
నారాయణ, హరిత (ఫైల్ ఫొటో)
పెదనందిపాడు(గుంటూరు జిల్లా): అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీలో నివాసముంటున్న గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు సరస్సు దాటుతున్న క్రమంలో గల్లంతయ్యారు. ఈ ఘటనలో భార్య హరిత మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నారాయణ, అతడి స్నేహితుడు ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు.
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తమ ఇద్దరు పిల్లలు, స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫీనిక్స్‌లో ఉన్న సరస్సు దాటే క్రమంలో మంచు ఫలకలు కుంగాయి. దీంతో నారాయణ, ఆయన భార్య హరిత, స్నేహితుడు సరస్సులో పడిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో హరిత మృతదేహం లభించింది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని అమెరికాలోని నారాయణ స్నేహితులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
కాగా ఈ ఘటనలో చిన్నారులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు. పాలపర్రుకు చెందిన ముద్దన వెంకట సుబ్బారావు, వెంకటరత్నం దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో కుమారుడు నారాయణ పెద్దవాడు. కష్టపడి చదివి విదేశాల్లో స్థిరపడిన కుమారుడు కుటుంబానికి అసరాగా ఉంటున్న సమయంలో విధి ఇలా చేస్తుందని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు, తోబుట్టువులు రోదిస్తున్నారు. కనీసం కడసారి చూపులకైనా మృతదేహాలను స్వగ్రామానికి తరలించేలా ప్రభుత్వం కృషి చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విన్నవించారు.
ఇదీ చదవండి: బయల్దేరే సమయానికి మంచు తుపాను...ఏకంగా 18 గంటల పాటు కారులో
Comments
Please login to add a commentAdd a comment