విజయవాడలో ఇంటర్ చదువుతున్నాడు. తల్లిదండ్రుల మరణవార్త తెలియడంతో అతడు విజయవాడ నుంచి హుటాహుటిన వచ్చి.. అమ్మానాన్నల మృతదేహాలపై పడి ఏడ్వడం అందరినీ కలచివేసింది. తులసీలక్ష్మి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరబాబు తెలిపారు. -
తాగుబోతు భర్తతో వేగలేక..
జహీరాబాద్ టౌన్: నిత్యం తాగి గొడవకు దిగుతున్న భర్త వైఖరికి మనస్తాపంతో భార్య వ్యవసాయ బావిలోకి దూకింది.. అది గమనించిన భర్త కూడా బావిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. మృతుని తల్లి పెంటమ్మ, పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ మండలం ఆనేగుంటకు చెందిన రాజగిర వెంకటి (35)కి భార్య లక్ష్మి (28), కూతుళ్లు గీతాంజలి, మల్లీశ్వరి, కుమారుడు సాయి ఉన్నారు. వెంకటి కుటుంబంతో గోవింద్‌పూర్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన వెంకటి తరచూ భార్యతో గొడవ పడేవాడు. గతంలో ఒకసారి గొడవ జరిగినప్పుడు వెంకటి బావిలో దూకగా చుట్టుపక్కల వారు రక్షించారు. ఆ సమయంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం కూడా మద్యం తాగిన వెంకటి భార్యతో గొడవకు దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య లక్ష్మి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు వెంకటి కూడా బావిలోకి దూకగా, ఇద్దరు నీట మునిగారు. ఇది గమనించిన వెంకటి తల్లి పెంటమ్మ ఇద్దరినీ కాపాడేందుకు డ్రిప్ పైపులు బావిలోకి జార విడిచినా ప్రయోజనం లేకుండా పోయింది. దంపతుల మృతితో పదేళ్ల లోపున్న ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. బావిలోంచి మృతదేహలను వెలికితీసిన చిరాగ్పల్లి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు వెంకటి తల్లి పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిరాగ్పల్లి ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. అనాథలైన చిన్నారులు -
మరణంలోనూ ఒకరికొకరు తోడుగా.. ఒకే సమాధిలో ఇద్దరికీ శాశ్వత విశ్రాంతి
రామచంద్రపురం రూరల్: మండలంలోని ఏరుపల్లికి చెందిన బూసి ధర్మరాజు(82), బూసి వీరమ్మ (72)లది 56 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె, పెద్ద అల్లుడు కాలం చేశారు. చిన్న కుమార్తె గొల్లపల్లి పార్వతి హసన్‌బాద గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. ఆమె భర్త గొల్లపల్లి సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తూ ఇటీవల మృతి చెందారు. 56 ఏళ్ల వైవాహిక జీవితంలో ధర్మరాజు, వీరమ్మ ఏనాడూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేదు. కుమార్తెల ఇళ్లకు వెళ్లేటప్పుడు కూడా ఇద్దరూ కలిసే వెళ్లి వచ్చేవారు. గ్రామంలో ఒకరికొకరు తోడుగా జీవించేవారు. ధర్మరాజు ఎనిమిది పదుల వయస్సులోనూ సైకిల్ తొక్కుకుంటూ కుమార్తె ఇంటికి వెళ్లేవారు. ఇంటిలోకి కావాల్సిన సరుకులు తానే స్వయంగా తెచ్చుకునేవారు. వీరమ్మ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ ఇంటి పనులు మొత్తం తానే చక్కబెట్టుకునేది. కొంతకాలంగా ధర్మరాజుకు కాస్త ఆయాసం వస్తూ ఉండేది. దీంతో భర్తకు వేడి మంచినీళ్లు ఇవ్వడం వీరమ్మకు అలవాటుగా మారింది. గురువారం రాత్రి 12 గంటల సమయంలో భర్తకు వేడి నీళ్లు ఇద్దామని పిలవగా స్పందించలేదు. చుట్టుపక్కల వారిని లేపి చూపించగా, వారు పరిశీలించి ధర్మరాజు మృతి చెందాడని చెప్పారు. దీంతో ఆమె రోదిస్తూ కూర్చుంది. చుట్టుపక్కల వారు కుమార్తెల కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. సుమారు 2 గంటల పాటు ఏడుస్తూ కూర్చున్న వీరమ్మ వెక్కిళ్లు వచ్చి, వాంతి చేసుకుని ప్రాణాలు విడిచిపెట్టింది. నాలుగు రోజుల క్రితం మునిమనవడితో కులాసాగా గడిపిన ఆ వృద్ధ దంపతులు ఒకే రోజు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం క్రిస్టియన్ పద్ధతిలో ఇద్దరినీ ఒకే సమాధిలో పూడ్చి పెట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ మల్లిమొగ్గల శ్రీధర్, మాజీ సర్పంచ్‌లు సాక్షి వేణు, చిల్లా గోపాలకృష్ణ, గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చదవండి: పోలీస్ స్టేషన్లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య -
చావులోనూ వీడని బంధం
కౌడిపల్లి(నర్సాపూర్): చావులోనూ బంధాన్ని వీడకుండా భార్యాభర్తలిద్దరూ ఒకేతాడుతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పంటలసాగులో వచ్చిన నష్టం ఆ దంపతుల ప్రాణాలను మింగేసింది. ఈ ఘటన శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లిలో చోటుచేసుకుంది. ముట్రాజ్‌పల్లికి చెందిన ఆకుల బాషయ్య(57), శివ్వమ్మ(53) భార్యాభర్తలు. వీరికి కొడుకు నరేశ్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. నరేశ్ ఏడాదిగా హైదరాబాద్‌లో ఉంటూ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. బాషయ్య, శివ్వమ్మ గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. పిల్లల పెళ్లిళ్లు, సాగు కోసం చేసిన రూ.4 లక్షల అప్పులు, ఇటీవల వేసిన బోరు ఫెయిల్ కావడం, పంటలో నష్టం రావడం.. వీటికితోడు భార్య అనారోగ్య పరిస్థితి ఆయనను ఆందోళనకు గురిచేశాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక తరచూ మథనపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారంరాత్రి పదిగంటల వరకు ఆ దంపతులు ఇరుగుపొరుగు వారితో ముచ్చట పెట్టి అనంతరం ఇంట్లోకి వెళ్లిపోయారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన మంగమ్మ బట్టలు ఉతికేందుకని బాషయ్య ఇంటికి వెళ్లి తలుపుతట్టగా లోపలి నుంచి ఉలుకూపలుకూలేదు. దీంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా దంపతులిద్దరూ ఒకేతాడుతో దూలానికి ఉరేసుకుని మృతిచెందారు. కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెళ్లయిన ఏడు నెలలకే..
రామాయంపేట(మెదక్): ఎన్నో కలలతో నూరేళ్ల దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన యువజంటను ఏడాది పూర్తి కాకముందే మృత్యువు కబలించింది. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన వారి బంధం ఏడు నెలలకే అర్థాంతరంగా ముగిసింది. వినాయక నవరాత్రి ఉత్సవాలకు హాజరైన దంపతులు తిరుగు ప్రయాణంలో మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన చకిలం శ్రీనివాస్, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయిరాజ్ (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఫిబ్రవరిలో గజ్వేల్‌కు చెందిన సారికను వివాహం చేసుకొని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీకెండ్‌తో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రామాయంపేటకు వచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులతో ఉత్సాహంగా గడిపి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో మేడ్చల్ వద్ద రోడ్డు దాటుతున్న ప్రయాణికుడిని ఢీకొట్టి దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. వెనకనుంచి వచి్చన లారీ వారిపై నుంచి వెళ్లగా ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడు సైతం మృతి చెందాడు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడిఉన్న దంపతులను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ముందు రోజు వరకు కళ్ల ముందే సంతోషంగా గడిపిన దంపతులిద్దరూ మృత్యువాత పడడంతో రామాయంపేటలో విషాదం నెలకొంది. -
మూడేళ్ల క్రితం భార్య.. నేడు భర్త.. అదే ట్రాక్టర్.. మరో విషాదం..
మాడుగులపల్లి(నల్లగొండ జిల్లా): మూడేళ్ల క్రితం పంచాయతీ ట్రాక్టర్ ఒక మహిళను బలి తీసుకుంటే.., నేడు అదే వాహనం మృత్యుశకటమై ఆమె భర్త మరణానికి కూడా కారణమైంది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. మాడుగులపల్లి మండల పరిధిలోని కన్నెకల్ గ్రామానికి చెందిన గంటెకంపు నరేష్ (32)సౌందర్య దంపతులకు ఇద్దరు సంతానం. నరేష్ గ్రామ పంచాయతీ కార్మికుడిగా, సౌందర్య ఐకేపీలో పనిచేస్తుండేవారు. చదవండి: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన మూడేళ్ల క్రితం సౌందర్య ఐకేపీ పని నిమిత్తం పంచాయతీ ట్రాక్టర్లో మిర్యాలగూడకు వెళ్లి తిరిగి వస్తుండగా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. బుధవారం నరేష్ గ్యారకుంటపాలెంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు అదే ట్రాక్టర్‌కు అమర్చిన ట్యాంకర్లో నీటిని తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్యారకుంటపాలంలోని విద్యుత్ తీగ ట్యాంకర్ పై భాగాన తగలడంతో నరేష్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే ట్రాక్టర్ దంపతుల్ని కబళించడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. -
కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా..
సాక్షి, కరీంనగర్/ వరంగల్: కరీంనగర్ జిల్లా మానకొండూరు శివారు ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ నుంచి వేములవాడకు వెళ్తున్న ఏపీ 36ఏటీ 0648 గల మారుతి ఆల్టో కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూతురికి వీసా రావడంతో కారులో మృతి చెందిన ఇద్దరిని వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన భార్యాభర్తలు మాధవి, సురేందర్‌గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన దంపతుల్లో సురేందర్ ప్రమాద స్థలలోనే చనిపోగా మాధవి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న తమ కూతురు మేఘన, మేనల్లుడు అశోక్ గాయపడ్డారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషయంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాశీబుగ్గలో విషాదం అయితే కూతురు మేఘనకు అమెరికా వీసా రావడంతో కుటుంబమంతా వేములవాడ రాజన్న దేవాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దైవదర్శనం కోసం శనివారం ఉదయం కారులో వేములవాడకు బయలుదేరగా.. మార్గమధ్యలో మానకొండూర్ మండలం ముంజంపల్లి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం తెలియడంతో కాశీబుగ్గలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. చదవండి: పెళ్లికి పెద్దలు నిరాకరించారని.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం -
నార్సింగిలో బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి
సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్‌లో మందుబాబులు బీభత్సం సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ జనాల ప్రాణాలు తీస్తున్నారు. 12 గంటల వ్యవధిలోనే రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మరవక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూవీ టవర్స్ వద్ద సోమవారం మధ్యాహ్నం కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న దంపతులు ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేట నుంచి భార్యభర్తలు తమ యాక్టివా స్కూటీపై పని నిమిత్తం గచ్చిబౌలి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనకనుంచి అతి వేగంగా వస్తున్న కారు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన దంపతులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులను దంపతులు దుర్గం రాజు, మౌనికగా పోలీసులు గుర్తించారు. మౌనిక నార్సింగి మున్సిపాలిటీలో పనిచేస్తోంది. అలాగే నిందితుడిని సంజీవ్‌గా గుర్తించిన పోలీసులు మద్యం మత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిందని తెలిపారు. నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 108 చూపించింది. దీంతో సంజీవ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, -
నీ వెంటే నేనూ..!
మంగళగిరి: మృత్యువులోనూ ఆ దంపతులు తమ బంధాన్ని వీడలేదు. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందిన దుర్ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన అక్కిరెడ్డి వీర్రాజు (85), రాఘవమ్మ (69) ముప్పై ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం యర్రబాలెంకి వలస వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుని ఇద్దరి కుమార్తెల వివాహాలు చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవమ్మ తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలి బుధవారం మృతి చెందింది. తన భార్య మృతిని తట్టుకోలేక వృద్ధుడు వీర్రాజు కూడా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించగా మధ్యలోనే మృతి చెందాడు. వీర్రాజు, రాఘవమ్మ ఆఖరి నిమిషం వరకూ కూడా ఎవరి పనులు వారే చేసుకునే వారని స్థానికులు తెలిపారు. -
విషాదం: భర్త మృతి.. ఒక్కరోజుకే ఆగిన భార్య గుండె
సాక్షి, చెన్నై: భర్త లేడన్న బాధను జీర్ణించుకోలేక భార్య మృతి చెందిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. కన్నమంగళం తాలుకా రామనాథపురం గ్రామానికి చెందిన శేఖర్(60) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. మృతదేహాన్ని వేలూరు ప్రభుత్వాస్పత్రి నుంచి అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన భార్య కన్నగి అమ్మాల్ (55) గుండెలవిసేలా రోదించింది. సోమవారం ఉదయం స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరూ ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. వీడిన మిస్టరీ -
నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త
-
కృష్ణా జిల్లా మంటాడలో దారుణం..
సాక్షి, కృష్ణా జిల్లా: పమిడిముక్కల మండలం మంటాడలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్య పై భర్త పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భార్య మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు తండ్రి, కొడుకును బలి తీసుకున్న కరోనా.. -
చావులోనూ... చేయి వదలనని..
ఏనాడో కలిపిన ఏడడుగుల బంధాన్ని చివరిదాకా కాపాడుకున్నారు ఆ దంపతులు. కడదాకా అనురాగం, ఆప్యాయతలను కలిసి పంచుకున్న వారు మృత్యువులోనూ తోడు వస్తానని బాస చేసుకున్నట్టున్నారు. వనపర్తి జిల్లాలో భార్య మృతిని తట్టుకోలేక ఒక భర్త గుండె ఆగిపోగా, సిద్దిపేట జిల్లాలో భర్త మరణాన్ని తట్టుకోలేక కొంతసేపటికే ఓ భార్య కూడా తనువు చాలిం చింది. ఈ విషాద ఘటనలు అందరినీ కంటతడి పెట్టించాయి. పాన్‌గల్ (వనపర్తి): వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మల్లాయిపల్లిలో లక్ష్మీదేవమ్మ (75), కర్రెన్న (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. శివారులో ఉన్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. లక్ష్మీదేవమ్మ, కర్రెన్నలది అన్యోన్య దాంపత్యం. ఇదిలా ఉండగా, లక్ష్మీదేవమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందగా ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి భార్యపై బెంగతో కర్రెన్న గుండె కూడా ఆగిపోయింది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోవడం ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులనూ కలచివేసింది. మరో ఘటనలో.. వర్గల్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరుకు చెందిన కొడపర్తి బాలయ్య (75), నాగవ్వ (65) దంపతులకు ఒక కుమారుడు. ముగ్గురు కుమార్తెలు. అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఆ దంపతులు ఒకరంటే మరొకరికి ప్రాణంలా ఉండేవారు. శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాలయ్య అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేని నాగవ్వ తీవ్ర వేదనకు గురైంది. రాత్రి 12 గంటల సమయంలో ఆమె సైతం ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలింది. విషాదాన్ని దిగమింగుకుంటూ కుటుంబ సభ్యులు ఆదివారం ఆ దంపతుల అంత్యక్రియలు ఒకే సమయంలో నిర్వహించారు. -
పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య!
ఫరూఖాబాద్(యూపీ): పుట్టినరోజు అంటూ 23 మంది చిన్నారులను పిలిచి బంధించిన వ్యక్తిని పోలీసులు గురువారం అర్ధరాత్రి హతమార్చగా, తప్పించుకునేందుకు ప్రయత్నించిన అతని భార్య.. గ్రామస్తుల చేతిలో చనిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా కసారియా గ్రామంలో జరిగిందీ ఘటన. చిన్నారులను బందీగా చేపట్టి, వారిని చంపేస్తామని బెదిరిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సంచలన ఘటన చివరకు సుఖాంతమైంది. సుభాష్ బాథమ్(40)పై గతంలో హత్య కేసు ఉంది. బెయిల్‌పై బయటకు వచ్చాడు. కూతురి పుట్టిన రోజు వేడుకులకు రావాలంటూ గురువారం గ్రామంలోని చిన్నారులను తన ఇంటికి పిలవగా 23 మంది పిల్లలొచ్చారు. అందర్నీ ఇంటి బేస్మెంట్లో బంధించాడు. హత్య కేసును వెనక్కి తీసుకుంటామని, ప్రభుత్వ ఇల్లు ఇస్తామని నచ్చజెప్పేందుకు యత్నించినా సుభాష్ వినలేదని డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. సుభాష్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులకు, ఒక గ్రామస్తుడికి గాయాలయ్యాయన్నారు. ఇంటి వెనుకవైపు నుంచి తలుపు బద్ధలు కొట్టి పోలీసులు లోపలికి వెళ్లారు. వారిపై సుభాష్ కాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. తర్వాత పిల్లలందరినీ పోలీసులు రక్షించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన సుభాష్ భార్య రూబీను గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. గాయాలతో ఆమె ఆసుపత్రిలో మరణించింది. సుభాష్ ఇంటి నుంచి పోలీసులు తుపాకిని, రైఫిల్‌ను, రెండు డజన్ల కాట్రిడ్జ్‌లను, 25 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే పిల్లలను బందీలుగా ఉంచుకునే ఆలోచనలో ఆ దంపతులు ఉన్నట్లు అర్థమవుతుందని పోలీసులు చెప్పారు. -
అమెరికాలో భారతీయ దంపతుల మృతి
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో భారత్‌కు చెందిన భార్యభర్తలిద్దరు మరణించారు. స్కూబా డైవింగ్ కోసం వెళ్తున్న వీరి పడవ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ ద్వీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... నాగ్‌పూర్‌కు చెందిన ప్రఖ్యాత శిశువైద్యుడు సతీష్ డియోపుజారి కుమార్తె అమెరికాలో దంత వైద్యురాలిగా పని చేస్తుండగా.. అల్లుడు ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సతీష్ కుమార్తె, అల్లుడు స్కూబా డైవింగ్ కోసమని కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ ద్వీపానికి వెళ్లారు. ఆ సమయంలో వీరు ప్రయాణం చేస్తున్న పడవలో ఒక్కసారిగా పడవలో మంటలు చెలరేగి కాలిఫోర్నియా సముద్రతీరంలో మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో 33 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు డైవర్స్ ఉన్నట్లు సమాచారం. పడవ మునిగిపోవడంతో వీరిలో 34 మంది మరణించినట్లు తెలిసింది. ఐదుగురు డైవర్స్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా డియో పుజారి రెండో కుమార్తె కూడా అమెరికాలోనే ఉంటున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆమె అధికారులను కలుసుకుని సాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ప్రమాదం గురించి డియోపుజారి మాట్లాడుతూ.. తన కుమార్తె అమెరికాలో దంత వైద్యురాలుగా పనిచేస్తోందని, అల్లుడు కూడా అమెరికాలోని ఓ ఫైనాన్స్ కంపెనీ పనిచేస్తున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పటివరకు తన కూతురు, అల్లుడి మరణంపై అమెరికా అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సతీష్ డియోపుజారి ఆవేదన వ్యక్తం చేశాడు. (చదవండి: కాలిఫోర్నియాలో ఘోర అగ్ని ప్రమాదం) -
పాపం..పసివాళ్లు
సాక్షి, కళ్యాణదుర్గం: నెల వ్యవధిలో అనారోగ్యం కారణంగా దంపతులిద్దరూ మృతి చెందడంతో అభం..శుభం తెలియని వారి పిల్లలు అనాథలుగా మారారు. వివరాల్లోకి వెళితే..వీరేష్, జయలక్ష్మి దంపతులు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో అద్దె ఇంట్లో నివసిస్తుండేవారు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. అయితే ఫిబ్రవరి 20వ తేదీన అస్వస్థతకు గురై వీరేష్ మృతి చెందాడు. భర్త పోయిన బాధలో ఉన్న జయలక్ష్మికి గత వారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో స్థానికులు ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నాటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండేది. బుధవారం అక్కడే మృతి చెందింది. దీంతో ఆమె కుమార్తెలు నవ్య(2), ఇటీవల పుట్టిన చిన్నారి అనాథలుగా మారారు. ప్రస్తుతం వీరేష్ సోదరి సరస్వతి వీరి ఆలనా పాలనా చూసుకుంటోంది. జయలక్ష్మి మృతదేహం వద్ద బంధువుల రోదనలు చూపరులను కలిచివేశాయి. అనాథలుగా మారిన చిన్నారులను దాతలు ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. -
బతుకుపోరులో ఓడారు
వనపర్తి: సంతలో కూరగాయల వ్యాపారం చేస్తూ నాలుగు పైసలు సంపాదించుకోవాలనుకున్నారు ఆ దంపతులు. సొంత ఆటోలో మార్కెట్‌కు వెళ్లి.. కూరగాయలు తెచ్చి.. గ్రామాల్లో జరిగే వారాంతపు సంతల్లో విక్రయించి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.. గత పదేళ్లుగా సాగుతున్న ఈ వ్యాపారానికి ఆదివారం తెరపడింది. బతుకు పోరులో దంపతులు ఓడిపోయారు. వీరి ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో భార్యాభర్తలు ఇద్దరూ విగతజీవులుగా మారారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో రేవల్లి మండలం నాగపూర్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వారాంతపు సంతలో విక్రయాలు.. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లకు చెందిన వడ్డె నాగేశ్వర్రావు(55), నాగలక్ష్మమ్మ(50) భార్యాభర్తలు. కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకువచ్చి ఆయా గ్రామాల్లో వారాంతపు సంతల్లో విక్రయిస్తారు. ఈ క్రమంలో ఆదివారం రేవల్లి మండలం నాగపూర్‌లో సంత ఉండడంతో ఉదయం భార్యాభర్తలు సొంత ఆటోలో వెన్నచర్ల నుంచి కూరగాయలు తీసుకువచ్చేందుకు నాగర్‌కర్నూల్ బయలుదేరారు. రేవల్లి మండలం నాగపూర్ సమీపంలో ఆటో, ఎదురుగా వస్తున్న నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. దీంతో ఆటో పల్టీ కొట్టడంతో ఆటో నడుపుతున్న నాగేశ్వర్రావు ఎగిరి బస్సు ముందు టైరు కింద పడగా.. నాగలక్ష్మమ్మ ఆటోలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు ఆటోలో కూలీ డబ్బుల కోసం వెళ్తున్న వెన్నచెర్లకు చెందిన భార్యాభర్తలు వంక రాజు, లక్ష్మిలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని సమీపంలోని రేవల్లి కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అనంతరం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి తలకు బలమైన గాయమైంది. ఈ సంఘటనతో వీరి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు.. ప్రమాద విషయం తెలుసుకున్న వనపర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎంపీపీ జానకిరాంరెడ్డి, రేవల్లి ఎస్ఐ సురేష్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను రేవల్లి కమ్యూనిటీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన లక్ష్మి ఫిర్యాదు మేరకు వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ నారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజీవ్‌ప్రేమ్‌కుమార్ రేవల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగేశ్వర్రావు, నాగలక్ష్మమ్మ దంపతులకు కుమారుడు సత్యం, కూతురు నాగలక్ష్మి ఉన్నారు. అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా ఆర్టీసీ తరపున రూ.10 వేలు అందజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎక్కువ సందర్భాల్లో కుమారుడు సత్యం తల్లిదండ్రులతో కలిసి ఆటోను నడుపుతుంటాడు. కానీ మూడు రోజుల క్రితం ఆయన మిర్యాలగూడలో బంధువుల ఇంటికి వెళ్లడంతో తండ్రి ఆటోను నడిపి దుర్మరణం పాలయ్యారు. -
గొడ్డళ్లతో భార్యాభర్తల కొట్లాట.. ఇద్దరూ హతం
బెట్టియా(బిహార్): వాగ్వాదం తారస్థాయికి చేరి ఒకరిపై మరొకరు గొడ్డళ్లతో దాడి చేసుకోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని దక్షిణ చంపారన్ జిల్లా బాన్స్‌బరియా పీపల్ చౌక్ గ్రామానికి చెందిన దంపతులు సోహన్ షా(58), బదామీ దేవి(46) మనస్పర్ధలతో గ్రామం నుంచి వచ్చి పాలం పట్టణంలోని తమ ఫామ్‌హౌజ్‌లో నివసిస్తున్నారు. బుధవారం వారి మధ్య గొడవ జరిగింది. గొడ్డళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. వారి కొడుకు బిశర్జన్ కుమార్(15) వచ్చేసరికి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయి రక్తపుమడుగులో ఉన్నారు. -
మరణంలోను వీడని బంధం
వైరా (ఖమ్మం) : అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పలుకరించడానికి వెళ్లిన దంపతులు గురువారం వైరా పాత బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వైరాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కట్ల సంజీవరావు(55) సోదరుడు అనారోగ్యంతో ఉన్నారు. ఆయన్ని చూసేందుకు సంజీవ్‌రావు, భార్య పద్మావతి(45)తోకలిసి బైక్‌పై వెళుతున్నారు. పాత బస్టాండ్ సమీపంలోని టెలిఫోన్ ఎక్సేంజ్ సమీపంలో వెనుక నుండి అతి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొంది. దీంతో దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు.