నాలుగు రోజుల క్రితం మునిమనవడితో ఉల్లాసంగా ఫొటో దిగిన ధర్మరాజు, వీరమ్మ
రామచంద్రపురం రూరల్: మండలంలోని ఏరుపల్లికి చెందిన బూసి ధర్మరాజు(82), బూసి వీరమ్మ (72)లది 56 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె, పెద్ద అల్లుడు కాలం చేశారు. చిన్న కుమార్తె గొల్లపల్లి పార్వతి హసన్‌బాద గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. ఆమె భర్త గొల్లపల్లి సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తూ ఇటీవల మృతి చెందారు. 56 ఏళ్ల వైవాహిక జీవితంలో ధర్మరాజు, వీరమ్మ ఏనాడూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేదు.
కుమార్తెల ఇళ్లకు వెళ్లేటప్పుడు కూడా ఇద్దరూ కలిసే వెళ్లి వచ్చేవారు. గ్రామంలో ఒకరికొకరు తోడుగా జీవించేవారు. ధర్మరాజు ఎనిమిది పదుల వయస్సులోనూ సైకిల్ తొక్కుకుంటూ కుమార్తె ఇంటికి వెళ్లేవారు. ఇంటిలోకి కావాల్సిన సరుకులు తానే స్వయంగా తెచ్చుకునేవారు. వీరమ్మ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ ఇంటి పనులు మొత్తం తానే చక్కబెట్టుకునేది. కొంతకాలంగా ధర్మరాజుకు కాస్త ఆయాసం వస్తూ ఉండేది.
దీంతో భర్తకు వేడి మంచినీళ్లు ఇవ్వడం వీరమ్మకు అలవాటుగా మారింది. గురువారం రాత్రి 12 గంటల సమయంలో భర్తకు వేడి నీళ్లు ఇద్దామని పిలవగా స్పందించలేదు. చుట్టుపక్కల వారిని లేపి చూపించగా, వారు పరిశీలించి ధర్మరాజు మృతి చెందాడని చెప్పారు. దీంతో ఆమె రోదిస్తూ కూర్చుంది. చుట్టుపక్కల వారు కుమార్తెల కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు.
సుమారు 2 గంటల పాటు ఏడుస్తూ కూర్చున్న వీరమ్మ వెక్కిళ్లు వచ్చి, వాంతి చేసుకుని ప్రాణాలు విడిచిపెట్టింది. నాలుగు రోజుల క్రితం మునిమనవడితో కులాసాగా గడిపిన ఆ వృద్ధ దంపతులు ఒకే రోజు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం క్రిస్టియన్ పద్ధతిలో ఇద్దరినీ ఒకే సమాధిలో పూడ్చి పెట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ మల్లిమొగ్గల శ్రీధర్, మాజీ సర్పంచ్‌లు సాక్షి వేణు, చిల్లా గోపాలకృష్ణ, గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
చదవండి: పోలీస్ స్టేషన్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment