చావులోనూ... చేయి వదలనని.. | Wife's Dies After Husband's Death | Sakshi
Sakshi News home page

చావులోనూ... చేయి వదలనని..

Published Mon, Apr 19 2021 4:16 AM | Last Updated on Mon, Apr 19 2021 8:56 AM

Wife's Dies After Husband's Death - Sakshi

వృద్ధ దంపతులు కర్రెన్న, లక్ష్మీదేవమ్మ (ఫైల్‌)  

ఏనాడో కలిపిన ఏడడుగుల బంధాన్ని చివరిదాకా కాపాడుకున్నారు ఆ దంపతులు. కడదాకా అనురాగం, ఆప్యాయతలను కలిసి పంచుకున్న వారు మృత్యువులోనూ తోడు వస్తానని బాస చేసుకున్నట్టున్నారు. వనపర్తి జిల్లాలో భార్య మృతిని తట్టుకోలేక ఒక భర్త గుండె ఆగిపోగా, సిద్దిపేట జిల్లాలో భర్త మరణాన్ని తట్టుకోలేక కొంతసేపటికే ఓ భార్య కూడా తనువు చాలిం చింది. ఈ విషాద ఘటనలు అందరినీ కంటతడి పెట్టించాయి. 

పాన్‌గల్‌ (వనపర్తి):
వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం మల్లాయిపల్లిలో లక్ష్మీదేవమ్మ (75), కర్రెన్న (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. శివారులో ఉన్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. లక్ష్మీదేవమ్మ, కర్రెన్నలది అన్యోన్య దాంపత్యం. ఇదిలా ఉండగా, లక్ష్మీదేవమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందగా ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి భార్యపై బెంగతో కర్రెన్న గుండె కూడా ఆగిపోయింది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోవడం ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులనూ కలచివేసింది. 

మరో ఘటనలో.. 
వర్గల్‌ (గజ్వేల్‌): సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం వేలూరుకు చెందిన కొడపర్తి బాలయ్య (75), నాగవ్వ (65) దంపతులకు ఒక కుమారుడు. ముగ్గురు కుమార్తెలు. అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఆ దంపతులు ఒకరంటే మరొకరికి ప్రాణంలా ఉండేవారు. శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాలయ్య అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేని నాగవ్వ తీవ్ర వేదనకు గురైంది. రాత్రి 12 గంటల సమయంలో ఆమె సైతం ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలింది. విషాదాన్ని దిగమింగుకుంటూ కుటుంబ సభ్యులు ఆదివారం ఆ దంపతుల అంత్యక్రియలు ఒకే సమయంలో నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement